దేశంలో కనీసవేతనం గత ఐదు సంవత్సరాలుగా పెరగలేదు. మన్మోహన్ సింగ్ దుర్దినాలలో 2011-13లో రోజుకు రు. 115 కాగా మోడీ గారీ అచ్చేదిన్ ప్రారంభంలో 2014లో రు.137, తరువాత రెండు సంవత్సరాలు రు.160, గత ఐదు సంవత్సరాలుగా రు.176 ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సగటు రోజు వారీ వేతనం రు.372.33కు, 2022లో రు.397, 2023నాటికి రు.419కి పెరగవచ్చని ఎకనోమెట్రిక్ పద్దతిలో అంచనా వేసింది. అంబానీ, అదానీల ఒకేడాది పెరుగుదలకు, అభాగ్యుల ఎనిమిదేండ్ల పెరుగుదలకు ఎంత తేడా ? అచ్చేదిన్ ఎవరికి ? చచ్చేరోజులు ఎవరికి ?
కార్మికుల కనీసవేతనాలు, ఉపాధి గురించి పరిశోధన చేసే వారు ఈ రోజుల్లో ఎవరుంటారు! ఆ అంశాన్ని ఎంచుకున్న ముగ్గురు ఉత్తమ పరిశోధకులకు నోబెల్ బహుమతి రావటం చిన్న విషయం కాదు కదా ! గుయిడో ఇంబెన్స్, జాషువా ఆగెస్, డేవిడ్ కార్డ్ ముగ్గురికీ కలిపి బహుమతి ఇచ్చారు. కార్మిక మార్కెట్ మీద కనీసవేతనాలు, విద్య, వలసల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వారు పరిశోధన చేశారు. కనీసవేతనాలు పెంచితే కుర్ర కార్మికులు, నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని చేసిన సూత్రీకరణలు తప్పని వారు నిరూపించారు.
ముకేష్ అంబానీ తరువాత అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ త్వరలో అంబానీ స్ధానాన్ని ఆక్రమించనున్నారా? పేదలు, మధ్యతరగతి మరిం తగా దిగజారనున్నారా? తీరు తెన్నులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అంబానీ రోజువారీ సంపాదన 163 కోట్లు కాగా అదానీ రాబడి 1002 కోట్లు మరి. అంబానీ ఆస్తి 7,18,000 కోట్లు కాగా అదానీ దగ్గర 5,05,000 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే అంబానీ సంపద పెరుగుదల తొమ్మిది శాతం కాగా అదానీకి 261శాతం అంటే నోరెళ్లపెట్టకండి. ఇదే సమయంలో ట్రేడింగ్ ఎకనమిక్స్.కాం అనే వెబ్సైట్ సమాచారం ప్రకారం దేశంలో కనీసవేతనం గత ఐదు సంవత్సరాలుగా పెరగలేదు. మన్మోహన్ సింగ్ దుర్దినాలలో 2011-13లో రోజుకు రు. 115 కాగా మోడీ గారీ అచ్చేదిన్ ప్రారంభంలో 2014లో రు.137, తరువాత రెండు సంవత్సరాలు రు.160, గత ఐదు సంవత్సరాలుగా రు.176 ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సగటు రోజు వారీ వేతనం రు.372.33కు, 2022లో రు.397, 2023నాటికి రు.419కి పెరగవచ్చని ఎకనోమెట్రిక్ పద్దతిలో అంచనా వేసింది. అంబానీ, అదానీల ఒకేడాది పెరుగుదలకు, అభాగ్యుల ఎనిమిదేండ్ల పెరుగుదలకు ఎంత తేడా ? అచ్చేదిన్ ఎవరికి? చచ్చేరోజులు ఎవరికి ?
