ప్రపంచంలో ఎన్నో జాతులు, ఎన్నో భాషలు.. అందరి మధ్య, అన్నిటి మధ్య అవగాహన, సహకారం అవసరం. ఒకజాతి విజ్ఞానాన్ని, తాత్విక సిద్ధాంతాలను మరోజాతి అందిపుచ్చుకున్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఒకదేశ ప్రగతిని మరోదేశం అవగాహన చేసుకుని, అదేబాటలో నడిచినప్పుడే ముందడుగు వేస్తుంది. అంతేకాదు ప్రతి జాతి, దేశం.. తమ వారసత్వ సంపదను తర్వాతి తరానికి అందించాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో 1972-76 సంవత్సరాలలో జరిగిన సమావేశాల్లో ద్విభాషా విద్యాబోధనను గుర్తించి, అందుకు సంబంధించిన తీర్మానాలను ఆమోదించింది.
(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా )
ఎన్ని బంధాలో.. ఎన్ని అందాలో..!.భాష ఒక భావ వ్యక్తీకరణ సాధనం అని సాధారణంగా దృష్టికి అనిపిస్తుంది.కానీ, దానితో మనకు అంతకు మించిన బంధం ఉంటుంది. మనవైన అవసరా లను మన భాష మాత్రమే అర్ధం చేసుకుంటుంది. అర్థమయ్యేలా చెబుతుంది...
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవేటికి రా!
- కాళోజీ
ఒక జన సమూహం ఫలానా వాళ్లు. అని గుర్తించటానికి మొట్టమొదటి కొండగుర్తు వారు మాట్లాడే భాష. భాష మన శ్వాస. భాష మన అస్థిత్వం. దానిని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం. ఒక జన సమూహానికి తొలి గుర్తింపు భాష ద్వారానే వస్తుంది. మరి కాలక్రమేణా ఆ భాష వాళ్లు అనేక భాషలు నేర్చుకొని- అసలు భాషను, అదే అమ్మ భాషను వదిలేస్తే వారు ఏమవుతారు? తమ తొలి సమూహం నుంచి దూరమవుతారు.
మీరెవరు? అంటే- ఎవరో చెప్పుకోలేని పరిస్థితి దాపురిస్తుంది. అది మన అస్థిత్వాన్నికే ప్రమాదం. అందుకనే- ప్రపంచంలోని ఏ తీరం చేరినా, బతకటానికి ఎన్ని భాషలు నేర్చినా అమ్మ భాషను మర్చిపోకూడదు. మన మూలం ఎక్కడంటే మన మాతృ భాషే అని గర్వంగా చెప్పుకోవాలి.
ఘనమైన భాష తెలుగు భాష
మన అమ్మ భాష తెలుగు. పదిహేను వందల ఏండ్ల చరిత్ర కల్గింది మన తెలుగు భాష. అందుకే మన భాషకు ప్రాచీన భాష హోదా దక్కింది. తెలుగులో విస్తారమైన సాహిత్యం ఉంది. అనేక సాహిత్య ప్రక్రియలు శాఖోపశాఖలై వర్ధిల్లాయి. జనజీవన స్రవంతిలోకి సజీవ పాయలుగా ప్రవహించాయి. పద్యాలూ, పాటలూ, కథలూ కావ్యాలూ, నాటకాలూ నాటికలూ, ప్రబంధాలూ మహా గ్రంథాలూ... ఆయా కాలాలను, జనజీవనాన్ని చిత్రించాయి. అన్నిటా తీయతీయని తెలుగు పలుకు వేకువల వెల్లువలా ప్రవహించింది. ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగు మాట్లాడతారని ఒక అంచనా. దేశంలో ఎక్కువగా మాట్లాడే మూడు ప్రధాన భాషల్లో తెలుగు ఒకటి. ఇవన్నీ మనం ఘనంగా చెప్పుకోవటానికి దోహదపడే సంగతులు, కానీ, తెలుగు వాడుకు రోజురోజుకూ తరిగిపోతుందన్నది పచ్చి నిజం. ఇన్ని కోట్ల మంది మాట్లాడ భాష ఎలా ఉనికిని కోల్పోయింది వంటి అనేక ప్రశ్నలు తలెత్తక మానవు. ప్రమాదం వచ్చినప్పుడే స్పందిస్తానంటే కుదరదు కదా. ఇప్పటి తరానికి అమ్మభాషను దూరం చేస్తున్నారు. భవిష్యత్తులో మన భాషలో మాట్లాడే వారు అంతరించిపోతే భాష కూడా అంతరించిపోతుంది కదా. వెంటనే పెను ప్రమాదం లేకపోయినా కొన్నేళ్లకు ప్రాభవం కోల్పోయే భాషల్లో తెలుగు కూడా ఉందన్న యునిసెఫ్ హెచ్చరిక తక్కువ చేయలేము.
