Sun 22 Aug 06:11:07.204661 2021
Authorization
ఖద్దరు దోతి, లాంగ్ కోటు, తల పాగా, చేతిలో చిన్న ట్రంకు పెట్టి, అందులో ఫోల్డింగ్ స్టవ్ పెట్టుకొని గ్రంథాలయాల స్థాపన కోసం, గాంధేయవాదం కోసం, ఆంధ్ర మహాసభ కార్యకర్తగా, సంఘాల పంతులుగా, సాంఘిక సంస్కరణ వాదిగా ఊరూరా తిరిగి ప్రజలను ఉత్తేజ వంతులను, చైతన్య వంతం చేసిన ఘనత ఉన్నవ వెంకటరామయ్య గారిదే..!!
ఉన్నవ వెంకటరామయ్య 1896 సంవత్సరంలో జూలై 16న గుంటూరు జిల్లా ఉన్నవ గ్రామంలో ఒక సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి సుబ్బారావు, తల్లి మహాలక్ష్మమ్మ. వీరికి ఏడుగురు సంతానం. వారిలో మూడో వారు ఉన్నవ వెంకటరామయ్య. ప్రాథమిక విద్య మొత్తం ఉన్నవ గ్రామంలో జరిగింది. తర్వాత ఆయన బావ వంకాయలపాటి రామకోటయ్య దగ్గర ఎక్కువ కాలం ఉండి చదువుకున్నారు. 1912లో మున్సిఫ్ పరీక్ష, 1913లో గ్రామ కరణం, ఎకౌంట్స్ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు.
1917లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఆరుట్ల గ్రామంలో ఉన్న వింజమూరి గోవిందరావు అనే భూస్వామి కోరిక మేరకు వారి పిల్లలకు చదువు చెప్పేందుకు భోజనం పెట్టి, నెలకు పది రూపాయల వేతనం ఇచ్చే విధంగా ఉద్యోగంలో చేరారు.
ఆరుట్ల గ్రామం జాగీర్దార్ శంగి శేషగిరిరావు ఆధీనంలో ఉన్నప్పటికినీ హిందువైనా, ముస్లిమైనా నాటి జాగీర్దార్ల వ్యవహారాలలో పెద్ద తేడా ఉండేదికాదు. పన్నులు భాగానే వసూలు చేస్తున్నప్పటికీ ఆ గ్రామం అంతా ఏతావాతా జీర్ణ గహంలా, వసతుల లేమితో ఎలాంటి అభివద్ధి లేకుండా కనిపించేది. ఉన్నవ వెంకట రామయ్య గోవిందరావు పిల్లలకు పాఠాలు చెబుతూనే ఆ ప్రాంతంలో వీధిబడి నడిపారు. ఆ ప్రాంతంలో ఉన్న నిరక్షరాస్యులకు చదువు నేర్పేందుకు వయోజన పాఠశాలను, బాలికల పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంత యువకులకు పెద్దబాలశిక్ష, చిన బాలశిక్ష, కనీసం ఉత్తరాలు, దిన పత్రికలు చదివే విధంగా ప్రజలను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఆ గ్రామ ప్రజలకు ఉన్నవ వెంకట రామయ్య ఆశాకిరణంలా కనిపించారు. తమ పిల్లలకు విజ్ఞాన భిక్షపెట్టిన గురువుగా భావించారు. వీధి పాఠశాల, వయోజన పాఠశాల, బాలికల పాఠశాల, వర్తక సంఘం, పద్మశాలీల సంఘం, భజన సంఘం, హరిజన విద్యా సంఘం, సహకార సంఘం, 1925లో పోస్ట్ ఆఫీస్ వంటి సంస్థలను స్థాపించి చైతన్యవంతంగా ప్రజలను తీర్చిదిద్దాడు.
గ్రంథాలయోద్యమ నేత
1920 ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞానం అందించాలనే దక్పథంతో హనుమాదాంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని అక్కడి యువకులతో, మధ్యతరగతి మేధావులతో, విరాళాలు సేకరించి 45 పుస్తకాలతో ఏర్పాటు చేశారు. మాడపాటి హనుమంతరావు గారి మీద ఉన్న గౌరవం, అభిమానంతో ఆ పేరు పెట్టారు. గ్రంథాలయానికి కంసాలి రంగయ్య తన ఇంటిని దానంగా ఇచ్చారు. 1925 లో పక్కా గ్రంథాలయ భవనం ఆరుట్లలో నిర్మించారు.
