ప్రసార మాధ్యమ ప్రస్థానంలో టెలివిజన్ అపూర్వ ముందడుగు. వార్తలు, స్థలాలు, సంఘటనలు దృశ్యమానం కావటం వల్ల ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయి ప్రతి ముందడుగులోనూ ఎదురయ్యే ముళ్ళున్నట్లే, టీవీ విశ్వరూపం మొదలయ్యాక దాని ప్రభావం పర్వవసానాలూ తెలిసొచ్చాయి. ఏ సాంకేతిక విజయాన్నయినా ఎక్కువగా ఉపయోగించుకోగలిగేది వ్యవస్థలోని వ్యాపార వర్గాలే . టీవీని కూడా ప్రపంచ వ్యాపితంగా వాళ్ళు అజమాయిషీ చేస్తున్నారు. వ్యాపారాత్మక రాజకీయాలు, సంస్కృతి, సరుకులు మన ఇంట్లోకి టీవీ ద్వారా ముంచెత్తుతున్నాయి. ఇప్పుడిక ఆపటం ఎవరితరమవుతుంది! ప్రపంచాన్ని ఇంట్లోంచే వీక్షించగలగటం, పరిణామాలు కళ్ళేదుటే కాంచటం ప్రయోజనాత్మకమే అయినప్పటికీ తీవ్రవాడకం వల్ల కలిగే అనర్థాలు విపరీతంగా పెరగటం విచారించే అంశం. అయినా అత్యంత అవసర వస్తువుగా మారిన టీవీ గురించిన వారాల ఆనంద్ కథనాన్ని ఈ వారం కవర్ స్టోరీలో చదవండి.
సామాన్యుల నట్టింట్లో వినోద వేదిక- టెలివిజన్ ఐక్య రాజ్య సమితి 21 నవంబర్‌ను ప్రపంచ టెలివిజన్ రోజుగా ప్రకటించింది. 1996లో ఇదే రోజున జరిగిన ప్రపంచ తెలివిజం ఫోరం సమావేశ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన చేసారు. అయితే ఆ నిర్ణయాన్ని జర్మనీ వ్యతిరేకించింది. అప్పటికే పత్రికా స్వాతంత్ర దినం, టేలికమ్యునికేషన్ రిజు లాంటివి వుండగా ఇది ప్రత్యేకించి అవసరం లేదని జర్మనీ వాదించింది. కానీ మెజారిటీ నిర్ణయం మేరకు ప్రపంచ టెలివిజన్ రోజును జరపడానికే సమితి నిర్ణయించింది. టెలివిజన్ సమాచారాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్నీ ఇంకా అనేక అంశాలని ప్రజలకు అందిస్తుందని యునెస్కో ప్రకటించింది. ఆ నేపధ్యంలో ప్రతి ఏటా 21 నవంబర్‌ను ప్రపంచ వ్యాప్తంగా టెలివిజన్ రోజుగా నిర్వహిస్తున్నారు.
దృశ్య శ్రవణ మాధ్యమాల ప్రభావం మనషి ఆలోచనా తీరు పైనా మానసిక స్పందనలపైనా ఊహించలేనంతగా వుంటుంది. కేవలం వినడమే కాకుండా వింటూ చూడడం చూస్తూ వినడం అన్నది మనిషి సమస్త ఇంద్రియాలనూ ప్రభావితం చేస్తుంది. ఆ క్రమంలో ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలలో భాగంగా ఉనికిలోకి వచ్చిన తొలి మాధ్యమం కదిలే బొమ్మల 'సినిమా'. మొదట మూకీ గానూ తర్వాత టాకీ గానూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని చేరుకుంది. మనిషి జీవన విధానంలోకి ఊహించని రీతిలో సినిమా చొచ్చుకుని వచ్చింది. అయితే సినిమా చూడాలంటే ఇంట్లోంచి బయలుదేరి సినిమా హాలుకు వెళ్ళాలి. కాని అదే దృశ్య శ్రవణ మాధ్యమం ఇంట్లోకి వస్తే... దృశ్య శ్రవణ ప్రసారాలు అన్న ఆలోచనే శాస్త్రవేత్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా రూపు దిద్దుకున్నదే 'టెలివిజన్'. నిజానికి టీవీ ఆవిష్కరణకు ముందు అది మానవ అభివృద్ధికి మానవ కల్యాణానికి ఉపయోగ పడుతుంది, సమాచార ప్రసారానికి గొప్ప వాహకమవుతుంది అనుకున్నారు. కాని టెలివిజన్ కాలక్రమంలో ఒక వ్యసనంగానూ, వ్యామోహంగానూ, కేవలం వ్యాపారంగానూ మారుతుందని ఎవరూ ఊహించలేదు. అంతేకాదు సమస్త మానవ విలువలపైనా కుటుంబ అనుబంధాల పైనా టీవీ తీవ్రమయిన ప్రభావంచూపుతుందని కూడా ఎవరూ ఊహించలేదు.