ఎన్ని బంధాలో.. ఎన్ని అందాలో..!. భాష ఒక భావ వ్యక్తీకరణ సాధనం అని సాధారణ దృష్టికి అనిపిస్తుంది. కానీ, దానితో మనకు అంతకు మించిన బంధం ఉంటుంది. మనవైన అవసరా లను మన భాష మాత్రమే అర్ధం చేసుకుంటుంది. అర్థమయ్యేలా చెబుతుంది.
సొంత పలుకులోనూ ఆధిక్య ఘోష
అమ్మభాష అంటే ఎవరి అమ్మ భాష అనేది. కూడా ఒక ప్రశ్న ప్రాథమికంగా మనది తెలుగు ప్రాంతాలను బట్టి, సామాజిక దొంతరలను బట్టి భాషా వాడుకల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ప్రపంచం మీద ఇంగ్లిషు ఆధిపత్యం ఉన్నట్టే- స్థానికీయ భాషల పైనా ఆ భాషలోని ఆధిపత్య తరగతుల ప్రాబల్యం, ప్రభా వమూ ఉంటుంది. దానిని సవరించి, సరైన పద్ధతిలో వాడటానికి ప్రజాస్వామిక దృష్టి అవసరం అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా ఏదీ సరైంది. కాకపోవొచ్చు.. మంచిచెడ్డల విచక్షణ, వివేచన. తరువాతే మాటలను వాడడం అవుతుంది. వివక్షను గుర్తించిన తరువాత ఆ పదాన్ని పూర్తిగా వాడడం మానేయటమే ఉత్తమ పద్ధతి, కొన్ని కులాలను, మహిళలను తక్కువ చేసేవి, కొన్ని వృత్తులను హేళన చేసేవి మన అమ్మ భాషలోనూ బోలెడు సామెతలూ, పదబంధాలూ ఉన్నాయి. వాటన్నిటినీ వాడుకలోంచి తొలగించాలి. మనందరి భాషగా మన పలుకుబడిని సంస్కరిం చుకోవాలి.
