బాలీవుడ్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, విమర్శకుల ప్రశంశలు అందుకున్న విలక్షణ నటి షబానా అజ్మీ. ఆమె సినీ నటిగా, సామాజిక కార్యకర్తగా పని చేస్తూనే మహిళల హక్కుల కోసం పోరాడారు. అజ్మీ ప్రధాన స్రవంతి, స్వతంత్ర సినిమా రెండింటిలోనూ 120కి పైగా చిత్రాలలో నటించి మెప్పించింది. భారత ప్రభుత్వం చలనచిత్ర రంగంలో, సామాజిక సేవలో ఆమె చేసిన సేవలను గుర్తించి "పద్మశ్రీ", "పద్మ భూషణ్" లతో సత్కరించింది. షబానా అజ్మీ ఉత్తమ నటిగా ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలతో సహా ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులను, అనేక ప్రశంసలు, గౌరవ డాక్టరేట్లు పొందడంతో పాటు 30వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల సందర్భంగా ఃఃవిమెన్ ఇన్ సినిమాఃః అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. 1997 లో రాజ్యసభకు సైతం నామినెట్ చేయబడింది.
షబానా అజ్మీ ప్రఖ్యాత కవి 'కైఫీ అజ్మీ', ప్రసిద్ధ రంగస్థల నటి 'షౌకత్ అజ్మీ'ల దంపతులకు జన్మించింది. 1950వ సంవత్సరం సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన షబానా తల్లిదండ్రులు సామాజిక జీవితంలో ఉండడంతో చిన్నతనంలోనే, ఇంటిలోని వాతావరణ నేపథ్యంలో కుటుంబ సంబంధాలు, సామాజిక, మానవ విలువల పట్ల గౌరవాన్ని పెంపొందించుకుంది. మేధోపరమైన ప్రేరణ, ఎదుగుదల కోసం ఆమె అభిరుచికి అనుగుణంగా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చేవారు. షబానా ముంబైలోని ''క్వీన్ మేరీ స్కూల్''లో ప్రాథమిక విద్యాభ్యసం పూర్తి చేసి, సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి సైకాలజీలో పట్టభద్రురాలైన తర్వాత పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో కోర్సును అభ్యసించింది.
సినీ రంగ ప్రవేశం
షబానా అజ్మీ 1973లో ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ నిర్మించిన ''ఫాల్సా'' ఆర్ట్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన, 1974 లో శ్యామ్ బెనగల్ నిర్మించిన ''అంకుర్'' చిత్రం మొదట విడుదలయి ''జాతీయ అవార్డును'' గెలుచుకుంది. ఆమె నటించిన ఈ రెండు చిత్రాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంశలు అందుకుంది. 1983 నుండి 1985 వరకు మూడు సంవత్సరాల పాటు షబానా వరుసగా జాతీయ అవార్డులను అందుకుంది, అంకుర్, అర్త్, ఖండార్, పార్ చిత్రాలతో పాటు, 1999లో వచ్చిన 'గాడ్ మదర్' చిత్రంలోని ఆమె నటనకు మరో జాతీయ అవార్డు రావడంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది.
షబానా నటన ఆమె పోషించిన పాత్రల నిజ జీవిత చిత్రణ ద్వారా వర్గీకరించబడింది. 'మండి' సినిమాలో ఆమె వేశ్య గహంలో మేడమ్‌గా నటించింది. ఈ పాత్ర కోసం, ఆమె బరువును పెంచి, తమలపాకును కూడా నమిలింది. దాదాపు ఆమె సినిమాల్లో నిజ జీవిత పాత్రలు కొనసాగాయి. వీటిలో 'ఖండార్' సినిమాలో తన విధికి రాజీనామా చేసిన జామిని అనే మహిళ, 'మాసూమ్' సినిమాలో ఒక సాధారణ పట్టణ భారతీయ భార్య, గహిణి తల్లి పాత్ర ఉన్నాయి.
