సంక్రాంతి పండుగ... హరిదాసులు ఉదయాన్నే ఆధ్యాత్మిక రాగాలను పలికి పొతే.. పట్టు పరికిణీల్లో పల్లె పడుచులు రంగవల్లికల సరాగాలు వల్లిస్తుంటే.. డూడూ బసవన్నలు గొబ్బెమ్మల దగ్గర తలలు ఊపుతుంటే..
ఒక పక్క భోగి మంటలు.. మరో పక్క కోడిపందాల జోరులో పెరిగిన వేడి.. పిండివంటలు గుబాళింపు ఒకవైపు.. ఉరుకులాడుతున్న పిల్లగాళ్ళ సందడి మరో వైపు.. ఇలా పండుగకు ఎన్నో కోణాలు. మరెన్నో వర్ణాలు. మూడు రోజుల పాటు పండగ ఉత్సాహం ఊరకే గోదారిలా తుళ్ళి పడుతూనే ఉంటుంది. ఇదంతా సంక్రాంతికి ఒక వైపు...
గత రెండు సంవత్సరాలుగా పండుగ సంబరం పూర్తిగా పోయింది. కరోనా కాటుతో విలవిలలాడిన జనానికి సంక్రాంతి వినోదం కరువైపోయింది. ముంచుతున్న ముప్పు రంగవల్లుగా రంగులు మారుస్తూ నీతో నేను..... అని కరోనా మనల్ని వెంబడిస్తూనే వుంది వైరస్ రక రకాలుగా అలంకరణలతో మనల్ని వెంటాడుతూనే వుంది. కొత్త సంవత్సరం, సంక్రాంతి... సంతోషాలతో సొంతూళ్ళకు వెళ్ళి సంబరంగా గడపాలనుకుంటున్న వాళ్లందరికీ ఇదొక సమస్య..... పిల్లల పట్ల , పెద్దల పట్ల ఎంతో జాగ్రత్త వహించడం అవసరం అలసత్యం పనికిరాదు. కరోనా విజృంభిస్తే తీవ్ర నష్టం. జరుగుతుంది. మన బ్రతుకుదెరువును చూసుకుంటూనే ఆరోగ్య రక్షణ కోసం శ్రద్ధ వహించాలి...
ఏడాదిలో తొలి పండుగ. ఏడాది కోసారొచ్చే పండుగ. పెద్ద పండుగ.... తెలుగు వారికే సొంతమైన పండుగ. పల్లెటూరి పండుగ. కష్టజీవుల పండుగ. జాన పదుల పండుగ.... సంక్రాంతి పండుగ. చదువు కోసమో... బతుకుదెరువు కోసమో, కారణమేదైనా కన్నతల్లికి, పుట్టినూరుకు దూరమయ్యాం. సొంత ఇంటికే బంధువులమయ్యాం. ఫర్వాలేదు.... దేశం కాని దేశంలో ఉంటేనేం. పట్టణ వాసపు జీవనంలో మగ్గితేనేం. సంక్రాంతికి మాత్రం సొంతూరుకు పరుగెడతాం. ఆఫీసులో సెలవులేదు. అయినా ఊరెళ్లాల్సిందే. ఎందుకంటారు? అమ్మ కోసమా, ఊరమ్మ కోసమా, మట్టివాసన కోసమా, మధురస్మృతుల కోసమా... ఎందుకో!?
ఉరుకుల పరుగుల జీవితం. ఊపిరి సలపని పని. ఆత్మీయతలు, అనుబంధాల ఊసే లేని క్షణాలు. ఆఫీసులో వర్క్ టార్గెట్లు. బాసులు చిర్రు బుర్రులు, సహోద్యోగుల కృత్రిమ పలకరింపులు. ఏదో తెలియని వెలితి. కాసేపు ప్రకృతిని ఆస్వాదించాలనుంటుంది. ప్రకృతి అంటే ..ఇరుకు ఇళ్లు, చిన్న చినుకులకే చీదరపుట్టించే రోడ్లు. ఎడతెరిపిలేని ట్రాఫిక్, చెవులు హోరెత్తేలా వాహనాల రొదలు. పచ్చదనమే తప్ప. ప్రశాంతత దొరకని పార్కులు. వెరసి నగర జీవనం మొత్తంగా ఒక ప్లాస్టిక్ వువ్వు మాదిరి అనిపిస్తుంది. పుస్తకాల సంచి భుజానేసుకుని పరిగెత్తే పిల్లలకైనా, ఆదరా బాదరాగా లంచ్ బాక్సులతో ఉరికే ఉద్యోగికైనా... విరామం, విశ్రాంతి కావాలి. అందుకు సంక్రాంతి పండక్కి తప్పకుండా. ఊరెళ్లాల్సిందే అంటారు పల్లె విడిచి పట్నవాసానికొచ్చిన ప్రతి ఒక్కరూ....
నెలనాళ్ల ముందుచూపు
మద్రాస్ ఐఐటిలో చదివే తెలుగు విద్యార్థి అయినా, బెంగుళూరులో ఆంధ్రామెస్ యజమానైనా, హైదరాబాద్‌లో పని చేసే వలస భవన నిర్మాణ కార్మికుడైనా... సంక్రాంతికి ఊరెళ్లాలంటే నెలనాళ్ల ముందే టిక్కెట్టు రిజర్వేషన్ చేయించుకోవాల్సిందే. లేకుంటే మాత్రం ముప్పు తిప్పలు పడి మూడు చెరువుల నీళ్లు తాగినంత పనవుతుంది ప్రయాణం. ఆర్టీసీ వాళ్లు. ఎన్ని స్పెషల్ బస్సులు పెట్టనివ్వండి.. రైల్వేవాళ్లు ఎన్ని ప్రత్యేక రైళ్లు పెంచనివ్వండి... అబ్బే సరిపోవు. ఈ సంక్రాంతి సెలవు దినాల్లో నిండు చూలాల్లా కనిపిస్తుంటాయి బస్సులు, రైళ్లు. ఇక ట్రావెల్స్ యజమానులకైతే ఇదే అదును దోపిడీ ద్వారాలు తెరపడానికి. ఇక మన భాగ్యనగరంలోని మహాత్మాగాంధీ బస్టాండ్‌కు ఒకసారి వెళ్ళి చలి తిరునాళ్లే ఇసుక వేస్తే రాలనంత జనం. తల్లి చంకలో చంటి బిడ్డ, పక్కన లగేజీ సంచులు.. బస్సులో సీటు కోసం పరితపిస్తూ కనిపించిన కండెక్టర్ సార్లను ఖాళీలున్నాయా అని అడగటం... నిరాశలు, పెదవి విరుపులు. ఇప్పుడు మాత్రం వెళ్లాల్సిందే. ఎందుకంటే మనస్సు అనే లగేజీ సంచుల్లో ఏడాదికి సరిపడా. మధురానుభూతులను మూటకట్టుకొని తెచ్చుకోవాలిగా! మరి దేశం కాని దేశంలోని ఉంటున్న వారికి మాత్రం సొంతూరుపై మమకారం ఉండదా. పండక్కి ఊర్లో ఉండాలి. అమ్మ, నాన్నతో గడపాలి. అయిన వారందరినీ కలవాలన్న ఆశలు వారికి ఉంటాయి కదా.
పిల్లల సంక్రాంతి
సంక్రాంతి అంటే.. అందులో పిల్లల ఆనందాలకు అవధులుండవు. పుస్తకాల మోత ఉండదు. హోంవర్క్లుండవు. బడి గంట అసలే వినపడదు. ఎంచక్కా సెలవుల్లో అమ్మమ్మ వాళ ఇంటికి వెళ్లచ్చు... నాన్నమ్మ చేత బోలెడన్ని కథలు చెప్పించుకోవచ్చు. ఇంట్లో ఎన్ని పిండి వంటలున్నా, అత్తయ్య, మామయ్య ఇచ్చే డబ్బులతో కురుకురేలు కొనుక్కోవచ్చు. ఊర్లో ఉండే పిల్లలందరినీ పోగు చేసి దాగుడు. మూతలు, ముక్కు గెల్లుడు, దొంగ పోలీస్ ఆటలన్నీ ఆడుకోవచ్చు. కేరింతలు కొడుతూ గాలి పటాలు ఎగరేయవచ్చు. హరిదాసు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూడటం. ఆయన కలశంలో బియ్యం పెట్టాలని తహతహలాడటం, పోటీకొచ్చిన అక్కతోనో. తమ్ముడితోనో గిల్లిగజ్జాలకు దిగటం ఇలాంటివి బోలెడన్ని ఇక భోగి రోజైతే... వీధిలో అందరికంటే పెద్ద భోగి మంట వేయాలి. పాత చెక్క ముక్కలు, బెల్లపు బుట్టలు, అట్ట పెట్టలు అన్నీ పోగుచేయాలి. ఆనాటి కోసమే తయారు చేసిన పిడకల దండను బయటకు తీయాలి. ఎవరి దండ పెద్దదో బేరీజు వేయాలి. అవన్నీ భోగి మంటలో వేసి నులి వెచ్చని ఆవిర్లను. ఒంటికి రుచి చూపిం చాలి. కొత్త బట్టలు తొడుక్కోవాలి. సంక్రాం తిని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు తన పెద్దలను స్మరించు కోవడం ఆనవాయితిగా వస్తుంది. హార్దిక సంబం ధాలు పూర్తిగా అడుగంటిపోతున్న ఈ రోజుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని భోజనం చేయడం.... కుటుంబ పెద్దలను స్మరిం చుకొని వారిని గౌరవించు కోవడం, తల్లిదండ్రుల ఆశీ స్సులు తీసుకోవడం ఇవన్నీ సంక్రాంతి మాత్రమే కల్పించిన సందర్భం. ఎక్కడెక్కడో నివశిస్తున్న అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరూ కలవడం అన్నది తర్వాత తరాలకు కుటుంబ ఆత్మీయతలు, అనుబంధాల గురించి తెలియచేసే మంచి క్రతువు.
సంక్రాంతి సందళ్లు
సంక్రాంతి పండుగకు తెలుగు లోగిళ్లన్నీ సందళ్లతో, సంతోషాలతో, ఆటపాటలతో, సరదా లతో వెరసి నూతనోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా...ఇంటికి కొత్త అల్లుడు రావడం, వారికి అత్తింటివారు కొత్త బట్టలు పెట్టడం, బావల్ని మరదళ్లు ఆటపట్టించడం ఆనవాయితీ. ఇక ఈ సంక్రాంతికి కొత్త సినిమాలు అందులోనూ పెద్దహీరోల సినిమాల సందడి ప్రత్యేకం. పండగపూట ఊరికి దగ్గర్లోని టూరింగ్ టాకీసు వెళ్లడం షరామామోలే. గతంలో అయితే బంధుమిత్రులు అందరూ కలిసి ఎడ్లబండి కట్టుకొని మరీ తెరబొమ్మ చూడ్డానికి వెళ్లేవారట, ఇప్పుడు కాలం మారింది. ఇంట్లో టెలివిజన్, కాపల్సినన్ని సినిమాలు. కానీ అవన్నీ సంక్రాంతి పూట బలాదూర్. ఇక అసలు సిసలైన సంక్రాంతి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడ్ల పోటీలు. అవి చూడ్డానికి చుట్టు పక్క ప్రాంతాల నుంచి వచ్చే జనం, సందడే సందడి. గోదావరి జిల్లాల్లో కోడి పందేల గురించి చెప్పనక్కర్లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బడా బడా బాబులంతా కొబ్బరితోటలు, చింత తోపుల్లో చొరబడి కోట్ల రూపాయలతో కోళ్ల పందేలు కాస్తారు. ఇంకా కొన్ని సంక్రాంతి సరదా ఆటలు కూడా ఉన్నాయి. టెంకాయాట.. ఉల్లి పాయాట, నిమ్మ కాయాట, సంక్రాంతి సమయంలో పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి. అక్కడ కొంత మంది రైతులు ఒకచోట చేరి ఈ ఆటలు ఆడతారు. ఎవరు వీటిని తక్కువ సమయంలో ఎక్కువ దూరం విసురుతారో వారు పందెంలో గెలిచినట్టు ఆరుగాలం పండించిన పంట చేతికొస్తుంది. చేతిలో డబ్బులాడతాయి. అప్పటిదాకా సరదాలు సంతోషాలు తెలియని రైతులు సంక్రాంతికి మాత్రం రకరకాల పందేలు కాచి సరదాలు తీర్చుకుంటారు.
పాత మిత్రుల కలయిక
పండక్కి ఊరెందుకెళుతున్నావు అని ఎవరైనా అడిగితే ఏమి సమాధానం చెప్పాలో తెలియక పోయినా మనస్సు మాత్రం వెంటనే ఒకటి గుర్తుచేసు కుంటుంది 'చిన్న నాటి స్నేహితుల్ని కలవచ్చు అని. నిజమే సొంతూర్లో కట్టికట్టని లాగులతో ఎన్నో ఏళ్లు కలిసి వాళ్లతో తిరిగుంటారు. కోతి కొమ్మచ్చిలు ఆడుంటారు. చింత చెట్లు ఎక్కుంటారు. దొంగతనంగా మామిడి పిందెలు తెంపుంటారు. ఏం చేద్దాం. కాలం విడదీసింది. బతుకు తెరువు కోసం తలోదిక్కు పోయారు. అయితేనేం... సం క్రాంతి పండుగకు అందరం కలుద్దాం.. అని ఫేస్‌బుక్‌లోనో, సెల్ఫోన్లలోనో ముందే సమా చారం అందుతుంది. కలవాల్సిన రోజు రానేవచ్చింది. ఊరి బొడ్డురాయి దగ్గర మొదలవు తుంది. కలయిక. శీను గాడెక్కడ... సురేష్ గాడెక్కడ. రాజేష్ ఎక్కడున్నాడో ఫోన్ చేయి... నరేష్ ఇంకా రాలేదా వాట్స్‌ప్‌లలో మెసేజ్ ఇవ్వు.. అంటూ బోలెడన్ని ఊసులు. అంతలో బడి రమ్మని పిలుస్తుంది. ఒక్కసారిగా ఆ బడి గోడలు సెల్యూలాయిడ్లవుతాయి. చిన్న నాటి జ్ఞాపకాలన్నీ అందులో బొమ్మలుగా మెదులుతాయి. మిత్రు లంతా కలసి గ్రామాభివృద్ధి విషయాలూ చర్చిస్తారు. అందులో భాగంగా సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఆటల పోటీలు, పాటల పోటీలు... క్రికెట్, కోకో, వాలీ బాల్ లాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తారు. సాంఘిక నాటికలనూ ప్రదర్శిస్తారు. గతంలో అయితే గ్రామంలోని కొంత మంది. యువకులు కలసి పండుగ పది రోజుల ముందు నుండే కోలాటం, చెక్క భజన నేర్చుకొని పండుగ రోజు ప్రదర్శనలిచ్చేవారట నేటికీ కొన్ని పల్లెల్లో సంక్రాంతి సాయంత్రాలు కోలాటాలు, చెక్క భజనలు, తోలు బొమ్మలాటలు వంటి జానపదుల నృత్యాలతో కోలాహలంగా ఉంటాయి.
'మధుర స్మృతుల' మూట
ఏడాది నుంచి ఎదురు చూసిన పండుగ రానే వస్తుంది. మూడు రోజుల పండుగ మురి పిస్తుంది. ఆ మురిపెంలో మూడు రోజులు మూడు క్షణాల్లా కరిగిపోతాయి. మళ్లీ మామోలే. బతుకు జీవుడా అంటూ కడుపు చేత పట్టుకొని, కన్నతల్లిని, సొంతూరుని వదిలి ప్రయాణం.
అబ్బా.... పండుగ అప్పుడే. అయిపోయిందా అనిపిస్తుంది. పిల్లలు రామని మారం చేస్తారు. పెద్దల మనస్సుల్లో కూడా తెలియని అలజడి. కానీ తప్పదు. అమ్మ కట్టించిన పిండివంటల సంచులు... పప్పుధాన్యాల మూటలు, బియ్యపు గోతాలు... వారి కన్న ప్రేమకు ఈ మూటలు కొలమానాలు మాత్రం కాదు. ఉదయాన్నే పది గంటలకే ఆఫీసులో అబెండ్ కావాల్సిన అబ్బాయిగారు. ప్రాజెక్ట్ వర్క్ పక్కన పెట్టి మరీ వచ్చిన అమ్మాయి గారు, మొదటి పిరియడ్ మిస్ కాకుండా బడిబాట పట్టాల్సిన బుజ్జాయి గారు.. మోయలేని మూటలతో, మనస్సంతా భారంతో అందరి అడుగులు భారంగా ముందుకు సాగుతుంటాయి. ఎక్కాల్సిన బస్సు. రానే వస్తుంది. మనస్సును మాత్రం వదిలేసి... మనుషుల్ని మాత్రమే తీసుకెళ్లడానికి. ఆ బస్సు కదులుతుంటే... అమ్మ కళ్లలో కృష్ణమ్మలు పొంగుతాయి. నాన్న గుండె చిన్నబోతుంది. తిరుగు ప్రయాణపు చిర్రుబుర్రులు మళ్లీ మొదలు. ఆపసోపాలు, ఇక్కట్లు అన్నీ భరించి ఎవరి గమ్యాలకు వారు చేరుకుంటారు. పండుగకు ఊరు వెళ్లని మిత్రులు, పల్లెటూరే తెలియని స్నేహితులకు, ఆఫీసులో సహోద్యోగులకు అరిశెలు, అమ్మ చేతి పిండి వంటలు రుచి చూస్తారు. సంక్రాంతి పంచుకుంటారు. అవి విన్నవారు. అరిసె తిన్నవారు అమ్మని, ఊరుని పొగడక మానరు. ఏడాదికి సరిపడా మధుర స్మృతుల మూటల్ని మాత్రం అలాగే మదిలో దాచుకుంటారు మళ్లీ సంక్రాంతి వరకూ...
ముగ్గుల పండుగ
సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ, నెల మొదలు నుండే ఎలాంటి ముగ్గులు పెట్టాలి. ఎన్ని చుక్కల ముగ్గులు పెట్టాలి. వాటికి ఏయే రంగులద్దాలి..... అమ్మాయిల మది ఇలాంటి ఆలోచనలతో నిండిపోతుంది. మా వీధిలో అందరికన్నా పెద్ద ముగ్గు నేనే వేయాలి. అందరి ముగ్గు కన్నా నా ముగ్గే బావుండాలి. ఎన్ని ఆశలు. ఎంత స్వార్థం. ఎవరైనా నీ ముగ్గు బాగుంది అని పొరపాటున అన్నారనుకో... ఇక ఒలంపిక్స్‌లో బంగారు పతకం వచ్చినంత ఆనందం. అయినా ఒలంపిక్స్‌లో ముగ్గుల పోటీకూడా చేరిస్తే బాగుంటుందేమో! అందులో మన తెలుగు అమ్మాయిలకే అన్నీ పతకాలు. ముగ్గులు పెట్టడంలో మన వారిది అందె వేసిన చెయ్యి కదా! ఈ పప్పులన్నీ ఉడకాలంటే ఊరిలో ఉండాలి. మాస్టర్ డిగ్రీ తీసుకొని ఉద్యోగాల వేటకోసం అమీర్‌పేట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే అమ్మాయిలు... ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం బెంగళూరులో బస చేస్తున్న యువతులు ...వీరి పరిస్థితి ఏమిటి. కాంక్రీట్ జంగిల్ నివాసంలో ముగ్గులు పెట్టే స్థలం ఎక్కడ. అంత సమయమెక్కడ. అందుకే సంక్రాంతికి ఊరు వెళ్లాలి. ఉన్న మూడు రోజులు అమ్మకు అసలు అవకాశం ఇవ్వకూడదు. ఇంటి ముందు పెద్ద పెద్ద చుక్కల ముగ్గు పెట్టాలి. రథం ముగ్గు వేయాలి. అమ్మ లంగా ఓణీ కట్టుకోమంటుంది. నానమ్మ చీర కట్టుకోమంటుంది. అమ్మ, నానమ్మ ఇద్దరి మాట వినాలి. ఉదయం లంగా ఓణీ, సాయంత్రం చీర. సరిపోతుంది. పెరటిలో ఉన్న కనకాంబరం చెట్లు తనకోసమే దాచిన పూలన్నీ తలలో తురమాలి. స్నేహితురాళ్లతో సరదా కబుర్లాడాలి. ఊరిలో పెట్టే ముగ్గుల పోటీలో పేరు ఇవ్వాలి. సాయంత్రం పూట నిర్వహించే కుర్చీలాటలో పాల్గొనాలి. బహుమతులన్నీ గెలుచుకోవాలి. అవన్నీ వచ్చే ఏడాది వరకూ తీపి చిపెట్టుకోవాలి.
Sun 09 Jan 02:44:31.208588 2022