Sun 08 Aug 05:53:24.997643 2021
Authorization
మన తెలుగు నేలలో రాయలసీమకు విశిష్టమైన స్థానముంది. లలితకళలకు, సంస్క్రతీ సంప్రదాయాలకు, పాడిపంటలకు, పసిడి సంపదలకు, మమతానురాగాలకు, వీరపరాక్రమాలకు, ధర్మపాలనకు, విజయ చరితలకు ఆలవాలమై అలరారుతున్న సీమ మన రాయలసీమ. ఈ నేల గొప్పతనాన్ని చాటి చెబుతూ 'శ్రీరాములయ్య' (1998) సినిమాలో 'గోరటి వెంకన్న' ఒక పాట రాశాడు. గోరటి వెంకన్న అంటేనే పల్లె సౌందర్యం, సీమ సంస్క్రతి, మట్టి వాసన గుబాళించే పాటల దరువులకు ప్రతీక. ఇక్కడ - రాయలసీమ ఔన్నత్యాన్ని కూడా సహస్ర ముఖాలుగా ఎలుగెత్తి వినిపించాడీపాటలో..
రాయలసీమ మనల్ని గన్న తల్లి. రతనాలు నిండిన భాగ్యసీమ ఇది. తన తనువంతా గనులు, నిక్షేపాలున్న సీమ. ఎన్నో గిరులు నెలవున్న నేల. సస్యశ్యామలమై సుభిక్షంగా అలరారే ప్రాంతం. వర్షం పడినపుడు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న వజ్ర వైఢూర్యాలు మన నేలమీద తేలియాడుతుంటాయి. మన నేల పొరలు నిమిరితే చాలు ఎన్నెన్నో పుష్యరాగాలు, మణులు దొర్లుతాయి. ఇంతటి ఖనిజరాశులున్నా, బంగారు నిధులున్నా పొంగిపోని తల్లి ఇది.
ఈ సీమ ఖనిజాలకు, నిధి నిక్షేపాలకే కాదు ఇక్కడి అణువణువు ఆధ్యాత్మిక నిలయమై అలరారుతుంటుంది. కలియుగంలో మానవులు ఓర్వలేరని తెలిసి, శ్రీ వేంకటేశ్వరుడు ఓ నల్లరాయిలా ఈ సీమ కొండపైనే వెలసినాడు. అదే నేడు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమై విరాజిల్లుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు మన జన్మలు ధన్యత పొంది పుణ్యమైపోతాయి. అంతే కాదు- విజయ నగర సామ్రాజ్యాధీశులైన హరిహరరాయలు, బుక్కరాయలు అడవికి వేటకు వెళ్తే సాధు జంతువులైన కుందేలు, కుక్కలు కూడా ఆ రాజులను, ఆ యుద్ధ పరాక్రమధీరులను వెంబడించాయన్న కథ ఉంది. అంటే ఇక్కడి సీమలో సాధు జంతువు కూడా తలచుకుంటే - కాళీమాతై విరుచుకుపడుతుంది. అంతటి పౌరుష ప్రతాపాలు ఈ నేలలో ఉన్నాయి. ఈ సీమలో ఎవరైన ప్రతిజ్ఞ పూనితే చాలు శత్రువును మట్టుపెట్టేదాకా నిద్రపోరు. అంతటి శౌర్య, ధైర్య సాహసాలు ఈ సీమ ప్రజల సొత్తు.
పాపాలను కడిగేటి పాతాళగంగ, ఆదిశంకరాచార్యులు తపస్సు చేసుకున్న బిలము (గుహ, రంధ్రం), హటకేశ్వరస్వామి క్షేత్రం (అటిక - ఉట్టి, కుండలో వెలసిన స్వామి అటికేశ్వరస్వామి. రానూ రానూ - హటకేశ్వరస్వామిగా పిలవబడుతుంది) అవనిలో కైలాసంగా పిలవబడుతున్న దివ్య క్షేత్రమైన శ్రీశైలం ఈ సీమలోనే ఉంది. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు స్వయంభువుగా వెలిసారు.
సన్యాసులు, మహర్షులు, ఆశ్రమాలు ఈ ప్రాంతంలో అణువణువున కనబడతాయి. శిథిలమైన దేవాలయాలు, శివనందులు ఇలా ఎన్నో ఈ సీమ అంతటా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఈ సీమకే మణిమకుటంగా విరాజిల్లుతోంది.