సమాంతర సినిమాలలో
ఆమె ప్రయోగాత్మక, సమాంతర భారతీయ సినిమాలలో కూడా నటించింది. 1996 లో దీపా మెహతా చిత్రం ''ఫైర్'' లో అజ్మీ రాధ పాత్రలో ఒంటరి మహిళగా నటించింది. రాధ, ఆమె కోడలుతో ప్రేమలో పడుతుంది. తెరపై లెస్బియనిజం సంబంధాన్ని ప్రదర్శించడంతో అనేక సామాజిక వర్గాలు, సంఘాల నుండి తీవ్రమైన నిరసనలు బెదిరింపులను ఎదుర్కొంది. అయితే 32వ చికాగో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా ''సిల్వర్ హ్యూగో అవార్డు'', లాస్ ఏంజిల్స్‌లోని అవుట్ ఫెస్ట్‌లో ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డు అందుకుంది. ఈ చిత్రంలోని రాధా పాత్ర షబానాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది.
శ్యామ్ బెనగల్ రూపొందించిన నిశాంత్, జూనూన్, సుస్మాన్, అంతర్నాడ్ సినిమాలలో నటించడంతో పాటు, సత్యజిత్ రే నిర్మించిన 'శతరంజ్ కే ఖిలాడి', మణాల్ సేన్ చిత్రాలు 'ఖండార్', జెనెసిస్, ఏక్ దిన్ అచనాక్', సయీద్ మీర్జా సినిమా 'ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యోన్ ఆతా హై', సాయి పరంజ్పే నిర్మించిన 'స్పర్ష్, 'దిశా', గౌతమ్ ఘోస్ 'పార్', అపర్ణ సేన్ 'పిక్నిక్', 'సతి', మహేష్ భట్ 'ఆర్త్', వినరు శుక్లా 'గాడ్ మదర్' చిత్రాలు విజయవంతమయి షబానా అజ్మీకి మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. మన్మోహన్ దేశారు 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'పర్వారిష్', ప్రకాష్ మెహ్రా 'జ్వాలాముఖి' వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. జాన్ ష్లెసింగర్ 'మేడమ్ సౌసాట్జ్కా', రోలాండ్ జోఫ్ 'సిటీ ఆఫ్ జారు' వంటి హాలీవుడ్ చిత్రాలలో సైతం అజ్మీ నటించారు. తన కెరీర్లో, షబానా 120 కి పైగా ప్రధాన స్రవంతి, సమాంతర సినిమాలో నటించి విలక్షణ నటిగా గుర్తింపు పొందింది.
రంగస్థల నాటకాలలో
షబానా అనుపమ అనే సోప్ ఒపెరాలో స్మాల్ స్క్రీన్ లో అరంగేట్రం చేసి, ఆధునిక భారతీయ స్త్రీని చిత్రీకరించింది. ఇందులో మహిళల సాంప్రదాయ భారతీయ ఆచారాలు, విలువలను ఆమోదిస్తూ, మహిళలకు మరింత స్వేచ్ఛ గురించి చర్చించింది. అజ్మీ సినిమాల్లో నటించడమే కాకుండా అనేక రంగస్థల నాటకాలలో నటించింది. వాటిలో ముఖ్యమైనవి కాకేసియన్ చాక్ సర్కిల్, ఫరూక్ షేక్ తుమ్హారీ అమత ఆధారంగా ఐదు సంవత్సరాల పాటు నడిచిన ఎంఎస్ సత్యు 'సఫేద్ కుండలి'. సింగపూర్ రిపెర్టరీ థియేటర్ కంపెనీతో అసైన్‌మెంట్‌పై ఆమె సింగపూర్‌లో పర్యటించింది, రే బ్యూనో దర్శకత్వం వహించిన ఇబ్సెన్స్ డాల్ హౌస్‌కు ఇంగ్మార్ బెర్గ్మాన్ తో నటించింది. ఈ అన్ని మాధ్యమాలలోని వ్యత్యాసాలను ఎత్తి చూపుతూ, థియేటర్ నిజంగా నటుడి మాధ్యమం, రంగస్థలం నటుడి స్థలం, సినిమా దర్శకుడి మాధ్యమం, టెలివిజన్ రచయిత మాధ్యమం అని ఆమె వ్యాఖ్యానించింది
వ్యక్తిగత జీవితం
1970 సంవత్సరం చివరలో అజ్మీకి 'బెంజమిన్ గిలానీ'తో నిశ్చితార్థం జరిగింది, కానీ తర్వాత ఆ నిశ్చితార్థం రద్దయ్యింది. 1984, డిసెంబర్ 9న పాటల రచయిత, కవి జావేద్ అక్తర్‌ను వివాహం చేసుకుంది. అదివరకే జావేద్ అక్తర్‌కు హిందీ సినిమా స్క్రిప్ట్ రైటర్ 'హనీ ఇరానీ'తో వివాహం అయ్యింది. వారికి ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ పిల్లలు కూడా. అయితే అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న జావేద్ అక్తర్‌ను వివాహనికి అజ్మీ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తపరచిన షబానా ఆయననే వివాహమాడింది.
షబానా సోదరుడు బాబా ఆజ్మీ సినిమాటోగ్రాఫర్, ఆమె సోదరి తన్వి అజ్మి నటి కూడా. సోదరి అల్లుడు నటుడు. నటీమణులు ఫరా నాజ్, టబు ఆమె మేనకోడళ్లు.
నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్త
షబానా అజ్మీ నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్త, పిల్లల మనుగడకు సహాయ పడటంలో, ఎయిడ్స్‌తో పోరాడటంలో, అన్యాయన్ని ఎదురించడంలో చురుకుగా పాల్గొంటారు. మతతత్వాన్ని ఖండిస్తూ అనేక నాటకాల ప్రదర్శనలలో పాల్గొంది. 1989లో స్వామి అగ్నివేష్, అస్ఘర్ అలీ ఇంజనీర్‌తో కలిసి, ఆమె న్యూఢిల్లీ నుండి మీరట్ వరకు నాలుగు రోజుల పాటు మార్చ్ చేసింది. ఆమె వాదించిన సామాజిక సమూహాలలో మురికివాడలు, స్థానభ్రంశం చెందిన కాశ్మీరీ పండిట్ వలసదారులు, లాతూర్ భూకంప బాధితులు ఉన్నారు. 1993 ముంబై అల్లర్లు ఖండించి, మతపరమైన తీవ్రవాదాన్ని విమర్శించింది. 1995లో రంగ్లో జరిగిన ఇంటర్వ్యూలో కార్యకర్తగా తన జీవితాన్ని ప్రతిబింబించింది. 11 సెప్టెంబర్ 2001 దాడులు, జామా మసీదు గ్రాండ్ ముఫ్తీ సలహాను ఆమె వ్యతిరేకించారు. భారతదేశంలోని ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో తమ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. షబానా ఎయిడ్స్ బాధితుల బహిష్కరణకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ప్రభుత్వం జారీచేసిన చిన్న సినిమా క్లిప్‌లో ''మీ తిరస్కరణ అవసరం లేదు, మీ ప్రేమ కావాలి'' అంటూ అజ్మీ ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. టీచ్ ఎయిడ్స్ అనే సంస్థ రూపొందించిన ఎయిడ్స్ ఎడ్యుకేషన్ యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్కి కూడా ఆమె తన స్వరాన్ని ఇచ్చింది. 1989 నుండి షబానా భారత ప్రధాన మంత్రి నేతత్వంలోని నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ సభ్యురాలు, నేషనల్ ఎయిడ్స్ కమిషన్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. 1997లో భారత ప్రభుత్వం షబానాను రాజ్యసభకు నామినేట్ చేసింది. 1998లో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ షబానాను భారతదేశానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది.
పురస్కారాలు
షబానా అజ్మీ 1988లో భారత ప్రభుత్వం నుండి నాల్గవ అత్యున్నత పౌర గౌరవమైన ''పద్మశ్రీ'' పురస్కారాన్ని, 2012వ సంవత్సరం మూడవ అత్యున్నత పౌర గౌరవమైన ''పద్మభూషణ్'' పురస్కారాన్ని అందుకుంది.
జాతీయ చలనచిత్ర అవార్డులు
అజ్మీ ఐదుసార్లు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. 1975లో అంకుర్, 1983లో అర్త్, 1984లో ఖంధార్, 1985లో పార్, 1999లో గాడ్ చిత్రాలలోని నటనకు గాను షబానా జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు కైవసం చేసుకుని అత్యధిక అవార్డులు పొందిన నటిగానిలిచింది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
1975లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు 'అంకుర్' నామినేట్ చేయబడింది.
1978 ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు కు 'స్వామి' గెలిచింది.
1981లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు కు 'తోడిసి బేవాఫై' నామినేట్ చేయబడింది.
1984లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు కు 'ఆర్త్' గెలిచింది.
1984లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు 'మసూమ్' నామినేట్ చేయబడింది.
1984లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు 'అవతార్' నామినేట్ చేయబడింది.