1925లో మధిరలో జరిగిన ప్రథమ ఆంధ్ర గ్రంథాలయ మహాసభలకు ఆరుట్ల హనుమదాంధ్ర భాషా నిలయం గ్రంథాలయ ప్రతినిధిగా హాజరై ప్రధాన పాత్ర పోషించారు. సూర్యపేట ఆంధ్ర జన సంఘం సమావేశ సమయంలో, రెండవ గ్రంథాలయ మహాసభ, యువక సభ, సంఘ సంస్కార సభ, ఆంధ్ర మహిళా సభ, వైశ్య యువజన సభలు మూడు రోజుల పాటు జరిగాయి.
హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర అనే గ్రంథంలో వెల్దుర్తి మాణిక్యరావు చెప్పినట్లు ఆంధ్ర ఉద్యమ కార్యకర్తలు ఆనాటి ప్రచారకులైన పువ్వాడ వెంకటప్పయ్య, టి.కే బాగయ్య, చాట్ రాతి లక్ష్మీ నరసింహ, గంగుల సాయి రెడ్డి, మంత్రి ప్రగడ వెంకటేశ్వర రావు, జానపాటి సత్యనారాయణ, ఉన్న వెంకట రామయ్య ప్రతి గ్రామంలో గ్రంథాలయం నెలకొల్పడానికి శక్తివంచన లేకుండా కషి చేశారు. అదేవిధంగా ఉన్నవ గారు గ్రంధాలయం పెట్టాలి అనే ఆసక్తి ఉన్న వారికి తగిన సహాయ సహకారాలు అందించేవారు. గ్రంథాలయాల స్థాపన తోటి తమ కర్తవ్యం అయిపోయింది అనుకోలేదు. మొక్క నాటిన రైతు అది పెరిగి ఫలించే వరకు నీరు, ఎరువు ఏ విధంగా అందిస్తుంటాడో, స్థాపించిన ప్రతి గ్రంథాలయానికి సభ్యులు వస్తున్నారా లేదా సభ్యులను ఏ విధంగా ఆకట్టుకోవాలి, ప్రజాహిత కార్యక్రమాలకు ఏం చేయాలి అనేటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. దీనికి తోడు గ్రంథాలయ కార్యకర్తలలో నూతన ఉత్తేజం కలిగించడానికి తాలూకా స్థాయి గ్రంథాలయ మహాసభలు ఏర్పాటు చేసేవారు.
ఆంధ్ర మహాసభ కార్యకర్తగా
ఉన్నవ వెంకట రామయ్య నిజాం రాష్ట్రంలో మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో గల గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర జన కేంద్ర సంఘం సమావేశాలను మొదలగు విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తుండేవారు. 1924లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ఆంధ్రలోని కాకినాడ పట్టణంలో జరిగాయి. సమావేశాలకు ఉన్నవ వెంకట రామయ్య తన సోదరునితో హాజరై ఆ స్ఫూర్తితో తెలంగాణలో కూడా చైతన్యం తేవాలని పరితపించే వాడు.
వెంకట రామయ్య కార్యదీక్షతపై ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారికి అవగాహన, అభిమానం ఏర్పడింది. ఆయనను ఆంధ్ర మహాసభ కార్యకర్తగా నియమించారు. అందుకు ఉన్నవకు లభించిన గౌరవ వేతనం పది రూపాయలు మాత్రమే. అది కనీసం ప్రయాణ ఖర్చులకు మాత్రమే సరిపోయేది. అయినను ఆ రోజుల్లో దేశానికి సేవ చేయాలనే తపన, ఆరాటం ఉన్నవారు కనుక ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన కర్తవ్యాన్ని తప్పక పాటించేవారు.
ఆంధ్ర మహాసభలు అనే ఆలోచన ఆయనదే కావడంతో ప్రథమాంధ్ర మహాసభ బాధ్యతను కూడా తన భుజస్కందాలపై వేసుకున్నారు. 1924లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో చేసిన ఏర్పాట్లన్నీ మొదటి ఆంధ్ర మహా సభ జోగిపేట లో ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభలో కూడా ఏర్పాటు చేసి దిగ్విజయం చేశారు. ప్రథమాంధ్ర మహాసభ ఆహ్వాన సంఘం ఉన్నవ కు జేబు గడియారం బహూకరించారు. ఇప్పటికీ ఈ జేబు గడియారం ఆయన కుమారుల వద్ద ఉన్నది.