''పురుషులందు పుణ్య పురుషులు వేరు'' (మహిళలకూ ఇదే వర్తిస్తుంది) అన్నట్టుగా పరిశోధకులందు జనపరిశోధకులు, ధనశోధకులు వేరు అని నోబెల్ బహుమతుల ప్రకటన వెల్లడించింది. ఎందుకంటే ఆ రాణీ ప్రేమపురాణం, ఈ కైఫీయత్‌కైన ఖర్చుల గురించి గాక కార్మికుల కనీసవేతనాలు, ఉపాధి గురించి పరిశోధన చేసేవారు ఈ రోజుల్లో ఎవరుంటారు! ఆ అంశాన్ని ఎంచుకున్న ముగ్గురు ఉత్తమ పరిశోధకులకు నోబెల్ బహుమతి రావటం చిన్న విషయం కాదు కదా ! గుయిడో ఇంబెన్స్, జాషువా ఆగెస్, డేవిడ్ కార్డ్ ముగ్గురికీ కలిపి బహుమతి ఇచ్చారు. కార్మిక మార్కెట్ మీద కనీసవేతనాలు, విద్య, వలసల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వారు పరిశోధన చేశారు. కనీస వేతనాలు పెంచితే కుర్ర కార్మికులు, నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని చేసిన సూత్రీకరణలు తప్పని నిరూపించారు. వేతనాలు పెంచితే కార్మిక లభ్యత పెరుగుతుందని కూడా తేల్చారు. అన్నింటికీ మించి వేతనాలు పెంచితే కంపెనీ లాభాలు తగ్గుతాయన్నది వాస్తవం కాదని ఆమేరకు వస్తు ధరలు పెంచుతారని వెల్లడించారు. మరి కేంద్ర ప్రభుత్వం లేదా మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు ఎవరికోసం కనీసవేతనాలను సంవత్సరాల తరబడి పెంచకుండా ఉన్నట్టు? సంపద పంపిణీలో అసమానతలను పెంచే చర్య కాదా ఇది.
గౌతమ్ అదానీ సంపద ఒక్క ఏడాదిలో రు.1.04 నుంచి ఏకంగా రు.5.05లక్షల కోట్లకు ఎదిగింది. ఇదంతా కష్టపడితే పెరిగిందేనా? సాధారణ కార్మికుడి కంటే అదనంగా వీరు రోజుకు ఎన్ని గంటలు శ్రమపడి ఉంటారు? ఇక్కడ కొంత మందికి సంపద పెరిగిందని ఏడవటం కాదు, ఎందరికో ఎందుకు పెరగటం లేదు అన్న ఆవేదనతోనే ఈ ప్రశ్న. కరోనా కాలంలో కొందరి సంపదలు పెరిగితే ఎందరో దిగజారారు ఎందుకని? ఐఐఎఫ్ఎల్ వెల్త్ హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 వెల్లడించిన వివరాల మేరకు ఏడాది కాలంలో కేవలం అదానీ మాత్రమే ఒక లక్ష విలువగల కంపెనీలు ఐదింటిని ఏర్పాటు చేశారు. సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా లక్ష కోట్ల సంపదదాటిని పది మందిలో ఎనిమిదవ స్దానంలో ఉన్నారు. అతగాడి రోజు వారీ సంపాదన రు.245 కోట్లు. ఏడాది కాలంలో ఏకంగా పన్నెండు స్ధానాలు ఎగబాకి రు.1.31లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. ఏడాది కాలంలో ఎవరెవరి సంపాదన ఎలా పెరిగిందో పట్టికలో చూడవచ్చు.
