అనేక పాత్రలు పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనేక అవార్డులనూ అందుకున్నారు. ఆమె తెరజీవితం కళ్లు జిగేల్ మానేలా సాగింది. కానీ, అలాంటి అభినేత్రి కళ్లు.. నిజజీవితంలో కన్నీళ్లు కార్చాయి... తెరపై నవ్విన పెదవులు, తెర వెనుక దు:ఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది. ఆమె నట జీవితంలోని హొయలు.. నిజ జీవితంలోంచి వెళ్లిపోయాయి. ఆమె జీవితం బాధాతప్తమైంది. మలుపులు.. మెరుపులు.., గెలుపులు.. ఓటములు.., సరాగాలు.. విరగాలు.. విషాద నిషాదాలు వెరసి ఆమె జీవితమే విషాదాంతమైన ఒక సినిమాగా మారింది. చరిత్రలో చెరగని సంతకంగా, చెదరని ్గపకంగా మిగిలింది.
నలబై ఏండ్ల క్రితం చనిపోయినా ఇంకా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సజీవంగానే ఉన్న మరపురాని అభినేత్రి.... మహానటి సావిత్రి. ఇప్పటికి ఎన్నో కొన్నిమార్లు యిలా సావిత్రి గురించి తెలుసుకునే ఉంటారు. ఆమె జీవితం గురించి వచ్చిన సినిమా, వ్యాసాలు, కథనాలు, పుస్తకాలు చదివిన, చూసినా ఎప్పటికప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నట్లే వుంటుంది. అదీ సావిత్రి ఆకర్షణ. ఆమె వర్ధంతి సందర్భంగా ''నవతెలంగాణ'' దిన పత్రిక ఆదివారం ప్రత్యేక సంచిక ''సోపతి'' పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం...
తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి ఓ ధృవతార. అందం, అభినయం.. కలగలసి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన మహానటి. నటనకే భాష్యం చెప్పిన ప్రతిభావంతురాలు సావిత్రి. కళ్ళతోనే అద్బుతంగా అభినయిస్తూ...., ముఖంలో అన్నీ భావాలూ పలికించే మహానటి, నవరసాలను అలవోకగా పండించడంలో దిట్ట. నటించడం కాదు..., ఏపాత్రలోనైనా జీవించండం ఆమెకు దేవుడిచ్చిన వరం. అందుకే తెలుగు, తమిళ సినిమాల్లో సావిత్రి ఎవరగ్రీన్గా నిలచి సూపర్ స్టార్ అయ్యారు. సావిత్రి కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు, తమిళ తెరపై చెరగని ముద్రవేసిన అసమాన ప్రతిభాశాలి. నాలుగు దశాబ్దాల క్రితం మరణిం చినా.., మరపురాని అభినేత్రి... మరిచి పోలేని మంచి మనిషి... వెండితెర ఇలవేల్పు.., మన తెలుగింటి ప్రియపుత్రి...
సావిత్రి. తరాలు మారినా...., తెలుగు చిత్ర రంగంలో సాటిలేని మేటి నటిగా కీర్తింపబడుతున్న ఏకైక వ్యక్తి సావిత్రి. తన నటనతో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయే సావిత్రి ఎన్నో మరుపురాని చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ అనేక పాత్రలు పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనేక అవార్డులనూ అందుకున్నారు. ఆమె తెరజీవితం కళ్లు జిగేల్ మానేలా సాగింది. కానీ, అలాంటి అభినేత్రి కళ్లు.. నిజజీవితంలో కన్నీళ్లు కార్చాయి... తెరపై నవ్విన పెదవులు, తెర వెనుక దు:ఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది. ఆమె నట జీవితంలోని హొయలు.. నిజ జీవితంలోంచి వెళ్లిపోయాయి. ఆమె జీవితం బాధాతప్తమైంది. మలుపులు.. మెరుపులు.., గెలుపులు.. ఓటములు.., సరాగాలు.. విరగాలు.. విషాద నిషాదాలు వెరసి ఆమె జీవితమే విషాదాంతమైన ఒక సినిమాగా మారింది. చరిత్రలో చెరగని సంతకంగా, చెదరని ్గపకంగా మిగిలింది.