అవునన్నా, కాదన్నా నేడున్నది హద్దులు చెరుగుతున్న ప్రపంచం జీవిక కోసం, అవకాశాల కోసం ఎక్కడివారు ఎక్కడికైనా వెళ్లాలి. అక్కడ రాణించాలి. జీవించాలి. దానికోసం ఇంగ్లీషు భాష అనివార్యం. ఆ అవసరానికి అనుగుణంగా సిద్ధపడుతూనే అమ్మ భాష అక్కున పెట్టుకొనే నిర్వర్తించాలి. ఈ పని ఇంటా, బయటా, బడిలో మూకుమ్మడిగా జరగాలి. దీనిలో ప్రభుత్వాలదే ప్రప్రథమ బాధ్యత. పిల్లలకు ప్రాథమిక విద్యను అమ్మభాషలోనే అందివ్వటం దాని తొలి మెట్టు. సొంత భాషలోనే మనం ఎక్కువ ఆలోచించగలం... ఎక్కువ ఊహించగలం.. ఎక్కువ నేర్చుకోగలం. ఇది. అంతర్జాతీయంగా అనేక పరిశోధనల తరువాత విద్యావేత్తలు నిర్ధారించిన నిజం ఇది. తొలుత అమ్మ భాషలో నిర్మాణ సూత్రాలు తెలిస్తే దాని ఆధారంగా ఇతర భాషలు నేర్చుకోవటం సులభం. పిల్లలకు మొదటి నుంచీ ఆంగ్ల మాధ్యమం అలవాటు చేస్తే మాతృభాషా పరిజ్ఞానం లేకుండా పోతుంది. భాష అంటే- మాట్లాడడం ఒక్కటే కాదుë ఆ భాషా కళ్లద్దాల్లోంచి మన సంస్కృతిని, సంబంధాలను, మూలాలను అర్థం చేసుకోవటం. ఆ పరిజ్ఞానం. ఉండాలంటే సంభాషణకు మించిన సాహిత్యం, చరిత్ర తెలియాలి. దానికి తెలుగు చదవడం, రాయటం తెలియాలి. ఈ అంశానికి సంబంధించే చాలా వేగంగా సమస్య ముంచుకొస్తోంది. తెలుగు మాట్లాడేవారు ఉన్నా- చదివేవారు, రాసేవారు. తగ్గిపోతున్నారు. ఇప్పటికే తెలుగేతర ప్రాంతాల్లో ఈ సంఖ్య గణనీయంగా ఉంది. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఆంగ్ల మాధ్యమం మూడు దశాబ్దాలుగా విస్తారంగా నడుస్తోంది. తరువాత ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం మొదలైంది. ఈ చర్యలతో తెలుగు నేర్వని తరాలు. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పరిణామాలు అమ్మభాషకు చాలా ప్రమాదకరమనేది.
ప్రపంచమే కుగ్రామం
ప్రపంచీకరణ యుగంలో ప్రపంచమంతా ఓ గ్రామం అయిపోయింది. సేవలూ, సంభాషణలూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సాగటం సహజమైంది. ఈ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రభ తగ్గటానికి కారణం కాదు. నిజానికి ఆంగ్ల మాధ్యమం పట్ల అంతటి ఆసక్తిని రేకెత్తించటంలో ఏండ్ల తరబడి పాలకులు నిర్లక్ష్యమే మూల కారణం. ప్రభుత్వ పాఠశాలలను అనేక రూపాల్లో నిర్వీర్యం చేయటం, కొత్త అవసరాలకు అనుగుణంగా.. వాటిని బలోపేతం చేయకపోవడంతో తల్లిదండ్రులు ప్రయివేటు వైపు మొగ్గటం ప్రారంభించారు. ఇప్పటికైనా పాలకులు తెలుగులోనే ప్రాథమిక విద్యను తెలుగులో అందించటం, తరువాత తెలుగు ఒక అంశంగా బోధించటం చాలా అవసరం. నూతన ప్రపంచానికి అనుగుణంగా మనం సన్నద్ధం అవుతూనే సొంత ఉనికిని, ఆస్ధిత్వాన్ని, భాషా సంస్కృతుల పరిరక్షణ మనందరి భాద్యత. ప్రభుత్వాలు తన బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సందర్భంలో ప్రజలు, భాషాభిమానులు జాగరూకులై ఉండాలి.
మధుర మధురమైన మన భాష కంటెను
చక్కనైన భాష గతి లేదు
తల్లి పాల కంటె తనయులకే పాలు
బలమునీయగలవు తెలుగుబిడ్డ
- నార్ల
కలిసి కట్టుగా ఉద్యమం చేయాలి....
