Sun 05 Sep 06:05:37.421744 2021
Authorization
భారత రాష్ట్రపతి, భారత రత్న కీ||శే సర్వేపల్లి రాధాకష్ణ పుట్టినరోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. 1888 సెప్టెంబరు 5న తమిళనాట తిరుత్తణి గ్రామంలో జన్మించిన రాధాకష్ణుడు ఉపాధ్యాయ వత్తి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన తీరు అసామాన్యంగానే వుంటుంది. క్రమశిక్షణ, కఠోరశ్రమ, అధ్యయనశీలత ఆయనకు ఆ ఔన్నత్యాన్ని తెచ్చింది. తత్వశాస్త్రంపై అధికారం, సంభాషణా చాతుర్యం ఆయనను భారత రాయభారిగా కూడా విజయం సాధించడంలో తోడ్పడింది. ఇటువంటి ఉన్నత వ్యక్తి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉచితమే. ఈ సందర్భంలో ఉపాధ్యాయుని గౌరవానికి సమాజానికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించే ప్రయత్నమే ఈ వ్యాసం.
సమాజంలో ఉపాధ్యాయ వత్తి ఉన్నతమైనదని భావిస్తారు. ఉపాధ్యాయులకు లేక గురువులకు భారత సమాజం గౌరవాన్ని ఇస్తుంది. దానికి కారణం శారీరక శ్రమలకు మేధోశ్రమలకు మధ్య ఉన్న అంతరమే. ఈ అంశం ఒక చదువరి ఉపాధ్యా యునిగా మారే క్రమంలోనే ఉంటుంది. ఉపాధ్యాయుని గౌరవం విద్యార్ధులకు జ్ఞాన గవాక్షాలను తెరవడం ద్యారా వస్తుంది. తన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా చూపి విద్యార్ధులను నిబద్దతతో తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు సంఘంలో సహజంగానే గౌరవానికి పాత్రులవుతారు.
ఉపాధ్యాయులు తమకు లభించే గౌరవంతో సంతోష పడటంలో పొరపాటేమీ లేదు. కానీ ఉపాధ్యాయులెప్పుడూ సంఘం చెక్కిన శిల్పాలనే విషయాన్ని సదా గుర్తుంచు కోవాలి. సమాజం దేన్ని కోరుకుంటుందో దాన్నే ఉపాధ్యాయుడు అందిస్తుంటాడు. ఆ మేరకే అతని జీవనశైలి, గౌరవం ఆధారపడి వుంటుంది. ఇదో కొత్త మాటలాగా లేక విచిత్రంగానూ అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం. ఉదాహరణకు మహాభారతంలో ద్రోణుని విషయమే తీసుకుందాం. రాజాశ్రయం లభించిన తర్వాతనే ద్రోణుడికి గౌరవం పెరిగింది. తన వద్దకు వచ్చిన ఏకలవ్యునికి కుల దష్టితో విద్యను నేర్పననడం ఆనాటి సమాజ కట్టుబాటే. అంతేగాక అర్జునుడిని మేటి విలుకాడిని చేయడానికి అదే ఏకలవ్యునికి విద్య నేర్పక పోయినా బొటన వ్రేలిని గురుదక్షిణగా అడిగాడు. ఇందులో సమాజం కట్టుబాటుకంటే గౌరవాన్ని కోల్పోకూడదన్న వ్యక్తిగత స్వార్ధమే ఎక్కువగా కనపడుతుంది. అయినా ద్రోణుడు గొప్పగురువే మన దేశంలో ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే అవార్డు ద్రోణాచార్య అవార్డు. ఇదీ ఉపాధ్యాయునిపై సమాజ ప్రభావం. అంతేకాదు అప్పటి కాలంలో బోధించేవారి సామాజిక స్థాయి కూడా గౌరవానికి కొంత కారణం కావచ్చు. అందుకే ఉపాధ్యాయుడు సమాజం చెక్కిన శిల్పం.
ఆనాటి కాలం గురించి పక్కన బెట్టి, సార్వత్రిక విద్య డిమాండ్ వచ్చిన తర్వాతి కాలానికి వద్దాం... మన దేశంలో సార్వత్రిక విద్యకు బీజం స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి హయాంలో పడింది. దీనికి మూలాలు అంతర్జాతీయంగా వున్నాయి. పారిశ్రామిక విప్లవం, ప్రెంచి విప్లవం, ఇంగ్లండులో వచ్చిన చార్టిస్టు ఉద్యమం, 1852లో విడుదలైన కమ్యూనిస్టు ప్రణాళిక ఇవన్నీ సార్వత్రిక విద్యను బలపర్చాయి. ఫలితంగా అందరికీ విద్య అందుబాటులోకి రావడం మొదలైంది. సమాజానికి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో అవసరం అయ్యారు. 1930లలో గనుక తీసుకున్నట్లైతే ఉపాధ్యాయులు అత్యంత దయనీయ జీవితాల్ని గడిపేవారు. ఈ పరిస్థితుల్లో కేరళలోని మలబార్ ప్రాంత ఉపాధ్యాయులు తమ పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పోరాటం మొదలు పెట్టారు. గౌరవం విషయానికి వచ్చినప్పుడు సమాజానికి ఉపాధ్యాయులు అతీతం కాదని చెప్పడం కోసమే ఇది చెబుతున్నాను. ఇక మళ్ళీ రెండవ ప్రపంచయుద్ధ కాలంలో యుద్ధభారాలు ప్రజలతో పాటు ఉపాధ్యాయుల జీవన స్థితిగతులను కూడా దిగజార్చాయి. బతుకు దెరువుకై విద్యార్ధులు బడి మానివేశారు. ఉపాధ్యాయులు పస్తులుండలేక ఉప వత్తులలోకి వెళ్ళారు. 1944 ప్రాంతంలో ఉమ్మడి మదరాసు రాష్ట్రంలోని ఎయిడెడ్ ఉపాధ్యాయుల స్థితిగతులు ఎలా వున్నాయో చూద్దాం. 9 రూపాయలు, 14 రూపాయలు, 18 రూపాయలు ఇలావుండేవి జీతాలు. వీటిలో 15% మేనేజ్ మెంట్ బలవంతంగా లాక్కునేది. ఇదీకాక పూర్ ఫండ్, సెంట్రీబుక్ చందా, మధ్యపాన నివారణ చందా, యుద్ధపన్ను ఇలా వేతనంలో మినహాయింపులుండేవి. కాబట్టి గౌరవనీయమైన వత్తి అనుకుంటున్న ఉపాధ్యాయ వత్తిలోని ఉపాధ్యాయులు ఇంత తీవ్రమైన పీడనకు, వేధింపులకు గురయ్యేవారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా ఉపాధ్యాయుల స్థితిగతుల్లో పెద్దగా మార్పులు లేవు. 1964లో దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఏర్పడ్డ నేషనల్ ఎడ్యుకేషన్ కమీషన్ భారత దేశంలోని ఎడ్యుకేషన్ సెక్టర్‌ను కూలంకషంగా పరిశీలించి ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని అభివద్ధికరమైన సూచనలు చేసింది. దీనిలో ఉపాధ్యాయులకు అకడమిక్ ఫ్రీడమ్ వుండాలని, ఇన్‌సర్వీస్ ట్రైనింగ్ అవకాశాలు వుండాలని, వేతనాలను మెరుగుపరిచి వారు ఆత్మగౌరవంతో జీవించేలా చూడాలని రికమెండ్ చేసింది. ఉపాధ్యాయులు కూడా ఒక మెరుగైన జీవితం కోసం సంఘాలను ఏర్పాటు చేసుకొని ఉమ్మడి పోరాటాల ద్వారా కొంత ఆర్ధిక సమద్ధినీ, కొన్ని హక్కులను సాధించుకోగలిగారు. ఇటీవల రిటైర్ అవు తున్న ఉపాధ్యా యులు కూడా తొలి సారి ఉద్యోగాల్లోకి వచ్చినప్పుడు వారి వేతనం అన్నీ కలిపి 550 లోపు వుండేది. పల్లెల్లో గ్రామస్తుల సహ కారంతో పొదుపుగా తమ జీవితాల్ని కొనసాగించే వారు. వేతనాల్లో కాస్త ఊరట గత రెండు పి.ఆర్.సిల నుండే ప్రారంభం అయింది.
తెలంగాణా ప్రభుత్వంలో ఉపాధ్యా యుల స్థితిగతులు మరింత దిగజారాయనే చెప్పవచ్చు. ధరల సూచి ప్రకారం ప్రతీ 5 సంవత్సరాల కొకసారి ఇచ్చే పి.ఆర్.సి ఇప్పటికే రెండు సంవత్సరాలు ఆలస్యం అయింది. మూడు కరువుభత్యాలు ప్రభుత్వం బాకీపడింది. ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నప్పటికీ కొత్త నియామకాలు లేవు. పదోన్నతులు లేవు దాంతో ఒక్కో మండల విద్యాధికారి కనీసం మూడు మండలాలు చూస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి ప్రభావంతో దిగజారిన పరిస్థితులు రెండవ ప్రపంచయుద్ధం నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. ఈ ప్రభావం ప్రైవేటు, కార్పొరేటు విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులపై చాలా ఎక్కువగా వున్నది. వారికి అనేక నెలల నుండి వేతనాలు లేవు. ఇటీవల వరకు విద్యాబోధన చేసిన వీరు ఉదర పోషణార్ధం పండ్లమ్ముకోవడం, బజ్జీల బండి నడపడం, ఇతర కూలీ పనులు చేయడం వంటి చిన్న వత్తులను ఆశ్రయిస్తున్నారు. ఆ గాథలు అనేకం దినపత్రికల్లో దర్శనమిస్తున్నాయి. అందుకే ఉపాధ్యాయుడు సమాజం చెక్కిన శిల్పం అంటున్నాను.
కరోనా కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి. 83 శాతం మంది విద్యార్ధుల తల్లిదండ్రులు పిల్లలను కోవిడ్్ కారణంగా పాఠశాలకు పంపలేమని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఆన్లైన్ తరగతుల షెడ్యూల్ ప్రకటించింది. ఇది విజయవంతం అవుతుందని చెప్పలేము. కానీ జరగబోయే పెద్ద నష్టం ఏమంటే ఉపాధ్యాయుడు తన వ్యక్తిత్వం ద్వారా ఏ పురోగామి మార్పులను విద్యార్థిలో తీసుకురావాలో అవి ప్రత్యక్ష బోధన లేకపోవడం వల్ల సాధ్యం కావు. దీనితో ఉపాధ్యాయునికి విద్యార్ధికి ఉన్న సంబంధం తెగిపోతుంది. ఇక సాంప్రదాయకంగా వచ్చే గౌరవం అనే భావన కూడా క్రమంగా నశిస్తుంది. అందుకే ఉపాధ్యాయ వత్తికి, ఉపాధ్యాయులకు ఉన్న గౌరవాన్ని సమాజమే ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది తప్ప ఎప్పటికీ ఒకే గౌరవం ఒక కాల్పనిక విషయమే. ఈ పరిస్ధితుల్లో ఉపాధ్యాయ దినోత్సవం నాడు కొందరు ఉపాధ్యాయులకు సత్కారాలు చేసి ఉపాధ్యాయ వత్తి గౌరవప్రదమైనదని, ఉపాధ్యాయుడు గౌరవనీయుడని ఉపన్యాసాలు ఇచ్చిన మాత్రాన సరిపోతుందా?
- జి.గోపాలకష్ణ, 9290146187