Sun 12 Sep 06:04:40.333428 2021
Authorization
సోషల్ చేంజ్ అనేది చిన్నమాటేగాని దాన్ని తీసుకు రావాలంటే సంస్కర్తలే జన్మించాలి. సమాజానికి భౌతిక రూపంతో పాటు గుణమూ ఉంటుంది. గుణ రూపాలు రెండూ మూలాల నుంచే ప్రాప్తిస్తాయి. మూలాలే దిశలకూ దశలకూ సమాజాన్ని నడిపిస్తుంటాయి. అందుకే సమాజం మారాలనుకునే వాళ్లు, సమాజాన్ని మార్చాలనుకునే వాళ్లు మూలాల్లోకి వెళ్లిగాని మాట్లాడరు. మూలాలు అందించే చైతన్యం ఎంతో ఉత్కష్టమైంది. మనుషులు సమాజంగా ఏర్పడేటప్పుడు వాళ్ల కుటుంబం, అనువంశికత, ఎత్తు, రంగు, భాష, వస్త్రధారణ, అలవాట్లు, ఆలోచనలు, ఆహారం, ఉత్పత్తి సంబంధాలు, సంస్కతి అన్నింటికీ మించి నివాస వాస్తవికత ప్రధాన భూమికగా మూలాల్లో నిక్షిప్తమై ఉంటుంది.
రక్తసంబంధం వలెనే నివాస వాస్తవికతలోని భూబంధాన్నీ మనిషి ఇంకో మనిషితో ఎల్లప్పుడూ ఇష్టపడతాడు. ఈ ఇష్టత నుంచే ఒక సమూహంగా మనుషులు మమేకమై కులాలు, జాతులు, మతాలు, దేశాలు, ఖండాలు ఏర్పడ్డాయి. కొందరు అవగాహనా లేమితో మూలాలను విస్మరిస్తుంటారు. అది మొదటికే మోసం. మూలాల స్ఫురణ మార్పుకు ప్రథమ యానకం. మూలాల కొనసాగింపే వారసత్వం. వారసత్వం సమాజానికి సజనాత్మకతను ప్రసరించే దీపధారి. మూలాల్లోని ఒక్కో అంశం ఒక్కోసారి ఒక్కో సందర్భానుసారం సోషల్ యాక్టివిస్టుల పోరాటాలకు నినాదమవుతుంది. మూలాలే రాజకీయ రూపం తీసుకుని ఏకీకరణకో, అస్తిత్వం ప్రాతిపదికగా వేర్పాటుకో అభివద్ధి కొరకు పావులు కదుపుతాయి. చెట్టుకు వేర్లు బలం. భవంతికి పునాది బలం. అట్లానే ఏ సమాజానికి ఆ సమాజం మూలాల నుంచే బలవర్ధకమవుతుంది.
మూలాలు చైతన్యాన్ని అందిస్తాయి. ఈ చైతన్యాలల్లో రాజకీయ ప్రక్రియే అత్యంత కీలకమైంది. ఎందుకంటే ప్రజా జీవితాన్ని అంతిమంగా నియమ బద్దం చేసేవి, నిర్దేశించేవి, వేగిర పరచేవి, శాసన సమ్మతంగా మలుపు తిప్పేవి రాజకీయాలే కాబట్టి. అయితే శుద్ధరాజకీయాలు ఎప్పుడూ సమాజం లోలోపలకు ఇంకవు, విస్తరించవు. ఒక వేళ ఇంకి విస్తరించినా ఎక్కువ కాలం మనజాలవు. అందుకే రాజకీయ మేధావులు తాము అనుకున్న సామాజిక మార్పును సాధించటానికి అక్కడి సంస్కతి నుండి మూలాల చర్చను ప్రారంభిస్తారు.
