మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ప్రగతి సాధించినా ఆయా జాతుల ప్రజలు తమ అస్తిత్వ పరిరక్షణ కోసం నిరంతరం పరితపిస్తున్నాయి. మానవుని అస్తిత్వ పరిరక్షణలో భాషనే కీలక భాగస్వామి.
తెలుగు వారి ఔన్నత్యం కోసం, తెలుగు వారి మనుగడ కోసం, తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాల కోసం తెలుగు జాతి వికాసం కోసం తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఇవాళ ప్రతిజ్ఞ తీసుకోవలసిన అవసరం ఏర్పడింది.
గిడుగు రామమూర్తి - ప్రజలు మాట్లాడే భాషకే పట్టాభిషేకం చేశాడు. దేశ కాల పాత్రాదులను బట్టి భాషలు నిరంతరం మార్పుకు గురవుతుంటాయి. మార్పు చెందడం జీవద్భాషల లక్షణం కూడా. జాతుల వికాసం చెందినట్టే, భాషలు కూడా వికాసం చెందుతుంటాయి.
తెలుగు అంతరించి పోతున్న భాషల జాబితాలో ముమ్మాటికీ చేరను గాక చేరదు. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడే ప్రజలున్నారు. హంగు, ఆర్భాటాల కోసం పరాయిభాషలు మాట్లాడినా, మాతృభాషలో హృదయాన్ని ఆవిష్కరించినంత గొప్పగా పరాయి భాషల్లో ఆవిష్కరించలేం. అందుకే, తెలుగు జాతి మనుగడ కోసం, తెలుగు భాషను రక్షించుకోడానికి గిడుగు జయంతి సందర్భంగా మనమంతా కంకణ బద్దులమవుదాం! తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం అహర్నిశలు కృషి చేద్దాం!
గిడుగు రామమూర్తి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన ఉద్యమకారుడు. ఇవాళ గిడుగు రామమూర్తిని బహుముఖీన కోణాలతో విశ్లేషించి ఆవిష్కరిం చాల్సిన అవసరం ఉంది. మనం గిడుగును కేవలం వ్యావహారిక భాషోద్యమ పితామహుడిగానే చూస్తున్నాం. కాని, ఆయన శాసన పరిశోధకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, అన్నింటికీ మించి గొప్ప మానవతావాదిగా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.
గిడుగు రామమూర్తి పంతులు 1863 ఆగస్టు 29న విజయ నగరానికి సమీపంలో వున్న పర్వతాల పేటలో జన్మించాడు. ఈ రోజు గిడుగు వారి 159వ జయంతి గొప్పవాళ్ళ జయంతులను ప్రతి ఏటా జరుపుకోవడం మనకు రివాజుగా మారింది. నిజానికి మానవ సమాజం ఎంత చైతన్య వంతమైనదైనా, అప్పుడప్పుడూ నిస్తేజంగా, నిర్లక్ష్యంగా కనిపిస్తుంటుంది. అట్లాంటి సందర్భాలను అధిగమించడానికి, ఇట్లాంటి మహానుభావుల జీవిత విశేషాలను సమాజానికి అందిస్తూ వుంటే, అమితోత్సాహంతో ముందుకు సాగుతుంది.
గిడుగు వంశంలో ఇప్పటి వరకు తెల్సిన పూర్వీకుడు గిడుగు నూకరాజు. నూకరాజు కుమారుడు జోగిరాజు. జోగిరాజుకు ఏడుగురు కుమారులు. వారిలో అంతర్వేది మూడవవాడు. అంతర్వేది కుమారుడు సుబ్బయ్య. సుబ్బయ్యకు ముగ్గురు కుమారులు. వారిలో రెండవవాడు వీర్రాజు. గిడుగు వీర్రాజు కుమారుడు గిడుగు వేంకట రామమూర్తి.
పర్వతాల పేట శ్రీకాకుళానికి 20 మైళ్ళ దూరంలో వంశధార నదీ తరంలో వుంది. పర్వతాల పేటలో వీర్రాజు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో మన కథానాయకుడు గిడుగు వేంకట రామమూర్తి జన్మించాడు.