టీవీ ఇవ్వాళ నట్టింట్లో తిష్ట వేసుకుంది. ఆధునిక సాంకేతిక అబివృద్ది నేపధ్యంలో టీవితో పాటు ఇంటర్నెట్ నట్టింట్లోకి కూడా వచ్చి చేరింది.
దాదాపుగా అందరి కుటుం బాల్లోనూ జీవితా ల్లోనూ అవి భాగమయి పోయాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుత కరోనా సృష్టించిన వర్తమాన సంక్షోభ కాలంలో అందరూ ఇండ్లకే పరిమితమయి పోయి ఈ రెండు మాధ్యమాలతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. కానీ ఈ రోజు వస్తున్న టీవీ సీరియల్లయినా, ఇంటర్నెట్ వెబ్ సిరీస్ అయినా అధిక శాతం హింస, కుట్రలు, కుతంత్రాలతో కూడిన ఇతివృత్తాలతో నిండిపోయి ఉంటున్నాయి. మన తెలుగు టీవీ సీరియల్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దాదాపు అన్ని సీరియల్లు కుటుంబ కథాంశాల పేర కుటుంబ విలువల్ని కుట్రలు కుతంత్రాలతో నింపి వేసాయి.అత్తా కోడళ్ళ నడుమ ద్వేషం, తోడి కోడళ్ళ నడుమ ఈర్ష, ఇట్లా మొత్తంగా కుటుంబ వ్యతిరేక విలువల్ని ప్రోత్సహిస్తున్న సీరియల్లు 'సకుటుంబ ప్రసారాలుగా' నడిస్తున్నాయి. అవి అట్లా ఉంచితే ఇంటర్నెట్లో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఓటీటీలు వచ్చాక పరిస్థితి ఇంకా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ ప్రభావంతో వస్తున్న హింసాత్మక పోకడులున్న 'క్రయిం సిరీస్' ఎక్కువగా వస్తున్నాయి. మిర్జాపూర్, బ్రీథ్, ట్రుథ్ సీకర్స్, హౌస్తేజేస్, ధిల్లీ క్రయిం, సేక్రేడ్ గేమ్స్, అభయ, అసుర్ లాంటి ఎన్నో వెబ్ సిరిస్ వీక్షకుల మనోభావాల పైన విపరీత మయిన ప్రభావాన్ని కలిగి స్తున్నాయి.
ఫలితంగా మంచితనం పట్ల, మనిషి తనం పట్ల, మనుషుల పట్ల, మానవ విలువల పట్ల, కళల పట్ల అత్యంత ఉదాసిన ధోరణి సర్వత్రా కనిపిస్తున్నది. దాదాపు అందరూ ఇంటికే పరిమితమయిన వర్తమాన స్థితిలో ఈ టీవీ సీరియల్లు, వెబ్ సిరీస్ ప్రభావం అమితంగా కనిపిస్తున్నది.
ఇంటర్నెట్ ఆవిష్కరణకు ముందు ప్రజల్ని ఆకర్షించిన మాధ్యమాల్లో రేడియో మొదటిది తర్వాతిది టీవీ.