అప్పుడవి సాంస్కతిక రాజకీయాలవుతాయి. స్తబ్దుగా ఉన్న ప్రజా శిబిరాలకు సాంస్కతిక రాజకీయాలు ఉప్పందిస్తూ కొత్త వ్యూహాలను రచిస్తాయి. సాంస్కతిక రాజకీయాలు ప్రజలను, ఉద్యమ నాయకత్వాలను కలుపుకుని మొత్తం సాంఘిక వాతావరణాన్ని తన దోవకే మళ్లిస్తాయి. ఇక్కడే ప్రజలకు నాయకత్వానికి ప్రకష్ట బంధం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే అప్పటి దాకా సాంప్రదాయిక మాధ్యమాలుగా ఉన్న ప్రదర్శన కళలు ప్రజా ఆకాంక్షలకు మాధ్యమాలవుతాయి. సాంస్కత్యోద్యమ బాంధవ్యం నుంచి తమ లక్ష్యాలకై వివిధ వర్గాలు, ప్రాంతాలు, దేశాలు విప్లవించిన సందర్భాలు చరిత్రలో అనేకం. పారిశ్రామిక యుగారంభం మొదలుకొని వర్తమానంలోనూ కార్మిక శ్రేయస్సు ఎజెండాగా జయప్రదమైన అంతర్జాతీయ మార్క్సిస్టు ఉద్యమాలూ, స్థానీయ సామాజిక అంతరాలు వివక్ష వర్ణవ్యవస్థలపై తిరుగుబాటుగా ముందుకొచ్చిన ఫూలే అంబేద్కరిస్టు ఉద్యమాలూ సంస్కతిక మూలాలు కేంద్రంగానే తమ కార్యాచరణ కొనసాగించాయి. స్వాతంత్య్రానికి పూర్వం, పిదప మనదేశంలో భాషల పేరిట కావొచ్చు, ప్రాంతాల పేరిట జరిగే ఉద్యమాలు కావొచ్చు సాంస్కతిక రాజకీయాలు వారధిగానే తమ భావజాల వ్యాప్తి చేసుకున్నాయి. కొన్నిసార్లు విజాతి శక్తుల ప్రభావంతో సాంస్కతిక రాజకీయాలు అనివార్యంగా తమ అభినివేశాన్ని మార్చుకునే పరిస్థితి కూడా సమాజంలో ఉంటుంది. సమాజంలో సంభవించే ప్రతి మార్పుకు, మార్పు తాలూకు ఉద్రేకాలూ ఉంటాయి. అదే మోతాదులో అడ్డగింపులూ ఉంటాయి. ఈ ఉద్రేకాలు అడ్డగింపుల ఆధారంగానే మార్పు 'ఆకస్మికం' లేదా 'క్రమేపి' అనే రూపం తీసుకుంటుంది. ఏదైనా ఒక మార్పు సమాజం అంతర్జన్యం లేదా బహిర్జన్యం అని ధ్రువీకరింపబడేది ఆ సమాజం మూలాల ద్వారా అక్కడి ఇతిహాసాల్లో చిత్రించబడిన మహాపురుషుల జీవితాశయాలు అందించే సాపేక్షత నుంచే. ఇక్కడే వ్యక్తులు వాళ్ల సామాజిక క్రియాశీలత (సోషల్ యాక్టివిజం)ది పెద్ద పాత్ర. బిల్ మోయర్ 'డూయింగ్ డెమోక్రసి' గ్రంథకర్త, సామాజికోద్యమ కారుడు తన 'మూవ్మెంట్ యాక్షన్ ప్లాన్(మ్యాప్)' విశ్లేషణలో వ్యక్తి సామాజిక క్రియాశీలత గురించి విపులంగా చర్చిస్తాడు. వ్యక్తుల వ్యవహార శైలి ప్రయోజకం (ఎఫెక్టివ్), నిష్ప్రయోజకం (ఇనెఫెక్టివ్) అని, ఇవి పౌరుడి స్థాయిలోనూ, రెబల్ స్థాయిలోనూ, రిఫార్మర్ స్థాయిలోనూ, సోషల్ ఏజెంట్ స్థాయిలోనూ వ్యక్తమవుతాయని బిల్ మోయర్ ఉదహరిస్తాడు. ఏ స్థాయిదైనా ఎఫెక్టివ్ సోషల్ యాక్టివిజమే సామాజాన్ని గుణాత్మకంగా మార్చగలదు. ఇనెఫెక్టివ్ సోషల్ యాక్టివిజం సమాజాన్ని మరింత వెనక్కి తోయగలదు.