కరోనా కాటుకు బలై ప్రాణాలు కోల్పోయిన వారెందరో అయితే బతికి ఆస్తులు అమ్ముకొని అప్పులపాలైన వారు అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సమయంలోనే 58 మంది బిలియనీర్లు పెరిగి 237కు చేరారు. ధనవంతుల జాబితాలో 179 మంది చేరి 1,007కు పెరిగారు, 894 మంది సంపదలు పెరిగితే 113 మందికి తగ్గాయట. పాపం కదా ! ఇక ధనికులు విపరీతంగా పెరిగిన రంగాలను చూస్తే ఫార్మాలో 130 మంది, పెట్రోకెమికల్స్లో 98 మంది ఉన్నారు. మహమ్మారులు సామాన్య జనం ప్రాణాలు తీస్తే ఔషధ కంపెనీలకు లాభాలను సమకూర్చుతాయని కరోనా నిరూపించింది. ఈ కంపెనీలకు గతేడాది రు.3,45,900 కోట్లు అదనంగా వచ్చిందట. ఇండియా రేటింగ్ సంస్థ విశ్లేషణ ప్రకారం రెండువేల ఆర్ధికేతర కార్పొరేట్లలో వేతనాల గురించి విశ్లేషించగా 60శాతం కంపెనీల్లో గతేడాది చివరి త్రైమాసికంలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సిబ్బంది ఖర్చు తగ్గించారు. అంటే కుటుంబాలకు ఉపాధి, ఆదాయం తగ్గింది. పోయినవి తిరిగి వచ్చే అవకాశం లేదని ఆ సంస్ద పేర్కొన్నది. అసలే తక్కువ ఆదాయం ఆపై కరోనా కాటుతో అనేక కుటుంబాలు అంతకు ముందు చేసుకున్న పొదుపు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. జనం బికారులు కావటానికి అదానీ, అంబానీల సంపద మరింత పెరగటానికి కారణాలను కూడా రేటింగ్ సంస్ద పేర్కొన్నది. పరోక్ష పన్నులు జనం మీద పెరగ్గా కార్పొరేట్లకు పన్ను తగ్గింది. 2010లో గృహస్తుల మీద పన్ను 60శాతం ఉంటే ఇప్పుడు అది 75కు పెరిగింది. ఇదే కాలంలో కార్పొరేట్ పన్ను తగ్గింది. అంతకు ముందు పెంచినదిగాక 2020 మార్చి-మే మాసాల మధ్య పెట్రోలు మీద రూ.13, డీజిలుపై రూ.16లను కేంద్రం పెంచింది. ఈ కాలంలో పీపాధర 28 డాలర్లు ఉండగా జనానికి తగ్గిందేమీ లేదు, పెరిగిన తరువాత ఆమేరకు జనం నుంచి వసూలు చేస్తున్నారు. ప్రతి రోజూ కొత్త రికార్డు నెలకొంటోంది. ఇది కుటుంబాల జేబులను గుల్ల చేస్తోంది. పోనీ అంతకు ముందు నిజవేతనాలు పెరిగాయా అంటే....ఐఎల్ఓ నివేదిక ప్రకారం 2015లో 2.8, 2016లో 2.6, 2017, 18లో 2.5శాతాల చొప్పున పెరిగాయి.తరువాత తగ్గాయి.కనీసవేతనం రు.176 కాగా వివిధ రాష్ట్రాల వేతనాలను విశ్లేషించినపుడు మధ్యగత వేతనం రు.269 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చినెలలో పార్లమెంట్లో తెలిపింది. వేతన కోడ్ 2019 ప్రకారం ఐదేండ్లలోపు కనీసవేతనాలను సవరించాలని నిర్దేశించటమే గొప్ప అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.
ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న వ్యవసాయ రంగంలో గత ఏడు సంవత్సరాల్లో ఆదాయాలు పెరిగాయా తరిగాయా అంటే పెరిగినట్టు చిత్రిస్తున్నారు. నిజం ఏమిటి ? లెక్కలతో తికమక చేస్తున్నారు. నిఖర ఆదాయం బదులు చెల్లించిన మొత్తాలనే పరిగణనలోకి తీసుకున్నారనే విమర్శ ఉంది. రికార్డు స్ధాయిలో పంటలు పండితే అది రైతాంగానికి ఆదాయం లేదా సంపద అన్నట్లు చిత్రిస్తున్నారు, గందరగోళపరుస్తున్నారు. పరిస్ధితి మదింపు సర్వే ప్రకారం 2018-19 సంవత్సరంలో సేకరించిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 కాలంలో కుటుంబంలో ఒకరు ఏడాది పాటు పొలంలో పని చేస్తే పంటల ద్వారా రూ.4000కు మించి ఆదాయం వస్తే వ్యవసాయ కుటుంబంగా పరిగణిస్తారని ఎన్ఎస్ఎస్ పేర్కొన్నది. నాబార్డు సర్వే 2016-17లో ఆ మొత్త రూ.5,000లుగా చెప్పారు. దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి? అది తేలేది కాదు వదిలేద్దాం. ప్రభుత్వలెక్కల ప్రకారం పైన పేర్కొన్న సంవత్సరాలలో వచ్చిన ఆదాయాల మార్పు తీరుతెన్నులను చూద్దాం.