పాలబుగ్గల పసిపిల్లలు పిల్లనగ్రోవి ఊదితే చాలు లేగదూడెలు, బీళ్ళు అన్నీ పులకరించిపోతాయి. చీకటిపడి, చంద్రుడొచ్చే వేళయ్యిందంటే చాలు ఈ సీమలో కోలాటాలతో చిందులు తొక్కుతూ, గజ్జెలు కట్టుకుని గంతులెస్తారు శ్రామికులు. అలా శ్రమజీవన సౌందర్యం పరిఢవిల్లిన నేల ఇది.
ఎంతో ఎత్తులో ఉన్న బండరాళ్ళు, కొండలు, ఎర్రని దుప్పులు, పలుగు రాళ్ళ గట్లు, పరికి కంప పొదలు, నల్లరేగడి నేలలు, చినుకు పడితే చాలు పెరిగే వేరుశెనగ పంటలు.. ఇలా వనసంపద, సస్యశ్యామల జీవన మకరందం ఈ నేలలోనే దొరుకుతుంది. నల్లమల్ల అడవుల్లో ఉదయించిన సూరీడు పగటి వేళకు ఎర్రటి అగ్గిలా మండుతాడు. అదే సాయం వేళయ్యే సరికి ఆ సూరీడే నందికొండ నీడల్లో చల్లగాలికి పరవశించి, ఒళ్ళు మరిచిపోయి, అలసిపోయి నిదురిస్తాడు. సూరీడికే చల్లదనానిచ్చే పవిత్రత, మాహాత్మ్యం ఈ నేల గాలిలో, ఈ సీమ చల్లదనంలో ఉంది. ఇలా సకల సంస్కృతులకు, జీవరాశులకు, నిధులకు, కళలకు నిలయమైన రాయలసీమ గొప్పతనాన్ని ఈ పాట ఎదఎదకు హాయిగా వినిపిస్తుంది. తాదాత్మ్యాన్ని కలిగిస్తుంది.
పాట :-
ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెల్లా తరుగని గనులున్న సీమ గిరులున్న సీమ
వానగాలికి సీమ తానమాడినపుడు వజ్రాలు ఈ నేల ఒంటిపై తేలాడు
పొరలు నిమిరితే పుష్యరాగాలు దొర్లు
బంగారు గనులున్న పొంగదీతల్లి పొంగిపోదమ్మా
కలియుగమ్మున నరులు ఓర్వలేరని తెలిసి
నల్లరాయై వెలసి ఎల్లలోకములేలు
వేంకటాచలము భూవైకుంఠస్థలము
దర్శించిన జన్మ ధన్యమౌతాదో పుణ్యమౌతాదో
హరిహర బుక్కరాయలడవికేటకెళ్తే
కుందేలు కుక్కల ఎంట బడ్డాయంట
పౌరుషాల పురిటి జీవగడ్డమో
ప్రతిన పట్టితే శత్రువిక పతనమేరా
పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ
ఆదిగురువులుతపమునాచరించిన బిలము
హటకేశ్వరశిఖరమవని కైలాసం
తనకు తా వెలసిన శివనందులమ్మో శ్రీశైలమమ్మో
సత్రాలు సాధువులు బైరాగి తత్త్వాలు
సీమ ఊరూరున మారు మ్రోగుతాయి
శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో
వీరబ్రహ్మం మఠము సీమకే మకుటం
పాలబుగ్గల నోట వేణువు మీటితే
ఆలమందలు కంచె బీళ్ళు పరవశించు
నింగిలో సంద్రుడు తొంగి సూసితే
సీమలో కోలాటమే సిందు తొక్కు చిరుగజ్జెలాడు
ఎత్తుబండరాళ్ళు ఎర్రని దుప్పులు
పలుగు రాళ్ళగట్లు పరికి కంప పొదలు
నెర్రెళ్ళు వారిన నల్లరేగళ్ళు
ఆరు తడుపుకే పెరుగు వేరుశెనగమ్మో
నల్లమల్లడవుల్లో తెల్లవారే పొద్దు
అంబాటియేలకు మీద అగ్గైకురిపించు
సందెపూట నందికొండ నీడల్లో
చల్లగాలికి ఒళ్ళుమరిచి నిదురించు అలసి నిదురించు.
- తిరునగరి శరత్ చంద్ర