సామాజిక మార్పును గురించిన పరిపూర్ణ అవగాహన వ్యక్తులకుండాలి. సామాజిక మార్పు ఎన్ని రకాలు? సామాజిక మార్పుకు కారణాలేమిటో తెలిసున్నపుడే ఆ దిశగా పౌరుల అడుగులు తీక్షణమవుతాయి. 'పరిణామ క్రమంలో వచ్చే మార్పు, విద్యుక్త స్థితి కల్పించే మార్పు, వైరుధ్యాల నుంచి పుట్టుకొచ్చే మార్పు' అని సామాజిక మార్పు మూడు రకాలు. సామాజిక మార్పును ''అనిర్ణీతం, సందర్భానుసారం, విజాతీయం'' అని వ్యాఖ్యానిస్తూ హర్బర్ట్ స్పెన్సర్ 'ద మ్యాన్ వర్సెస్ స్టేట్' గ్రంథంలో ''సమాజపు వివిధ పార్శ్వాల వివిధ నిర్వర్తనల పరస్పరాధీనం ద్వారా వ్యక్తమయ్యే రూపాంతరం'' అంటాడు. సామాజిక ప్రగతిని గురించి ప్రస్తావిస్తూ ఆగస్ట్ కామ్టే తన 'ద కోర్స్ ఇన్ పాజిటివ్ ఫిలాసఫి' గ్రంథంలో 'లా ఆఫ్ త్రీ స్టేజస్' ను ఉదహరిస్తాడు. సమాజిక మార్పు 'వేదాంత సంబంధి, తార్కిక సంబంధి, రూఢి సంబంధి' అని పేర్కొంటాడు. ఈ మూడింటిలో దేనికి సంబంధించిందైనా సామాజిక మార్పుకు ''జనాభా స్వభావం -స్థితిగతులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, సంస్కతి సంప్రదాయాలు, రాజకీయాలు, ఆర్ధిక వ్యవస్థ, విద్యా విధానం'' అనే ఆరు అంశాలు ప్రధాన కారణాలుగా సామాజిక శాస్త్రవేత్తలు చూపుతున్నారు. అయితే సమాజంలో అమలయ్యే విద్యా విధానం ఆ సమాజంలోని సమస్తాన్ని నిర్ణయిస్తుందనేది విద్యావేత్తల అభిప్రాయం. బడులు (స్కూల్స్) ఇన్నున్నా ఇంకా చేతబడులే ఊళ్లేలుతున్న పరిస్థితి మన గ్రామీణ జీవితంలో వేళ్లూనుకొనే ఉంది. అందుకే వందేళ్ల కింద ''కన్ను కానని వస్తుతత్వము కాంచ నేర్పరు ఇంగిలీజులు వారి విద్యల కరచి నే సత్యమునరసితిన్'' అంటూ మహాకవి గురజాడ చదువు ప్రాముఖ్యతను గురించి ముత్యాల సరాల్లో వ్యాఖ్యానించాడు. విద్యలో సైన్స్ టెంపర్ జొప్పించబడాలని ఆనాడు పండిట్ నెహ్రూ అభిలషించిందీ సమాజాలను పట్టి పీడిస్తున్న మూఢాచారాల పెకిలింతకే.