సావిత్రి 1937 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు నిశ్శంకర సుభద్రమ్మ, గురవయ్య. వారు సావిత్రికి పెట్టిన అసలు పేరు సరస వాణిదేవి. సావిత్రి పుట్టిన ఆరు నెలలకే తండ్రి గురవయ్య మరణించాడు. అప్పుడు సావిత్రికి వరసకు పెదనాన్న అయిన కొమ్మారెడ్డి వెంకటరామయ్య తల్లి సుభద్రమ్మ, సావిత్రిని చెరదీశారు. ఆయన సహకారంతో సావిత్రి విజయవాడ కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివింది. ఆమె పాఠశాలకు వెళుతూనే నృత్యం నేర్చుకోవడం ఆరంభించింది. ఆ రోజుల్లో శిష్ట్లా పూర్ణయ్యశాస్త్రి హరికథలు చెప్పటంలోనూ, కూచిపూడి సంప్రదాయ నృత్యం చేయటంలోనూ నిష్ణాతుడు. ఆయన పిల్లలకి నృత్యం నేర్పి ప్రదర్శనలు ఇస్తుండేవాడు. మొదట్లో ఆయన సావిత్రిని డ్యాన్సుకు పనికిరాదని తేల్చారు. అప్పుడు సావిత్రి పులిపాక నరసింహారావు వద్ద శిష్యరికం చేసింది. కొన్నాళ్ళకు పూర్ణయ్య శాస్త్రి ఆ స్కూలుకు వచ్చినప్పుడు సావిత్రి చేస్తున్న నాట్యభంగిమలు, నాట్యపటిమకు ముగ్దుడైపోయి తన శిష్యురాలిగా చేర్చుకొని నాట్యంలోని మెళకువలు నేర్పారు. 'రాధాకృష్ణ' నృత్యనాటికను ఆయనే స్వయంగా రాసి ప్రదర్శనలు ఇచ్చినప్పుడు అందులో సావిత్రి చేత కృష్ణుడి పాత్ర పోషింపజేశారు. అలా విజయవాడ, రాజమండ్రి, కొత్తగూడెం, పాలకొల్లు వంటి పట్టణాల్లో ప్రదర్శనలుజరిగాయి. ప్రదర్శనలు జరిగిన ప్రతిచోటా సావిత్రికి ప్రశంసలు లభించేవి. నృత్యంతోబాటు సావిత్రి సంగీతం మీద కూడా దృష్టిపెట్టి వీణ నేర్చుకుంది. పదేండ్ల వయసులో అరుణోదయ నాట్యమండలిలో చేరి దాదాపు ఒక ఏడాదిపాటు నృత్యప్రదర్శనలలో పాల్గొంది. ఈ నాట్యమండలిలోనే ప్రముఖ నటులు ఎన్.టి.రామారావు, జగ్గయ్య, కె.వి.ఎస్.శర్మ కూడా నటిస్తుండేవారు. తర్వాత కొంతకాలానికి సావిత్రి పెదనాన్న 'నవభారత నాట్యమండలి' సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా సావిత్రి అనేక చోట్ల ప్రదర్శనలు విజయవంతంగా ప్రదర్శించింది. 1950లో కాకినాడ పట్టణంలో నాట్యకళాపరిషత్తు ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రఖ్యాత హిందీ నటులు, పృథ్వీ థియేటర్స్ నాటక సమాజ అధిపతి పృథ్వీరాజ్ కపూర్ వచ్చారు. ఆయన సావిత్రి నటనకు, నాట్యానికి ముగ్దుడైపోయి రెండు బహుమతులను అందజేశారు. ఆమె అందెల కదలికలు, ముఖారవిందం పృథ్వీరాజ్ కపూర్‌నే కాదు ఆ వేడుకలలో పాల్గొన్న సభికులను కూడా అబ్బురపరిచాయి.