నిజానికి ఎక్కడో జరిగే విషయాల్ని, వింతల్ని విశేషాల్ని కళ్ళతో చూడాలనే తపన ఆసక్తి మనుషులకు ఎప్పటి నుంచే వుంది. అందుకే 'పాతాల భైరవి' లాంటి సినిమాల్లో ఎక్కడో వున్న రాజకుమారిని మాయా దర్పణంలో చూడడం, అట్లే మాజిక్ లంతరు, అంజనం వేయడం లాంటి విచిత్ర సాధనాల గురించి మనం కథల్లో విన్నాం, చదువుకున్నాం. అట్లా మనుషుల్లో వుండే ఆసక్తి పరిశోదన ఫలితంగా టెలివిజన్ ఆవిష్కరణ జరిగింది.అది అంత సులువుగానూ, తొందరగానూ ఏమీ జరగలేదు. ఫాక్స్ మెయిల్ పద్ధతి కనిపెట్టబడిన నాటి నుంచే అదే రీతిలో బొమ్మల్ని కూడా ప్రసారం చేయవచ్చునా అనే పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఆ దిశలో మొదటి ప్రయోగం 1883లోనే ఆరంభమయింది. బెర్లిన్ యునివర్సిటీలోని పోల్ నివ కో అనే విద్యార్థి దిశలో ప్రయోగాలు చేసాడు. స్కానింగ్ సాధనాన్ని నిర్మించాడు. ఆ క్రమంలో అనేక పరిశోధనలు జరిగినప్పటికీ స్కాట్లాండ్కు చెందిన జాన్ లోగీ బైర్డ్ J L BAIRD తన పరిశోధనల ద్వారా టెలివిజన్ నిర్మాణంలోని అనేక సాంకేతిక
సమస్యల్ని పరిష్కరించాడు. అందుకే ఆయన్ని టీవీ ఆవిష్కర్తగా ప్రపంచం గుర్తించింది. తర్వాత ఎలక్ట్రానిక్ పద్దతిలో టీవీలను రూపొందించే కృషి అమెరికాలో కొనసాగింది. వివిధ దేశాల్లో జరిగిన పరిశోధనల ఫలితంగా లండన్‌లో 1936లో టెలివిజన్ ప్రసారాలు క్రమంగా ప్రసారం కావడం ఆరంభమయింది. అది ప్రపంచ యుద్ధ కాలం కనుక ఇంగ్లాండ్ టీవీ ప్రసారాల్ని కొద్ది కాలానికే నిలిపివేసింది. తర్వాత 46లో తిరిగి ఆరంభమయ్యాయి. ఇక క్రమంగా టీవీ ప్రసారాలు పెరగడం, పరికరాల ఉత్పత్తి పెరగడంతో టీవీ ప్రసారాల వేగం ఎంతో పెరిగింది. కాని టీవీ పైన పరిశోధనలు అంత టితో ఆగలేదు చేయిలో ఉంచుకునే సైజులో టీవీ
సెట్‌ను 1952లోనే తయారు చేసారు. ఇక టీవీ ప్రసారాల్ని కలర్లో కూడా చేయ వచ్చని జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆటో వాన్ బ్రాంక్ 1902లోనే నిరూపించినప్పటికీ పరికరాల ఉత్పత్తి తదితరాల ధరలు అధికంగా వుండి అప్పట్లో అది ఆచరణ సాధ్యం కాలేదు. విస్త్రుత పరిశోధనల తర్వాత రంగుల టీవీ ప్రసారాలు 1950లో అమెరికాలో, 60లో జపాన్‌లో, 67లో బ్రిటన్‌లోనూ మొదలయ్యాయి.
ఇక ఫ్లాట్ టీవీని డాక్టర్ గ్లేజర్ లండన్‌లో కనిపెట్టి ప్రదర్శించాడు. అది ఫోటో ఫ్రేంలాగా గోడకు తగిలించే వీలుండి విశేషంగా ఆకర్షించింది.
ఇక టీవీ రంగంలో జరిగిన మరో విశేష పరిశోధన టేప్ పైన రికార్డ్ చేసే పరికరం. టేప్ రికార్డర్ ఉపయోగంలోకి వచ్చాక ప్రసార రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక వీడియో టేప్ మరో ఆవిష్కరణ. దాంట్లో దృశ్య, శబ్ద తరంగాలను రికార్డు దేశే అవకాశం కలిగింది. దాంతో కేవలం టీవీలకే కాకుండా సినిమా రంగానికీ కూడా ఎంతో ఉపయుక్తమయింది. అట్లా నిరంతర ఆసక్తి తీవ్ర పరిశోధనల ఫలితంగా టీవీ అనేకానేక మార్పులకు లోని ఇవ్వాల్టి స్థితికి చేరింది. ఇంకా స్మార్ట్ టీవీ తదితరాలు వచ్చి ఇంటర్నెట్తో అనుసంధానం జరిగి ఇవ్వాళ టీవీ అద్భుతాల్ని చూపిస్తున్నది. యు ట్యూబ్, ఓటీటీ లాంటివి అందుబాటులోకి వచ్చి మొత్తం టీవీ వీక్షణ ధ్యేయం, లక్ష్యం అన్నీ మారి పోయాయి.
