Sun 02 Jan 04:53:23.740761 2022
Authorization
పెళ్లి, పిల్లలు, ఇంటి చాకిరి, భర్త సేవ తప్ప మరొక లక్ష్యం అనేది స్త్రీకి లభించని కాలంలో చైతన్యపరిచే రచనలు చేస్తూ, ఉపాధ్యాయునిగా బోధన చేస్తూ, సంఘంలో ఉన్న దురాచారాలను ప్రతిఘటిస్తూ మార్పు కోసం శ్రమించిన సంఘసంస్కర్త, నాయకురాలు, సజనశీలి, సావిత్రిబాయి పూలే. అంత వెనకబాటుతనంలో సమాజాన్ని సైతం మార్చడానికి ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రయత్నం అమోఘమైనది. వ్యక్తుల కంటే ప్రభుత్వాలు చాలా బలమైనవి. ఆర్థిక వనరులు కలిగి ఉన్నవి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్రం, మంచి జీవనం, మహిళల అభ్యున్నతి అందించగలదు. కానీ అలాంటి మార్పు రావాలంటే ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వాలు రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. దానికి మనం ప్రతి ఒక్కరం ప్రయత్నిస్తూ ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాలను గెలిపించుకోవడం ద్వారా సమాజాన్ని సమూలంగా మార్చగలం. ఇద్దరు వ్యక్తులు చేసిన పనిని సమాజంలోని ఎక్కువమంది చేయగలిగితే ఈ సమాజం మారడం అసాధ్యమేమీ కాదు. రండి చేయి చేయి కలుపుదాం! మన భవితను నిర్మించు కుందాం!!
సాంస్కతిక అభివద్ధికి భారతదేశంలో జరుగుతున్న కషిని గమనిస్తే అత్యధికంగా పక్షపాత ధోరణి కనిపిస్తుంది. బ్రాహ్మణ ఆధి పత్య వర్గాలకు అందిన జ్ఞాన ఫలాలు సబ్బండ వర్గాలకు అందడం లేదనేది నిర్వివాదాంశం. కొన్ని వందల ఏండ్లుగా ఉన్న ఈ వ్యవస్థను చూసి చలించిపోయిన జ్యోతిరావు పూలే, తన భార్యకు చదువు నేర్పి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు.
సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న జన్మించారు. ఆమెకి తన తొమ్మిదవ ఏట 12 ఏండ్ల జ్యోతిరావు పూలేతో 1840లో వివాహం జరిగింది.అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో జ్యోతిరావు పూలేతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఇది అగ్రవర్ణాలకు నచ్చలేదు. ఆమెపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్యకర పదజాలంతో దూషించడం వంటివి చేసేవారు. పాఠశాలకు వెళ్లిన తర్వాత మలినమైన ఆ చీరను మార్చుకుని పాఠాలు బోధించే వారు. ఎవరైనా ప్రశ్నిస్తే ''నా ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని క్షమించి, ఆశీర్వదిస్తాడు'' అని సహనంతో ఆమె పలికేది. ఎంత కాలం గడిచినా వేధింపులు ఆగకపోవడంతో ఆమె ధైర్యం సన్నగిల్లి సాగింది. ఈ సమయంలో ఆమెకు ప్రేమనూ, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తూ అండగా నిలిచాడు పూలే. ఆ ధైర్యంతో బోధన కొనసాగించింది. అయినా వేధింపులు ఎక్కువ కావడంతో ఒకరోజు ఒకడి చెంప పగలకొట్టింది. సుమారు 120 సంవత్సరాలకు ముందు భార్యకు ప్రోత్సాహం, ధైర్యాన్ని అందించిన మహౌన్నతుడు పూలే. ఈ రోజుల్లో భార్య పట్ల సహకారం, ప్రోత్సాహం ఇచ్చే వారు ఎంతమంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. అభ్యుదయవాదులు, విద్యావంతులలో కొంతమంది మాత్రమే ఇలా వ్యవహరించ గలుగుతున్నారు. అలాంటి సహకారం పొందిన మహిళలు తను సాధించాలనుకునే లక్ష్యాలను చేరుకోగలుగుతున్నారు.
స్త్రీలు విద్యావంతులైతే పరాయి వాళ్లకు ఉత్తరాలు రాసే ప్రమాదం ఏర్పడుతుందనీ, చదువుకున్న స్త్రీ పాప ఫలితంగా, ఆమె భర్త తినే అన్నం పురుగులుగా మారిపోతుందనీ, అతను అకాల మరణం పాలవుతాడనీ,ఎన్నో నమ్మకాలు ప్రచారంలో ఉండేవి. అవన్నీ నిరాధారమైనవనీ, అసత్య ప్రచారాలనీ, పేద, తక్కువ కులాల వాళ్ళు చదవకుండా చేసిన ప్రచారమని తెలియజెప్పి విద్య యొక్క ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యేలా వివరించి చదువును అందించింది సావిత్రిబాయి పూలే. బాల్య వివాహాల వల్ల చిన్న వయసులోనే వితంతువులుగా మారే బాలికలూ, యువతుల పట్ల సాంఘిక దురాచారాలు అమలు అవుతుండేవి. సాంఘిక బహిష్కరణకు అవమానాలకు గురిచేసే వాళ్ళు. వీరికోసం 1953లో శరణాలయాన్ని స్థాపించారు.
చైతన్యం నెలకొల్పడం
ఈ మధ్యకాలంలో పూజలు, వ్రతాలు, క్రతువుల పట్ల ప్రజలకు మక్కువ ఎక్కువ అయ్యింది. పాలకులు కూడా అలాంటి మూఢవిశ్వాసాలను పెరిగేలా ప్రోత్సహించడం సాధారణమై పోయింది. మూఢనమ్మకాలలో ఉన్న ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉండదు. అందుకే పాలకులు వాటిని పెంచి పోషిస్తున్నారు. గోమూత్రం, అప్పడాలతో కరోనా పోతుందని మనువాద భావజాలాన్ని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సావిత్రిబాయి పూలే దీనికి విరుద్ధంగా వితంతువులకు శిరోముండనం చేయబోమని క్షురకులు తిరుగుబాటు చేసేటట్టుగా వాళ్లను చైతన్యపరిచి 1860లో ఒక సమ్మెను నిర్వహించింది సావిత్రిబాయి పూలే. వితంతువులు జీవితాంతం అలాగే ఉండాలి అనే సాంప్రదాయానికి వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు ప్రారంభించాడు పూలే. ఇందులో వితంతు పునర్వివాహాలు అనేకం చేశారు. ఇవే కాకుండా 1870లో దేశంలో దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు చేసిన కషి సాటిలేనిది. కరువుబారిన పడిన కుటుంబా ల్లోని అనాధబాలల కోసం 52 పాఠశాలను నిర్వహించారు. మహిళలను స్మశానానికి రానివ్వని సంస్కతి ఉన్న మనదేశంలో భర్త చితిని తానే అంటించి, దహన సంస్కారాలు నిర్వహించిన సావిత్రిబాయి తెగువ చూసి దేశం దిగ్భ్రాంతి చెందింది.
బాలికావిద్య
ఆనాటి కృషి నేటికీ కొనసాగించాల్సిన అవశ్యకత ఎంతైనా వున్నది. నేడు 15 -18 సంవత్సరాల మధ్య వయసు బాలికలలో 40 శాతం మంది బడిబయట ఉంటున్నారని సర్వే తెలుపుతోంది. నేషనల్ ఎచీవ్ మెంట్ సర్వే (ఎన్ ఏ ఎస్) దేశంలోని 24 రాష్ట్రాలలోని 22 భాషలు 96 శాతం పాఠశాలల్లో చదువుతున్న 92 శాతం విద్యార్థులను కలిసి సర్వే నిర్వహించి, నవంబర్ 12 2021న వివరాలను విడుదల చేసింది. బడిపిల్లల నమోదు, అధ్యయన పత్రాలు, అధ్యయన మద్దతు అంశాలను పరిశీలించి, రాష్ట్రాలవారీగా ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఖర్చు చేసే మొత్తంలో మొదటి స్థానంలో కేరళ నిలువగా చివరి స్థానంలో బీహార్ ఉంది. విద్యకు బడ్జెట్లో నిధులు కేటాయించడం, బాలికల విద్యపై కేంద్రీకరించడం, వారిని ప్రోత్సహించడం వంటి చర్యలతోనే సఫలీకృతమౌతుంది.
అక్షరాస్యత
దేశంలో అక్షరాస్యత శాతం పెరిగినప్పటికీ ఇంకా బాలికల్లో చదువుకున్న వారి శాతం తక్కువగానే వుంటున్నది. ఆనాటి సావిత్రీబాయి పూలే కన్నకలలు ఇంకా సాకారం కాలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం అక్షరాస్యత 74 శాతం కాగా మహిళల అక్షరాస్యత 65.46 శాతం, పురుషులు 82శాతంగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి చూస్తే 1951-2001, 2011 సంవత్సరం వరకూ మహిళల్లో 2011 నాటికి 65 శాతంగా మహిళల అక్షరాస్యత పెరుగుతూ వచ్చింది. అంతే ఇంకా నూటికి 35శాతం మంది చదువుకు దూరంగానే వుంటున్నారు. అదే మాదిరిగా పురుషుల అక్షరాస్యత 27 నుంచి 75కి, 2011 నాటికి 82 శాతానికి పెరిగింది. లింగ వివక్షత కొట్టొచ్చినట్లు తెలుస్తుంది. అదే మాదిరిగా 2015 -16 విద్యా సంవత్సరం నుంచి 2019 -20 లో 18 శాతం మహిళల ఉన్నత విద్యలో అభివద్ధి కనిపిస్తుంది. 2019-20 రిపోర్ట్ ప్రకారం 2018 19తో పోల్చినప్పుడు బాలికల నమోదు 14.08 ఎనిమిది లక్షలకుపైగా పెరిగింది. ఈ పెరుగుదల అన్ని స్థాయిల్లో ఉంది. ఇది అలాగే 1912-13తో పోల్చినప్పుడు 2019- 20లో సెకండ్, హైయర్ సెకండరీ స్థాయిలో బాలుర కన్న బాలికల నమోదు పెరిగింది. తెలంగాణలో కూడా 2019-20సంవత్సరంలో సెకండరీ నుంచి హయ్యర్ సెకండరీ కి వెళ్ళిన బాలుర కన్నా బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ గణాంకాలను చూసి ఆనందించదగ్గ గుణాత్మక మార్పులు అయితే భారతదేశంలో లేవు అనేక కారణాలతో బాలికలు విద్యకు దూరం చేయబడుతున్నారు.
బాలికా విద్యకి ఆటంకాలు
- కుల వ్యవస్థ: కులవివక్షత మూలంగా బాలికల విద్య వెనకకు నెట్టబడింది. ఆ ప్రభావం నేటికీ కొనసాగుతుంది బ్రాహ్మణ కుటుంబాలకు మాత్రమే చదువుకునే స్వేచ్ఛను హిందూ మతం కల్పించింది. వర్ణవ్యవస్థతో 50శాతం దళిత పిల్లలు ప్రాథమిక విద్యలో డ్రాపౌట్స్ గా ఉన్నారనీ, 1989లోనే వారి చదువు కొనసాగే చట్టాలు తెచ్చినా అమలుకు నోచుకోలేదు.
- లింగ వివక్షత: ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది మహిళలు మాత్రమే భారత దేశంలో ఉన్నారు. ఆడపిల్లలను పుట్టక ముందే గర్భంలోనే చిదిమే. పుట్టిన ఆడ పిల్లలు కూడా మంచి ఆహారాన్ని, విద్యను పురుషులతో సమానంగా పొందలేకపోతున్నారు. పురుషాధిక్య భావజాలంలో ఉన్న తల్లిదండ్రులు బాలురను అధికంగా ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు అధికంగా విద్యను పొందుతున్నారు.
- పేదరికం గ్రామాల అభివద్ధి లేకపోవడం: నిరక్షరాస్యతతో, గ్రామాలలో ఉన్న అభివద్ధి లేని కారణంగా 47శాతం ఆడపిల్లలకు 18 సంవత్సరాలకే పెళ్లిళ్లు, గర్భవతులు కావడం జరుగుతుంది.
- ఆర్ టి ఈ 2009 విద్యా హక్కు చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చి తను చేయాలనుకున్నది చేసినట్టుగా భావించిన వాస్తవంలో మాత్రం 6 నుండి 14 సంవత్సరాల వయసులోనే బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. అనేక ఆర్థిక పరిస్థితుల మూలంగా ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా అది అమలు కావడం లేదు.
- రుతుక్రమ పరిస్థితులు: బాలికలు నెలసరి సమయంలో వారికి శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేక, 71 శాతం మంది పిల్లలకు తమ శరీరంలో జరిగే మార్పుల గురించి తెలియదు. పరిశుభ్రతను పాటించడం పట్ల అవగాహన లేదు.ఈ విషయాలను మాట్లాడడం అవమానకరంగా భావించడం కారణంగా 23 మిలియన్ల మంది బాలికలు డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారు.
- ఆర్థిక భారం: బస్సు చార్జీల ఖర్చు భరించలేక చదువు మానేసిన వారు బీహార్లో అనేకమంది వున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం ఉచిత సైకిళ్లను సరఫరా చేసింది. దీనిమూలంగా1,75,000మంది నుంచి 6,00,000 వరకు బాలికల నమోదు పెరిగింది.
- మౌలిక సదుపాయాలు: బాలికలకు పాఠశాలలలో ప్రకారం 2019-20 సంవత్సరాలలో 92 శాతం పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం ఉంది. 95.6 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉపయోగంలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం వాటిని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో నుంచి తొలగించినది. అపరిశుభ్రంగా ఉండి అనారోగ్యం పాలు అవుతున్నారు.
- కంప్యూటర్ పరిజ్ఞానం: కంప్యూటర్ బేస్డ్ ఫంక్షనల్ లెటరసీ( సి బి ఎఫ్ ఎల్) చదువులో బాలురతో పోల్చుకుంటే 81 శాతం బాలికలకు కంప్యూటర్ పరిజ్ఞానం అందడం లేదు. తల్లిదండ్రులు నిరక్షరాస్యత కారణాలుగా ఉన్నాయి. జాబ్స్ లాంటి ఉన్నత చదువులు ఉద్యోగాలు కేవలం 19 శాతం మాత్రమే పొందుతున్నారు.
- భావి తరాలకు మార్గదర్శి: 1897లో ప్లేగు వ్యాధి సోకిన పిల్లల కోసం వైద్య శిబిరాలను నిర్వహించి, రెండు వేల మంది పిల్లలకు ఆమె భోజన వసతులను సమకూర్చినదట. చివరికి 1897 మార్చి 10న అదే వ్యాధితో మరణించడం విషాదకర సంఘటన.
పెళ్లి, పిల్లలు, ఇంటి చాకిరి, భర్త సేవ తప్ప మరొక లక్ష్యం అనేది స్త్రీకి లభించని కాలంలో చైతన్యపరిచే రచనలు చేస్తూ, ఉపాధ్యాయునిగా బోధన చేస్తూ, సంఘంలో ఉన్న దురాచారాలను ప్రతిఘటిస్తూ మార్క్ మార్పు కోసం శ్రమించిన సంఘసంస్కర్త, నాయకురాలు, సజనశీలి, స్ఫూర్తి సావిత్రిబాయి పూలే. అంత వెనకబాటుతనంలో సమాజాన్ని సైతం మార్చడానికి ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రయత్నం అమోఘమైనది. వ్యక్తుల కంటే ప్రభుత్వాలు చాలా బలమైనవి. ఆర్థిక వనరులు కలిగి ఉన్నవి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్రం, మంచి జీవనం, మహిళల అభ్యున్నతి అందించగలదు. కానీ అలాంటి మార్పు రావాలంటే ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వాలు రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. దానికి మనం ప్రతి ఒక్కరం ప్రయత్నిస్తూ ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాలను గెలిపించుకోవడం ద్వారా సమాజాన్ని సమూలంగా మార్చగలం. ఇద్దరు వ్యక్తులు చేసిన పనిని సమాజంలోని ఎక్కువమంది చేయగలిగితే ఈ సమాజం మారడం అసాధ్యమేమీ కాదు. రండి చేయి చేయి కలుపుదాం! మన భవితను నిర్మించు కుందాం!!
- జి. వందన, 9490120210