విద్యార్థులను ఆలోచింప చేయడం అనేది కూడా పుస్తకాల ద్వారా జరిగే ముఖ్యమైన ప్రక్రియ. అసలు బోధన యొక్క ముఖ్యోద్దేశం ఆలోచింప చేయడమే కదా. మరి, చదివినంతనే ఏ పుస్తకాలు ఆలోచింప చేస్తాయనే ప్రశ్న కూడా విద్యార్థుల్లో ఉత్పన్నమవుతుంది. వాటిని ఎవరు రాస్తారు? అవి ఎక్కడ లభిస్తాయి? తమకు కావాల్సిన పుస్తకాలను విద్యార్థులు ఎట్లా ఎక్కడ కొనుక్కోవచ్చు? ఒక వేళ తమకు ఇష్టమైన పుస్తకాలన్నిటినీ ఒకే చోట ఒకే దఫా కొనుక్కోవాలనుకుంటే ఏం చేయాలి? మంచి పుస్తకాలు ఏవి? ఇట్లాంటి ప్రశ్నలంటికీ సమాధానమే పుస్తకోత్సవాలు, ప్రదర్శనలు (బుక్ ఎక్జిబిషన్స్). పుస్తక ప్రదర్శన, పుస్తకోత్సవానికే మరో పేరు 'బుక్ ఫెయిర్'. ప్రపంచవ్యాప్తంగా అనేక పుస్తకోత్సవాలను ఆయా బుక్ట్రస్ట్లు నిర్వహిస్తూ గొప్న గొప్ప పుస్తకాల్ని పాఠకులకు అందించడంలో ప్రసిద్ధికెక్కాయి. డిసెంబరు జనవరి మాసాల్లో మన దేశంలో ప్రధాన నగరాల్లో బుక్ ఫెయిర్స్ నడుస్తుంటాయి. అట్లాగే మన రాజధానిలో కూడా అనేక సంవత్సరాలుగా 'హైదరాబాద్ బుక్ ఫెయిర్' నిర్వహించబడుతూ ప్రజల ప్రశంసలు అందుకుం టున్నది. ఏటా రెండు నుంచి ఐదులక్షల లక్షల మంది దాకా పుస్తకాభిమానులు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సందర్శిస్తారు. పలు సార్లు బుక్ఫెయిర్లో కలుసుకున్న వాళ్లంతా నిజ జీవితంలో 'రీడర్స్ కమ్యూనిటీ'గా ఏర్పడతారు. పుస్తక స్నేహం, పఠన మైత్రి వ్యక్తుల మధ్య చక్కటి సాంస్కృతిక బాంధవ్యానికి దోహదం చేస్తుంది.
'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో' అంటాడు కందుకూరి వీరేశలింగం పంతులు. 'ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక' అంటాడు ప్రజా కవి కాళోజీ నారాయణ రావు.' పుస్తకాలకు సంబంధించి ఇట్లాంటి ఎన్నో సూక్తుల్ని మహితోక్తుల్ని స్కూళ్లలో కాలేజీల్లో తరగతిగదుల్లో గోడల మీద మనం చూస్తుంటాం. అవి విద్యార్థులను పఠనం వైపుకు మరల్చడానికి బాగా పనిచేస్తాయి. పఠనం అలవాటైతే చాలు విద్యార్థుల నుంచి ఎదురయ్యే సమస్యలు ముప్పావు వంతు తీరిపోతాయి. ఎందుకంటే పఠనం అలవాటుగా మారిన విద్యార్థులు మిగతా విద్యార్థులకంటే భిన్నంగా ఉంటారు. పాఠశాల నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ సృజనాత్మకంగా నడచుకుంటారు. గ్రహణశక్తి అధికంగా ఉంటుంది. చురుకుదనంతో ఉత్తేజంతో అభ్యసన కృత్యాల్లో పాలుపంచుకుంటారు. సమయం వృధా చేయరు. వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. చదివిన పుస్తకం గురించి తోచిన పద్ధతిలో స్నేహితులతో, ఉపాధ్యాయులతో గ్రంథ చర్చలు జరుపుతారు. పాఠశాల గ్రంథాలయాన్ని నిత్యం ఉపయోగిం చుకుంటారు. ఊళ్లో శాఖా గ్రంథాలయం ఉంటే అక్కడా సభ్యత్వం తీసుకుంటారు. ఆదివారాల్లో సెలవుదినాల్లో లైబ్రరీ రీడింగ్ హాల్లో మొదట ప్రవేశించి యాక్టివ్ రీడర్‌గా ఆఖర్న లేచివస్తారు. ఐతే, పుస్తక పఠనం ఒక్క విద్యార్థులనే కాదు పౌరవ్యవస్థను కూడా 'ఆలోచన- భావన- వ్యక్తీకరణ- ఆచరణ' అనే చక్రీయ (సైక్లిక్) సంవిధాన అనుసరణకు ఉద్యుక్తులను చేస్తుంది. ఈ సైక్లిక్ సంవిధానం విద్యార్థుల అభ్యసన ప్రక్రియను సంపూర్ణంగా మార్చేస్తుంది, పౌరుల జీవన దృక్పథాన్ని ఉన్నతీకరించి ఆదర్శవంతం చేస్తుంది. పుస్తక పఠనానుభవం చదువరులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి వాళ్ల నడవడికను ఆశయాల పూదోటగా తీర్చి దిద్దుతుంది. భావనల కిటికీ తెరచి కథలూ కావ్యాలూ నవలలూ వ్యాసాలూ రాయిస్తుంది. విశ్లేషకులుగా సద్విమర్శకులుగా రూపొందిస్తుంది. నాయకత్వ లక్షణాలనూ పోషిస్తుంది.