'సంసారం' చిత్రంతో సావిత్రి సినీరంగ ప్రవేశం
1950లో సావిత్రికి నటనపై ఉన్న ఆసక్తితో, పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య సావిత్రిని యాక్టర్ చేయాలనే పట్టుదలతో.. ఈ ఉత్సవాలు ముగిసిన నెల రోజులలోపే విజయవాడలో గోకులకృష్ణా డిస్టిబ్య్రూషన్ సంస్థకు చెందిన సి.వి.కృష్ణమూర్తిని కలిశారు. ఆయన తాను నిర్మించబోయే 'సంసారం' చిత్రంలో సావిత్రికి ఏయన్నార్ సరసన నాయికగా నటించే చాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో అక్కినేని, ఎన్టీఆర్‌లు హీరోలు. కానీ, 14ఏండ్ల వయసు ఉండడంతో పాటు, కెమెరా ముందు తగని బిడియం ప్రదర్శించడంతో ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. సినిమా డైరెక్టర్ ఎల్. వి. ప్రసాద్, సావిత్రి హీరోయిన్గా పనికి రాదన్నారు. అయితే ఈ చిత్రంలోనే ఓ పాటలో హీరోయిన్ స్నేహితులలో ఒకరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించే అవకాశం ఇచ్చారు. 1951లో యన్టీఆర్ ను జానపద కథానాయకునిగా నిలిపిన 'పాతాళభైరవి'లో 'నే రానంటే రానే రాను...' అంటూ సాగే ఓ బిట్ సాంగ్‌లో సావిత్రి నర్తించారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించి, విజయా సంస్థకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తరువాత 1952లో యన్టీఆర్‌తో విజయా సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం 'పెళ్ళిచేసిచూడు'లో జోగారావుకు జోడీగా నటించారు సావిత్రి. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో సావిత్రి కనబరచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. 1952లో సావిత్రి కెరీర్లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం 'పల్లెటూరు'. ఇందులో యన్టీఆర్ ఆమెకు జోడీగా నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ''ప్రియురాలు, శాంతి'' వంటి సినిమాల్లో నటించిన సావిత్రికి 1953లో వచ్చిన 'దేవదాసు' చిత్రంలోని పార్వతి పాత్ర మంచి పేరు సంపాదించి పెట్టి, సావిత్రి నట జీవితాన్ని రాత్రికి రాత్రి మార్చివేసింది. ఈ సినిమాలో నాగేశ్వర్రావుకు ధీటుగా నటించి మెప్పించారామె. దేవ దాసుగా అక్కినేని ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో.. పార్వతిగా సావిత్రి అంతే పేరు సంపాదించుకున్నారు. ఆమె నట జీవితానికి పునాది వేసిన చిత్రంగా దేవదాసు చరిత్రలో నిలిచిపోయింది. కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయంచేస్తూ విజయా సంస్థ నిర్మించిన 'చంద్రహారం'లో యన్టీఆర్ కథానాయకుడు. అందులో హీరోపై మనసు పడి, అతనిని తన సొంతం చేసుకోవాలని, నాయికకు పలుకష్టాలు కల్పించే 'చంచల'గా సావిత్రి నటించారు. ఆమె కెరీర్లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రమది. 1954లో యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన 'పరివర్తన'లో ఆమె యన్టీఆర్ సరసన నటించారు. 1955లో విడుదలైన 'మిస్సమ్మ' సావిత్రి నట జీవితంలో మరో మలుపు. ఇందులో యన్టీఆర్‌కు నాయికగా నటించి, స్టార్డమ్ నూ సొంతం చేసుకున్నారు. భానుమతి చేయాల్సిన ఈ పాత్రను.. సావిత్రి పోషించి భేష్ అనిపించారు. ఈ సినిమాలో మిస్ మేరీగా సావిత్రి నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్సమ్మ విజయంతో సావిత్రి ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
దేవదాసు, మిస్సమ్మ విజయాలతో సావిత్రి హీరోయిన్గా రెండో స్థానంలో నిలిచారు. తన ముందు తరం హీరోయిన్లు భానుమతి, అంజలీదేవి తర్వాతి స్థానం ఆమెదే. 1957లో విడుదలైన తోడికోడళ్లు, మాయాబజార్ చిత్రాలు సైతం గొప్ప విజయాలు సాధించాయి. ఈ సినిమాల సక్సెస్‌తో సావిత్రి నెంబర్ వన్ హీరోయిన్గా నిలిచారు. 'మాయాబజార్'లో మాయా శశిరేఖగా ఎస్వీఆర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు. ఆ పాత్రలో ఆమె నటన నభూతో.. అన్నట్టు సాగింది. ఉత్తరకుమారుడు రేలంగిని, సావిత్రి ఆట పట్టించే సన్నివేశాలు అందరినీ కట్టిపడేశాయి. నేటికీ ఈ చిత్రం.. సజీవంగా నిలవడంలో ఆమె కృషి మరువలేనిది. కళ్లలో నటనలు పలికించడం.. పెదవి విరుపులతో హావభావాలు ప్రదర్శించడం.. సావిత్రి ప్రత్యేకత. చిలిపిదనం ఒలికించే కళ్లే విషాదాన్ని వర్షించేవి. ఆయా సన్నివేశాల్లో ఏడవాల్సి వస్తే నిజంగానే ఏడ్చేసేవారామె. అలా చేయడం మరో నటికి సాధ్యం కాదనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మహానటిగా నేటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. సావిత్రి ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది.. ఆమె కనిపించరు. ఇది సావిత్రి నటనకు మచ్చుతునక. మాటల్లో మెరుపులు ఆమె సొంతం. సావిత్రి ఉంటే సక్సెస్ గ్యారంటీ. ఉత్తమ నటి అవార్డు ఏ సంస్థ ఇచ్చినా.. అది సావిత్రికే వచ్చేది. అర్థాంగిలో మతిస్థిమితంలేని భర్తను మామూలు మనిషిగా చేసుకున్న భార్య పాత్రలో నటించినా, 'అప్పుచేసి పప్పుకూడు' చిత్రంలో కామెడీ పాత్ర వేసినా ఆమెకే చెల్లింది. అందుకే తల్లిగా, చెల్లిగా, వదినగా ఏపాత్ర వేసినా.. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చిన ఘనత ఆమెది. సావిత్రి తన కెరీర్లో చేసిన కొన్ని పాత్రలకూ... ఆమె రియల్ లైఫ్ కు దగ్గర పోలికలున్నాయి. ఆమె హుషారుగా నటిస్తే ఆహ్లాదం ఆవరిస్తుంది. ఆమె విషాదా భినయం ప్రేక్షక మనసులను బరువెక్కిస్తుంది.
నటిగా సావిత్రికి, అన్నపూర్ణ సంస్థకు ప్రత్యేక అనుబంధం. ఆ బ్యానర్లో నిర్మించిన ఒకటి రెండు చిత్రాల్లో తప్ప... మిగిలిన సినిమాలన్నిటిలో సావిత్రే పర్మినెంట్ హీరోయిన్. ఈ సంస్థలో నిర్మించిన ''దొంగరాముడు, వెలుగునీడలు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు'' చిత్రాలు నటిగా సావిత్రికి మంచి పేరు తెచ్చాయి. తెలుగు సినిమాల్లో సావిత్రి, నాగేశ్వర్రావుల జంట.. కనువిందు చేసింది. సంతానం చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబినేషన్.. అనేక చిత్రాల్లో కొనసాగింది. ''అభిమానం, నమ్మినబంటు, శాంతినివాసం, సిరిసంపదలు, ఆరాధన, మంచి మనసులు, మాయాబజార్, నవరాత్రి, సుమంగళి'' చిత్రాలల్లో నటించి.. సావిత్రి, ఎఎన్‌ఆర్‌లు హిట్ పెయిర్‌గా పేరు సాధించారు. సహజంగా కథానాయికలు కొంచెం లావయితే తెరమరుగవుతారు. కానీ, సావిత్రి 'చదువుకున్న అమ్మాయిలు' సినిమా నాటికే తక్కిన హీరోయిన్ల కంటే ఎంతో లావు. అయినా ఆ సినిమాతో పాటు ఎన్నో సిని మాల్లో సావిత్రి టీనేజ్ అమ్మా యిగా నటించి మెప్పించారు. వెండితెర ప్రస్థానంలో సావిత్రి హీరోయిన్‌గానే కాక క్యారెక్టర్ నటిగానూ యాక్ట్ చేసారు. గోరింటాకులో తల్లిగా అద్భుతంగా నటించారామె. ఎన్టీఆర్, సావిత్రిల జోడి కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ''కన్యాశుల్కం, భలేరాముడు, వినాయక చవితి, ఇంటిగుట్టు, శ్రీవేంకటేశ్వర మహత్యం, నర్తనశాల, గుండమ్మకథ, దేవత'' వంటి అనేక చిత్రాలతో హిట్ పెయిర్‌గా నిలిచారు.
సావిత్రి హిందీ సినిమాల్లోనూ నటించారు. ''బహుత్ దిన్ హుయే, ఘర్ బసాకే దేఖో, గంగా కీ లహరే, బలరాం శ్రీకృష్ణ'' చిత్రాల్లో నటించి, ఉత్తరాది ప్రేక్షకులను సైతం మైమరిపించారు. తెలుగు తర్వాత దక్షిణాది భాషల్లో తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు.
సావిత్రి విశిష్ట నటి మాత్రమే కాదు, సినిమా నిర్మాత, దర్శకురాలు కూడా. తెలుగు మహిళా దర్శకుల్లో భానుమతి తర్వాత సావిత్రిది రెండో స్థానం. ఆమె తెలుగులో 'చిన్నారి పాపలు', 'చిరంజీవి', 'మాతృ దేవత', 'వింత సంసారం' వంటి చిత్రాలకు దర్శకత్వం చేసి, విజయాలను అందుకున్నారు. తమిళంలో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమె సొంతంగా నిర్మాణం, దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'ప్రాప్తం' (తెలుగులో మూగ మనసులు) చిత్రంతో ఆమె దురదృష్టం మొదలైంది. ఈ చిత్రం పూర్తి కావడానికి దాదాపు ఐదేండ్లు పట్టింది. అది సావిత్రిని కోలుకోలేని అప్పుల్లోకి నెట్టింది. దీంతో, సినిమాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రి.. జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు
సావిత్రిని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 'కళై మామణి', 'నడిగయర్ తిలకం' బిరుదులతో, ఆంధ్ర యువతీ మండలిచే 'నటి శిరోమణి' బిరుదుతో పాటు 'మహానటి' అనే బిరుదుతో సత్కరించింది. మహానటి సావిత్రికి అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 'చివరకు మిగిలేది' చిత్రానికి రాష్ట్రపతి అవార్డు లభించింది.
జెమినీ గణేశన్‌తో అనుబంధం
సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో సావిత్రి జెమినీ స్టూడియోస్‌ని సందర్శించడానికి వెళ్ళినపుడు, ఆమె మొదటిసారి జెమినీ గణేశన్‌ను అక్కడ కలుసుకుంది. జెమినీ గణేశన్ తమిళ పరిశ్రమలో ప్రముఖ హీరోగా వెలుగొందుతూ, తమిళ ప్రేక్షకులచే 'కాదల్ మన్నన్' (ప్రేమ రాజు) అని పిలిపించుకునేవారు. ఒక సందర్భంలో జెమినీ గణేశన్, సావిత్రి గురించి మాట్లాడుతూ, ''ఆమె భవిష్యత్తులో అత్యుత్తమ నటిగా ఎదుగుతుంది'' అని చెప్పారట. అయితే ఆ తర్వాత అక్కినేనితో కలసి 'దేవదాస్' సినిమాలో ఆమెకు ఆఫర్ రావడంతో అతని జోస్యం నిజమైంది. 1956లో 'మనం పోల మాంగళ్యం' అనే తమిళ చిత్రంలో సావిత్రి, గణేశన్ కలిసి నటిస్తున్నప్పుడు వీరిద్దరి మద్య ఏర్పడిన అనుబంధం రహస్య వివాహానికి దారితీసింది. ఆ తర్వాత సావిత్రి లక్స్ సబ్బు ప్రకటన కోసం ఆమె ఫోటో వెనుక భాగంలో 'సావిత్రి గణేష్' అని సంతకం చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. కొద్ది రోజులకు వీరికి ఇద్దరు పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్ జన్మించారు. పని ఒత్తిడి కారణంగా తన పిల్లలతో గడపడానికి సావిత్రికి సమయం దొరికేది కాదు. అయినప్పటికీ, ఆమె తన షెడ్యూల్ నుంచి పది నిమిషాలు వీలు చేసుకుని తన పిల్లలతో గడిపేది. సావిత్రి తన పిల్లలకు తాను నటించిన చిత్రాలను చూపించడానికి 16 ఎం. ఎం. ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేసింది. సావిత్రి 100వ చిత్రం 'కొంజుమ్ సళంగై' (తెలుగులో 'మురిపించే మువ్వలు') జెమినీ గణేశన్‌తో జతకట్టడం జరిగింది. సావిత్రి. జెమినీ గణేషన్‌తో చాలా సినిమాలు చేసారు.
ప్రధాని సహాయ నిధికి నగలన్నీ విరాళం
1965లో భారత్, పాక్ మధ్య రెండోసారి యుద్ధం మొదలైంది. వరస యుద్ధాలతో భారత్ ఆర్థికంగా చతికిలబడిపోయింది. అదే సమయంలో నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అభ్యర్థించారు.1965 సెప్టంబర్లో ఒక రోజు ప్రధాని చాంబర్లోకి గుమస్తా వచ్చి 'మీ కోసం ఒక దక్షిణాది నటి వచ్చి వేచి ఉన్నారు' అని చెప్పాడు. శాస్త్రి గారు ఎవరా అని ఆలోచిస్తూనే 'సరే లోపలికి పంపండి' అని ఆదేశించారు. ఓ 5 నిమిషాలు గడిచిన తర్వాత 28 ఏండ్ల వయసున్న ఓ యువతి ఒంటి నిండా నగలతో దగదగలాడుతూ లోపలికి వచ్చి.. ప్రధానికి నమస్కారం చేశారు. శాస్త్రిగారికి తానెవరో పరిచయం చేసుకున్నారు. తర్వాత ఆ నటి తాను వచ్చిన పని చెబుతూ.. తాను ధరించిన ఆభరణాలన్నింటినీ ఒక్కోటి తీసి శాస్త్రి గారి టేబుల్ మీద పెట్టారు. ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని నవ్వుతూ బదులిచ్చారు. ఒంటిపై నగలన్నీ విరాళంగా ఇచ్చిన ఆమె వంక చూస్తూ.. ప్రధాని ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయారు. కాసేపటి తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్లతో.. 'భేటీ నువ్వు మహనీయురాలివమ్మా.. నీ దేశభక్తికి అభినందనలు' అంటూ శాస్త్రి గారు ఆమెను ప్రశంసించారు. ఆమెతో కరచాలనం చేసి, గౌరవంగా గుమ్మం వరకు వెళ్లి సాగనంపారు. ఆమె ఎవరో కాదు.. మన మహానటి, వెండి తెర సామ్రాజ్ఞి, నడిగర్ తిలగమ్ మహానటి సావిత్రి. ఆమె చేసిన దానాల్లో ఇదొకటి. ఆమె దేశభక్తికి, దాతృత్వానికి ఇదొక ఉదాహరణ మాత్రమే! అయితే కొంతమంది ఆమె అమాయకత్వం, దాతృత్వాన్ని ఉపయోగించుకున్నారు.
సావిత్రి అభిరుచులు
సావిత్రికి సినిమాలు, తన పిల్లలు కాకుండా, మల్లెలు, వర్షమంటే మక్కువ.. ఆమె తన ఇంటి ఆవరణలో ఉన్న మల్లెతోటలో నుంచి పువ్వులు తెంచుకుని, తన జుట్టుకు ధరించి ఆనందించేది. ఆమె వానలో తడుస్తూ చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ గెంతులు వేసేది. ఎడమ చేతివాటం. రాయడం, సంతకాలు చేయడం అన్నీ ఎడమ చేతితోనే చేసేవారు. ఆమె క్రికెట్, చెస్ ఆటలంటే ఆసక్తి కనబరిచేది. మద్రాసులో జరిగే క్రికెట్ మ్యాచ్‌లని తప్పకుండా చూసేది. ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ గ్యారీ సోబర్స్ ఆమెకు అత్యంత ఇష్టమైన క్రీడాకారుడు. ఆ రోజుల్లో కూడా ఆమె శివాజీ గణేశన్‌తో కలిసి స్టార్ క్రికెట్లో పాల్గొంది. సావిత్రి ఇంట్లో దంతంతో చేసిన ఆకర్షణీయమైన చెస్ టేబుల్ ఉండేది. మాటల్లో చమత్కారం.. ఇతరులను అనుకరించడంలోనూ పరిపూర్ణమైన నైపుణ్యం, దీంతో ఆమె భర్త జెమినీ గణేశన్, రేలంగి, సరోజాదేవి, శివాజీ గణేశన్, ఎస్.వి. రంగారావు, కబీర్ బేడి లాంటి వాళ్ళను అనుకరిస్తూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది. దానధర్మాలు చేయటంలో ఆమెకు సాటిలేరు.. సాయం చేయటలో ఎముకలేని చెయ్యి అనటానికి నిదర్శనం.
నమ్మినవాళ్ల చేతిలో మోసపోయిన సావిత్రి
సినీ వినీలాకాశంలో వెలిసిన ఓ ధ్రువతార మహానటి సావిత్రి. నిండైన నటనకు ఆమె మారుపేరు. ఆమె నవ్వు మల్లెల జల్లు. ఆమె నడకే ఒక నాట్యం. ఆమె హావభావాల వెనుక సప్తస్వరాలు గోచరిస్తాయి. నటిగా సావిత్రి సాధించలేనిది ఏదీ మిగలలేదు. ఒక వ్యక్తిగా ఆమె సాధించి మిగుల్చుకున్నది కూడా లేదు. ఆమె అందుకోలేని ఆస్తులే లేవు. కానీ వాటిని పదిలపరచుకోలేని అశక్తురాలు. తరగని దరహాసం ఆమెకు దేవుడిచ్చిన వరం. ప్రేక్షక జనం ఆమెను మహానటిగా గుర్తించి మంగళహారతులు పట్టారు. సావిత్రికి జాగ్రత్త తక్కువ. చుట్టుపక్కన ఉన్నవాళ్ళు, నమ్మినవాళ్లే సావిత్రిని మోసం చేశారు. ఆమెకు దగ్గరి బంధువులమని, స్నేహితులమని చెప్పుకొనే వాళ్లు మాత్రం ఆమె ఆస్తుల మీద కన్నేశారు. కబళించుకున్నారు. ఒకసారి సావిత్రి ఇంట్లో పనిచేసే వాడు టవల్లో చుట్టుకుని తెచ్చిన నగలను జ్యూవెలర్ షాప్‌లో అమ్ముతుండగా షావుకారు జానకి గుర్తించి ఆ నగలను వెనక్కి ఇప్పించారట, వీటితో పాటు ఐ.టి. శాఖ వేదింపులు సావిత్రిని క్రుంగ తీసాయి. నిజజీవితంలో నటన అంటే తెలియని అమాయకురాలు సావిత్రి కాబట్టి ఇలాంటి సంఘటనలతో పాటు గణేశన్ వ్యవహరశైలి ఆమెను నైరాశ్యంలోకి నెట్టేసాయి.
జెమినీ గణేషన్‌తో వివాహం విఫలం
దాదాపు రెండు దశాబ్దాలు సినీ పరిశ్రమలో సత్తా చాటి ప్రేక్షకుల హృద యాలలో స్థానం ఏర్పర చుకున్న సావిత్రి కెరీర్ 1970 లలో పతన మైంది. అప్రహితంగా సాగి పోతున్న ఆమె జీవితంలో ఓ నిర్ణయం తన జీవితగమనాన్నే మార్చేసింది. తమిళ సినీపరిశ్రమలో అప్పటికే రెండు పెళ్ళిళైన జెమినీ గణేషన్‌ను వివాహమాడింది. కొంతమంది వద్దని వారించినా వినలేదు. పెళ్లి తర్వాత సావిత్రి ఆర్థిక విషయాలు జెమినీ చేతిలోకి వెళ్ళాయి. తెలుగులో అఖండ విజయం సాధించిన మూగమనసులు సినిమాను జెమినీ గణేషన్‌ను పెట్టి తమిళంలో పునర్మించగా అది ఆశించనంతంగా విజయవంతం కాలేదు. అంతే అప్పుల ఊబిలో చిక్కుకుంది. తన భర్త జెమిని గణేషన్‌ని సావిత్రి ఆరాధించడమే కాకుండా చాలా విశ్వసించింది. అయితే జెమినీ గణేషన్‌తో ఏర్పడిన విబేదాల కారణంగా వివాహం విఫలమైన తర్వాత, సావిత్రి చాలా బాధపడింది. తన ఇద్దరు పిల్లలతో విశాలమైన ఇంట్లో ఒంటరిగా జీవించడం ఆమెకు చాలా బాధ కలిగించింది. జెమినీ గణేషన్ దూరం అయ్యాక, కొద్దిరోజులకే ఇద్దరు పిల్లలు కూడా దూరం అయ్యారు. అది తట్టుకోలేక సావిత్రి మద్యానికి బానిసైంది. మనోవ్యధతో నిద్రకు దూరమవ్వడంతో ఆమెని నిద్రమాత్రలు, డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన అలవాట్లకు లోనయ్యేలా చేసింది. బి.పి., మధుమేహంతో మెల్లగా ఆకలి మాయమైంది, మత్తు ఆమె మనోభావాలను, సున్నితత్వాన్ని అధిగమించింది. సావిత్రి చాలాసార్లు ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రుల్లో ఉన్న సమయంలో చాలా బాధలు పడింది. షూటింగ్ కోసం మైసూర్‌కు వెళుతున్న సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ 19 నెలల పాటు కోమాలో ఉన్న సావిత్రి డిసెంబర్ 26, 1981న 46 ఏండ్ల చిన్న వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
సావిత్రి జీవిత కథ ఆధారంగా పుస్తకాలు, సినిమా
సావిత్రి జీవిత కథను ఆధారం చేసుకుని తెలుగులో ఇప్పటికే వందల సంఖ్యలో వ్యాసాలు, కథనాలతో పాటు, పదికి పైగా పుస్తకాలు వెలువడ్డాయి. అయితే ఈ పుస్తకాలన్నీ అమ్మకాల్లో రికార్డులు సృష్టించి మలి ముద్రణలు జరుపుకున్నాయి. పల్లవి వెలువరించిన 'మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్జి', డా|| పరుచూరి విజయలక్ష్మి 'మహానటి సావిత్రి', హెచ్ రమేష్ బాబు 'మహానటి సావిత్రి వెండితెరపై వెన్నెలపై సంతకం', పద్మ 'అభినేత్రి సావిత్రి', పసుపులేటి రామారావు 'అద్భుతనటి సావిత్రి తెరవెనుక నిజాలు', డా|| వెలచాల కొండలరావు 'మహానటి సావిత్రి', ప్రణయరాజ్ వంగారి 'మహానటి సావిత్రి', డా|| కంపల్లె రవి చంద్రన్ 'సావిత్రి కరిగిపోయిన కర్పూరకళిక'తో పాటు, సావిత్రి జీవితకథను తెలుగు ప్రేక్షకుల ముందుంచుతూ నాగ్ అశ్విన్ 'కీర్తీ సురేష్' కథానాయికగా 'మహా నటి' సినిమాను రూపొందిం చారు. ఈ సినిమాలో సావిత్రి జీవితాన్ని, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను చూపించారు. మహానటిగా కీర్తిసురేష్ కనబర్చిన అభినయం ఆమెకు తిరుగులేని గుర్తింపు తేవడంతో పాటు, జాతీయ ఉత్తమనటిగా అవార్డును సైతం పొందారు.
సావిత్రి కారును అత్యంత వేగంగా నడిపేవారు. 'నర్తనశాల' చిత్రానికి ఆమె మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి రెండు వరకూ పనిచేసేవారు. కారుకి డ్రైవరున్నా కూడా ఆమే స్వయంగా నడుపుకొంటూ వచ్చేవారు. షూటింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 2 గంటలు దాటిపోయేది. ఇంటికి ఒక్కరినే పంపడం ఎందుకని చిత్ర బృందం ఎవరినైనా సహాయంగా పంపేది. అయితే సావిత్రి పక్కన కూర్చొని ఆమె డ్రైవింగ్‌ను చూసేవాళ్లకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. భయంతో వణికిపోయేవారు. అంత వేగంగా ఆమె కారును నడిపేవారు.
మహానటిగా పేరుప్రాఖ్యాతలు సంపాదించిన సావిత్రి.. రేపల్లె మండలంలో పాఠశాల ప్రారంభించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. వడ్డివారిపాలెంలో సావిత్రి గ్రామీణులైన పేద విద్యార్థులకు విద్యను అందించాలని సంకల్పించుకుని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. ప్రస్తుతం శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ.. విద్య, క్రీడ, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పలువురిని మన్ననలు పొందుతోంది. గత పదకొండు సంవత్సరాలుగా నూరుశాతం ఫలితాలు, పలు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందటం, పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటం విశేషం.
-పొన్నం రవిచంద్ర, 9440077499
Sun 26 Dec 04:06:02.337407 2021