అడవి దేవులపల్లి సంఘటన
మిర్యాలగూడ తాలూకాలోని అడవిదేవుల పల్లిలో వైశ్యులు చాలా మంది వ్యవసాయ దారులు, వర్తకం పట్ల ఉత్సాహం చూపలేదు. ఇక్కడ దుకాణాలు పెట్టలేదు. గ్రామం పెద్దది కావడంతో అక్కడ అమీన్, కచ్చిర్, ప్రభుత్వ పాఠశాల ఉండేది. అమీన్ కచ్చిర్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వచ్చిపోయే అధికారులకు ఉచితంగా లేదా తక్కువ ధరకు సరుకులు సప్లై చేయమని వైశ్యులను నిర్బంధించేవారు. ఆ బాధ నుండి విముక్తి పొందటానికి నల్గొండ నుండి ఒక మార్వాడి వర్తకుని పిలిపించి దుకాణం పెట్టించారు. ఉచిత సరఫరాలో ఆ మార్వాడికి వచ్చిన నష్టాన్ని తమలో తాము సాలీనా నెలకు మూడువేల రూపాయలు పంచుకుని చెల్లించే ఏర్పాటు చేసుకున్నారు. వర్తక సంఘాలు ఏర్పడ్డాయి అనే వార్త గోల్కొండ పత్రికలో ఎప్పుడైతే వచ్చిందో, తరువాత మార్వాడికి ఇక మేము మీ నష్టాన్ని చెల్లించలేమని చెప్పారు. సరకుల దుకాణం మూసివేయాలని అనుకున్నారు. అప్పటిదాకా ఉచితంగా, తక్కువ ధరలకు సరుకులు పొందిన ఉద్యోగులకు బాధ కలిగింది. దీనికి కారకుడైన కేంద్ర జన సంఘం ప్రచారకుడు ఉన్నవ వెంకట రామయ్య ఒక కచ్చిరుకు పిలిపించి శిక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఆ సంగతి తెలుసుకున్న గ్రామస్తులు చుట్టుముట్టారు. తరువాత ఉన్నవను సురక్షితంగా పంపించి వేశారు. ఇది ప్రజలకు ఆయన మీద ఉన్న అభిమానం.
గోల్కొండ పత్రిక మేనేజర్‌గా
నిజాం నిరంకుశ పాలన ఎదురొడ్డి నిలిచింది గోల్కొండ పత్రిక. నిజాం ''కింగ్ కోటి'' రాతల ఫిరంగి మోతలు కురిపించి, నిర్మొహమాటంగా ప్రజల అభిప్రాయాలను ప్రకటించి, సాహిత్య సేవ చేసిన గోల్కొండ పత్రికతో మూడున్నర సంవత్సరాల పాటు అనుబంధ ఉన్నది. తెలంగాణలో రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఆంధ్రోద్యమ ప్రచారం కోసం తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. గోల్కొండ పత్రిక చందాదారుల సంఖ్య పెంచడానికి ప్రయత్నించారు.
వితంతు పునర్వివాహాల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. వాటిలో గోల్కొండ పత్రిక ట్రై పుష్కర ఉత్సవ సంచిక పేజి నెంబర్ 41, 42 లో ఒక వైశ్య యువకునికి 9 సంవత్సరాల వితంతు బాలికకు వివాహం చేయుటకు తను ఏ విధంగా ప్రయత్నం చేశారో వివరించారు. ఆయన మొదటి నుండి రాజకీయ విషయాల కన్నా సంఘ సంస్కరణ విషయాలపై ఆసక్తి కనబరిచారు. కందుకూరి వీరేశలింగం, ఉన్నవ లక్ష్మీనారాయణ, మాడపాటి హనుమంతరావు గార్ల ప్రభావం ఎక్కువగా ఉండేది.
సంఘాల పంతులు
ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభ ప్రచార కార్యక్రమాలకు వరంగల్, నల్లగొండ మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో విరివిగా పర్యటించారు. పర్యటించిన ప్రతిచోటా గ్రంథాలయం, రైతు సంఘం, వర్తక సంఘం, పద్మశాలీల సంఘం, భజన మండలి, సహాకార సంఘం, హరిజన విద్యా సంఘం వంటి సంఘాలతో పాల్గొని, ఆయా సంఘాల కార్యకర్తలు స్థానిక సమస్యల గురించి చర్చించి వాటి నివారణ కోసం ప్రయత్నం చేసేవారు. అందువల్లనే వారిని సంఘాల పంతులు అని పిలిచేవారు. ఆయన సేవను నల్లగొండ జిల్లా ఎక్కువ ఉపయోగించుకుంది అని చెప్పవచ్చు.