రైతు కుటుంబానికి పంట నిజ ఆదాయం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు తగ్గింది. మిగతా పశు, ఇతరంగా లేకుండా కేవలం పంటల మీదనే ఆధారపడితే నష్టం తప్ప లాభం లేదు. మొత్తంగా తీసుకున్నప్పటికీ పెరుగుదల పెద్దగా లేదన్నది స్పష్టం. గ్రామీణ సంక్షోభంలో ఇదొక ప్రధాన అంశం. ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఖర్చుల పెరుగుదలను విస్మరిస్తే కుదరదు కదా, అందువలన నిఖర ఆదాయం ఎంతో తేలితే అసలు బండారం బయట పడుతుంది. సర్వే జరిగిన సంవత్సరం పంటల పరిస్ధితి మెరుగ్గా ఉండవచ్చు లేదా దిగజారి కూడా ఉండవచ్చు. అందువలన ఒక ఏడాది ప్రమాణం సరైన నిర్ధారణ ఇవ్వదు.
కరోనా కల్లోలంలో ఉపాధికి దెబ్బ చెప్పుకోలేనిది, సమగ్ర సమాచారం లేదు. అసలు వలస కార్మికులెంత మందో తెలియని వాస్తవాన్ని కరోనా బయట పెట్టింది. ఉపాధి నష్టం అంచనాలు తప్ప నిర్దిష్టత లేదు. 2020-21లో ఆర్ధిక వృద్ది 7.3శాతం లోటు అన్న లెక్కలను కూడా అనేక మంది అంగీకరించటం లేదు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చన్నది అభిప్రాయం. అమెరికాలోని పూ పరిశోధనా సంస్ధ అంచనామేరకు 3.2కోట్ల మంది మధ్యతరగతి జనాలు ఆ వర్గీకరణ నుంచి దిగజారిపోయారు. ప్రపం చంలో వంద మంది పరిస్ధితి అలా దిగజారిందని అనుకుంటే మన వాటా 60 అని చెప్పిందంటే పరిస్ధితి ఎంతదారుణంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే అసలు మధ్య తరగతి ఎందరనేది మౌలిక ప్రశ్న. మన దేశంలో పేదరికానికి తప్ప దీనికి నిర్ధిష్ట ప్రమాణం లేదు. బ్రూకింగ్ సంస్ధకు చెందిన హౌమీ ఖరాస్ నిర్వచనం ప్రకారం 2011లో 11-110 డాలర్ల మధ్య (రు. 171-1714)ఆదాయం ఉన్న 38 కోట్ల మంది 2015-22లో మధ్యతరగతిలోకి ప్రవేశిస్తారని 2019లో చెప్పాడు. ఎన్సీిఏఆర్ చెప్పిందాని ప్రకారం రెండు నుంచి పదిలక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి అని అలాంటి వారు 2010లో 15.3 కోట్ల మందని చెప్పింది. 2012లో అమెరికా సంస్ద గ్లోబల్ డెవలప్మెంట్ పదికోట్లని చెప్పింది. 2009-10లో జరిగిన ఎన్ఎస్ఎస్ సర్వే ప్రకారం పది కోట్లు, గత దశాబ్దిలో వివిధ సర్వేల ప్రకారం ఏడు నుంచి 60 కోట్ల మంది మధ్య ఉన్నట్లు అంచనా వేశారు.కొన్ని సర్వేలు వినిమయాన్ని బట్టి అంచనా వేశాయి. అధికారికంగా వెల్లడించని, అనధికారికంగా బయటకు వచ్చిన ఎన్ఎస్ఓ వివరాల ప్రకారం తగినంత ఉపాధి లేక గడచిన నాలుగుదశాబ్దాలలో తొలిసారిగా 2017-18లో వినిమయం తగ్గిపోయింది. 2015 నుంచి పట్టణ మధ్య తరగతి తగ్గిపోగా గ్రామీణ మధ్యతరగతి గిడసబారిపోయింది. కొందరి విశ్లేషణ ప్రకారం మన దేశ మధ్యతరగతి స్దితి ధనికులకంటే పేదలకు దగ్గరగా ఉంటుంది. కరోనా కాలంలో 23 కోట్ల మంది కనీసవేతన పరిధిలోకి దిగజారినట్లు అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు.