భారత దేశంలో టీవీరంగం
మన దేశం లో Terrestrial టెలివిజన్ 15 సెప్టెంబరు 1959 ఢిల్లీలో మొదలయింది. ఒక చిన్న ట్రాన్స్మిటర్, తాత్కాలిక స్టూడియోతో ప్రయోగాత్మక ప్రసారం చేయడం ద్వారా అది ప్రారంభం అయింది. 1965 నుంచి ఆల్ ఇండియా రేడియోలో అంతర్భాగంగా రోజువారీ ప్రసారాల్ని మొదలుపెట్టారు. వాటిల్లో ముఖ్యంగా విద్యా విషయక అంశాలు, వార్తలు ప్రసారం చేసేవారు. టీవీ ప్రసరాల్ని క్రమంగా బాంబే, అమ్రిత్సర్లకు విస్తరించారు. వినోదాత్మక కార్యక్రమాలూ మొదలయ్యాయి. 1976 టీవీని రేడియో నుంచి వేరు చేసారు. 1982లో జాతీయ ప్రసారాలతో పాటు కలర్ టీవీ కూడా అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో ధిల్లీలో ఆసియన్ గేమ్స్ జరగడంతో రాజీవ్ గాంధీ చొరవతో దేశంలో కలర్ టీవీలు వచ్చాయి, టీవీకి విశేష ప్రాచుర్యం లభించింది.
అయితే మొదటి రోజుల్లో సాంకేతిక ఇబ్బందుల వల్ల టీవీ అమర్చుకోవాలనుకునే ఇండ్లల్లో ముప్పై నలభై ఫీట్ల ఆంటేన్నాలని అమర్చుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఇంట్లో టీవీ వుండడం అంటే గొప్ప ప్రతిష్ట. తర్వాత 'లో పవర్ ట్రాన్స్ మిట్టర్'లు వచ్చాయి. క్రమంగా సాంకేతిక అభివద్ది ఫలితంగా టీవీలు జనానికి కొంత దగ్గరయ్యాయి.
సరిగ్గా అప్పుడే దూరదర్శన్‌లో విశేషంగా ధారావాహికలు (సోప్ ఒపేరా) ప్రసారం కావడం మొదలయింది. జాతీయ ప్రసారాల్లో ముఖ్యంగా కుమార్ వాసుదేవ్ దర్శకత్వంలో వచ్చిన 'హం లోగ్' , తర్వాత 'బున్యాద్' లాంటి సీరియల్లు చాలా ప్రాచుర్యం పొందాయి. తర్వాత దూరదర్శన్‌లో ప్రసారమయిన రామానంద్ సాగర్ 'రామాయణ్', బీ.ఆర్.చోప్రా 'మహాభారత్'లు మొత్తం దేశాన్ని ఒక కుదుపు కుది పాయి. ఆదివారం ఉదయమే జన మంతా లేచి తయారయి టీవీల ముందు కూర్చునే వారు.
వాటి ప్రభావం వల్ల సినిమా టాకీసుల్లో ఉదయం ఆటలు విఫలమయ్యాయి. ఫిలింసొసైటీ ప్రదర్శనలూ నిలిచి పోయాయి. ఒక రకంగా ఫిలిం సొసైటీ ఉద్యమానికే ఆ సీరియల్ల వల్ల విఘాతం కలిగిందని చెప్పొచ్చు. ఇంకా అదే కాలంలో దేశ విభజన అంశం పైన భీష్మ సహాని నవలను గోవింద్ నిహలాని రూపోనించిన 'థామస్' నెహ్రు డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా శ్యాం బెనెగళ్ తీసిన 'భారత్ ఏక ఖోజ్', ఆర్ కే నారాయణ్ 'మాల్గుడి డేస్' కథల్ని అదే పెరుతో శంకర్ నాగ్ టీవీ సీరియల్ తీసారు. ఆ తర్వాత సర్కస్ లాంటి సీరియల్లు షారుఖ్ ఖాన్‌కి బ్రేక్ ఇచ్చి విశేష ప్రాచుర్యం పొందాయి. ఇక దూరదర్శన్‌లో ప్రసారమయిన 'చిత్రహార్'లో సినిమా పాటలు, శని ఆదివారాల్లో సినిమా ప్రసారాలు, ఆదివారం మధ్యాహ్నం అవార్డు చిత్రాల ప్రదర్శనలతో దూరదర్శన్ వెలిగి పోయిందనే చెప్పాలి..
కానీ 1991 తర్వాత భారత ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా liberalisation privatisation globalization విధానాన్ని అనుసరించడంతో టీవీ రంగం కూడా దాని ప్రభావానికిలోనయింది. అప్పటిదాకా కేవలం దూరదర్శన్ ఆధీనంలో వున్న టీవీ ప్రసారాలు కేబుల్ టీవీ ప్రసారాల్ని ప్రైవేట్ కు ఇవ్వడంతో దూరదర్శన్ ప్రభ క్రమంగా తగ్గింది. దేశంలో టీవీ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. మూడేళ్ళ క్రితం జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 197 మిల్లియన్ ఇండ్లల్లో టీవీ లున్నాయి. ఇక పే టీవీ రావడంతో టీవీలు ప్రజల్లోకి మరింతగా చొచ్చుకొని పోయాయి. ఇప్పటికి 50కి పైగా పే చానళ్ళు, 60 వేలకు పైగా కేబుల్ ఆపరేటర్లు, లెక్క లేనంత మంది ఎం ఎస్ వొ లు ఇంకా డిటిహెచ్ సేవలు అందుబాటులో వున్నాయి. దేశంలో దాదాపు 900కు పైగా టీవీ చానల్లు ఉన్నాయి. రోజు రోజుకూ మన దేశంలో టీవీ వీక్షకుల సంఖ్య పెరిగి పోతూనే వుంది. పర్యవసానంగా ప్రకటనల రంగం విపరీతంగా పెరిగి ఆపరేటర్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతున్నది. అది ప్రింట్ మీడియాను ఎప్పుడో దాటేసింది. ఇక ప్రవేటు టీవీ చానళ్ళ నడుమ వున్న అనారోగ్యకర పోటీ వల్ల ప్రసారాల్లో జనాన్ని ఆకట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఎంతకయినా దిగాజారే స్థితి కనిపిస్తున్నది. టీవీల్లో వినోద కాలక్షేప కార్యక్రమాలకు పెద్దస్థానం కల్పించి వీక్షకులను పెంచుకోవడమే పరమా వధిగా చాన్నళ్ళు పనిచేస్తున్నాయి. పర్యవసానంగా సమాచార ప్రసార చానళ్ళు ఉనికి కోసం కష్టపడాల్సిన స్థితి వచ్చేసింది. ఇక ఒటీటీలు వచ్చి కొత్త సినిమాల్ని, వెబ్సిరీస్ని అనుబాటులోకి తేవడంతో టీవీ వ్యాపారం మరింత పోటీకి వేదిక అయింది.
ఇట్లా మొత్తం మీద టీవీ ఆవిష్కరణ తర్వాత గడిచిన దశాబ్దాలలో కంటెంట్ పరంగానూ, వ్యాపార పరంగానూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.సాంకేతికంగా పెరిగిన అభివద్ది టీవీ ప్రసార క్వాలిటీ బాగా మెరుగు పడింది. సామాన్యుల నట్టింట్లో వినోద వేదిక అయిపొయింది. వ్యాపారస్తులకు వ్యాపారమూ అయిపొయింది, టీవీ ప్రజల జీవితాల్లో భాగమయిపోయింది..
భవిష్యత్తులో టీవీ ప్రసారాల్లోని మంచి చెడ్డల్ని మత్తు మండునీ వివరిస్తూ వీక్షకుల్ని మేలుకొలిపే ఉద్యమం లాంటిది వస్తే తప్ప టీవీ ప్రసారాలు అర్థవంత మయ్యే స్థితి కనుచిప్పు మేరలో కనిపించడం లేదు. ఆ రోజు వస్తుందని టీవీ గొప్ప సామాజిక మాధ్యమము అవుతుందని ఆశిద్దాం.
- వారాల ఆనంద్, 9440501281
Sun 21 Nov 02:35:46.419439 2021