తూర్పున ఉదయించిన సూర్యుడు పూర్వార్ధ గోళాన్ని కవ్వించి నవ్వించి అలరించి అల్లాడించి పశ్చిమార్ధగోళంలో తన వంతు కర్తవ్య నిర్వహణకు సిద్ధమయ్యే సమయానికి భూమ్మీద పుట్టిన ప్రతి పదిమందిలో ఏడుగురు మోకాళ్లు డొక్కల్లో కుక్కుకుని నిద్రకు సిద్ధమవుతున్నారు. భారతదేశంలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. 2021లో ప్రపంచంలోని 101 దేశాల్లో ఆకలిగొన్న వారి స్థితిని అర్థం చేసుకునేందుకు రూపొందించిన ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం అట్టడుగున 94వ స్థానంలో నిలిచింది. యథా ప్రకారంగా మోడీ ప్రభుత్వాన్ని అభాసు పాలుచేయటానికి అంతర్జాతీయ సమాజం కుట్రపన్నిందన్నది మోడీ వందిమాగధుల వాదన. దీనికి భిన్నంగా మోడీ పాలనలో దేశంలో ఆకలిగొన్న కడుపులు , అర్థాంతరంగా అసువులు బాస్తున్న పసికందుల సంఖ్య పెరిగిందన్నది స్వతంత్ర విశ్లేషకులు, వ్యాఖ్యాతలు, ఆర్థిక పరిశీలకులు చేస్తున్న వాదన.
ప్రపంచం చాలా అభివృద్ధి అయ్యింది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఎన్నో కొత్త కొత్త మార్గాలు ముందుకొస్తున్నాయి. కొన్ని ఆమూర్త రూపంలో ఉండే శాస్త్రవిజ్ఞానాలు అయితే ఈ ఆమూర్త రూపాలకు రంగు, రుచి, కండ నింపి చూపించే కొలమానాలు రూపొందించే స్థాయికి గణాంక శాస్త్రం, కంప్యూటర్ ఆధారిత సిమ్యులేషన్ మోడల్స్ తయారయ్యాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పాలకులు జనం కళ్ల నుండి దాయాలనుకుంటున్న విషమ పరిస్థితులను కూడా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సామర్ధ్యం నగంగా ప్రజల ముందుంచుతోంది.
ప్రపంచ ప్రజల ఆకలిని కొలిచే కొలమానం మరోసారి ప్రపంచం నివ్వెరపోయే వాస్తవాలు ప్రపంచం ముందుంచింది. 116 దేశాల్లో ప్రజలు కడుపు నింపుకోవటానికి పడుతున్న పాట్లు, అర్థాకలి, అర్ధాయుష్షులో పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే కొండెక్కుతున్న పసిపిల్లల జీవితాల గురించి ఈ నివేదిక వెల్లడించిన వివరాలు మనసు, మానవత్వం అంటూ ఉన్న వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడనీయకుండా చేసేవిగా ఉన్నాయి.
తూర్పున ఉదయించిన సూర్యుడు పూర్వార్ధ గోళాన్ని కవ్వించి నవ్వించి అలరించి అల్లాడించి పశ్చిమార్ధగోళంలో తన వంతు కర్తవ్య నిర్వహణకు సిద్ధమయ్యే సమయానికి భూమ్మీద పుట్టిన ప్రతి పదిమందిలో ఏడుగురు మోకాళ్లు డొక్కల్లో కుక్కుకుని నిద్రకు సిద్ధమవుతున్నారు. భారతదేశంలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. 2021లో ప్రపంచంలోని 101 దేశాల్లో ఆకలిగొన్న వారి స్థితిని అర్థం చేసుకునేం దుకు రూపొందించిన ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం అట్టడుగున 94వ స్థానంలో నిలిచింది. యథా ప్రకారంగా మోడీ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయటానికి అంతర్జాతీయ సమాజం కుట్రపన్నిం దన్నది మోడీ వందిమాగధుల వాదన. దీనికి భిన్నంగా మోడీ పాలనలో దేశంలో ఆకలిగొన్న కడుపులు, అర్థాంతరంగా అసువులు బాస్తున్న పసికందుల సంఖ్య పెరిగిం దన్నది స్వతంత్ర విశ్లేషకులు, వ్యాఖ్యాతలు, ఆర్థిక పరిశీలకులు చేస్తున్న వాదన.
ఈ వాదన ప్రతివాదనల్లో వాస్తవం మరుగునపడుతోంది. అసలు ఆకలి ఏమిటి, ఆకలి సూచిక ఏమిటి, దాన్ని ఎలా కొలుస్తారు, ఈ కొలమానాలను ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్నలు ప్రజల దృష్టికి రాకుండా తెలిసీ పాలకపక్ష ప్రసార మాధ్యమాలు, తెలీక ప్రత్యా మ్నాయ మాధ్యమాలు చేస్తున్నాయి. అం దుకే ఆకలి కొలమానాల అంకెలు, శాతాలు, స్థానాల్లో దాగి ఉన్న మతలబులను విడమర్చి చెప్పేందుకే ఈ ప్రయత్నం.
ఆకలి అంటే ఏమిటి?
ఆకలి అంటే కడుపు నిండటం, నింపుకోవటమే కాదు. అలా నిండిని కడుపుకు కావల్సినంత పౌష్టికాహారాన్ని అందించలేకపోవటం కూడా. దీన్నే విధానపరిభాషలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కావల్సినన్ని కిలోకెలోరీల ఆహారాన్ని తీసుకోలేని స్థితి అని నిర్వచిస్తారు. ఐక్యరాజ్యసమితి ఆధ్క ర్యంలో పని చేసే ప్రపంచ ఆహార సంస్థ విశ్లేషణ ప్రకారం ఓ మనిషి వయసు, రోజువారీ చేసే శారీరక, మేధో శ్రమ అవసరాలకు తగ్గట్లు శక్తిని అందించేలా ఆహారం తీసుకోలేకపోతే అటువంటి వ్యక్తి ఆకలితో ఉన్నాడని నిర్ధారించాల్సి ఉంటుందని తీర్మానించింది.
పౌష్టికాహార కొరత అంటే కేవలం ఆకలి తీర్చే స్థాయిలో ఆహార లభ్యత లేకపోవటం మాత్రమే కాదు. తీసుకునే అహారంలో మనిషి ఆరోగ్యంగా ఉండటానికి కావల్సిన శక్తి, ప్రోటీన్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లోపం కూడా. అంటే మోతాదు లేదా నాణ్యత విషయంలో కావల్సినంత ఆహారం ప్రజలకు అందుబాటులో లేకపోవటం.
పౌష్టికాహార లోపం అంటే అసర మైనంత ఆహారాన్ని తీసుకోలేక పోవటం ఒక్కటే కాదు. అవసరం లేని ఆహారాన్ని తీసు కోవటం కూడా. అంటే పౌష్టి కాహారం కొరతతో పాటు సరైన సమయంలో సరైన మోతాదులో ఆహారం
తీసుకోలేకపోవటం కూడా.
ప్రపంచ ఆకలి కొలమానం అంటే ఏమిటి?
అంతర్జాతీయ, ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో ఆకలిగొన్న ప్రజల మోతాదును కొలిచేందుకు రూపొందించిన సూచికే ప్రపంచ ఆకలి కొలమానం. ఏటా ఆకలి నియంత్రణ, నిర్మూలనలో వివిధ దేశాల పురోగతిని అంచనా వేసేందుకు ఈ సూచిక కీలకమైన సాధనంగా ఉపయోగ పడుతుంది. ఈ నివేదిక ద్వారా వివిధ దేశాలు ఆహార భద్రత కల్పించే దిశగా తీసుకోవాల్సిన విధాన నిర్ణయాల దిశగా ప్రభుత్వాలను ప్రేరేపిస్తుంది.
ప్రపంచ ఆకలి కొలమానం
లెక్కించేది ఎలా ?
ప్రపంచ ఆకలి కొలమానాన్ని మూడు దశల్లో లెక్కిస్తారు. ఈ మూడు దశల్లోనూ ఉపయోగించే సమాచారం వివిధ మార్గాల్లో, మాధ్యమాల ద్వారా సేక రిస్తారు. మొదటిది ఆహారం కొరత, నాణ్యత, లభ్యత గురించినది. ఒక్కో దేశానికీ నాలుగు అంశాలకు సంబంధిం చిన సమాచారాన్ని క్రోడగీకరించి విశ్లేషిస్తారు.
తగినంత ఆహారం తీసుకోలేకపోవటం మొత్తం దేశ జనాభాలో పైన చెప్పిన పద్ధతుల్లో మనిషి ఆరోగ్యంగా బతకటానికి కావల్సినంత మోతాదులో ఆహారాన్ని తీసుకోలేకపోతున్న జనాభా మోతాదు ఎంత శాతం ఉన్నారు అన్నది ఆకలి కొలమానానికి ఓ ముఖ్యమైన పునాది.
వృధా అవుతున్న బాల్యం : ఐదేండ్ల లోపు వయస్సున్న బాల బాలికలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు, లేకపోవటం.
ఎదుగుదల మాంద్యం : బాల బాలి కల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవటం, తీవ్రమైన పౌష్టికాహార కొరతను అనుభవిస్తున్న వారి మోతాదు.
శిశు మరణాలు : ఐదేండ్లలోపు వయస్సున్న పిల్లల మరణాల మోతాదు.
ప్రపంచ ఆకలి కొలమానికి రెండో ప్రాతిపదిక : పైన ప్రస్తావించిన నాలుగు అంశాలకు ఒక్కోదానికి వంద పాయింట్ల చొప్పున కేటాయించి వాటి సగటు లెక్కను నమోదు చేయటం రెండో ప్రాతిపదిక.
ఈ రెండు పద్ధతుల్లో లెక్కించిన మోతాదుల సగటు ఒక్కో దేశానికి లెక్కించి పాయింట్లు నిర్దారించటం ఈ క్రమంలో మూడో దశ. ఆయా దేశాల్లోని ప్రజల్లో ఎంత మంది అర్థాకలితో, అల్పాహారం తోనూ బతుకు బండి లాగిస్తున్నారో తెలుసుకునేందుకు ఇంత సంక్లిష్టమైన గణాంకాల సేకరణ, విశ్లేషణ, మదింపు జరుగుతుంది.
అయితే ఆయా దేశాలకు సంబంధించిన ఇన్ని కోణాల్లో సమాచారాన్ని ఎలా సేకరిస్తారు అన్నది మరో ప్రశ్న. ప్రధానంగా ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ అంగాలు, ప్రపంచ బ్యాంకు, శిశు మరణాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి అధ్యయన బృందం, యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, భౌగోళిక ఆరోగ్య సర్వే, క్లస్టర్ సర్వేలు వంటి అనేక మార్గాలు, మాధ్యమాల ద్వారా దేశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు.
2021 ఆకలి కొలమానం 2021 నాటి స్థితినే సూచిస్తుందా?
ఈ సంవత్సరానికి సంబంధించిన ఆకలి కొలమానంలో ఆయా దేశాలు ఏ స్థానాల్లో నిలిచాయి అని మనం పై పద్ధతిలో నిర్ధారిస్తున్నాము. అంటే ఈ నిర్ధారణకు పునాదిగా ఉన్న సమాచారం ఈ సంవత్సరానికి సంబంధించినదేనా అన్న ప్రశ్న ముందుకొస్తుంది. కాదు. ఉదాహరణకు భారతదేశానికి సంబంధించిన 2021 ఆకలి కొలమానం తయారు చేయాలంటే 2018-2020 కాలానికి సంబంధించి నాణ్యమైన ఆహారం తీసుకోలేని జనాభా వివరాలు, 2016-2020 కాలానికి చెందిన వృధా అవుతున్న బాల్యం గురించిన వివరాలు, 2019కి చెందిన శిశుమరణాల రేటు ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే ఈ సంవత్సరం కొలమానంలో మన దేశం స్థాయి, స్థానం గురించి అర్ధం చేసుకోవా లాంటే దాదాపు ఐదేండ్ల ముందు నుంచీ ఈ అంశాలకు సంబంధించిన వివరాలు పునాదిగా ఉంటాయి.
ప్రపంచం ఆకలిని ఎందుకు లెక్కిస్తుంది?
అర్థగంటలో అంతరిక్షానికి పోయి రాగలిన సామర్ధ్యం ఉన్న ప్రపంచం, ఫోన్లో ఆర్డర్ చేసుకోవటానికి వీలైనంత దగ్గర్లో రుచికరంగా తయారైన వంటకాలు ఓ వైపున, టన్నుల కొద్దీ వృధా అవుతున్న వండిన ఆహారం మరోవైపున ఉన్న 21వ శతాబ్దంలో ఇంకా దేశాలు ఆకలి కడుపులను లెక్కించేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి అన్నది ఓ ముఖ్యమైన ప్రశ్న. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు గత నాలుగైదు దశాబ్దాల్లో కొత్త రూపం, సారం అందిపుచ్చుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఆర్థిక విధానాల నిర్దిష్ట లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలు పెంచటం. ప్రజల దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఆకలి దప్పులను దూరం చేయటానికి ప్రభుత్వాలు విధానాలు రూపొందించేవి. కానీ నేటి పరిస్థితి దీనికి భిన్నమైనది. ప్రభుత్వ విధానాల లక్ష్యం, దశ, దిశ మారాయి. ప్రజల జీవన స్థితిగుతులు మెరుగపర్చటం కంటే ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించటం లక్ష్యంగా విధనాలు రూపొందిస్తున్నాయి ప్రభుత్వాలు. అభివృద్ధి అంటే ఏడాది చివర ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల పాత్ర పోషించే కంపెనీల లాభాలు పెరిగేందుకు కావల్సిన విధానమే అన్నది గత కొంతకాలంగా రివాజుగా మారింది. దీన్నే సంస్కరణలు అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. నిజానికి ఉన్న పరిస్థితి నుండి మెరుగైన పరిస్థితికి చేరటాన్ని సంస్కరణ అనే సానుకూల అర్థంలో వాడుతూ ఉంటాము. ఇది వాస్తవమే కానీ ఎవరి ఎదుగుదల నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా ఉంటుంది అన్నది ఇక్కడ కీలకం. సంపన్న వర్గానికి దక్కే లాభాల రేటు పెంచేందుకు మార్గాలు వెతకటాన్నే సంస్కరణగా చెప్తున్నాము. కానీ ఈ సంస్కరణలు సాధారణ ప్రజల దైనందిన జీవితంలో సాపేక్ష ఎదుగుదల, నిలకడైన ఎదుగుదలకు పునాదులు వేయటం లేదు. ప్రజల దైనందిన జీవితంలో మెరుగుదల ప్రభుత్వ నివేదికల్లో కనిపించే లెక్కల్లో మాత్రమే కనిపిస్తుంది. నిజ జీవితంలో బతుకు భారతమవుతోంది. సోకాల్డ్ సంస్కరణలు ప్రజలకు చూపించిన స్వర్గాన్ని చేతికందేంత దూరంలోకి తేవటంలో విఫలమయ్యాయన్న విషయం పాలకవర్గానికి తెలుసు. అయినా ఈ సంస్కరణలతో ఏదో ఊడి పడుతుంది, ఒరగబెడుతుంది అన్న నమ్మకం కలిగించేందుకు తరచు అంతర్జాతీయ సంస్థలు కొన్ని గణాంకాలు వెదజల్లుతూ ఉంటాయి. ప్రపంచంలో రోజుకు ఓ డాలరు ఆదాయం సంపాదించే పేదల శాతం, ఒకటిన్నర డాలర్ల ఆదాయం సంపాదించే పేదల శాతం, రెండు డాలర్ల ఆదాయాన్ని సంపాదించే పేదల శాతం అంటూ లెక్కలు జారీ అవుతాయి. వీటన్నింటి ఫలితం ఒక్కటే. దారి, తీరు మారిన ఆర్థిక విధానాలు, సో కాల్డ్ సంస్కరణల వలన ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయని నమ్మించే ప్రయత్నంలో విరామం లేకుండా పాలక పక్ష మేధావులు చేసే కృషిలో భాగమే ఈ కసరత్తులన్నీ.
అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. ఇటువంటి కసరత్తు వలన పాలకవర్గం ఎంతగా దాచిపెడదామనుకుంటున్నా దాచిపెట్టలేని వాస్తవాలు ప్రజల దృష్టికి వస్తాయి. పాలకపక్ష మేధావులు కుమ్మరిస్తున్న ఈ సమచారాన్నే సరైన రీతిలో విశ్లేషించి పాలకవర్గ విధానాల వైఫల్యాన్ని ప్రత్యామ్నాయ మేధావులు, ప్రజాపక్ష మేధావులు ప్రజలముందుంచటానికి ఉపయోగించాలి. ఈ కోవలోనే ప్రపంచ ఆకలి కొలమానాన్ని కూడా చూడాలి.
ఆకలి - ఆర్థిక విధానం
ఆకలి ఎవరికి వారు కొని తెచ్చుకునేది కాదు. ఆకలికి కూడా ఓ సామాజిక ఆర్థిక నేపథ్యం ఉటుంది. భారతదేశం వరకే చూద్దాం. 2021 ఆర్థిక సర్వేలో పేర్కొన్న వివరాలు ఇవి. 2016 నాటికి తలసరి ఆహార ధాన్యాల లభ్యత 177.7 కిలోలు ఉంటే 2020 నాటికి 187.1 కిలోలకు పెరిగింది. 2016 నుండి 2020 మధ్య కాలంలో దేశంలో పండిన, దిగుమతి చేసుకున్న వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, ఇతర ఆహార ధాన్యాలు దేశంలోని మొత్తం జనాభాకు పంచితే 2016లో మనిషి ఏడాదికి 177.7 కిలోలు దొరికితే 2020 నాటికి మరో పది కిలోలు పెరిగి 187.1 కిలోలు దొరుకుతోంది. ఇదే ఆర్థిక సర్వేలో చెప్పిన మరో ప్రమాణాన్ని కూడా చూద్దాం. 1951లో అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయటానికి 80 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంటే 2020 నాటికి నాలుగు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. మరి మనిషి తినటానికి కావల్సినన్ని ఆహార ధాన్యాలు గోదాముల నిండా ఉన్నప్పుడు, ఈ దేశం ఆకలి కొలమానంలో ఎందుకు అవమానకర స్థానంలో నిలిచింది అన్నది దేశభక్తులంతా వేసుకోవాల్సిన ప్రశ్న. ఇక్కడే ప్రభుత్వం, దాని విధానాలు, నిబద్ధత చర్చకు వస్తాయి. మన దేశంలో కూడా దారి తప్పిన విధానాలే అమల్లో ఉంటున్నాయి కాబట్టి గోదాముల్లో ధాన్యం మూటలు కుప్పలు తెప్పలుగా పోగుపడుతున్నా, ఆకలి మంటలు చల్లారటం లేదు. కనీసం అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మంటగలు స్తుందన్న విషయం గుర్తించిన తర్వాత కూడా గోదాముల్లో ఎలకలకు తిండిపెడుతున్న ధాన్యం ఆ ధాన్యాన్ని పండించిన కష్టజీవుల కడుపు నింపటానికి ప్రభుత్వం సిద్ధం కాకపోవటాన్ని ఏమనాలి? దీనికి ప్రభుత్వాల ప్రాధాన్యతలు, ఆ ప్రాధాన్యతలకు పునాదిగా ఉన్న వర్గ దృక్ఫధమే కారణమని అమర్త్యసేన్ 1980 దశకంలోనే సోదాహరణంగా వివరించాడు. చంద్రగుప్త మౌర్యుడికి ఆర్థిక మంత్రిగా పని చేసిన కౌటిల్యుడు దేశంలో ఆకలి, పేదరికం, కరువు, కాటకాలు నివారించాల్సిన బాధ్యత గుర్తు చేస్తూ రాశాడు. మరి గతాన్ని తవ్వి నెత్తికెత్తుకుని అదే ఘనమని ఊరేగుతున్న నేటి ప్రభుత్వం, దాని కొమ్ము కాస్తున్న మేధావులు కౌటిల్యుడి మాత్రమైనా ఆలోచించేలేకపోతున్నారు. అంధత్వం శారీరక వైకల్యం కాదు. మానసిక వైకల్యం అన్న మాటలకు అర్థం ఇదేనేమో... !
- కొండూరి వీరయ్య
9871794037
Sun 24 Oct 08:34:22.778378 2021