1984లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు 'మండి' నామినేట్ చేయబడింది.
1985లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు 'భావన' గెలిచింది.
1985లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు కు 'స్పార్ష్' నామినేట్ చేయబడింది.
2003లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ విలన్ అవార్డు కు 'మక్డీ' నామినేట్ చేయబడింది.
2004లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు కు 'తెహజీబ్' నామినేట్ చేయబడింది.
2006లో ఫిల్మ్‌ఫేర్ 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు' గెలిచింది.
2017లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు 'నీర్జా' గెలిచింది.
అంతర్జాతీయ అవార్డులు
1993లో ఉత్తర కొరియా చిత్రోత్సవంలో 'లిబాస్' చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు
1994లో ఇటలీలో జరిగిన టోరిమా ఆర్ట్ ఉత్సవంలో 'పటాంగ్' చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు
1996లో చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'ఫైర్' చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా అవార్డు
1996లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన అవుట్ ఫెస్ట్‌లో 'ఫైర్' చిత్రానికి ఉత్తమ నటి అవార్డు
వివిధ అవార్డులు, గౌరవాలు
బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు 1975లో 'అంకుర్' చిత్రానికి, 1984లో 'పార్' చిత్రానికి, 1987 లో 'ఏక్ పాల్' చిత్రానికి, 1999లో 'గాడ్ మదర్' చిత్రానికి, 2003లో 'తెహజీబ్' చిత్రానికి ఉత్తమనటి అవార్డులు గెలుచుకోగా, 1998లో ఉత్తమ సహాయనటిగా 'మత్యుదండ్' చిత్రానికి స్టార్ స్క్రీన్ అవార్డు, 2004లో 'తెహజీబ్' చిత్రానికి జీ సినీ అవార్డు, 2005లో 'ఉదయరాగం' చిత్రానికి ఉత్తమ ప్రదర్శనకు గాను అవార్డు అందుకుంది.
1999లో ఇండియన్ సినిమాకు విశేష సేవలు అందించినందుకు ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ అవార్డు, 2002లో కళలు, సంస్కతి, సమాజానికి చేసిన కషికి గుర్తింపుగా మిచిగాన్ విశ్వ విద్యాలయం ద్వారా మార్టిన్ లూథర్ కింగ్ ప్రొఫెసర్షిప్ అవార్డు ప్రదానం చేయబడింది.
2006లో గాంధీ ఫౌండేషన్ గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు లండన్‌లో ప్రదానం చేసింది.
2007లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఏ.ఎన్.ఆర్ జాతీయ అవార్డు
2009లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ క్రిస్టల్ అవార్డుతో సత్కరించారు.
2012 లో ముంబైలోని బాంద్రా బాండ్స్టాండ్లో ఆమె చేతి ముద్ర ప్రిన్సిపరేషన్ కోసం భద్రపరచబడినందున ఆమెను వాక్ ఆఫ్ ది స్టార్స్ సత్కరించింది.
2013లో నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ యు. కె ద్వారా గౌరవ ఫెలోషిప్.
2018లో పవర్ బ్రాండ్స్ 'మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీ' ద్వారా భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ నటిగా, మహిళల విద్య, మానవ హక్కులు, సమానత్వం, శాంతి కోసం కషి చేసినందుకు షబానా అజ్మీకి 'భారతీయ మానవతా వికాస్ పురస్కార్' ని ప్రదానం చేసింది.
జాతీయ అవార్డులు
1988లో నటిగా,సామాజిక కార్యకర్తగా తన పనిలో మహిళల సమస్యలను ఎత్తి చూపినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా 'యష్ భారతీయ' అవార్డు.
1994 లో సెక్యులరిజం గౌరవార్థం 'రాజీవ్ గాంధీ అవార్డు' అందుకున్నారు.
గౌరవ డాక్టరేట్లు
2003లో పశ్చిమ బెంగాల్ జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
2007లో యార్క్‌షైర్‌లోని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ బ్రాండన్ ఫోస్టర్ యూనివర్సిటీ అజ్మీకి కళలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది
2008లో ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
2013లో సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
2014లో ఫిబ్రవరి 5న టెరీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
- పొన్నం రవిచంద్ర, 9440077499
సీనియర్ జర్నలిస్టు, సినీ విమర్శకులు
Sun 19 Sep 03:35:09.843293 2021