పఠనానురక్తులైన విద్యార్థుల నుంచి పాఠశాల నిర్వహణలో యాజమాన్యానికి, విద్యా బోధనలో గురువులకు, జ్ఞానాన్వేషణలో తోటివిద్యార్థులకు అందే సహకారం గుణాత్మకంగా ఉంటుంది. లౌకిక విషయాలకే పరిమితమైన పౌరులు సైతం పుస్తకపఠనంతో సామాజిక వాస్తవా లను, ప్రాపంచిక సంఘటనలను పరిణామాలను గురించి లోతుగా తెలుసుకోగలుగుతారు. పరిపక్వమైన ఆలోచనలు చేస్తారు. మంచి చెడుల పట్ల విచక్షణతో వ్యవహరిస్తారు. కాలవాచిగా వీచే ధోరణుల్లో పనికొచ్చేవి ఏవో, పెడధోరణులేవో కనిపెట్టగలుగుతారు. ప్రపంచమంతటా అమలవుతున్న ఆర్థిక సరళీకరణల గుట్టును అవగతం చేసుకోగలుగుతారు. ప్రభుత్వాలు అనుసరించే విధానాలను అర్థం చేసుకొని అవి భేషైనవి అయితే సమర్థిస్తారు. లోపభూయిష్టమైనవైతే ధైర్యంగా దుయ్యబడతారు. మానవ హక్కుల రక్షణకు పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్న మహనీయులకు అండగా ఉంటారు. గత చరిత్రలో అపురూపమైన విస్మృత ఘట్టాలపై ప్రతిస్పందిస్తారు. దేశ విదేశాల స్వాతంత్య్రోద్యమాలను తులనాత్మకంగా అధ్యయనం చేస్తారు. గ్రామం నుంచి గ్లోబు దాకా గల సమాచారం చదువరులకు కరతలామలకం. మొత్తంగా చూస్తే అటు పాఠశాల ఇటు సమాజం ప్రగతిశీల భావనలతో ముందడగు వేయడానికి, మేధోబృందాల (థింక్ ట్యాంక్) తయారీకి పిన్నలమీద పెద్దలమీద 'గ్రంథాలు-పఠనం' ఒక నిశ్శబ్ద విప్లవంలా పనిచేస్తాయి. అన్ని కాలాల్లో ప్రపంచ శాంతి సామరస్యాలను అభివృద్ధిని సమకూర్చే మేధాసంపత్తిని పౌర సమాజానికి పుస్తకాలే ప్రసాదించగలవు. కామ్రేడ్ వి.ఐ.లెనిన్ ఓ సందర్భంలో ''అనుభూతి నుంచి భావనాత్మక ఆచరణ (లాజికల్ థింకింగ్)కు, అక్కడి నుంచి ఆచరణకు. ఇదే సత్యాన్ని తెలుసుకునే పంథా'' అంటాడు. బహుశా ఆ అనుభూతి పఠనానుభూతి అయితే పాఠకులు కూడా సత్యాన్వేషణకై నిలబడగలరు, తలపడగలరు.
Books give a soul to the universe, wings to the mind , flight to the imagination,and life to every thing" అంటాడు ప్లేటో మహాశయుడు. పఠనం అలవడిన విద్యార్థులకు బోధించడం ఉపాధ్యాయులకు ఎంతో సులువు. పారిభాషిక పదాల ఎరుకకు, సబ్జెక్టును అర్థం చేయించడానికి ఏరకమైన ఇబ్బందులు ఏర్పడవు. అవగాహనకు పఠనగుణం తోడై విద్యార్థులు సమృద్ధిగా నీరందిన మొక్కలా సతతహరితంగా ప్రకాశిస్తారు. విద్యార్థులను ఆలోచింప చేయడం అనేది కూడా పుస్తకాల ద్వారా జరిగే ముఖ్యమైన ప్రక్రియ. అసలు బోధన యొక్క ముఖ్యోద్దేశం ఆలోచింప చేయడమే కదా. మరి, చదివినంతనే ఏ పుస్తకాలు ఆలోచింప చేస్తాయనే ప్రశ్న కూడా విద్యార్థుల్లో ఉత్పన్నమవుతుంది. వాటిని ఎవరు రాస్తారు? అవి ఎక్కడ లభిస్తాయి? తమకు కావాల్సిన పుస్తకాలను విద్యార్థులు ఎట్లా ఎక్కడ కొనుక్కోవచ్చు? ఒక వేళ తమకు ఇష్టమైన పుస్తకాలన్నిటినీ ఒకే చోట ఒకే దఫా కొనుక్కోవాలనుకుంటే ఏం చేయాలి? మంచి పుస్తకాలు ఏవి? ఇట్లాంటి ప్రశ్నలంటికీ సమాధానమే పుస్తకోత్స వాలు, ప్రదర్శనలు(బుక్ ఎక్జిబిషన్స్).పుస్తక ప్రదర్శన ,పుస్తకోత్సవానికే మరో పేరు 'బుక్ ఫెయిర్'.ఇక్కడ పెద్ద ఎత్తున పుస్తకాలను అమ్మకానికి ప్రదర్శన పెడతారు. జర్మనీ దేశం బుక్ ఫెయిర్లకు పెట్టింది పేరు. బంగ్లాదేశ్‌లో బుక్ ఫెయిర్స్ విరివిగా జరుగుతుంటాయి. లండన్ బుక్ ఫెయిర్, ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్, ఢిల్లీ బుక్ ఫెయిర్, కలకత్తా బుక్ ఫెయిర్, చెన్నై బుక్ ఫెయిర్, విజయ వాడ బుక్ ఫెయిర్, ముంబై బుక్ ఫెయిర్, హాంకాంగ్ బుక్ ఫెయిర్, కైరో బుక్ ఫెయిర్, మాస్కో బుక్ ఫెయిర్, పారిస్ బుక్ ఫెయిర్,నేషనల్ బుక్ ఫెయిర్,వరల్డ్ బుక్ ఫెయిర్, జైపూర్ లిటరరీ ఫెస్టివల్, బెంగుళూరు బుక్ ఫెయిర్, తిరువనంతపురం బుక్ ఫెయిర్, పూణే బుక్ ఫెయిర్, కొచ్చి బుక్ ఫెయిర్ మొదలు ప్రపంచవ్యాప్తంగా అనేక పుస్తకోత్సవాలను ఆయా బుక్ట్రస్ట్లు నిర్వహిస్తూ గొప్ప గొప్ప పుస్తకాల్ని పాఠకులకు అందించడంలో ప్రసిద్ధికెక్కాయి. డిసెంబరు జనవరి మాసాల్లో మన దేశంలో ప్రధాన నగరాల్లో బుక్ ఫెయిర్స్ నడుస్తుంటాయి. అట్లాగే మన రాజధానిలో కూడా అనేక సంవత్సరాలుగా 'హైదరాబాద్ బుక్ ఫెయిర్' నిర్వహించబడుతూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నది. ఏటా రెండు నుంచి ఐదులక్షల లక్షల మంది దాకా పుస్తకాభిమానులు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శిస్తారు .సరసమైన ధరకు విలువైన పుస్తకాలను కొనుక్కుంటారు. పుస్తకాల కొనుగోలులో 'సెలక్ట్ అండ్ పర్చేజ్' ప్రధానమైంది. ఈ కౌశలం ఇక్కడ పాఠకులకు మరింతగా అబ్బుతుంది. పలు సార్లు బుక్ ఫెయిర్‌లో కలుసుకున్న వాళ్లంతా నిజ జీవితంలో 'రీడర్స్ కమ్యూనిటీ'గా ఏర్పడతారు. పుస్తక స్నేహం, పఠన మైత్రి వ్యక్తుల మధ్య చక్కటి సాంస్కృతిక బాంధవ్యానికి దోహదం చేస్తుంది. బుక్ ఫెయిర్ సందర్శిస్తున్న జనాల్లో అత్యధికులు అధ్యాపకులు విద్యార్థులు తల్లదండ్రులే కావడం విశేషం. విదేశీ టూరిస్టులు కూడా మన హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను సందర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధి కారులు, పారిశ్రామిక వేత్తలు, చలన చిత్ర దర్శకులు, మీడియా ప్రతినిధులు, విద్యావేత్తలు బుక్ ఫెయిర్ విజిటర్స్‌లో తప్పక ఉంటున్నారు. పాఠశాలలు కాలేజీలు విద్యార్థులతో 'విజిట్ బుక్ ఫెయిర్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. విద్యారంగం పట్ల అవగాహన ఉన్న పేరెంట్స్ తమ పిల్లల ఆసక్తిని గమనించి బుక్ ఫెయిర్ కోసం బడ్జెట్ నూ కేటాయిస్తున్నారు.
అన్నింటికీ అభిరుచి అవసరాలే కారణమైనట్టు బుక్ ఫెయిర్ సందర్శనకూ అక్షర ప్రపంచాన్ని ఆమూలాగ్రం చవిచూడాలనే తపన, హోం లైబ్రరీని అభివృద్ధి చేసుకోవాలనే కోరికే కారణం. బుక్ ఫెయిర్ లక్ష్యం కూడా పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచడం, అన్ని రకాల పుస్తకాలను ప్రజల ముంగిట ఉంచడం. పుస్తక సంబంధీకులందరికి బుక్ ఫెయిర్ ఓ అద్భుతమైన ప్లాట్ ఫాం. రచయితలు- పబ్లిషర్స్ - విక్రయదారులు - పాఠకులు - పుస్తక విశ్లేషకులు ఐదుగురినీ ఒకే ఆవరణలో కలిపే అరుదైన ఈవెంట్ బుక్ ఫెయిర్. ఇక్కడ రోజూ కొన్ని పుస్తకావిష్కరణలు జరుగుతాయి. పుస్తకావిష్కరణల్లో ప్రముఖులు ప్రసంగాలు చేస్తారు. ప్రసంగాల్లో సందేశాలు, చర్చకొచ్చే రచనల తాలూకు సందర్భాలు, సిద్ధాంతాలను విద్యా వంతులే కాదు శ్రామికజనం కూడా ఇక్కడ తదేకంగా ఆకళింపు చేసుకుంటారు. ప్రత్యేకించి 'బుక్‌టాక్స్' సభికులను ఆకర్శిస్తాయి. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ ఇతర భారతీయ భాషల్లోని పుస్తకాలను పబ్లిషర్స్, ఏజెంట్స్, డిస్టి బ్యూటర్స్, రిటెయిలర్స్, రచయితలు తమ తమ స్టాల్స్‌లో అందంగా అమర్చి ప్రదర్శనకు పెడతారు. భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, వ్యక్తిత్వ వికాసం, సైన్సు, టెక్నాలజీ, విద్య, వైద్యం, పర్యావరణం, వాణిజ్యం, దౌత్యం, మేనేజ్మెంట్, సైకాలజీ, క్రీడలు, జాగ్రఫీ ఎకానమీ,ఫోక్ లోర్, ట్రైబల్ లోర్, పాలిటీ, ఫిలాసఫీ, ఫోటోగ్రఫీ, సినిమా, లలిత కళలు, అంతర్జాతీయ సంబంధాలు, జనాభా గణన, సర్వేలుఃరిపోర్టులు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, అనుభవాలు- జ్ఞాపకాలు, యాత్రా రచనలు, వివిధ సంఘటనలపై అధ్యయనాలు, పోటీ పరీక్షలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, యోగా, బాల సాహిత్యం ఇట్లా అనేక రకాల పుస్తకాలతో వందలాది స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. నేషనల్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, నవోదయ, విశాలంధ్ర, సహచర, నవతెలంగాణ, నవచేతన, ప్రజాశక్తి, ఎమెస్కో, ఓరియెంట్ లాంగ్మన్, ఓరియెంట్ బ్లాక్ స్వాన్, పీకాక్, పర్స్పెక్టివ్, ఆకార్ బుక్స్, వింటేజ్ బుక్స్, పెంగ్విన్, రూపా, హార్పర్ కొలిన్స్, బ్లూమ్స్ బరీ, తూలికా బుక్స్, నవయాన, కోణార్క్ పబ్లిషర్స్, సేజ్, రౌట్లెడ్జ్, హచ్చెట్టే, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇత్యాది ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు ప్రచురించిన సామాజిక గ్రంథాలు తెలుగు పాఠకులకు చిరపరిచయం.
చాలా మంది అపోహ పడుతున్నట్టు పుస్తకాలు గతానికి మాత్రమే ఆనవాళ్లు కాదు. ప్లుట్జర్ ప్రైజ్ విజేత ప్రసిద్ధ అమెరికన్ నవలాకారుడు జాఫ్రీ కె. యూజిడినస్ చెబుతునట్టు" The book has many characteristics:some are extre mely old-fashioned story telling traits, but there are also a fair number of postmodern traits, and the self-consciousness is one " అనేది ముమ్మాటికీ వాస్తవం. అన్-లిమిటెడ్ జనరేషన్ అయిన ఇప్పటి నవ తరం యువతరం ఎదుర్కొనే వర్తమాన సంఘర్షణలకూ నివృత్తి పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంటుంది. మన అలంకారికులు సూచించినట్టు
''దృష్టపూర్వా అపిహ్యర్థాః, కావ్యేరసపరిగ్రహాత్, సర్వే నా ఇవాభాంతి, మధుమాస ఇవ్ ద్రుమా'' మనం చూచినవీ మనకు తెలిసినవీ అయినప్పటికిని కావ్యాల్లో రసయుక్తంగా వర్ణింపబడుతూ వసంత ఋతువులో చిగురించి పుష్పించే వృక్షకోటి వలె వస్తువిషయాదులు నిత్యనూతనంగా శోభిస్తుంటాయి.
ప్రపంచంలోని విజ్ఞాన శాఖలన్నిటి గ్రంథాలకు ప్రాతినిధ్యం ఉండేట్టు నిర్వాహకులుజాగ్రత్తలు తీసుకుంటారు. అతిశయోక్తి అనుకోకండి, నిజానికి బుక్ ఫెయిర్ పుస్తకాలకో సామాజిక హోదా నిస్తుంది. కవులను రచయితలను ఆదరించి ప్రమోట్ చేస్తుంది. రాయితీలతో పాఠకుల డబ్బును ఆదాచేస్తుంది. ప్రతి పుస్తకాన్ని ఇన్వెస్ట్మెంట్గా సంకల్పించి ప్రచురణ రంగానికి మార్కెట్‌ను సృష్టిస్తుంది. 'నేను స్టాల్లో ఉన్నా, నేను చదువదగిన దాన్ని' అంటూ పుస్తకం ఇక్కడ సందర్శకులతో సంభాషిస్తుంది. పాఠకుడి చేతికి అమరి అక్కడ నుంచి 'హోం లైబ్రరీ'కి చేరడమే పుస్తకానికి బ్రాండ్ ఇమేజ్. ఖండ ఖండాతరాల్లో ఎక్కడెక్కడో నివాసం ఉంటూ రచనలు వెలువరించే వందలాది మంది సుప్రసిద్ధ కవులను, రచయితలను, పరిశోధకులను ఎందరినో పాఠకులు నేరుగా బుక్ ఫెయిర్‌లో కలుసుకోవచ్చును. ఈ మొత్తం ఎపిసోడ్లో పుస్తకం రాసిన రచయిత, ముద్రించిన పబ్లిషర్, ప్రమోట్ చేసిన ఏజెంట్, అమ్మిన రిటేలర్, బుక్ ఫెయిర్ సిబ్బంది ఇట్లా ప్రతి ఒక్కరూ లాభపడతారు. ఇంత బహుముఖీన(మల్టిప్లెక్స్) వృత్తి ప్రయోజనాలు ఒక్క బుక్ ఫెయిర్ ద్వారానే సాధ్యం. ఇది పుస్తకాల పెద్ద పండుగ .ఇక్కడ జరిగేది వ్యాపారం అనుకోరాదు, కొన్న ప్రతి పుస్తకం ద్వారా టన్నులకొద్ది విజ్ఞానం వివేకం ప్యాకింగ్ రూపంలో వినియోగ దారుడిని వరిస్తాయి. బుక్ ఫెయిర్‌ను అమ్మకాల పరిశ్రమగానే భావించ రాదు. అమ్మ వంటి పుస్తకం నమ్మిన ప్రతి ఒక్కరికి బువ్వపెడుతుంది. అందుకే మిత్రులారా! హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు జే కొడదాం, వారంలో ఏదో ఒక రోజు వెళ్లొద్దాం, సన్నిహితులకూ సందర్శించమని కబురు చేద్దాం.
పుస్తకం వారసత్వం కావాలి
కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ నెల 18 నుంచి 28 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్‌ఫెయిర్ నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలో పుస్తకాలు చదివేవాళ్ల సంఖ్య పెరిగింది. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ వేదికగా సాహిత్య పుస్తకాల అమ్మకాలు కూడా బాగా ఊపందుకున్నాయి. కరోనా తర్వాత దేశంలోనే తొలి పుస్తక ప్రదర్శన ఇదే.! ఈ ఏడాది బుక్‌ఫెయిర్ ప్రాంగణానికి ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ పేరును, చిందు భాగవత యక్షగాన సంప్రదాయాన్ని అంతర్జాతీయస్థాయి వరకూ తీసుకెళ్లిన చిందు ఎల్లమ్మ పేరును ప్రధాన వేదికకు పెట్టాము. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరో పన్నెండు రాష్ట్రాల నుంచి ప్రచురణకర్తలు బుక్‌ఫెయిర్ లో పాల్గొంటారు. దీనితో పాటు కవులు, రచయితలను ప్రోత్సహించేందుకు బుక్‌ఫెయిర్ సొసైటీ ప్రత్యేకంగా 'రైటర్స్ స్టాల్' నిర్వహిస్తుంది. పుస్తకం వారసత్వం కావాలి. అందుకు ఇదే సరైన సమయం. కరోనా నిబంధనల దష్ఠ్యా సాహిత్య సదస్సులు, సమావేశాలు, కవి సమ్మేళనాలను రద్దు చేశాం. తెలంగాణ భాషా, సాంస్కతిక శాఖ సహకారంతో రోజూ సాయంత్రం ఆరు గంటల తర్వాత సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పుస్తకావిష్కరణ సభలు యథావిధిగా కొనసాగుతాయి. విద్యార్థులు, యువతలో పఠనాసక్తిని పెంపొందించేందుకు త్వరలోనే ప్రతి యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శన నిర్వహించే ఆలోచనలో బుక్ ఫెయిర్ సోసైటీ ఉంది. స్వతహాగా సాహిత్యాభిలాషి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటంతో నగరం నడిబొడ్డున ప్రభుత్వ సహకారంతో ఈ జాతీయ పుస్తక మహౌత్సవం నిర్వహి స్తున్నాము. యువతలో బుక్ కల్చర్‌ను పెంపొందించేందుకు నా వంతు ప్రయత్నిస్తాను. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది.
- జూలూరు గౌరీశంకర్,
అధ్యక్షులు, హైదరబాద్ బుక్ ఫెయిర్.
విజ్ఞాన వినోదాల కళా సంగమం
హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ భారత దేశంలోనే మొదటి స్థానం, దేశంలో మూడవ స్థానంలో ఉన్నది. హైదరాబాద్ నగరం ఒక మినీ భారతం. గంగా జమున తెహజీబ్ హైదరాబాద్. వీరందరికి కావల్సిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కృషి చేస్తుంది. రాష్ట్ర అవతరణ అనంతరం హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌కు విశిష్టత పెరిగింది. ప్రతి ఏటా పది లక్షలకు పైగా పుస్తక ప్రియులు ఇందులో పాల్గొంటున్నారు. పుస్తకాలకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహారణ. పుస్తక రూపం మారిందే కాని పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. అయితే పుస్తకం పట్టుకొని చదివితే వచ్చే అనుభూతి వేరే ఉంటుంది. ఇంటర్నెట్, ఫోన్, ట్యాబ్‌లలో పుస్తకాలను చదువుతున్నారు.
ఈ సారి బుక్ఫెయిర్లో రచయితలను, కవులను ప్రోత్సహించేందుకు వారి రచనలను బుక్‌ఫెయిర్ తీసుకొని ఒక స్టాల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారి రచనలను పాఠకులకు చేరువ చేస్తుంది. లుక్ కల్చర్ నుంచి యవతను బుక్ కల్చర్‌లోకి తీసుకురావడానికి ఇలాంటి పుస్తక ప్రదర్శనలు తోడ్పడతాయి.
- కోయ చంద్రమోహన్
కార్యదర్శి, హైదరాబాద్ బుక్ ఫెయిర్
- డా|| బెల్లి యాదయ్య, 9848392690
Sun 19 Dec 03:35:33.069858 2021