అలాంటి వారి పొదుపు మొత్తాలు, బ్యాంకు డిపాజిట్లు కరోనా సమయంలో ఆవిరయ్యాయి. 2020 జూలై-సెప్టెంబరు మధ్య గృహస్థు బ్యాంకు డిపాజిట్లు జీడీపీలో7.7శాతం ఉండగా అక్టోబర్-డిసెంబర్ నాటికి మూడు శాతానికి తగ్గాయని ఆర్బీఐ నివేదిక చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యలు సంపద అసమానతలను మరింతగా పెంచేందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. ప్రభుత్వ బాండ్లు, రుణ పత్రాల కొనుగోలు, రూ. 5.3 లక్షల కోట్ల నగదును ద్రవ్య వ్యవస్దలోకి విడుదల చేశారు. ఈ మొత్తం నిజమైన ఆర్ధికరంగం బదులు స్టాక్ మార్కెట్‌కు ఎక్కువ భాగం వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఆర్ధిక రంగం తిరోగ మించినా, పునరుద్దరణతో నిమిత్తం లేకుండా స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డులను బద్దలు కొట్టటమే దానికి నిదర్శనం. దీని గురించి ఆర్బీఐ ఆందోళన కూడా తెలిపింది. గృహస్తుల సంపద కరిగిపోగా కంపెనీల ఆస్తులు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన చౌకవడ్డీ రుణాలతో అంతకు ముందు అధికవడ్డీలకు తెచ్చిన రుణాలను తీర్చాయి తప్ప కొత్తగా పెట్టుబడులు పెట్టలేదని చెబుతున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది.
దేశంలో పదిశాతంగా ఉన్న ధనికుల కొనుగోలు శక్తి పెరిగితే స్టాక్‌మార్కెట్, విలాసవస్తువుల మార్కెట్, బంగారం, వజ్రాల దిగుమతి మరింతగా పెరుగుతుంది తప్ప ఉపాధి పెరగదు.మధ్య తరగతి మరింతగా తగ్గిపోతుంది, పేదరికం, దారిద్య్రం పెరుగుతుంది. అదే 90శాతంగా ఉన్నవారి శక్తి పెరిగితే నిత్యావసర వస్తువుల గిరాకీ పెరిగి పరిశ్రమలు, వాణిజ్యంతో ఉద్యోగాలు పెరుగుతాయి.సంస్కరణలు ప్రారంభమైన మూడు దశాబ్దాలలో అసమానతలు మన దేశంలో మరింతగా పెరిగాయి. కరోనా వాటిని మరింత పెంచింది. ఒకశాతంగా ఉన్న ధనికుల సంపద 1990లో జాతీయ ఆదాయంలో 11శాతం ఉంటే 2019నాటికి 21కి పెరిగింది. ప్రపంచంలో 64దేశాల తీరుతెన్నులను పరిశీలించగా కరోనా కాలంలో ధనికుల ఆదాయాలు మరింతగా పెరగ్గా ఇతరులవి తగ్గాయి. కరోనా లాక్డౌన్ కారణంగా ఆదాయాలు తగ్గినట్లు వేరే చెప్పనవసరం లేదు. ఏడునెలల తరువాత 2020 అక్టోబరులో లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరిలో ఉన్న ఆదాయాలు కంటే 15-20శాతం తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే సమాచారం అసమగ్రంగా ఉండటంతో పాటు ఇటీవలి కాలంలో విస్వసనీయత కోల్పోయింది. సీఎంఐఈ 2020మే నెల అంచనా ప్రకారం అంతకు ముందు నెలలో 12.2కోట్ల ఉద్యోగాలు పోయాయి. అధికారిక అంచనాల ప్రకారం పదిహేనేండ్ల వయసుపైబడిన ఉద్యో గార్ధులు 2020 జనవరి- మార్చినెలల్లో దేశంలో 18.2కోట్ల మంది ఉన్నారు. లాక్డౌన్ కాలంలో 7కోట్ల మంది కార్మికశక్తి నుంచి తగ్గారు. ఉద్యోగార్ధులలో మహిళలు 4కోట్ల మందే ఉన్నా, ఉపాధి నుంచి తగ్గిన ఏడు కోట్లలో మూడు కోట్లు ఉన్నారంటే వారి మీద ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరికొన్ని గణాంకాల ప్రకారం 2020 జనవరి-మార్చి నెలల్లో 16.6 కోట్ల మంది పని చేస్తుండగా తరువాత మూడు నెలల్లో వారి సంఖ్య 2.6కోట్లకు తగ్గింది. రోజువారీ కార్మికులు ఎక్కువగా ప్రభావిత మయ్యారు. కోటీ 90లక్షల మందిలో 90లక్షల మందికి ఉపాధి పోయింది. నెలవారీ వేతనం ఉన్నవారు కోటి మంది తగ్గితే స్వయ ఉపాధి కలిగిన వారు 60లక్షల మందికి ఉపాధి పోయింది.
కరోనా ప్రభావం గురించి అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం ఆదాయాల కంటే అప్పులు ఆరు రెట్లు ఎక్కువ చేశారని తేలింది. దిగువ 25శాతం జనాభాలో పేద కుటుంబాల అప్పులు నాలుగు రెట్లు, ధనికుల అప్పు 1.4రెట్లు మాత్రమే పెరిగాయి. రానున్న రోజుల్లో అసమానతలను పెంచేందుకు ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. సీఎంఐఈ విశ్లేషణ ప్రకారం 2020 చివరి నాటికి ఉపాధి కరోనా ముందు స్దాయికి చేరినా ఆదాయాలు పెరగలేదు. కోటీ 50లక్షల మంది కార్మికులు పనికి దూరంగా ఉన్నారు. కరోనా రెండవ తరం ప్రభావాల గురించి ఇప్పటికీ సరైన అంచనాలు లేవు.ఎవరి పద్దతిలో వారు వేసిన అంచనాలన్నింటినీ తలకు ఎక్కించుకుంటే బుర్రలు తిరుగుతాయి. మొత్తం మీద నడుస్తున్న చరిత్రను చూస్తే రానున్న రోజుల్లో ఆదాయ, సంపదల అసమానతలు పెరుగుతాయి. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
వనరు 2012-13 2018-19 తేడా శాతం 35.3 శాతం
ద్రవ్యోల్బణంతో తేడా
--------------------------------------------------------------
వేతన ఆదాయం 2,071 4,063 96.2 60.9
పంట ఆదాయం 3,081 3,798 23.3 -12
పశుపోషణఆదాయం 763 1,582 107.3 72
ఇతర ఆదాయం 512 641 25.2 -10.1
మొత్తం ఆదాయం 6,427 10,084 56.9 21.6
- ఎం కోటేశ్వరరావు
Sun 17 Oct 04:15:45.911014 2021