రామమూర్తికి ఐదు సంవత్సరాల, ఐదు నెలల, ఐదవ రోజున అక్షరాభ్యాసం జరిగింది. గోనెపాడు గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేసిన వారణాసి గున్నయ్యగారు రామమూర్తి గురువు.
పర్వతాల పేట వంశధార నదీతీరంలో వుండని ఎప్పాను కదా! దానికి అవతలివైపు నగరి కటకం వుంది.. నగరి కటకం ప్రాచీన కాలంలో ముఖలింగ నగర రాజ సైనికుల నివాస ప్రాంతంగా వుండేది. పర్వతాల పేటలో వీర్రాజు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న రోజుల్లో, నగరి కటకంలో జయపుర సంస్థానాధీశులుగా పని చేసిన విక్రమదేవ వర్మ తండ్రిగారు నివసిస్తూ ఉండేవారు. విక్రమ దేవ వర్మ 1867లో నగరి కటకంలోనే జన్మించాడు.
రామమూర్తి, విక్రమ దేవ వర్మ ఇద్దరూ బాల్య స్నేహితులు. ఇద్దరూ పెరిగి పెద్దవారవుతున్న క్రమంలో అభిప్రాయ బేధాలు ఏర్పడినాయి. అయినప్పటికి వారి మధ్య స్నేహం కొనసాగింది. పర్వతాల పేటలో రామమూర్తి ఉన్న రోజుల్లో నగరి కటకంలో వీధి భాగోతాలు, తోలు బొమ్మలాటలు వంటివి ప్రదర్శనలు జరుగుతూ వుండేవి. రామమూర్తి ఆ చన్న వయస్సులో నగరి కటకానికి వెళ్ళి ఆ ప్రదర్శనలు చూసి వచ్చేవారు. ఆలస్యమైనపుడు విక్రమ దేవ వర్మ ఇంట్లో నిద్రపోయేవారు.
రామమూర్తికి 11 సంవత్సరాల వయస్సులో అనగా 1874లో ఉపనయనం జరిగింది. 1875లో గిడుగు వీర్రాజు మరణించారు. తండ్రి మరణానంతరం రామమూర్తి బాధ్యతను వీర్రాజు మేనల్లుడు కాళ్ళకూరి విశ్వనాథం గారు చూసుకున్నారు. 1879లో రామమూర్తి, గురజాడ అప్పారావు ఇద్దరూ మెట్రిక్యులేషన్ పాసయ్యారు. కుటుంబ పరిస్థితుల రీత్యా రామమూర్తి ఉద్యోగ అన్వేషణ చేయాల్సి వచ్చింది. గురజాడ పై చదువులకు వెళ్లారు.
రామమూర్తికి 1879లో వివాహం జరిగింది. కందికొండ దాసు రెండవ కుమార్తె అన్నపూర్ణమ్మను రామమూర్తి తన జీవిత భాగస్వామిగా స్వీకరించాడు.
మెట్రిక్యులేషన్ అనంతరం రామమూర్తి ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించాడు. రెండు, మూడు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. చివరకు పర్లాకిమిడి హైస్కూల్లో ఫస్టుఫారం ఉపాధ్యాయునిగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఆయన నెల జీతం రూ.30/-. అది 1880వ సంవత్సరం.
పర్లాకిమిడి పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరిన తర్వాత అంచెలంచెలుగా తన విద్యార్హతలు పెంచుకున్నాడు. అదే క్రమంలో ప్రమోషన్లు కూడా వచ్చాయి. మొత్తం మీద పర్లాకిమిడి రాజావారి కళాశాలలో చరిత్ర ఉపన్యాసకులుగా ఎదిగారు.
రీడింగ్ రూం
ఆ రోజుల్లో పర్లాకిమిడిలో 'రీడింగ్ రూం' పేర చిన్న సమాజం ఉండేది. ఈ రీడింగు రూం తరుపున అనేక సామాజిక కార్యక్రమాలు జరుగుతూ వుండేవి. ఆ సమాజానికి రామమూర్తి కార్యదర్శిగా పని చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు సంఘసంస్కరణ ఉద్యమాన్ని నడిపిస్తున్న రోజుల్లో ఎంతో మంది ఉద్యమకారులు పర్లాకిమిడి వెళ్ళి 'రీడింగురూం' తరుపున ప్రసంగాలు చేస్తూ వుండేవారు. ఓ రోజు రఘుపతి వేంకటరత్నం నాయుడు కూడా ఇక్కడ ప్రసంగం చేశారు. సంస్కరణవాదులు చెప్పే విషయాలు సనాతన సంప్రదాయ వాదులకు మింగుడు పడేవికావు. వక్తలుగా వచ్చిన వారిని ప్రశ్నల వర్షంతో ముంచెత్తేవారు. సనాతన వాదుల ప్రశ్నలకు రామమూర్తి జోక్యం చేసుకుని అప్పుడప్పుడు సమాధానాలు చెపుతూ వుండేవారు.
సవరలు
పర్లాకిమిడి పట్టణానికి సమీప కొండ ప్రాంతాలల్లో అమాయకులైన సవరలు జీవిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో లభించే కలప, తేనె వంటి పదార్థాలు పర్లాకిమిడి అంగళ్ళలో అమ్ముకుంటూ తమ జీవనాన్ని సాగిస్తుండేవారు. కాని, అమాయకులైన సవరల శ్రమశక్తి దోపిడీకి గురవుతున్న విషయాన్ని రామమూర్తి గుర్తించారు. సవరలను విద్యావంతులుగా తీర్చిదిద్దితే వారి జీవితాలు కొంతైనా బాగుపడుతాయన్న ఆలోచన రామమూర్తికి కలిగింది.
సవరపొట్టెడును ఇంట్లో పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఆ తర్వాత సవర పల్లెల్లో తిరుగుతూ వాళ్ళ దయనీయ జీవనస్థితి గతులను దగ్గరుండి పరిశీలించాడు. వాళ్ళ జీవితం మారాలంటే, సవరల కోసం పాఠశాలలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. ముందు సవర పిల్లల కోసం సవర వాచకాలు రచించాడు. సవర పాటలు, సవర ప్రయోగ దీపికలు తయారు చేశాడు. సవర పల్లెల్లో పాఠశాలకు తగిన రీతిలో ఉపాధ్యాయులను తయారు చేశాడు. ఆ తర్వాత తన స్వాప్నిక జగత్తును సాకారం చేసే క్రమంలో సవర పాఠశాలలు స్వయంగా ప్రారంభించాడు. ఇదంతా మహా యజ్ఞం. ఈ మహా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి రామమూర్తి మహా యాజ్ఞికుడిగా అవతరించాడు.
రీడింగు తరపున రామమూర్తి సవరల కోసం పాటుపడుతున్న వైనాన్ని ఆనాటి మద్రాసు గవర్నరు పర్లాకిమిడిని సందర్శించినపుడు ఒక వినతి పత్రం రూపంలో ఆయనకు సమర్పించారు. కొంత ఆలస్యంగానైనా మద్రాసు ప్రభుత్వం రామమూర్తి సవరల కోసం చేస్తున్న కృషిని గుర్తించింది. ఆ క్రమంలో 1911 నవంబర్ 12న ఐదవ జార్జి పేరిట మద్రాసు బ్రిటిష్ ప్రభుత్వం 'సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్'ను రామమూర్తికి ప్రదానం చేసింది. ఆ తర్వాత జనవరి 1న రావుసాహెబు బిరుదుతో సత్కరించింది.
శాసన పరిశోధకుడు
రామమూర్తి ముఖ లింగ శాసనం, కొకుదురు శాసనం, దీర్ఘాసి శాసనం వంటి శాసనాలను పరిష్కరించి చరిత్ర మీద తనకున్న సత్తాను నిరూపించుకున్నాడు.
ముఖలింగ దేవాలయ గోడల మీది శాసనాలు రామమూర్తి దృష్టిని ఆకర్షించాయి. ముఖ లింగం ప్రాచీన కాలం నాటి యాత్రాస్థలమే. రామమూర్తి ఆ దేవాలయ గోడల మీది శాసనాలను పరిశోధించి 1894లో ముఖలింగ ప్రాచీనత మీద ఒక వ్యాసం రాసాడు. అది 1894లో 'మద్రాసు జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్' అనే పత్రికలో అచ్చయింది. ఈ వ్యాసం ఒక నూతన విషయాన్ని ఆవిష్కరించింది. ప్రాచీన కాలం నాటి ముఖ లింగమే తూర్పు గాంగ వంశీయుల రాజధానీ నగరమని, అందరూ భావిస్తున్నట్లు ఇప్పటి ఓడరేవు అయిన కళింగ పట్నం కాదనీ, ప్రాచీన కాలంలో ముఖ లింగానికీ కళింగ నగరమని పేరుండేదనీ రామమూర్తి ఆ వ్యాసంలో తేల్చాడు. శాసన పరిశోధకుడిగా చరిత్రకు అందించిన ఈ నూతన విషయాన్ని చరిత్రకారులు అంగీకరించి ఆ మేరకు తన పూర్వపు తప్పిదాన్ని సవరించుకున్నారు. ఇట్లా రామమూర్తి ఏ అంశాన్ని పట్టుకున్నా దాని లోతులను తరచి చూసే జిజ్ఞాస కలిగినవాడు.
సామాజిక ఉద్యమకారుడు
గిడుగు రామమూర్తి రీడింగు రూం సమాజానికి స్వయంగా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి, ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నాడు. సవర పిల్లల కోసం పాఠశాలలు స్థాపించి, వాళ్ళను విద్యావంతులుగా తీర్చిదిద్దాడు. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి కుమార్తె పదవ ఏటనే బాల్య వివాహాల బారిన పడి ఆ తర్వాత వైధవ్యాన్ని పొందింది. సనాతనుల ఆక్షేపణలకు భయపడిన మల్లయ్య శాస్త్రిని ఒప్పించి ఆ అమ్మాయికి పునర్వివాహం జరిపించడంలో గిడుగు క్రియాశీలకంగా వ్యవహరించారు.
రామమూర్తి శిష్యుల్లో ఒకడు కన్నేపల్లి వేంకట నరసింహం ఇంగ్లండులో పై చదువులు చదుకొని, దేశానికి తిరిగివచ్చి మర్యాద పూర్వకంగా రామమూర్తిని కలిసాడు. ఆ సందర్భంగా నిర్వహించిన సహపంక్తి భోజనం పర్లాకిమిడి బ్రాహ్మణులకు కోపం తెప్పించింది. రామమూర్తిని వెలివేశౄరు. కులక్రభష్టుడైన వాణ్ని అంటే, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం వల్ల కుల భ్రష్టత్వాన్ని పొందినట్లుగా ఆ శిష్యుణ్ణి భావించి, వాడితో పాటు మరికొందరికి భోజనాలు పెట్టన రామమూర్తిని బహిష్కరించారు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే 'వెలి' పోతుందని రామమూర్తికి కబురు పంపారు. రామమూర్తి వాళ్ళ చాందస భావాలను నిరసించారే గానీ, వాళ్ళ బెదిరింపులకు లొంగలేదు.
వ్యావహారిక భాషోద్యమం
గిడుగు వారి వ్యావహారిక భాషోద్యమం కూడా సామాన్యుల శ్రేయస్సును ఉద్దేశించి పుట్టింది. 1857 నాటి భారతీయ విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తూ వున్న క్రమంలో, 1903లె గవర్నర్ కర్జన్ విశ్వవిద్యాలయాల్లోని విద్యావంతులు, తమ విద్యా పరిజ్ఞానాన్ని ఏ మేరకు దేశ ప్రజలకు వినియోగిస్తున్నారని తెలుసుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ కమిటీ అందించిన నివేదికల్లో కర్జన్కు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించలేదు. భిన్న ప్రాంతీయ భాషలు మాట్లాడే భారతీయ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో జ్ఞానాన్ని సంపాదించినా, ఆ జ్ఞానాన్ని ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసుకుని, తమ ప్రజలకు అందించడంలో కృతకృత్యులు కాలేకపోతున్నారని కర్జన్ ఏర్పాటే చేసిన కమిటీ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాదు, వివిధ ప్రాంతీయ భాషల్లో కళాశాలలు ప్రారంభించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఆ నివేదిక ఆధారంగా జాతీయ కళాశాలలకు రూపకల్పన జరిగింది.