మార్పును కాంక్షిచేముందు ఉద్యమాన్ని నిర్మించే స్వరూప స్వభావం ప్రజలకు ముందుగా తెలియాలి. పరభాషల ప్రాధాన్యత వల్ల మాతృభాషకు ప్రమాదం ఉంటుందనే వాస్తవం తెలుసు కోవటంతో ఆగకుండా భాష పరిరక్షణ ఉద్యమం ప్రజలు నిర్మిస్తే తప్ప ప్రభుత్వాలు కళ్ళు తెరవవు. విద్యా వ్యవస్థ అంతట మాతృ భాషను అమలు చేయకపోగ భాషను భుక్తికి పరిమితం చేసే ప్రమాదాన్ని ఎదురు కోవలసి ఉంటుంది. మాతృ భాషను మింగే పర భాషల ప్రాధాన్యం విద్యా వ్యవస్థ లోకి పాలకులు జోపించటమే కాదు ప్రజల సహజ స్వభావల్ని మళ్లీస్తారు కూడ. భాష ఉద్యమం కోసం ప్రజలు, భాషా సంఘాలు సాహిత్య సాంస్కృతిక సంస్థలు సామజిక ఉద్యమ కార్యకర్తలు కలిసి కట్టుగా ఉద్యమం నిర్మిస్తే తప్ప మాతృభాషను సుసంపన్నం చేసుకోలేము.
- డా|| నాళేశ్వరం శంకరం
ప్రముఖ కవి, తెరసం రాష్ట్ర అధ్యక్షులు.9440451960
భాషను పరిరక్షించుకునే విధి విధానాలు అవసరం
భాషను పరిరక్షించు కోవడానికి కావలసిన విధివిధానాలు ప్రభుత్వాలకు ఉండాలి. లాంగ్వేజి పాలసీ పెట్టడంతో పాటు మాతృ భాషను కాపాడుకావడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రసారమాధ్యమాల్లో తెలుగు వాడకం, పత్రికల్లో తెలుగు వాడకం, వీటన్నిపట్ల చొరవ తీసుకోవాలి. దానికి తోడు తెలుగును ప్రత్యేకంగా కాపాడు కోవడానికి నిఘంటువులు ముద్రించుకోవాలి. ఆయా మాండలికాలకు సంబంధించినటువంటి పదజాలాన్ని అచ్చువేయాలి. వీటన్నింటి పట్ల ప్రభుత్వం తగిన శ్రద్ద తీసుకోవాలి. అలా చేయకుండా ఇంగ్లీష్ మీడియం మీద దుమ్మెత్తిపోస్తే తెలుగు మీద భాష మీద ప్రేమ ఉన్నట్టా...! ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం కూడా ఇతర భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాతృ భాష దినోత్సవం సందర్భంగా నైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. తెలుగు భాష అంతరించి పోవచ్చు అనేది భ్రమ. దేశంలో చదువులేని జనాభే సగం ఉన్నది. దేశంలో సగం మంది నిరక్షరాసులే ఉన్నారు. దేశంలో తెలుగు అంతరించి పోతదన్నది భమ్ర. ఇదంతా అగ్రవర్ణాల కుట్ర. స్వచ్చమైన తెలుగు భాష కూలి తల్లి మాటల్లో బతుకుంటది. నిజాయితీగా ప్రభుత్వాలు పూనుకొని భాష పాలసీలను తీసుకొస్తే తప్ప మాతృభాషకు పూర్తి గౌరవం దక్కదు.
- డా|| పసునూరి రవీందర్, 7702648825
ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి!
ఇవ్వాళ మాతృభాష రక్షణ బాధ్యత కేవలం బహుజనులదే అన్నట్టుగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో 95 శాతానికి పైగా విద్యార్థులు ఈ సామాజిక వర్గాలవారే. ఈ పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధిస్తే చాలు తెలుగు బతుకుతుంది అన్నట్టుగా కొంతమంది ఉద్యమకారులు ఆలోచిస్తున్నారు. అది తప్పుడు అవగాహన. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెడతామని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందునుంచే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభించింది. దీనివల్ల కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా తెలుగుకు వచ్చిన తక్షణ ప్రమాదమేమీ లేదు.
అవును మాతృభాష రక్షణకు ఇప్పుడొచ్చిన ప్రమాదమేమి లేదు. ఎందుకంటే ఇప్పటికీ సినిమాలు, టీవీలు, సోషల్ మీడియా, వివిధ పత్రికల వల్ల ప్రాంతీయ మాండలికాలు కూడా గౌరవానికి నోచుకుంటున్నాయి. భాషకూ ప్రాచుర్యం దక్కుతోంది. ఈ గౌరవం ఇంకా ఇనుమడించాలంటే ఇప్పుడున్న తెలుగు పాఠకులకు మరిన్ని మంచి పుస్తకాలు అందుబాటులోకి తేవాలి. అట్లా పుస్తకాలు అందుబాటులోకి రావాలంటే కనీసం తెలుగులో అచ్చయ్యే పుస్తకాలను ఒక కమిటీ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసి కనీసం వెయ్యి కాపీలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఏండ్ల నుంచి ఈ పనిని చేస్తున్నాయి. అట్లా చేసినట్లయితే మంచి సాహిత్యం ప్రజలకు మరింత చేరువవుతుంది. భాషకూ ప్రాచుర్యం దక్కుతుంది. అంతేతప్ప పాఠశాలల్లో, అదీ కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క తెలుగు మీడియంలో మాత్రమే విద్యాబోధన ఉండాలనడం విజ్ఞతలేని వాదన. ఇవాళ ప్రజలకు భాషను రక్షించుకోవడం కన్నా పొట్టను పోషించుకోవడం ప్రధానమైన పని. ఉపాధి ఇంగ్లీషు భాష ద్వారానే ఎక్కువగా ఉన్నదని గుర్తించాలి.
- సంగిశెట్టి శ్రీనివాస్, 9849220321
ఏ భాషనూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు
మన భాషను కాపాడుకోవటమంటే ఏ భాషనూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. భాష కేవలం పదాల, పదబంధాల, వ్యాకరణాల వ్యవహారం కాదు. అది ఆ జాతి ప్రజల ఆత్మ. అంతరాత్మ కూడా.అందుకనే తెలుగు భాషా వికాసం ఇక్కడి తెలుగు ప్రజల వికాస పరిణామంలో మాత్రమే చూడగలుగుతాము. మూడు వేల ఏండ్ల చరిత్ర కలిగిన జాతి తెలుగు ప్రజలది. ఎంత క్లిష్టమైన భావాన్నైనా గొప్ప అభివ్యక్తితో స్పష్టం చేయగల శక్తి తెలుగుభాషకుంది. సమాజం మారుతున్నట్టుగానే భాషా సాహిత్యాలూ మార్పుకు గురౌతాయి. భాషలను నేర్చుకోవ టానికి పరిమితులనూ విధించుకోకూడదు. మన భాష పట్ల అభిమానం ఉండవలసిందే కానీ దురభిమానం తగదు.
ఇక తెలుగు భాషను ప్రేమించడం, రక్షించడమంటే ఇతర భాషా పదాలను ఏదీ వాడకుండా ఇముడ్చుకోకుండా కృతకంగా తయారు చేసుకోకూడదు. నూతన భావాలు, ఆలోచనలు శాస్త్రాలకు అనుగుణంగా నూతన పదబంధాలు, అన్యభాషాపదాలు వచ్చి చేరుతాయి. వాటిని ఆహ్వానించాలి. తెలుగుతనంలో ఉండాలి కానీ, తెలుగులో ఏ భాషా పదం చేరకూడదనే ఆలోచన సరికాదు. భాషను నిత్యం ఆధునీకరించుకుంటేనే సజీవంగా నిలుస్తుంది.
- కె. ఆనందాచారి,
తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,948787660
- అనంతోజు మోహన్ కష్ణ
Sun 20 Feb 02:09:56.178226 2022