మనదేశం వరకు చూసుకుంటే మనం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లోకి వచ్చేశాం. ఇప్పుడు మూలం నుంచి జరిగిన అభివద్ధిని, జరగాల్సిన అభివద్ధిని నిర్వచించుకోవాలి. ఈ దేశం కోసం మూలవాసులు అనాదిగా చిందించిన రక్తాన్ని, అర్పించిన చెమటనూ పాఠాలుగా పెట్టుకోవాలి. భాషలన్నిటికీ సమప్రాధాన్యం, సంస్కతులన్నిటికీ సమగౌరవం కల్పిస్తూ భాషా సంస్కతుల వికాసానికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి. ఇప్పటిదాకా ఏ లబ్ధి నోచుకోని అణగారిన వర్గాలకు, 'ఈవ్ ఆఫ్ డిస్ట్రక్షన్' గా చెప్పుకోబడుతున్న ప్రస్తుత విధ్వంసక అభివద్ధి కింద సర్వం కోల్పోయిన 'దేశం లేని ప్రజలు' గా మిగిలిన కాందిశీకులకు ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చేయూత నివ్వాలి. దేశ సంపదలో అణగారిన ప్రతి వర్గానికి భాగస్వామ్యం ఉందని గుర్తించి, దాన్ని బాధ్యతగా పంపిణీ చేసి దేశానికి అవసరమైన శక్తిని భక్తిని పురోగతికై 'ఉమ్మడి సౌభాగ్యా (చైనా అధ్యక్షుడు తరుచుగా వాడే మాట)'న్ని వెలికితీయాలి. ఈ ప్రకార్యంలో ఇక ఏ మాత్రం అలసత్వం ఉదాసీనత తటస్థించినా దేశపటం గణుతికెక్కదు. పారిశ్రామికీకరణ నాల్గోదశలో విశ్వ సంపన్నులు నయా సామ్రాజ్యవాదులతో అంటకాగుతూ పనిగట్టుకొని సామాన్యులను ఆదివాసీలను అంతమొందించాలనుకున్నా, లేదా కనీస మానవ హక్కులను పట్టించుకోకుండా పేదలను రోగాలకు రొష్టులకు వదిలేసినా, ఎవరెవరు తమ మూలాల్లోంచి తమ ఆరాధ్యపురుషుల ప్రవచనాల్లోంచి, ముఖ్యంగా బిల్ మోయర్ చెప్పిన 'మ్యాప్' నాలుగు వ్యవహార శైలుల్లోంచి తప్పనిసరి వచ్చి తీరవలసిన సామాజిక మార్పు కోసం ప్రభాతభేరి ఎట్లా మ్రోగించాల్నో రాజ్యాంగమే దిక్సూచినిస్తుంది. పొద్దున్నే కూడళ్లలో జాతీయ పతాకం ఎగరేస్తూ జనగణమన ఉత్సవ సమితితో సావధానంగా గొంతు కలుపుతున్న జనాలను చూస్తుంటే అధ్యాపకుడిగా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. చాన్నాళ్ల కల నెరవేరి ఈసారి ఒలంపిక్స్‌లో భరతమాత మెడలో బంగారం పడినందుకు, మన రామప్పకు యునెస్కో గుర్తింపు లభించినందుకు పౌరుడిగా ఒకింత గర్వంగానే వుంది. ఇదే సమయంలో మన పొలాల్లో కాడెద్దుల హొయలకు బదులు కాం'ట్రాక్టర్ల' రొద ప్రజ్వరిల్లుతున్నందుకు ఓ మూలవాసిగా బాధేస్తుంది. కరిగట్టు రోజున బురద మళ్లల్లో అరకల సల్లాపం కనుమరుగైనందుకు ప్రాణం అల్లాడిపోతుంది. ఎంత కాదనుకున్నా వ్యక్తి సుఖ దుఃఖాలకు సాంఘిక వికాస విషాదాలే కారకమూ ప్రేరకమూ కదా. ఇప్పుడు అభివద్ధికి ఉద్యమిస్తూనే ఊరు వేరు మూలాన్ని కాపాడేందుకు నికష్ట యాంత్రీకరణకు బ్రేకులు పడాల్సిందే. అనవసర దూరం పెరిగి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న ఈ తరుణంలో సమిష్టికి కలుపుగోలుతనానికి తాతా నాయనమ్మలు నేర్పించిన తత్త్వగీతాలకు శ్రుతి కట్టిపాడే నవతరం రావాల్సిందే. సోషల్ యాక్టివిజమే ఊరుకైనా దేశానికైనా జీవనాడి.
- డా.బెల్లి యాదయ్య, 9848392690
ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా.