బతుకు తోటలో చేరే ప్రతి ఒక్కరూ బాల్యపు పూదోటను దాటాలి! అక్కడి పరిమళాలూ, అనుభవాల సారాంశంగానే జీవితమంతా ఎదగాలి. బాల్యమంటే... వెండి వెన్నెల్ల పసిడి తీరం... మధుర రాగాల బందగానం... అనేక కథలూ గాధల అపూర్వ సంగమం... ఆ దశను దాటేకొద్దీ అది మరింత అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఓ అవకాశం వస్తే... జీవితంలో మళ్లీ మళ్ళీ తొంగిచూసుకొవాలనే అందమైన మధుర జ్ఞాపకం బాల్యం. పిల్లలకు ఆనందంగా ఉండటానికి బ్యాంకు బ్యాలెన్సులు అక్కర్లేదు. సంతోషాన్ని ఎక్కడి నుంచో కొనుక్కోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. హౌదాలూ భేదాలూ చూసుకోవాల్సిన పనిలేదు. ఆటకు ఫలానా చోటే కావాలన్న ఆంక్ష లేదు. పాటకు పదిమందీ ఉండాలన్న కాంక్ష లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఉంటే చాలు! పసిమనసు ఉంటే చాలు.. పరవశాలే పరవశాలు. ఆనందామే ఆనందం. అంత మధురంగాను ఉంటుంది. మానవ సమాజం నిండా వాటిని నింపుకుంటే- అన్ని దశలూ, దేశాలూ పసిడితనమంత సంతోషంగానే ఉంటాయి. పిల్లల ప్రపంచానికి ఇంతటి మహత్తు ఉంది కాబట్టే- కవులు బాల్యం గురించి పలవరించకుండా ఉండలేరు. చిత్రకారులు చిన్ననాటి మాధుర్యం గురించి బొమ్మలు గీయకుండా ఉండలేరు. మహాకవి శ్రీశ్రీ తన 'శైశవగీతి'లో పిల్లల ఆనందలోకాన్ని ఆవిష్కరించారు.
పాపం పుణ్యం, ప్రపంచమార్గంను
కష్టం సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా
అయిదారేడుల పాపల్లారా!
ఈ గీతం నిండా అందమైన బాల్యం అంతకంటే అందంగా పరుచుకొని ఉంటుంది. ఆ దశాన్ని ఊహిస్తుంటేనే మనసు పరవళ్లు తొక్కుతుంది. నిజానికి ఇది ఒకప్పటి బాల్యం . బాల్యం మీద భవిష్యత్తు స్వప్నం స్వారీ చేయటానికి ముందున్న సహజ బాల్యం. ఆ దశ్యం అదశ్యమై కాంక్రీట్ జంగీల్‌లో ఇప్పుడు బాల్యం బంధి అయింది. సహజత్వం లేదు. అంతా యాంత్రీకరణే. పిల్లలు పిల్లలులాగ బయటికి కనిపిస్తున్నా వాళ్లు లోలోపల బోలెడు బరువులు మోయాల్సి వస్తోంది. మంచి భవిష్యత్తు, అమ్మానాన్నల కలలు, చుట్టుపక్కల వాళ్లతో సమానమైన లేక అంతకన్నా ఎత్తయిన లక్ష్యాలూ వారిని వెంటాడుతూ ఉన్నాయి. అందుకని ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. పరుగులని కూడా అనలేం. పరుగులు తీస్తున్న బైకుల మీదా, బస్సుల మీదా కాళ్లు కట్టేసుకొని కూర్చొని... కలల సాఫల్య కేంద్రాలుగా భావించే స్కూళ్లకు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ఉరవడిలో ఆటపాటలకు, సహజమైన బాల్యోత్సాహానికి అవకాశం లేకుండా పోతోంది. అలాంటి తరుణంలో ఆ పిల్లల అభిప్రాయాలను మనమూ తెలుసుకుందాం.
బడి అంటే ఇష్టమా? ఇల్లు అంటే ఇష్టమా?
నాకు బడి అంటేనే చాలా ఇష్టం. ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. జ్ఞానం వస్తుంది. స్నేహితులందరం ఎలాంటి భేద భావం లేకుండా కలిసిమెలసి ఉంటాం. అందుకేనాకు బడి అంటే ఇష్టం అంతేకాదు. మా అమ్మా నాన్నలు ఎక్కువగా చదువుకోలేదు. బడిలోకి రావడం వల్ల చదువు విలువ తెలుస్తున్నది. మా తెలుగు టీచర్ ఇచ్చే పుస్తకాలు చదవడం వల్ల తెలుగులోని గొప్పదనాన్ని తెలుసుకున్నాను. కవితలు, కథలు రాయాలని ప్రయత్నం చేస్తున్నాను. మా టీచర్ ఇచ్చిన ప్రోత్సాహంతో రాసిన కవిత తెలంగాణ సారస్వత పరిషత్తు వారు నిర్వహించిన బాలల కవితల పోటీలో ప్రోత్సాహక బహుమతికి ఎంపిక అవడం నాకు మా ఇంట్లో అందరికీ ఎంతో సంతోషం కలిగించింది. కథలు, కవితలు భవిష్యత్‌లో కూడా చదువుతాను. కానీ నాకు ఇంజనీర్ కావాలని ఉంది. ఇంజనీరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు మొదటి నుంచి సైన్స్, లెక్కలు, తెలుగు పద్యాలు అంటే ఇష్టం.
నీకు ఏ సబ్జెక్టులంటే ఇష్టం?
తెలుగులో కొత్త బాట పాఠం చాలా ఇష్టం. పద్యాలు ఇష్టం అందులో గతానికి ఇప్పటికీ
ఊర్లలో చాలా మంచి మార్పులు రావడం బాగుంది. పద్యాల్లో ఎన్నో మంచి విషయాలు, విలువలు ఉంటాయి. ఫిజిక్స్‌లో విద్యుత్ ప్రవాహం, సైన్స్‌లో శ్వాస క్రియ, లెక్కల్లో త్రికోణమితి ఇష్టం.
మీ ఇంట్లో ఎవరంటే నీకు ఇష్టం?
అమ్మా నాన్న ఇద్దరూ కూలి పని చేస్తారు అమ్మే ఎక్కువ కష్టపడుతుంది అమ్మ అటు కూలికి పోయి వస్తూనే ఇంట్లో పనులన్నీ చేస్తుంది. మా కోసం ఎక్కువ కష్టపడుతుంది.
- కోట యువరాజు 10వ తరగతి
బడి అంటే ఇష్టమా? ఇల్లంటే ఇష్టమా?
బడే ఇష్టం. ఇంట్లో ఉంటే అన్ని పనులు చేయాలి. గేదెలను తోలుకొని పోవాలి. అక్కడ ఎండొచ్చినా వానొచ్చినా వాటిని కాసుకుంటా ఉండాలి. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో వానొస్తే ఎటు పోవాలో తెలియక చాలా సార్లు భయపడ్డాను. ఒకసారి పెద్ద నాగుపాము నేను ఉన్న చెట్టు దగ్గరకు వచ్చింది. గేదెలను వదిలేసి ఇంటికి ఉరుక్కుంటూ వచ్చిన. స్నేహితులు ఉండరు ఏం వుండరు. ఆడుకునే వీలుండదు. అదే బడైతే స్నేహితులు ఉంటారు. మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఆడుకోవచ్చు.పాఠాలు వినొచ్చు. సమయానికి భోజనం కూడా బల్లో తినొచ్చు. అదే ఇంటిదగ్గర సమయం ఉండదు ఏం ఉండదు. ఇంకా బల్లో పుస్తకాలు, బట్టలు కూడా ఇస్తారు.. ఇంటి దగ్గర అంత కష్టంగా ఉండాలి ఇంట్లో ఉంటే బాగానే ఉంటుంది గాని అమ్మా నాన్న ఇద్దరూ కూడా కూలికి పోతరు కదా. మేం కూడా పోవల్సి వస్తుంది.
ఇంటి దగ్గర అవేనా ఇంకేమైనా పనులు చేస్తావా?
గేదెలకు కుడితి తొట్టిలో నీళ్ళు పోస్తా. బట్టలు మడతలు పెడతా. మా అమ్మ ఏది చెబితే అది చేస్తా.
అమ్మా నాన్న ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం ?
అమ్మే మేడం. మా నాన్న రోజూ తాగుతడు అందుకే నాకు నచ్చడు. అమ్మే ఎక్కువ కష్టపడుతుంది.
బడికి వస్తున్నావు కదా!: నీకు ఏయే పాఠాలు ఇష్టం?
తెలుగు బాగా ఇష్టం మేడం. ఇందులో కథలుంటాయి. పద్యాలు ఉంటాయి. అందులో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. మనం వాటిని చదివి కొత్తగా కూడా రాయమని ఉంటుంది.అలా రాయ డం ఇష్టం. మిగిలినవి ఇష్టమే కానీ తెలుగు తర్వాతనే.
పెద్దయ్యాక ఏం చేస్తావు?
పెద్దయ్యాక బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేస్తాను.
బడిలో పాఠాలు చదువుతున్నావా?
అన్ని పాఠాలు చదువుకుంటున్నాను.
- గంగుల రాం ప్రసాద్,7వ తరగతి
బడి ఇష్టమా?
ఇల్లు ఇష్టమా?
బడే ఇష్టం మేడం. బడిలోనే అన్నీ ఉంటా యి. చదువు కోవచ్చు, ఆడు కోవచ్చు. స్నేహి తులతో కలిసి ముచ్చ ట్లు పెట్టు కోవచ్చు.
ఇంకా ఎందుకు ఇష్టం?
బడిలో మధ్యాహ్న భోజనం పెడతారు. బుక్కులు ఇస్తారు. బట్టలు ఇస్తారు.
మరి ఇలాంటివి ఇంటి వద్ద ఉండవా?
ఇన్ని ఉండవు మేడం. అప్పుడప్పుడు అవసరమని కూలికి తీసుకొని పోతారు. ఇంట్లో పనులన్నీ చేస్తుంటాను. ఎంత సేపూ అవే తప్ప చదువు వుండదు..
ఇంటి వద్ద ఏమేం పనులు చేస్తావు?
గిన్నెలు రుద్దుతా.ఉతికిన బట్టలు మడతలు పెడతా. వాకిలి ఊడుస్తా. అమ్మా నాన్నల కోసం అన్నం కూర కూడా వండుతా.
అమ్మా నాన్నా ఎవరంటే ఇష్టం?
అమ్మే మేడం నాన్న గేదెలను తోలుకొని పోతాడు గడ్డి కోస్తాడు. అమ్మ ఇంట్లో పనులన్నీ చేస్తుంది.మళ్ళీ కూలికి కూడా పోతుంది. చాలా కష్టపడుతుంది.
నీకు ఏ పాఠాలు ఇష్టం?
తెలుగు - తెలుగులో కథలు కవితలు పాటలు పద్యాలు ఉంటాయి.
పెద్దయ్యాక ఏం చేస్తావు?
డాక్టర్ చదువుతా. పేదోళ్ళకు డబ్బు ఉండదు కాబట్టి వారికి ఉచితంగా వైద్యం చేస్తాను.
- నామా యశ్వంత్ 8వ తరగతి
బడి అంటే ఇష్టమా?
ఇల్లంటే ఇష్టమా?
ఇల్లంటేనే ఇష్టం. ఇంటిదగ్గర ఆడుకోవచ్చు. ఎవరి అదుపు ఉండదు. అమ్మా నాన్న కూలికి పోతారు. రోజూ టీవీ చూడొచ్చు.. బడికి రాని వాళ్ళు కొందరు స్నేహితులతో తిరగొచ్చు.
మరి చదువు?
ఎప్పుడైనా చదువుకోవాలి అనిపిస్తే చదువుకుంటాను మేడం.
కనీసం ఇంట్లో ఏమైనా పనులు చేస్తావా ?
రోజూ నీళ్ళు తోడి అన్నీ నింపుతాను. అమ్మా నాన్నా కూలికి పోయి వచ్చే సరికి నీళ్ళు కాగబెట్టి పెడతాను. మంచినీళ్లు పట్టుకొస్తాను. సాయంత్రం కోళ్ళను కమ్ముతాను.
ఇంకేం చేస్తావు ?
క్యాటరింగ్‌కు సప్లయర్‌గా స్నేహితులతో వెళతా. తోటలకు నీళ్లు పెట్టడానికి వెళతాను.
నీకు అమ్మా నాన్న ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం ?
నాన్నే ఇష్టం మేడం. అరక పనికి పోతాడు. వాకిలి ఊడ్చి కళ్లాపి చల్లుతాడు. పనులకు పోతాడు...
చదువంటే ఇష్టం లేదా ?
ఉంది మేడం.
ఏం అవ్వాలని ఉంది ?
టీచర్
టీచరా? ఎందుకు?
మా మామయ్య, అత్తయ్య టీచర్లుగా చేస్తున్నారు కాబట్టి.
నీకు ఏ పాఠాలు ఇష్టం ?
ఫిజిక్స్ పాఠాలు ఇష్టం.
ఇంగ్లీష్ చదువుకుంటే ఎక్కడైనా బతకొచ్చు.
గొడ్డుగొర్ల సుమంత్ 10వ తరగతి
బడి అంటే ఇష్టమా? ఇల్లంటే ఇష్టమా?
బడి అంటే ఇష్టం. చదువు చెబుతారు. తప్పు చేస్తే మందలి స్తారు. మంచిగా స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చు. చదువుకోవడం నాకు చాలా ఇష్టం.
నీకు ఏ పాఠాలు ఇష్టం ?
మేం ఇంట్లో ఉర్దూలో మాట్లాడుతాం. కాబట్టి హిందీ అంటే ఇష్టం. అందులో 'హౌంగే కామ్యాప్' గేయం చాలా ఇష్టం. అందులో ఏదైనా సాధించి సఫలీకతులవ్వడం అనేది ఉంది
హిందీ తర్వాత ఇంగ్లీష్ కూడా ఇష్టం. అందులో కూడా మంచి విషయాలు ఉంటాయి.
అలివర్ అనే పాఠం చదువుతుంటే బాధ కలుగుతుంది. అనాధాశ్రమంలో పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టరట. వాళ్ళు ఆకలికి తాళలేక చచ్చిపోతారని చదువుకుని బాధ పడ్డాను. ఈ కరోనా వల్ల ఇల్లంటే బాగా బోర్ కొట్టింది. ఇక ఇంతేనా అనిపించింది.
పెద్దయ్యాక ఏం చేస్తావు?
టీచర్ కావాలని ఉంది. బాగా చదువుకుని పిల్లలకు పాఠాలు చెప్పాలని ఉంది.
షేక్ హుజేఫా
8వ తరగతి
వురిమళ్ల సునంద
కలకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మా బడిలో బోర్డు మీద రోజూ ఒక పద్యం రాసి నేర్పిస్తారు. నేను డెబ్బై పద్యాలు నేర్చుకున్నాను. ఎవరు ఎక్కువ పద్యాలు నేర్చుకుంటారో అని మేమంతా పోటీ పడుతాము. పద్యాలు నేర్చుకోవడం వలన ఆలోచనశక్తి పెరుగుతుంది. నీతి తెలుస్తుంది. చాలా పదాలకు అర్థాలు తెలుసుకున్నాను. పద్యాలు నేర్చుకున్న ప్రతీసారి ఎంతో ధైర్యంగా ఉంటుంది. వేమన పద్యాలు నాకు చాలా ఇష్టం.
కె.మేఘన, 7వ తరగతి,
యు.పి.ఎస్ .అజిలాపురం.
ఊర్లలో గవర్నమెంట్ బడులలో చదువుకునే పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతారు. బడి ఉన్న రోజు కూడా పత్తి తీయడానికి పిల్చుకపోతారు. కొంతమంది తల్లిదండ్రులు పుస్తకాలు కూడా ఇప్పించరు. చిన్న పిల్లలుంటే వాళ్ళను చూసుకోవాలి. కొన్ని సార్లు రాసుకోవడానికి కూడా టైం ఉండదు. అయినా వీటిని దాటుకొని చదువుకోవాలి. మా నాన్న నన్ను కష్టపడి చదివిస్తాడు. నేను ఒక గొప్ప స్థానంలో ఉండాలని అనుకుంటున్నాను.
జి.శివ ,7వ తరగతి,
యు.పి.ఎస్. అజిలాపురం.
- తగుళ్ల గోపాల్
యు.పి.ఎస్. అజిలాపురం, వెల్దండ
పుస్తకాలు చదవడం నాకు ఎంతో ఇష్టం. మా బడిలో వ్యాసరచన పోటీ పెట్టినప్పుడు సెకండ్ ప్రైజ్ వస్తే చంద్రశేఖర్ ఆజాద్ పుస్తకం ఇచ్చారు. పుస్తకాలు చదవడం వలన గొప్ప గొప్ప వాళ్ళందరు తెలుస్తారు. కథల పుస్తకాలు బాగా చదువు తాను. ప్రతీ ఒక్కరు పుస్తకాలు చదవాలి. పెద్దయ్యాక అవి ఎంతో ఉపయోగ పడుతాయి.
కె.శివదీక్షిత్ ,5వ తరగతి,
యు.పి.ఎస్.అజిలాపురం, వెల్దండ
నాకు మా బడి చాలా ఇష్టం. మా సార్ వాళ్ళు అర్ధమయ్యేటట్లు పాఠాలు చెబుతారు.చదువుతో పాటు ఆటలు ఆడిస్తారు.ప్రతీ శనివారం బాలసభ పెడుతారు. రోజూ బడికి వస్తే క్రమశిక్షణ వస్తుంది. జీవితంలో మంచిగా ఎదగాలంటే రోజు బడికి రావాలి. మంచిగా చదువుకొని డాక్టర్ కావాలని అనుకుంటున్నాను.
తామశ్రీ ,5వ తరగతి
- యు.పి.ఎస్. అజిలాపురం, వెల్దండ
నీవు చదువుకునేది ఎందు కొరకు?
నేను చదివి మంచి ఉద్యోగం సంపాదించి మా కుటుంబానికి మంచి పేరు తెస్తాను. మా అమ్మ, చెల్లిని కష్ట పడకుండా చూసుకుంటాను. అంతే కాకుండా మా ఊరిలో ఆడ పిల్లలను చదవనియ్యడం లేదు. కాబట్టి నేను చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే నన్ను చూసి అయినా వాళ్ళు చదివిస్తారని నా చిన్న కోరిక. అందువలన చదువుకోవాలని అనుకుంటున్నాను.
నీకు ఏ సబ్జెక్టు అంటే ఇష్టం? ఎందుకు?
నాకు అన్ని సబ్జెక్టులు అంటే ఇష్టం. తెలుగంటే మరీ ఇష్టం. జీవశాస్త్రంలో మన ఆరోగ్యాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలుసుకుంటా. ఆంగ్లంలో మన ఇతర దేశాలకు వెళ్ళాలంటే మనకు ఆరగ్లం వచ్చి ఉండాలి. మ్యాథ్స్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు నాకు అన్ని సబ్జెక్టులు అంటే ఇష్టం.
టీవీ చూడటం ఇష్టమా? ఏ కార్యక్రమాలు చూస్తావు?
టీవీ చూడడం నాకు ఇష్టం నేను ఎక్కువగా మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమం చూస్తాను. ఆ కార్యక్రమం నాకు చాలా ఇష్టం. జవాబులు నాకు తెలిస్తే ఆసంతోషం వేరే. ఈ రోజుల్లో అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారు. వాళ్ళ గురించి తీసే సినిమాలు వకీల్ సాబ్ లాంటి సినిమాలు చూస్తా.మన జ్ఞానానికి సంబంధిచిన ఏవైనా కార్యక్రమాలు వస్తే చూస్తాను.
- పి. మానస 10వ తరగతి.
క్రమ శిక్షణ అంటే ?
క్రమశిక్షణ అంటే మంచి ప్రవర్తన కలిగి ఉడటం. సహాయం చేసే గుణం ఉండడం. ఇతరుల పట్ల దయా, జాలి కలిగి ఉండడం పెద్దలను గౌరవించడం అమ్మానాన్నలు చెప్పే మంచి మాటలు విని వాటిని పాటించడం గురువును గౌరవించడం ఇలాంటి మంచి గుణాలు కలిగి ఉంటే నా దృష్టిలో క్రమశిక్షణ అనుకుంటున్నాను.
పాఠశాలలో చదువుకోవడం నచ్చిందా?
పాఠశాలలో చదువుకోవడం నచ్చింది. ఎందుకంటే పాఠశాలలో గురువులు మంచిగా పాఠాలు చెబుతారు. నేరుగా గురువు నుండే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మంచిగా ఆటలు ఆడిపిస్తారు. అందువల్ల పాఠశాలలో చదువుకోవటం నచ్చింది.
ఆన్‌లైన్ క్లాసులు వినటం నచ్చిందా?
ఆన్‌లైన్ క్లాసులు నచ్చలేదు. ఫోన్‌లో సిగల్స్ కట్ అవడం కనెక్ట్ అయ్యే సరికి జూమ్ కట్ అవుతుంది. ఇలా చాలా మందికి జరిగింది. సిగల్స్ సరిగా లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులు సరిగా అర్థం అయ్యేవి కావు. అమ్మకు సహాయం చేస్తా అమ్మకు ఇంటి పనిలో వంట పనిలో సహాయం చేస్తాను. నేను మా అమ్మకు సహాయం చేస్తాను. ఎలాంటి సహాయం అంటే ఇల్లు ఊకడం, గిన్నెలు తోమడం, అన్నం వండడం, బట్టలు పిండడం, ముగ్గు వేయడం మొదలైన పనులు చేస్తూ ఉంటాను.
నీ లక్ష్యం ఏమిటి?
కష్టపడి చదువకుని ఎస్‌ఐ జాబ్ సాధించాలి, అమ్మనాన్నలను మంచిగా చూసుకోవాలి.
- బి. వైష్ణవి 10వ తరగతి
ఇంట్లో ఎవరంటే ఇష్టం?
మా ఇంట్లో నాకు మా అమ్మానాన్నలు, మా అక్క ఇష్టం. వీళ్ళు నాకు ఎప్పుడు దేనినైనా సాధించాలని చెపుతారు. ముఖ్యంగా మానాన్న దేంట్లోనైనా పాలుగొని ముందుకు రావాలని చెప్ప దేంటోలైనా ఓడిపోయినా బాదపడకు అని ఓటమి మనకు ఒక పరిక్ష లాంటిది అని చెపుతారు. ఓడిపోతే మనం చేసిన తప్పులు తెలుసుకుని ఆ తప్పులు తెలుసుకోవాలని నాకు చెపుతారు. అందుకే నాకు మా అమ్మానాన్నలు, అక్క ఇష్టం.
సెల్‌ఫోన్ ఎందుకోసం వాడాలి?
సెల్‌ఫోన్ ఎందుకోసం వాడాలంటే మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి సమాచారం చేరవేయడానికి వాడాలి. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను మనకు సెల్ ఫోన్‌లో చూడవచ్చ. దీని ద్వారా గాంధీజీ, వివేకానంద, ఝాన్సీ రాణి వంటి ఎందరో మహానీయుల చరిత్రలు తెలుసుకోవచ్చు. వీడియో కాల్స్‌తో బంధుమిత్రులతో మాట్లాడవచ్చు. మంచిగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఇస్తుంది.
నీ కిష్టమైన జాతీయ నాయకుడు ఎవరు? ఎందుకు?
ఏపిజే అబ్దుల్ కలాం ఈయన విజయాన్ని చూసి ముందుగానే మురిసిపోవద్దు. అది మొదటి అడుగుగానే భావించాలని తెలిపారు. ఈయన ఎన్నో అపజయాలను చవిచూసి విజయాలను సాధించారు. అవమానాలను అనుభవిస్తూ దు:ఖాలను దూరం చేసుకుంటూ విజయాలకు బాటలు వేసారు. కలలు కనండి వాటిని నిజం చేసుకోవాలని చెప్పారు. అందుకే నాకు ఈయన అంటే ఇష్టం.
పాఠశాలకు బలవంతంగా వస్తున్నావా? ఇష్టంగా వస్తున్నావా?
నేను పాఠశాలకు ఇష్టంతోనే వస్తున్నాను.. ఎందుకంటే నాకు ఇష్టమైన ప్రదేశం అంటే ఉంటే అవి పాఠశాల మాత్రమే నా జీవితాన్ని మార్చి నన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేది పాఠశాల మాత్రమే పాఠశాలలో ఉపాధ్యాయులు మంచి విషయాలను చెపుతారు. నా భవిష్యత్‌కు బాటలు వేస్తారు. పాఠశాలలో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.
విషయాలను నేను ఎంతో ఇష్టంగా నేర్చుకుంటాను పాఠశాల మనకు ఎంతో మంది వ్యక్తులను స్నేహితులను చేస్తుంది. నేను ఎక్కడ ఉన్నా కూడా పాఠశాలను మరచిపోను.
- ఆకుల పుృధ్వీ
తరగతిగదిలో అందరితో ఎలా ఉంటావు?
తరగతి గదిలో అందరితో సమానంగా ఉంటాను. గురువుల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తాను. స్నేహితులందరితో స్నేహభావంతో ఉంటాను. అందరితో కలిసి మెలిసి ఉంటాను.
తరగతి గదిలో ఎవరైనా గొడవలు జరిగితే దానిని పెద్దదిగా చేయకుండా వేరే వారికి తెలవనీయకుండా నేను , నా స్నేహితులు తరగతి గదిలోనే పరిష్కరిస్తాను.
గురువుల పట్ల ఏ విధంగా ఉండాలి?
గురువుల పట్ల గౌరవంగా క్రమశిక్షణతో ఉండాలి. తల్లిదండ్రులతో ఎలా గౌరవంగా ఉంటామో అలానే ఉంటాలి.
తల్లిదండ్రులు పిల్లలకు జీవితాన్ని ఇస్తారు. పిల్లలకు జీవితమంటే ఏమిటో గురువులు తెలియజేస్తారు. పైకి రావాలంటే ఏం చేయాలో , ఎలా చేయాలో చదువులు అసలు ఎందుకు చదవాలో చదవడం వల్ల లాభాలు చెప్పి గురువులు పిల్లల్ని తీర్చి దిద్దుతారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రుల పేర్లు, గురువుల పేర్లు నిలబెట్టాలి.
మీ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండి చదువుకోవాల్సిన అవసరం ఏంటి మీ ఊర్లో బడి లేదా?
మా అమ్మమ్మకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. కొడుకులు లేరు. అందువల్ల వారు నన్ను కొడుకుగా భావించారు. అమమ్మకు, తాతయ్యకు వ్యవసాయంలో పనులులు చేస్తాను. అలాగే ఇంట్లో పనులు సహాయ పడతాను. ఒక్కోసారి ఇద్దరికి ఆరోగ్యాలు బాగా లేనప్పుడు వారికి ఆసరగా ఉంటాను.
నేను చదువుకుంటూ, వారికి సహాయంగా ఉండడం కోసం అమ్మమ్మ ఇంటి వద్ద ఉండాల్సిన అవసరం ఉంది. మా ఊర్లో బడి ఉంది. కాని అందులో 7వ తరగతి వరకే ఉంది.
మీ పాఠశాల గురించి నీ మాటల్లో?
మా పాఠశాలలో గురువులందరూ సరైన క్రమంలో పాఠాలు చెబుతున్నారు. మా గురువులు విద్యార్థులందరనీ చదువులో గాని, ఆటపాటల్లో గాన్ని ప్రోత్సహిస్తారు. మా పాఠశాల నాకు, నా స్నేహితులకు క్రమశిక్షణ, స్నేహభావం, ప్రేమలను నేర్పించింది.
మా పాఠశాల నాకు దేవాలయం?
మా పాఠశాల నాకు దేవాలయంతో సమానం దేవాలయంలో దేవుళ్ళు ఉంటారు. పాఠశాలలో గురువులు ఉంటారు. విద్యార్థుల తప్పుఒప్పులను సరి చేస్తూ జీవితాలల్లో వెలుగులు నింపుతారు.
మా పాఠశాల నాకు కుటుంబంలాంటిది?
కుటుంబంలో తల్లిదండ్రులు, చెల్లే, అన్నా ఉంటారు. పాఠశాలలో గురువులు స్నేహితులు ఉంటారు. స్నేహితులు మంచి చెడులు చెపుతారు. గురువులు జ్ఞానాన్ని క్రమశిక్షణను నేర్పిస్తారు.
-ఎస్. వరుణ్‌కుమార్, 10వ తరగతి
- తండ హరీష్ గౌడ్
జడ్‌పీహెచ్‌ఎస్ వి.ఎస్ లక్ష్మీపురం
Sun 14 Nov 02:50:49.664085 2021