తెలుగు మాట్లాడే ప్రజల మధ్య జాతీయ కళాశాలలు ఏర్పాటైతే, ఆ జాతీయ కళాశాలల్లో ప్రవేశపెట్టే పాఠ్య పుస్తకాలలో ఏ భాషాశైలిని ఉపయోగించాలన్న చర్చ మొదలైంది. గ్రాంథిక భాష సలక్షణమైనదనీ ఆ భాషనే పాఠ్య పుస్తకాలల్లో ప్రవేశ పెట్టాలని గ్రాంథిక భాషా వాదులు వాదించారు.
దేశంలో అక్షరాస్యతను పెంచడం కోసం, సామాన్య ప్రజలను విద్యా విషయంలో చైతన్యవంతంగా తీర్చిదిద్దడం కోసం జాతీయ కళాశాలల ఏర్పాటు జరుగుతుందనీ, అందువల్ల పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టే భాషా శైలి జన సామాన్యానికి అర్థమయ్యేటట్టుగా ఉండాలని గిడుగు వారు భావించి ప్రచారం చేశారు. క్రమక్రమంగా తెలుగు పండితుల మధ్య అభిప్రాయ భేదాలు ముదిరి అది గ్రాంథిక, వ్యావహారిక భాషోద్యమాలకు దారి తీసింది.
గ్రాంథిక భాషలో పుస్తకాలు తయారు చేస్తే దాని వల్ల ఆశించిన ఫలితాలు రావన్నది గిడుగువారి వాదం. వ్యావహారికాన్ని ఆమోదిస్తే భాష భ్రష్టమవుతుందని గ్రాంథిక వాదుల మతం. భాష భ్రష్టత్వాన్ని గురించి ఆలోచించిన గ్రాంథిక వాదులు, విద్య రాకపోవడం వల్ల సమాజం భ్రష్టుపడుతుందని మాత్రం ఆలోచించలేకపోయారు. మొత్తం మీద గ్రాంథిక, వ్యావహారిక వాదాలు ముదిరి ముదిరి మహౌద్యమం వైపు దారి తీసింది. మొదట్లో గ్రాంథిక భాషావాదుల సంఖ్య అధికం. క్రమంగా దశాబ్దాలు మారుతున్న కొద్దీ రామమూర్తి వాదంలోని శాస్త్రీయతను పల్వురు అంగీకరించడం మొదలెట్టారు. కందుకూరి వీరేశలింగం పంతులు కూడా రామమూర్తి వ్యావహారిక వాడకంలోని సత్యాన్ని గుర్తించారు.
రామమూర్తి తన వ్యావహారిక భాషోద్యమాన్ని నాలుగు అంశాల ప్రాతిపదికతో ముందుకు నడిపించారు.
ప్రపంచ దేశాలు ఆధునిక యుగంలో అడుగు పెడుతున్న క్రమంలో భాషా పరమైన మార్పులను అంగీకరించాయి. గ్రీకు, రష్యన్, నార్వేజియన్, ఇంగ్లీషు లాంటి భాషలు ఆయా దేశాలు ఆధునిక యుగంలో ప్రవేశించినపుడు భాషా పరమైన పెక్కు మార్పులను అంగీకరించిన విషయాన్ని రామమూర్తి గుర్తించారు. భారతదేశంలో కూడా బెంగాలీ వంటి భాషలు ఆధునిక యుగంలో విపరీతమైన మార్పులకు గురవుతూ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలను నిశితంగా పరిశీలించిన రామమూర్తి జీవద్భాషలు నిరంతర ప్రవాహం లాంటివని, మార్పు అనివార్యమని ప్రతిపాదించారు.
లక్ష్యాన్ని ప్రాతిపదికగా చేసుకుని లక్షణ గ్రంథాలు ఏర్పడుతాయని, లక్షణ గ్రంథాలకు లక్ష్యాన్ని శాసించే అధికారం లేదనే రామమూర్తి మరో అంశాన్ని ముందుకు తెచ్చారు. వ్యాకరణ గ్రంథాలు రాసేటపుడు వైయ్యాకరణులు వదిలివేసిన పదాలన్నీ లక్షణ విరుద్ధాలని గ్రాంథిక వాదుల మతం. లక్ష్యాన్ని సరిగ్గా చూడకుండా లక్షణ గ్రంథాలు రాయడం వైయ్యాకరణుల తప్పిదమని రామమూర్తి వాదం. క్రమంగా రామమూర్తి వాదంలోని సత్యాన్ని అందరూ గుర్తించడం మొదలెట్టారు.
నిజమైన వచన రచనా సంప్రదాయం వ్యావహారికమేగాని రామమూర్తి మరో వాదాన్ని ముందుకు తీసుకువచ్చారు. తాళపత్ర గ్రంథాలలో వ్యావహారికంలో ఉన్న అనేక రూపాలు వైయ్యాకరణుల సూత్రాలకు అనుకూలంగా దిద్దిపారేస్తున్నారనీ, అలా చేయడం కూటకరణ దోషాలకు పాల్పడడమే ననీ రామమూర్తి వాదించారు. తాళ పత్ర గ్రంథాలను, ముద్రిత పుస్తకాలను తేరిపార పరిశీలించి రామమూర్తి వివిధ కళాశాలలో కమిటీలు ఏర్పాటు చేయించి, తన వాదానికి అనుకూలంగా సాక్ష్యాధారాలను సేకరించారు.
గ్రాంథిక భాషలో రాస్తున్నామని వాదించే పండితులకు గ్రాంథిక భాష రాదని రామమూర్తి మరో అంశాన్ని ముందుకు తెచ్చారు. కొక్కొండ వేంకటరత్నం వంటి పండితుని గ్రంథాలలోని లోపాలను వేదం వేంకట రామశాస్త్రి ఎత్తిచూపిన వైనాన్ని రామమూర్తి గుర్తించారు. ఇద్దరు పండితులకు గ్రాంథిక భాషా విషయంలోనే వైవిధ్యం ఉన్నప్పుడు, అట్లాంటి వైవిధ్య భరితమైన గ్రాంథిక శైలిని పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టడం ఎంత వరకు సమంజసమని రామమూర్తి ప్రశ్నించారు. ఇట్లా రామమూర్తి తన వాదాన్ని సమర్థిస్తూనే నాలుగు గ్రంథాలను తయారు చేశారు. అవి - 1) వ్యాసావళి, 2) బాలకవి శరణ్యం, 3) గద్య చింతామణి, 4) ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం
ఇట్లా, గిడుగు రామమూర్తి తన జీవిత కాలాన్నంతా వ్యావహారిక భాషోద్య మానికే ధారపోశారు. సంప్రదాయ భావాలు బాగా జీర్ణించుకున్న పండిత ప్రకాండులతో రామమూర్తి యుద్ధానికి దిగాల్సి వచ్చింది. రామమూర్తిని మొదట్లో తెలుగు భాషను విధ్వంసం చేయడానికి ముందుకొస్తున్నాడని గ్రాంథికవాదులు నిందించారు. కాని, రామమూర్తి సంకుచిత భావాలు కలిగిన పండితుల ఇరుకైన మనస్తత్వాలకు విశాలంగా మార్చడానికి మూడు దశాబ్దాల కంటే ఎక్కువే పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు తన వ్యావహారికవాదమే నెగ్గింది.
ఒక వైపు సవరల కోసం, మరోవైపు సామాజిక సంస్కరణల కోసం, ఇంకో వైపు నూతన ఆవిష్కరణల కోసం, వేరొక వైపు వ్యావహారిక భాషోద్యమం కోసం తన జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి మన గిడుగు రామమూర్తి పంతులు. అందుకే, రామమూర్తిని బహుముఖీన కోణాలలో విశ్లేషించి ఆయన జీవితంలో సాధించిన అద్భుత ఘట్టాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది.
- డా|| దాశరథుల నర్సయ్య, 9390919100
Sun 29 Aug 05:29:03.641391 2021