ఆంధ్ర మహాసభల్లో చురుకుగా పాల్గొనడం, ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి కార్యక్రమాలు నిజాం ప్రభుత్వానికి కంటగింపుగా వుండేవి. దీంతో ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర సంఘ కార్యదర్శికి 1933 ఏప్రిల్ 23న రాత్రి 11 గంటలకు ఇచ్చారు. తరువాత మే 11న వివరణ ఇచ్చినా అందుకు అంగీకరించలేదు.
ఉన్నవ వెంకటరామయ్య ఆర్థిక స్థితిని బట్టి హైదరాబాద్‌లోని ఎక్సెల్సియర్ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరినప్పటికీ, అక్కడ కూడా నిజాం ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. దీంతోఆ పదవికి కూడా రాజీనామా చేశారు. 1951 మద్రాసుకు చెందిన దక్షిణ భారత హిందీ ప్రచార సభను హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించినప్పుడు ఆ సభ కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగడానికి సహకరించారు.
ఆంధ్ర మహాసభలో పదవి విరమణ తర్వాత గోల్కొండ పత్రిక మేనేజర్‌గా, తర్వాత స్వగ్రామానికి మకాం మార్చారు. పోలీసు చర్య అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి హిందీ మహాసభ, సర్వోదయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆయన ఆరుట్ల గ్రామానికి చేసిన సేవలకు గుర్తుగా 1946 నవంబరు 13న ఆ గ్రామ ప్రజలు ఘన సన్మానం చేశారు. 1972 లో భారత స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను స్వాతంత్ర సమర యోధులుగా సత్కరించి ఉపకార వేతనం మంజూరు చేసింది.
మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డికి 1962 శాసనసభ ఎన్నికల్లో ఏజెంట్‌గా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వాతంత్ర సమరయోధుల పింఛను ఏర్పాటు చేశారు. దానితో ఆయన జీవిత చరమాంకం ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా గడిచి పోయింది. 1981 నవంబర్ 5న తన స్వగహంలో 85వ ఏట పరమపదించారు.
నిజాం ప్రభుత్వం దష్టిలో గ్రంథాలయాలు విప్లవ కేంద్రాలుగా భావించి ప్రతి గ్రంథాలయాన్ని ప్రభుత్వం అనుమానపు దష్టితో చూస్తున్న సమయం గ్రంథాలయ స్థాపన వాటి విస్తరణకు ఆంధ్ర జన సంఘం విశేషంగా కషి చేసింది. నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఆయన. తెలంగాణ మారుమూల ప్రాంతాలకు సైతం ఆంధ్రోద్యమ ప్రచారాన్ని, గ్రంథాలయ ఉద్యమాన్ని, గాంధేయ వాదాన్ని తీసుకెళ్లి స్వాతంత్రోద్యమ భావాలను రేకెత్తించిన ఉద్యమ జ్యోతి మన ఉన్నవ. వారి ఆశయాలను, జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
సాంఘిక సంస్కరణ ఉద్యమ నేతగా
బాల్య వివాహాలను వ్యతిరేకించారు. అంటరానితనం నిర్మూలనకు తన వంతు ప్రయత్నం చేశారు. ఆంధ్ర మహాసభ లక్ష్యాలను అమలుపరిచే చిన్న కేంద్రంగా ఆరుట్ల గ్రామాన్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దారు.
1946లో ఏర్పాటు చేసిన గ్రంధాలయాల మహాసభలకు జాతీయ నాయకులను ఆహ్వానించారు. జాతీయ నాయకుల జయంతులను, వర్థంతులను, జాతీయ పండుగ దినాలను పురస్కరించుకుని ఆంధ్రోద్యమ నాయకు లను, స్వాతంత్య్రోద్యమ నాయకులు మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామ కష్ణారావు, కొండా వెంకట రంగా రెడ్డి, వి.బి.రాజు, సుర వరం ప్రతాపరెడ్డి, హయగ్రీవాచారి వంటి పెద్దలను ఈ గ్రామానికి ఆహ్వానించేవారు. అలా ఈ గ్రామానికి వచ్చిన పెద్దలందరూ ఇబ్రహీంపట్నం వరకు కారు లేదా బస్సు సౌకర్యం ఉన్నందున దాని ద్వారా వచ్చేవారు. తర్వాత ఇబ్రహీంపట్నం నుండి ఆరుట్ల వరకు సైకిళ్ల మీదనో, ఎడ్లబండ్ల మీద ప్రయాణం చేసేవారు.
- డా. రవికుమార్ చేగొని
తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి