పార్లమెంట్లో గాంధీ విగ్రహానికి ఎదురుగా గాంధీ హత్యకు ప్రేరేపించిన హైందవరాష్ట్ర భావజాలానికి ఆది గురువైన సావర్కార్ విగ్రహం నిలబడి గాంధీ విలువలనే కాదు. ఆధునిక భారతదేశం గురించి గాంధీ కన్న కలలను కూడా ప్రశ్నిస్తోంది. జీవిత కాలంలో గాంధీ పాటించిన విలువలు, సాగించిన ఉద్యమాలు, సాధించిన విజయాలు, కన్న కలలు, నిర్మించతల పెట్టిన జాతి నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో ఆయన మరణంపై అంశాలను ఎలా ప్రభావితం చేశాయో అధ్యయనం చేయటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం.
మహాత్మా గాంధీ జీవితంతో పాటు మరణం కూడా ఎప్పటికప్పుడు చరిత్ర కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ప్రత్యేకించి సంఘపరివారం సాగించే వ్యక్తి హననం, వ్యక్తిత్వ హననం, విధాన హననం వంటి ముప్పేట ముష్కర వ్యూహాలదే పైచేయి అవుతున్న నేటి తరుణంలో ఈ అవసర మరింతగా ముందుకొస్తుంది. జాతి పితగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీని నేటి పాలకులు చీపురు పుల్లకు సరిపెట్టారు. హంతకులే రొమ్ము విరుచుకుని తిరగటం అన్నది మధ్యయుగాల మనువాద సంస్కృతిలో తప్ప ఆధునిక సంస్కృతిలో కనిపించని లక్షణం. కానీ ఉన్నావో మొదలు హథ్రస్ వరకూ నిందితులంతా పాలకపక్షం పంచన చేరి సన్మానాలందుకుంటున్నారు. ఈ ఒరవడి గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించటంతోనే మొదలైంది. హంతకులు ఛాతీ విరుచుకుని నడవటమే వీరత్వమన్న సంఘపరివారం సైద్ధాంతిక నేపథ్యమే దీనికి పునాది.
ఈ పునాదులు గత ఏడున్న దశాబ్దాలుగా అంతకంతకూ బలోపేతం అవుతూ వస్తున్నాయి. అందుకే పార్లమెంట్లో గాంధీ విగ్రహానికి ఎదురుగా గాంధీ హత్యకు ప్రేరేపించిన హైందవరాష్ట్ర భావజాలానికి ఆది గురువైన సావర్కార్ విగ్రహం నిలబడి గాంధీ విలువలనే కాదు. ఆధునిక భారతదేశం గురించి గాంధీ కన్న కలలను కూడా ప్రశ్నిస్తోంది. జీవిత కాలంలో గాంధీ పాటించిన విలువలు, సాగించిన ఉద్యమాలు, సాధించిన విజయాలు, కన్న కలలు, నిర్మించతల పెట్టిన జాతి నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో ఆయన మరణంపై అంశాలను ఎలా ప్రభావితం చేశాయో అధ్యయనం చేయటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం.
అక్టోబరు 2, 1869న పోర్బందర్లో జన్మించిన గాంధీది పుట్టుకతోనే పూలు పరిమళించినట్టు పరిమళించిన వ్యక్తిత్వం కాదు. జీవనయానంలో ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లు, అనుభవించిన కష్టాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఆచరించిన మార్గం, ప్రదర్శించిన అంకిత భావం కారణంగానే ఆయన జాతిపితగా ఎదిగారు. నిలిచారు. బారిష్టర్ చదువు కోసం 1888 నుంచి 1891 మధ్య కాలంలో ఆయన ఇంగ్లాండ్‌లో గడపిన జీవితం కొత్త ప్రపంచపు గాలి సోకేలా చేసింది. స్వేఛ్చా వాయువులు పీల్చటం ఎంత ఆరోగ్యకరమో రుచి చూపించింది. బారిష్టర్ పట్టా పుచ్చుకుని స్వదేశానికి తిరిగి వచ్చాక న్యాయవాద వృత్తిలో అంతగా రాణించలేమోనేన్న బెరుకు ఆయన్ను వెంటాడుతూ వచ్చింది. ఎట్టకేలకు మిత్రుల సలహాతో దక్షిణాఫ్రికా పయనమయ్యాడు. వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించటంలో గాంధీ తొలిపాఠాలు నేర్చుకున్నది దక్షిణాఫ్రికాలోనే. బోయెర్ యుద్ధం తర్వాత దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి ప్రభుత్వం అధికారం సంఘటితమైంది. అయినా ప్రవాస భారతీయులకు కాస్తవంత గౌరవం దక్కకపోవటంతో గాంధీ తిరిగి ఆందోళన బాట పట్డారు. భారతీయులు తమను తాము గుర్తించుకోవాలంటూ ఆదేశించే ట్రాన్స్‌వాల్ ఏసియాటిక్ చట్టానికి (మన దేశంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టం లాంటిది) వ్యతిరేకంగా గాంధీ జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టాడు. 1907 నుంచి 1914 మధ్యకాలంలో సాగించిన వివిధ పోరాటాల ఫలితంగా 1914లో ఎట్ట కేలకు ఇండియన్స్ రిలీఫ్ చట్టం తెర మీదకు వచ్చింది. ఈ పోరాటాల నడు మనే జీవితకాలం తాను అనుసరించిన సత్యాగ్రహ పోరాట రూపానికి పునాదులు పడ్డాయి.
బహుశా 1909లో ఇంగ్లాండ్ నుంచి దక్షిణాఫ్రికా తిరిగి వెళ్లే ప్రయాణంలో ఆయన రాసిన హింద్ స్వరాజ్ గ్రంధంలో ఆధునిక భారతీయతకు సంబంధించిన ఆనవాళ్లు రూపుదిద్దుకున్నాయి. దాదా భాయి నౌరోజి, గోపాల కృష్ణ గోఖలేలతో జరిపిన చర్చల తర్వాత ఈ రచనకు పూనుకున్నాడు. ఈ రచన ద్వారా తాను నిర్మించతలపెట్టిన ఆధునిక భారత జాతీయతకు నిర్వచనం ఇచ్చే ప్రయత్నంచేశాడు. భారత జాతీయత, భారతీయత మతపరమైన సరిహద్దులకు లోబడి ఉండేది కాదు అని స్పష్టం చేశాడు. బహుళమతాల సమైక్య సహజీవనమే ఆధునిక భారతీయతకు పునాదులని ప్రతిపాదించాడు. ఇదే అవగాహనతో
భారతదేశానికి తిరిగి వచ్చాక హిందూ ముస్లింలను ఐక్యం చేసి స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. ఈ దిశగా అప్పటికే కృషి చేస్తున్న బాలగంగాధర్ తిలక్‌తో చేతులు కలిపాడు. కాలక్రమంలో జాతీయ కాంగ్రెస్‌కు మూడో తరం నేతగా ఎదిగారు. భారతదేశానికి వచ్చాక ఆయన స్వాతంత్య్రోద్యమంలో పోషించిన పాత్ర, సాగించిన ప్రయోగాలు, సాధించిన విజయాలు పాఠ్యాంశాలుగా మనం తెలుసుకున్నవే. ఆధునిక భారత జాతీయతను నిర్వచించిన గాంధీ జాతిపిత అన్న గుర్తింపును సార్ధకం చేసుకున్నారు. కానీ గాంధీ నిర్వచించిన జాతీయతను పూర్తిగా ద్వేషించే శక్తులు కూడా అదే కాలంలో తులసి వనంలో గంజాయి మొక్కల్లా పెరగనారంభించాయి.
జనవరి 30, 1948న మహాత్మా గాంధీ హత్య, స్వాతంత్య్రానంతర భారతదేశంలో హిందూ మతోన్మాద గ్రూపులు ప్రారంభించిన దుర్మార్గపు ప్రచారపు పర్యవసానం. విద్వేషపు వికృత కార్యాచరణ...
''భారతదేశంలో భవిష్యత్తులో హిందూ రాష్ట్ర ఏర్పడే అవకాశాన్ని కొట్టిపారేయడం చాలా తొందరపాటు అవుతుంది. అయితే, ప్రస్తుతం ఆ అవకాశం బలంగా కనిపించడం లేదు. భారతదేశంలో లౌకిక రాజ్యం మనుగడ సాగించే అవకాశాలు చాలా ఎక్కువ'' (భారతదేశం సెక్యులర్ స్టేట్, 1963).
అరవైల ప్రారంభంలో అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త డొనాల్డ్ యూజీన్ స్మిత్ ''భారతదేశంలో హిందూ రాజ్యానికి అవకాశం'' గురించి చేసిన వ్యాఖ్యానం ఇది. ఈ వ్యాఖ్యానం చేసి సరిగ్గా 40 ఏండ్లు అయింది. ఈ నాలుగు దశాబ్దాలల్లో దేశంలో జరిగిన అనేక పరిణామాలను అవి ముందుకు తెచ్చిన ప్రమాదాలను మదింపు వేసుకునే సందర్బంగా గాంధీ వర్ధంతిని జరుపుకోవాలి.
నేడు, ఒక సామాన్యుడికి కూడా, భారతదేశంలో లౌకిక రాజ్యం చాలా బలహీనమైన పునాదులపై నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. హిందూ రాజ్యానికి అవకాశం అర్ధ శతాబ్దం క్రితం 1963 కంటే చాలా బలంగా ఉంది. గాంధీని స్తుతించాల్సిన సందర్బంలో గాంధీ హంతకుడు గాడ్సేను స్తుతించేందుకు పాలకులు చూపిస్తున్న ఉత్సాహం, గాడ్సే భక్తులు ఏకాంగా పార్లమేంట్కి ఎన్నికయ్యే అవకాశం ఇస్తున్న ప్రజాస్వామ్యాన్ని మనం గమనిస్తే లౌకిక భారతం హిందూ రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్న క్రమాన్ని మనం గమనించవచ్చు.
ఈ చర్య స్వతంత్ర భారతదేశంలో జరిగిన మొదటి ఉగ్రవాద చర్య అనటంలో సందేహం లేదు, అయితే ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం మాత్రమే కాదు. రాజ్యాంగ విలువలపై ఆధారపడి ఆధునిక భారత నిర్మాణం దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై ఆరెస్సెస్ వేసిన గొడ్డలి వేటు.
గాంధీ హత్య క్రమాన్ని వివరిస్తూ లెఫ్ట్ వర్డ్ ముద్రించిన పుస్తకానికి రాసిన పరిచయంలో తీస్తా సెతల్వాద్ రాసినట్టుగా, బియాండ్ డౌట్: ఎ డాసియర్ ఆన్ గాంధీస్ అసాసినేషన్ (తులికా, 2015, పేజీ 1), ఈ చర్య
'యుద్ధ ప్రకటన, ఉద్దేశ్య ప్రకటన, హత్యకు కుట్ర పన్నిన ఆ శక్తులకు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడంలో ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు లౌకిక, ప్రజాస్వామ్య భారతంపై శాశ్వత యుద్ధంలో ఎలా ఉండబోతున్నాయో ప్రకటించింది. అంతే కాదు. ఆధునిక లౌకిక భారత విలువల కోసం కట్టిబడి ఉన్న వారిపట్ల కూడా హైందవరాజ్య నిర్మాణం కోసం అంకితమైన వారిపట్ల ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు ఎలా వ్యవహరించబోతున్నాయో తెలియచెప్పే బహిరంగ ప్రకటన'' అని గుర్తు చేశారు.
జాగ్రత్తగా పరిశీలిస్తే, స్వాతంత్య్రానంతర కాలంలో హిందూత్వ మతోన్మాద గ్రూపులు ప్రారంభించిన దుర్మార్గపు విద్వేష ప్రచారానికి ఈ హత్య పరాకాష్టగా చెప్పవచ్చు. ఈ హిందూత్వ శక్తులు 'వ్యవస్థీకృత' మత హింసను ప్రత్యక్షంగా రెచ్చ గొట్టడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయో చూపించడానికి తగినన్ని డాక్యుమెంటరీ రుజువులు, సాక్ష్యాధారాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకులలో ఒకరైన హిందూ మహాసభ నాయకుడు బిఎస్ మూంజే జిన్నాను ఎదుర్కోవడానికి 'మేము శాస్త్రీయ ప్రాతిపదికన హింసను పాల్పడవలసి ఉంటుంది' అని అభిప్రాయపడ్డారు. అఖిల భారత హిందూ మహాజాతి సమ్మేళనం (అఖిల భారత హిందూ మహాసభ పేపర్లు, ఫైల్ సి-105/46, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ, ఆర్ఎస్ఎస్, పాఠశాల పాఠ్యపుస్తకాలు, మహాత్మా గాంధీ హత్య, ఎడిట్ చేసిన వారు ఆదిత్య, మృదుల ముఖర్జీ, సుచేత మహాజన్, పేజీ 60) లో మూంజే చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని వక్కాణించారు.
అదే పుస్తకంలో ప్రస్తావించిన మరో అంశాన్ని ప్రస్తావిస్తే తమ లక్ష్య సాధన దిశగా సాగించే ప్రయాణంలో ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారన్న కఠోర వాస్తవం వెలుగులోకి వస్తుంది (పేజీ 65). హిందువుల ప్రయోజనాలకు ద్రోహం చేస్తున్నారని హిందూ మహాసభ కార్యకర్తలు జాతీయ నాయకులపై ఆనాడే బహిరం గంగా అభియోగాలు మోపారు. నెహ్రూ, పటేల్, ఆజాద్‌లను ఉరితీస్తామని వారు బెదిరించారు. హిందూ మహాసభ సమావేశాలలో గాంధీ ముర్దాబాద్ (గాంధీకి మరణం) అనేది సాధారణ నినాదంగా ఉండేది. ఇంటెలిజెన్స్ విభాగం 18 డిసెంబర్ 1947 నాటి (ఢిల్లీ పోలీస్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్) నివేదిక 50,000 మంది వాలంటీర్లు హాజరైన ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాల్లో గొల్వల్కర్ ఉపన్యాసం గురించి నమోదు వ్యాఖ్య ఇది : 'ఇక్కడ గోల్వాల్కర్ ప్రభుత్వ వైఖరిని 'అన్ ఇండియన్ అండ్ సైతానిక్'గా అభివర్ణించారు.' మరో సందర్బంలో 8 డిసెంబర్ 1947న 2500 మంది కార్మికులతో జరిగిన సమావేశంలో గోల్వాల్కర్ ప్రసంగాలను కూడా కపూర్ కమిషన్ అధ్యయనం చేసింద గాంధీ హత్యపై దర్యాప్తుకు అప్పటి కేంద్ర హోమ్ మంత్రి వల్లభారు పటేల్ స్వయంగా ఈ కపూర్ కమిటీని నియమించారు. కపుర్ కమీషన్ నివేదిక, చాప్టర్ XIX: 66)
సీనియర్ జర్నలిస్ట్ భరత్ భూషణ్ దీనిని ధృవీకరిస్తూ ఢిల్లీ సీఐడీ నివేదిక వివరాలపై ఓ ప్రత్యేక నివేదిక రూపొందించారు. ఈ నివేదిక కూడా కపూర్ కమీషన్ నిర్ధారణలను పరిపుష్టం చేసింది. భరత్ భూషణ్ అధ్యయనం ప్రకారం 'గాంధీని చంపేస్తానని వివిధ సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ గోల్వాల్కర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. డిసెంబర్ 1న మధురలో యాభై మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నాయకులను హత్య చేయడం గురించి చర్చించారని ఆరోపించిన లక్నో సీఐడీ లేఖ వివరాలను కూడా కథనంలో పొందుపరిచారు.'
గాంధీ హంతకులు తమ నేరపూరిత చర్యను ఎలా సమర్ధించుకున్నారు ?
గాడ్సే గాంధీని హత్య చేయటానికి, 'దేశ విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు బకాయిపడిన రూ. 55 కోట్ల మొత్తాన్ని విడుదల చేయమని భారత ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి గాంధీజీ చేసిన నిరాహార దీక్షపై అతని ఆకస్మిక ప్రతిస్పందన' అని వివరణ ఇవ్వడం తరచు మనకు కనిపిస్తుంది. అదే నిజమైతే గాంధీ నిరాహారదీక్ష గురించి ప్రస్తావించడానికి ముందే డిసెంబర్ లో మధురలో ఆరెస్సెస్ కార్యకర్తల శిబిరం కాంగ్రెస్ నాయకత్వం హత్య గురించి ఎందుకు చర్చిస్తుంది?
వాస్తవం ఏమిటంటేన్1930 దశకం నుంచి, హిందూత్వ అగ్ర నాయకులు గాంధీని హతమార్చేం దుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు, సందర్భాలలో గాడ్సే ప్రత్యక్ష పాత్రధారి. సీనియర్ గాంధీయవాది చునిభారు వైద్య తన గ్రంధంలో ''1934వ సంవత్సరం నుంచి ప్రారంభమై పద్నాలుగు సంవత్సరాల కాలంలో, గాంధీజీని హతమార్చేందుకు దాదాపు ఆరు సందర్భాలలో ప్రయత్నాలు జరిగాయి. చివరిగా గాడ్సే జనవరి 30, 1948న చేసిన ప్రయత్నం విజయవంతమైంది. మిగిలిన ఐదు ప్రయత్నాలూ 1934 జూలై - సెప్టెంబర్ మధ్య జరగ్గా, రెండో ప్రయత్నం 1944, సెప్టెంబర్‌లోనూ, మూడో ప్రయత్నం 1946 సెప్టెంబర్ లోనూ, 20 జనవరి 1948న జరిగాయి. 1934, 1944 మరియు 1946లలో విఫలయత్నాలు జరిగినప్పుడు, విభజనకు సంబంధించిన ప్రతిపాదన గానీ, పాకిస్తాన్‌కు 55 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించిన అంశం అస్సలు చర్చలోనే లేదు.'' అని గుర్తు చేశారు. (చునీభారు వైద్య: హాంతకుడే అమరుడైన వేళ : గాంధీ లేదా గాడ్సే, పేజి 61, బియాండ్ డౌట్ ప్రచురణలు).
భారతీయ ప్రజానీకం అనేక విధాలుగా బ్రిటిష్ వలసవాదులతో పోరాడుతున్న కాలం. కాంగ్రెస్ మాత్రమే కాక సోషలిస్టులు, కమ్యూనిస్టులు కూడా వలస పాలకులపై ధవజమెత్తుతున్న కాలం అది. అంబేద్కర్-పెరియార్-మంగూ రామ్-అచ్యుతానంద్ మొదలైన సామాజిక విప్లవకారులు కూడా సామాజిక విముక్తి కోసం పోరాటాలను ప్రారంభిస్తున్న కాలం.
ఈ పోరాటాలకు వ్యతిరేకంగా, హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని హిందుత్వ శక్తులు తమ సంస్థల నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరించారు. మతపరమైన మార్గాల్లో ప్రజలను విభజించే ప్రణాళికలు రూపొందించడంలో నిమగమై ఉన్నారు. అహ్మదాబాద్‌లో 1937లో జరిగిన హిందూ మహాసభ 19వ వార్షిక సమావేశాల్లో అధ్యక్ష ప్రసంగంలో సావర్కర్ భారతదేశం రెండు దేశాలతో కూడినదని ప్రకటించడం మనం మరచిపోగలమా? ఒక సంవ త్సరం తరువాత సావర్కార్ ''భారతదేశంలో హిందువులే ఒక జాతి. ముస్లింలు ఓ మైనారిటీ సమాజం.' అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఏజీ నూరానీ తన సావర్కర్, హిందుత్వ గ్రంధం ద్వారా వెలుగులోకి తెచ్చారు.
సావర్కర్ ద్విజాతి సిద్ధాం తాన్ని ప్రతిపాదించిన రెండేండ్ల తర్వాత 1939లో జిన్నా తన రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
కాలక్రమేణా, గాంధీ కృషి కారణంగా భారతదేశం బహుళజాతుల సమ్మేళనం అన్న ఆలోచన స్వాతంత్య్రోద్యమంలో వేళ్లూనుకుందన్నది వాస్తవం. తత్ఫలితంగా ఏదో ఒక గందరగోళం చేయకపోతే తామనుకున్న పద్ధతుల్లో దేశాన్ని హిందూ రాష్ట్రంగా తీర్చి దిద్దాలన్న ప్రయత్నాలు గట్టెక్కే అవకాశం లేదని హిందుత్వ యోధులకు అర్ధం అయ్యింది. గాంధీ విషయంలో ఆరెస్సెస్ ద్వంద్వ వ్యూహాన్ని అనుసరించింది.
మొదటిది, జాతీయత భవన. భారత జాతీయత బహుళజాతుల లౌకిక సంగమమా లేక సంఖ్యాపరంగా ఆధిపత్య మతస్తుల ఆధారంగా భారత జాతీయతను నిర్వచించాలా అన్న చర్చను ప్రేరేపించడం, రెండవది, హిందూయిజం గురించిన గాంధీ అవహాగనపై సైద్ధాంతిక దాడి చేయటం. గాంధీ దృష్టిలో హిందూయిజం అంటే 'సర్వ్ ధర్మ సమ భావన'. ఈ అవగాహన హిందుత్వ వాదుల అవగాహనకు పూర్తి భిన్నమైనది. వ్యతిరేకమైనది. ముప్పైల దశాబ్దంలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల బలిదానానికి కూడా దేశం సాక్షిగా నిలిచింది. ఇదే కాలంలో బాల్య దశలో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమం ఇచ్చిన సంపూర్ణ స్వరాజ్య నినాదం తర్వాతి కాలంలో కాంగ్రెస్ మహాసభల నినాదంగా మారింది. అంతిమంగా కరాచీ వార్షిక సమావేశాల్లో కాంగ్రెస్ ఈ నినాదం ఇవ్వక తప్పలేదు. సర్దార్ వల్లభారు పటేల్ అధ్యక్షతన జరిగిన కరాచీ కాంగ్రెస్ కూడా రాష్ట్ర మతపరమైన తటస్థతను పాటించాలని పిలుపునిచ్చారు.
పైన పేర్కొన్న తన పుస్తకంలో, తీస్తా సెట్లవాడ్ ''కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలకు మత సామరస్యం ఎలా కేంద్రంగా ఉందో'', ''మెజారిటేరియన్ , మైనారిటీ మతతత్వ శక్తులు తమ సంకుచితత్వాన్ని, ద్వేషాన్ని పెంచే వ్యూహాలను రూపొందించారో వివరిస్తోంది.
గాంధీ హత్య - ఆరెస్సెస్ అన్న తన విశ్లేశనాత్మక వ్యాసంలో బదరీ రైనా సావర్కర్ మరియు గోల్వాల్కర్ 'జాతీయత్వం' గురించి వ్రాసిన వాటిని ఉటంకిస్తూ ''సంయుక్త హిందూ/ఫాసిస్ట్ శిబిరం గాంధీ నిర్మూలన 'జాతీయవాద' కర్తవ్యంగా భావించారు. ఇక్కడ జాతీయవాదపు అవసరం అంటే ఆరెస్సెస్ ప్రతిపాదించిన హిందూ రాష్ట్ర నిర్మాణపు అవసరం). స్వతంత్ర భారతపు రూపు రేఖలు, తాత్విక దృక్పధం ఎలా ఉండాలన్న దానిపైనే ఆరెస్సెస్ శిబిరానికి, గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఉద్యమానికి మధ్య కీలక విబేధాలున్నాయి. మహా సభ/ఆర్ఎస్ఎస్ దృక్పథం ఇంత కంటే సారూప్యతతో ఎక్క డా లేదు. ఈ సమస్యపై సావ ర్కర్ (1938, నాగ్ పూర్ సెషన్), గోల్వాల్కర్ మేము, అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్, 1938లో ఏమి చెప్పారో గుర్తు చేసు కోవాల్సిన అవసరం ఉంది. ''ప్రాదేశిక జాతీయతను సమర్థి స్తూ మౌలికమైన హైందవ జాతీయతను తుంగలో తొక్కడం కాంగ్రెస్ వాదులు చేస్తున్న ఘోరమైన పాపం. రాజకీయ తప్పిదం. ప్రాదేశిక జాతీయత ఓ ఎండమావి. మత, జాతి, సాంస్కృతిక, చారిత్రక అనుబంధాలు హిందువులైన మనల్ని ఒక జాతిగా సన్నిహితం చేస్తున్నాయి. కాబట్టి హిందువులమైన మనం మనమే ఒక దేశం'' అని గోల్వాల్కర్ వాదించారు. ఇంకా తన వాదనను ముందుకు తీసుకెళ్తూ
గోల్వాల్కర్: ''భారతీయులు మొదటిసారిగా ఒక జాతిగా జీవితాన్ని గడపబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ భూభా గంలో నివసించేవారంతా ఒకే జాతి అన్న వాదన కూడా ప్రచారంలో పెడుతున్నారు. వాళ్లంతా ఐక్యంగా ఉండాలని అటువంటి సమైక్య జాతీయత పునాదిగా రాజ్యాంగ బద్ధమైన పద్ధతుల్లో స్వాతంత్య్ర సాధన కోసం కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. ఓ తప్పుడు ప్రజాస్వామిక అవగాహన కారణంగానే ఈ వాదనలు ముందుకొస్తున్నాయి. మన దేశాన్ని ఆక్రమించిన వారితో కలిసి భారతీయత అన్న కిరీటాన్ని పంచుకోవాలని చెప్తున్నారు. వారితో చేతులు కలపడానికి వారిని గెలవడానికి ప్రయత్నించాము. ఇటువంటి ప్రయత్నాల ఫలితం మనకు తెలిసిందే. మన చేతులతోనే మన (హైందవ) జాతీయత గొంతు నులుముతున్నాము.'' అని రాశారు.
ఈ విధంగా, సావర్కర్ నుంచి గోల్వాల్కర్, దేవరాస్, ప్రస్తుత 'సాంస్కృతిక జాతీయవాదుల' వరకు దేశం నిర్దిష్ట సరిహద్దులకు లోబడి జీవిస్తున్న వారంతా భారతీయులే అన్న భావనకు వ్యతిరేకంగా భారత జాతీయతకు మతం పునాదిగా ప్రతిపాదిస్తూ వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం వెనక దాగివున్న ఆరెస్సెస్ అసలు లక్ష్యం ఈ అవగాహనే. హిందూ-ముస్లిం ఐక్యత లేకుండా సాధించే స్వరాజ్యం అసంపూర్ణంగా ఉండదని నమ్మడం, వాదించటమే గాంధీ చేసిన తప్పు. ఆ తప్పుకు దేశం చెల్లించిన మూల్యమే గాంధీ హత్య. ఆ హత్య వెనుక దాగిన తాత్విక మోసపూరిత కుట్రను అర్దం చేసుకునే ప్రయత్నం చేయకపోవడమే నేడు దేశం చెల్లిస్తున్న మూల్యం.
- కొండూరి వీరయ్య, 9871794037
Sun 30 Jan 02:07:45.508089 2022