లిపి కనుక్కున్న తర్వాత మానవుడు తను సంపాదించిన జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని, అనుభవాల నుంచి రూపొందించిన సూత్రాలన్నిటిని లిఖితబద్ధం చేసి తర్వాతి తరాలకు అందించడం అనే ఒక విధానానికి శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచే లిఖిత సాహిత్యం కూడా అందుబాటులోకి వచ్చింది.
''సహితస్య భావః సాహిత్యః'' అనేది పూర్వీకులు చెప్పిన మాట! అందుకే వేలాది సంవత్సరాల సాహితీ ప్రస్థానాన్ని గమనిస్తే, సాహిత్యానికి ప్రధానంగా రెండు ప్రయోజ నాలున్నాయని తెలుస్తుంది. 1) ప్రజల్లో, పాఠకులలో, వారి మనసుల్లో, కార్యాలలో, కార్యాచరణలో క్రియాశీలతను, చైతన్యాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగించడం. 2) వారిలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించడం ద్వారా సామాజిక ప్రయోజనాన్ని, లోక కళ్యాణాన్ని సాధించడం. అందుకే ప్రపంచం మొత్తం మీద మానవాళి ప్రస్థానంలో ఎన్నో కళా రూపాలు, ఎన్నో సృజనాత్మక వ్యాసంగాలు క్రమంగా ఏర్పడినప్పటికీ వీటన్నిటిలోనూ లిఖిత బద్ధమైన సాహిత్యమే ప్రధానాంశంగా కొనసాగుతూ వస్తోంది.
కాగా సాహిత్యం మనకు మొదటి నుంచి రెండు రూపాల్లో కనిపిస్తుంది ఒకటి మౌఖిక సాహిత్యం మరొకటి లిఖిత సాహిత్యం! ఒక జాతికి సంబంధించిన జీవన అనుభవాలు, ఒక వ్యక్తి, ఒక తరానికి సంబంధించిన సంఘటనలు, ఎదుర్కొన్న విషయాలు వాటి నుంచి రాబట్టిన జీవన సారాంశం అంతా సాహిత్య రూపంలో క్రోడీకరించడం అనేది జరుగుతూ వచ్చింది. దాంట్లో భాగంగానే మనకు మౌఖిక సాహిత్యంలో ఆదిమ జాతుల కాలం నుంచి, భాష రూపొందిన కాలం నుంచి కూడా ఒక తరం నుంచి మరొక తరానికి ఆశువుగా మౌఖిక సంప్రదాయంలో మొదలైన సాహిత్యం సామాన్య జనాలందరికీ హితోక్తిగా, ఒక మంచి మాటగా, ఒక చుక్కాని లాగా, దిక్సూచిలాగా ఉంటూ వచ్చింది.
లిపి కనుక్కున్న తర్వాత మానవుడు తను సంపాదించిన జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని, అనుభవాల నుంచి రూపొందించిన సూత్రాలన్నిటిని లిఖితబద్ధం చేసి తర్వాతి తరాలకు అందించడం అనే ఒక విధానానికి శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచే లిఖిత సాహిత్యం కూడా అందుబాటులోకి వచ్చింది.
లిఖిత సాహిత్యం కూడా ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి, ఒక తరం, ఒక జాతికి సంబంధించిన సామూహిక అనుభవాల సారాంశంగా ఉండటం ఒకటైతే మరొకవైపున కాల్పనికత, సృజనాత్మకతకు ఒక ఊహకి పట్టాభిషేకం చేస్తూ చేసే రచనలుగా కూడా రూపొందడం మరొకటి. ఈ క్రమంలో సాహిత్యం ఎన్నో మలుపులు తిరిగి, మరెన్నో మెరుపులను సాహితీ వినీలాకాశంలో సృష్టించింది. మానవుడి జీవన ప్రస్థానానికి సమాంతరంగా పయనిస్తూ ''మనిషి జీవితం సాహిత్యం'' అనేంతగా ప్రాధాన్యతను సంతరించుకున్నది.
తెలుగు భాషా సాహిత్యాలు-తెలంగాణ పాత్ర
మొత్తం మానవ పరిణామ క్రమంలో మానవుడు సాధించిన ఎన్నో విజయాలలో నిప్పును, వ్యవసాయాన్ని, చక్రాన్ని కనుక్కోవడాన్ని మౌలిక విజయాలుగా చెపుతారు. అయితే వాటితో పాటు అత్యంత గొప్ప ఆవిష్కరణగా సాహిత్యం ఇప్పుడు ప్రపంచ మేధావులందరి చేతా ప్రశంసలు పొందింది. అలాంటి సాహిత్యం ప్రపంచంలోని అన్ని భాషలలో ఆయా జాతి మానవుల సంఘటిత జ్ఞాన, సంస్కృతీ, విశ్వాసాల భాండాగారంగా రూపొందింది. తెలుగు భాష కూడా అందుకు మినహాయింపు కాదు!
అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి చక్కని సాహిత్యం, కాల పరీక్షకు నిలిచి గెలవగలిగిన సాహిత్యం సృష్టించబడింది. పంపన కాలం నుంచి అంటే క్రీస్తుశకం 941 సంవత్సరం నుంచి మొదలుకొని ఇప్పటి వరకూ నిరంతరాయంగా, అవిశ్రాంతంగా తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు, సాహితీవేత్తల చేత వివిధ ప్రక్రియలలో సాహిత్యం సృష్టించబడుతూ వస్తోంది. తెలుగు భాషకు సంబంధించి శాసనాల కాలంలోనూ అంతకు ముందు మౌఖిక సంప్రదాయంలో కూడా తెలుగు భాష పునాదులు వేసుకుంది. శాసనాల అనంతరం కావ్యాల రూపంలో కాల్పనిక సృజనాత్మక సృష్టి రూపంలో కూడా సాహిత్యం తనదైన ముద్ర వేసుకుంటూ ఆ కాలపు ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చెబుతూ దానికి సమకాలీన డాక్యుమెంటేషన్ లాగా సాహిత్యం కొనసాగుతూ వచ్చింది.
ఈ వరుసలోనే శాతవాహనుల కాలంలో, కాకతీయుల కాలంలో, సంస్థానాల కాలంలో, కుతుబ్ షాహీల కాలంలో, అసఫ్ జాహీల కాలంలో, ఆధునిక కాలంలో కూడా తెలంగాణ ప్రాంత కవులు, సాహితీవేత్తలు తమ తమ సృజనాత్మకతతో వివిధ రకాల సాహితీ ప్రక్రియలను సృష్టిస్తూ ప్రతి సందర్భంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అలా తెలంగాణ ప్రాంతం తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియల్లో తొలి కొలువుగా, ఆది నెలవుగా నిలిచింది కూడా!
తెలంగాణ నేల మొట్టమొదటి కందపద్యం కుర్క్యాల శాసనములో కనిపిస్తుంది. అలాగే ఎన్నో ఇతర సాహితీ ప్రక్రియలకు పాదులు వేసింది తెలంగాణ ప్రాంత కవులు కావడం ఇక్కడ గమనారÛం. పాల్కురికి సోమన లాంటి కవులు అచ్చతెనుగు, జానుతెనుగు అనే స్వచ్ఛమైన, నిజమైన ప్రజలు మాట్లాడే వ్యవహారిక గ్రామ్య తెలుగుకు సాహిత్య ప్రతిపత్తిని, కావ్య ప్రతిపత్తిని ఇచ్చిన సందర్భం ఉంది. ఆ తర్వాత పోతన లాంటి కవులు కూడా విభిన్న ప్రయోగాలని నిర్వహిస్తూ వచ్చారు.
అలాగే తొలి గాధాసంకలన కావ్యం (గాధా సప్తశతి-హాలుడు), తొలి సీసపద్య శతకం (చెన్నమల్లు సీసలు -పాల్కురికి సోమన), తొలి శతకం (వృషాధిప శతకం- పాల్కురికి), తొలి లక్షణ గ్రంథం (కవి జనాశ్రయం- మల్లియరేచన), తొలి ద్విపద రామాయణం (రంగనాథ రామాయణం- గోన బుద్ధారెడ్డి), తొలి యక్షగానం (సుగ్రీవ విజయం-కందుకూరి రుద్రకవి), తొలి పురాణం (మార్కండేయ పురాణం-మారన), తొలి చారిత్రక గ్రంథం (ప్రతాపరుద్ర చరిత్రము -ఏకామ్రనాథుడు), తొలి ధ్వ్యర్థి కావ్యం (రాఘవ పాండవీయం - వేములవాడ భీమకవి), తొలి త్య్రర్థి కావ్యం (యాదవ రాఘవ పాండవీయం - ఎలకూచి బాలసరస్వతి), తొలి గజల్ (దాశరథి), తొలి ప్రపంచపదులు (డా|| సినారె) వంటి ఎన్నెన్నో సాహితీ ప్రయోగాలను తెలంగాణా సాహితీవేత్తలే పరిచయం చేసి, తెలుగు సాహిత్య సర్వతోముఖ వికాసానికి, విస్తరణకు దోహదం చేసారు. ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో పుట్టిన సాహిత్యం తెలుగు సాహిత్య పరంపరని మరింత సుసంపన్నం చేయడమే కాకుండా వైవిధ్యభరితంగా, విశిష్ట సహితంగా మార్చగలిగింది.
తెలంగాణా -అకాడమీల ఏర్పాటు
ఇక భారత ప్రభుత్వం భారతీయ సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం 12 మార్చి, 1954 లో కేంద్ర సాహిత్య అకాడమిని ఏర్పాటు చేసింది. ఆ కోవలోనే తెలుగు ప్రాంతంలో తెలుగు భాషా వికాసం, సాహిత్య పరిణామము, ప్రస్థానము గురించి పరిశీలించడానికి, ప్రోత్సహించడానికి, సాహితీవేత్తలను ఉత్సాహపరచడానికి ఆయా కాలాలలో సృజించిన సాహిత్యాన్ని డాక్యుమెంట్ చేయడానికి, పరిశోధన చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 'ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ' ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని ఏండ్ల తర్వాత 1983 ప్రాంతంలో అకాడమీలన్నీ రద్దయిన తర్వాత సాహిత్య అకాడమీ కూడా రద్దు అయి, దాని స్థానంలో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే 1985 నుంచి మళ్ళీ సాహితీవేత్తలు, రచయితలు, సృజనశీలురు చాలా మంది సాహిత్య అకాడమీని పునరుద్ధరించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే అది వేర్వేరు కారణాల వల్ల సాకారం కాకుండా, కేవలం ఆశగానే మిగిలిపోయింది.
2014 జూన్, 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధిని సాకారం చేయాలనే దీక్షను చేపట్టింది. ఆ క్రమంలోనే స్వతహాగా కవి, సాహితీవేత్త, కళాకారుడు కావడం, కళల పట్ల, ప్రజల పట్ల అవ్యాజమైన అనురాగం, ప్రేమ కలిగిన వ్యక్తి కావడం వల్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాహిత్య అకాడమీని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, గౌరవాల సాధన దిశగా ఏర్పాటు చేయాలని భావించారు. ఆ మేరకు భాషా సాంస్కృతిక శాఖ ద్వారా చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ జీవో నంబర్ 344 ద్వారా 02.05.2017 తేదీన అకాడమీలను స్థాపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ జీవో ప్రకారం తెలంగాణ సాహిత్య అకాడమీతో పాటు నాలుగు అకాడమీలను 'తెలంగాణ సంగీత నాటక అకాడమీ', 'తెలంగాణ లలితకళా అకాడమీ', 'తెలంగాణ జానపద అకాడమీ'లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వరుసలో మొదటగా, సాహిత్యం, అక్షరం, మానవ ఆలోచనకు పునాదులు గాను, మానవ పరిణామానికి, మానవ ప్రగతికి తొలి మెట్లు గాను ఉంటాయి. గనుక తెలంగాణ సాహిత్య అకాడమీని 2017లో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
అలా తెలంగాణ రాష్ట్రంలో కవులు, సాహితీవేత్తలు, రచయితలు, వ్యాసకర్తలు, సృజనకారులు చేసిన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో, దానికి ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కలిగించే లక్ష్యంతో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆవిర్భవించింది. దానికి తొలి అధ్యక్షుడిగా ప్రముఖ సాహితీవేత్త డా|| నందిని సిధారెడ్డిని ప్రభుత్వం నియమించింది. వారి సారథ్యంలో తెలంగాణ భాష, సాహిత్యం, చరిత్ర, కవిత్వం ఇతర ప్రక్రియలపైన దాదాపు 120 విశిష్టమైన పుస్తకాలను ప్రచురించడం ద్వారా తెలంగాణ సాహిత్యానికి ఒక నిర్దిష్టమైన అక్షర రూపాన్ని కలిగించే ప్రయత్నం తెలంగాణ సాహిత్య అకాడమి చేసింది.
దాంతోపాటు ముఖ్యమంత్రి సారధ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ''ప్రపంచ తెలుగు మహాసభలు'' 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకు అత్యంత వైభవంగా అంతర్జాతీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో రవీంద్రభారతిలో, లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఇతర వేదికలపై ''నభూతో...'' అన్న రీతిలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో తెలుగు భాష, తెలుగు సాహిత్యము, తెలుగు సాహితీ ప్రక్రియల వికాసంలో తెలంగాణ ప్రాంత కవులు, కళాకారులు, సాహితీవేత్తలు చేసిన కృషిని ఎలుగెత్తి చాటడంలో విజయవంతం అవడమే కాకుండా, తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ సాహితీ మూర్తిమత్వాన్ని, తెలంగాణ సాహితీ విశ్వరూపాన్ని ప్రదర్శించడం జరిగింది.
తెలంగాణ సాహిత్య అకాడమీ-కరోనా కాలం-ఆగని అక్షర యజ్ఞం
తెలంగాణ జాతి పునర్నిర్మాణ చరిత్రలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటే ఒక ఉదాత్తమైన, ఉన్నతమైన వ్యవస్థాగతమైన మార్పుగా నిలిచిపోగా, వైభవోపేతమైన తెలంగాణా సాహితీ పరంపరను కొనసాగిస్తూ తెలంగాణ సాహితీ అవసరాలకు, తెలంగాణ ప్రజాసాహిత్య సంప్రదాయాలకు అనుగుణంగా పని చేసే దిశగా తెలంగాణ సాహిత్య అకాడమి కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేసింది.
ఇదిలా ఉండగా, అనూహ్యంగా 2020 జనవరిలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసి, మానవ జాతి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వ్యక్తులను, వ్యవస్థలను అన్నిటినీ స్థంభింప చేసింది. మార్చి 23, 2020న భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'జనతా కర్ఫ్యూ'ను విధించాల్సి వచ్చింది. ఆ తర్వాత రోజు నుంచే దేశ చరిత్రలో మొట్టమొదటసారిగా 'లాక్డౌన్' విధించారు. ఈ నేపథ్యంలో అన్ని యంత్రాంగాలు, సంస్థలు, వ్యవస్థలు పూర్తిగా నిర్వ్యాపారమై ఎక్కడివక్కడే కుదేలైన పరిస్థితులలో సాహితీ, సాంస్కృతిక కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి.
ఇలాంటి పరిస్థితులలో 28 జూలై, 2020 నాడు ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు సెక్రటరీగా అదనపు బాధ్యతలు అందించింది. అప్పటికే, భాషా సాంస్కృతిక శాఖ చేపట్టిన ''6సి ఇనిషియేటివ్''లో భాగంగా సాహితీ కార్యక్రమాలకు తెలంగాణ సాహిత్య అకాడమి సారథ్యంలో ఆన్లైన్ వేదికగా శ్రీకారం చుట్టింది. ''6సి'' అంటే (Corona Cannot Control Culture, Creativity, Cinema) ఈ పేరుతో 4 ఏప్రిల్, 2020 నాడు సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలకు ఆన్లైన్ ద్వారా డిజిటల్/వర్చువల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించడానికి భాషా సాంస్కృతిక శాఖ నిర్ధిష్ట కార్యాచరణ పథకాన్ని రూపొందించి అమలు చేసి విజయము సాదించింది. ఈ విధానంలో నిర్వహించిన నృత్యోత్సవాలు, డ్రామా ఉత్సవాలు, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ షాప్, కర్రసాము, డైరెక్షన్, సంగీతోత్సవాలు ఇతర వర్క్ షాప్‌లు ఎంతో ఆదరణను, ప్రశంసలను పొందాయి. ఈ అనుభవంతో తెలంగాణ సాహిత్య అకాడమి ద్వారా వర్చువల్/డిజిటల్ విధానంలో ఆన్లైన్ సాహితీ కార్యక్రమాలను, కవి సమ్మేళనాలను నిర్వహించడం ప్రారంభించింది.
అలా తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ కరోనా సమయాల్లో ఫిజికల్‌గానూ, డిజిటల్‌గానూ ఈ దిగువ రకాల సాహిత్య, భాషా కార్యక్రమాలను నిర్వహించి, మానవ సృజనాత్మకత కరోనాకన్నా గొప్పదని నిరూపించగలిగింది.
1. తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్తల జయంతులు, వర్ధంతులు
తెలంగాణాకు చెందిన ముకురాల రామారెడ్డి, మాడపాటి, రావెళ్ళ వెంకట రామారావు, మఖ్ధూం మొహియుద్దీన్, నీలా జంగయ్య, సరోజిని నాయుడు, గడియారం రామకృష్ణశర్మ, ఒద్దిరాజు సోదరులు, బిరుదురాజు రామరాజు, సామల సదాశివ, పల్లా దుర్గయ్య, సురవరం ప్రతాపరెడ్డి, సుద్దాల హనుమంతు, పైడిమర్రి, చందాల కేశవదాసు, దాశరథి సోదరులు, పాకాల యశోదారెడ్డి, వానమామలై, దేవులపల్లి రామానుజరావు, కాళోజి, నందగిరి ఇందిరాదేవి, షోయబుల్లాఖాన్, మాదిరెడ్డి సులోచన, వట్టికోట, ఆదిరాజు, పొట్లపల్లి, లోకమలహరి, భండారు అచ్చమాంబ మొదలగు సాహితీ వైతాళికుల జయంతి, వర్ధంతుల సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలతో నివాళులు అర్పించడమే కాక, వారు చేసిన సాహితీ కృషిని గుర్తు చేసుకోవడం, ఆన్లైన్ వేదిక గానూ యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా వారి జీవిత విశేషాలను తెలుగు సాహితీ లోకంలో వ్యాప్తి చేసింది.
2. కవి సమ్మేళనాలు - రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ బహు భాషా కవి సమ్మేళనాలు
కావ్యకౌముది సంస్థతో కలిసి ''అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనం''లను నాలుగు సార్లు ఆన్లైన్ వేదికగా నిర్వహించగా అందులో ప్రతిసారీ దాదాపు 25 పైగా దేశాల నుంచి కవులు పాల్గొని తమ తమ భాషలలో కవితలు వినిపించారు. ఇవే కాకుండా తెలుగు కవి సమ్మేళనాలను కూడా ఆయా సాహితీ సంస్థల కార్యక్రమాలలో అంతర్భాగంగానూ, ప్రత్యేకంగానూ నిర్వహించింది.
3. భాషా ఛందస్సుపై అవగాహన కార్యక్రమాలు
''తెలుగులో బాలవ్యాకరణం, భాష, విమర్శ'' అంశాలపై సంవత్సర కాలం పాటు ఆన్లైన్ కార్యక్రమాలను తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించింది. భాష, వ్యాకరణంపై ఉన్న ఎన్నో క్లిష్ట అంశాలను ఈ కార్యక్రమంలో విశదీకరించి చర్చించడం ద్వారా ఉపాధ్యాయులు, భాషా పండితులు, సాహితీ వేత్తలకు అవగాహన కల్పించడం సాధ్యమయింది.
4. ప్రసిద్ధ కవులచే స్వయంగా 'కావ్యగానం' కార్యక్రమాలు
ఈ యుగ ధర్మం - ''ఎవరి గోసను వారే చెప్పాలే!'' ఈ సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రముఖ కవులు తాము రాసిన కవితల గురించి, దాని నేపథ్యాన్ని గురించి వారి ముఖతః వారే వివరించే విధంగా వినూత్నమైన కార్యక్రమాన్ని 'కావ్యగానం' అనే పేరిట తెలుగు భాషా చైతన్య సమితితో కలిసి తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతి ఆదివారం నిర్వహించింది. అను మాండ్ల భూమయ్య, కూరెళ్ల విఠలా చార్య, తిరునగరి, జింబో, గండ్ర లక్షణ రావు, రామాచంద్రమౌళి, జలజం, నాళేశ్వరం, సుద్దాల అశోక్ తేజ, అయినంపూడి శ్రీలక్ష్మీ, యాకూబ్, వనపట్ల, జూపాక సుభద్ర, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సుంకిరెడ్డి, అన్నవరం, అఫ్సర్, ప్రసేన్, జూకంటి, వేణు సంకోజు, నలిమెల భాస్కర్, షాజహానా, ఎస్వీ సత్యనా రాయణ, దేశపతి శ్రీనివాస్, దోరవేటి, కాంచనపల్లి, దామెర రాములు, శిలాలోహిత, స్వాతి శ్రీపాద, రేణుక అయోల, కొండె పూడి నిర్మల, మహెజబీన్, సీతారాం, రేడియం మొదలగు సమకాలీన కవులు ఈ కార్యక్రమంలో పాల్గొ ని తమ సాహిత్య ప్రస్థానాన్ని, కవితా విశేషాలను వివరిం చడం పరిశోధనలకు, భవిష్యత్ తరాలకు ఒక డాక్యుమెం టేషన్‌ను అందజేసిందని చెప్ప వచ్చు. ఈ కార్యక్రమం పరిశోధ కులకు‘First Hand Source of information’గా భావించగలిగే స్థాయిలో రూపొందడం విశేషం.
5. ప్రచురణ విక్రయ కేంద్రం ఏర్పాటు
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన పుస్తకాలను విద్యార్థులు, పరిశోధకులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, సాహితీ ప్రియులకు అందరికీ అందుబాటులో ఉంచడానికి రవీంద్రభారతి ప్రాంగణంలో శాశ్వత విక్రయ కేంద్రాన్ని 13 నవంబర్, 2020 నాడు ఏర్పాటు చేసింది. దీనివల్ల వ్యక్తులు పుస్తకాలను చూడటం, చదవడం, అవసరమైన వాటిని డిస్కౌంట్లో కొనుగోలు చేసే అవకాశం లభించింది.
6. హైదరాబాద్ బుక్ ఫేయిర్‌లో స్టాల్ ఏర్పాటు
ప్రతి యేటా ప్రతిష్టాత్మకంగా భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించే బుక్ ఫెయిర్‌లో తెలంగాణ సాహిత్య అకాడమికి ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఫెయిర్‌ను సందర్శించే లక్షలాది మంది పుస్తక ప్రేమికులకు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చేరువ చేసింది.
7. సోషల్ మీడియా ద్వారా తెలంగాణాసాహితీ, భాషా విషయాల వ్యాప్తి
తెలంగాణకు సంబంధించిన సాహితీ, భాషా విషయాలు, వైతాళికులకు సంబంధించిన విశేషాంశాలను, జీవన ప్రస్థానాన్ని వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు, సందర్భోచితంగా తెలియపరుస్తూ ఒకవైపు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యక్రమాలను, మరొకవైపు ఆ విశేషాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రయత్నాన్ని చేసింది.
ఇలా 'కోవిడ్ సవాలు'ను అవకాశంగా మలుచుకుంటూ ఆన్లైన్ వేదికగా గణనీయమైనంత సాహితీ, భాషా కార్య క్రమాలను నిర్వహించడం ద్వారా తెలంగాణ సాహిత్య అకాడమి తెలంగాణ ప్రాంతం అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ చేరువ అయింది. సౌతాఫ్రికా నుంచి మొదలుకొని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు, కెనడా నుంచి మొదలుకొని బ్రిటన్ వరకు వివిధ ఎన్ఆర్ఐ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ సాహిత్య అకాడమి రకరకాల సాహిత్య కార్యక్రమాలను నిర్వహించింది. ఇక దేశీయంగా వివిధ సాహితీ సంస్థల సహకారంతో పైన తెలిపిన విభిన్నమైన సాహితీ కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ''హైబ్రిడ్ తరహా''లో ఆన్లైన్/ వర్చువల్ కార్యక్రమాలను,ఆఫ్ లైన్ కార్యక్రమాలను సమాంతరంగా నిర్వహిస్తూ వర్గాలు, ప్రాంత పరిమితులకు అతీతంగా తెలంగాణ సాహిత్య అకాడమీ అందరినీ కలుపుకొని పోవాలనే లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతం అయింది.
8. పుస్తక ప్రచురణలు
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన లక్ష్యాలలో పుస్తక ప్రచురణలు కూడా ఒకటి. దీనివల్ల ఆయా భాషా, సాహిత్య విషయాలు గ్రంధస్థం కావడమే కాక, భావితరాలకు 'రెఫరెన్స్' గా నిలుస్తాయి. అందుకే ''తెలంగాణ భాష - ఒక అవలోకనం'' (నలిమెల భాస్కర్) వంటి పుస్తకాలను ఎన్నిటినో ఈ కరోనా కాలంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురించారు.
అంతేగాక, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, విద్యావేత్తగా, సాహితీ వేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, పాలనాదక్షుడిగా, ఆర్థిక సంస్కరణల ప్రతిపాదకుడిగా పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావు పాత్ర రాష్ట్ర దేశ విషయాలలో అనన్య సమాన్యమైనది. ఆయన శత జయంతి సందర్భంగా వారి మూర్తిమత్వాన్ని 360 డిగ్రీలలో ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ప్రకటించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ మొత్తం 8 పుస్తకాలను ప్రచురించింది. వాటిలో పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. వాటి వివరాలు:
శ్రీ పీవీ నరసింహారావు రచనలు (ఇంగ్లీష్‌లో)
I. Influence of India's Culture on the West and Other Speeches: పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై పీవీ నరసింహారావు ప్రసంగాల సంకలనం
II. The Granny & Other Stories: పీవీ నరసింహారావు రాసిన 8 అరుదైన కథల సంకల నం. ఇందులో ప్రసిద్ధ గొల్ల రామవ్వ కథ కూడా ఉంది.
III. The Meaning of Secularism and Other Essays: పీవీ నరసింహారావు వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల సంకలనం.
IV. Thus Spake PV-Interviews with P.V.NarasimhaRao: పీవీ నరసింహారావును వేర్వేరు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూల సంకలనం.
శ్రీ పీవీపై వచ్చిన ఇతర పుస్తకాలు (ఇంగ్లీష్‌లో)
V. P.V. Narasimha Rao-Architect of India's Reforms: పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణ లపై సంజయ బారు రాసిన కాఫీ టేబుల్ పుస్తకం.
VI. Legend in Lines: పీవీ నరసింహారావు స్ఫూర్తిగా దాదాపు 125కు పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర కార్టూనిస్ట్ లు వేసిన క్యారికేఛర్ల సంకలనం.
శ్రీ పీవీ గారిపై తెలుగులో ప్రచురించిన పుస్తకాలు
VII. నమస్తే పీవీ: పీవీ నరసింహారావు గురించి నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం.
VIII. కాలాతీతుడు: పీవీ నరసింహారావు జీవితం స్ఫూర్తితో 143 మంది కవుల కవితా సంకలనం. పై పుస్తకా లను 2021 జూన్ 28న పీవీ జ్ఞానభూమిలో జరిగిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆవిష్కరించడం విశేషం.
ఇవే కాకుండా
సమకాలీన సాహితీవేత్తల రచనలు, జీవితం, సాహిత్యంపై చర్చ - సదస్సులు
- ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక - నల్లగొండ (బండారు శంకర్) వారి ఆద్వర్యంలో మునాసు వెంకట్ కవిత్వంపై, మహాకవి గింజల నరసింహారెడ్డి కవిత్వంపై ఒక రోజు సదస్సు.
- సాహితీ మిత్ర మండలి, పరకాల వారు సాహితీ కార్యక్రమాలపై సదస్సు (డా.పల్లేరు వీరస్వామి).
- సాహితీ సోపతి, కరీంనగర్ (అన్నవరం దేవేందర్) వారి పదేండ్ల పండుగ సాహితీ ఉత్సవాలు, డా.కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలను నిర్వహించింది.
- భానుపురి సాహితీ వేదిక, సూర్యాపేట వారి ఆద్వర్యంలో సక్కనితొవ్వ సాహితీ సంకలన ఆవిష్కరణ మరియు భానుపురి సాహితి జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం వంటి కార్యక్రమాలను (ఆఫ్ లైన్లో - భౌతికంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ) విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
- ఇవేకాక కవిత్వం / సాహిత్యానికి సంబంధించిన పుస్తకావిష్కరణలను, బాల సాహిత్యంపై, కావ్య పాఠనంపై కొత్త పుస్తకాల పరిచేయంపై ప్రత్యేక సాహితీ సదస్సులు / చర్చా గోష్టులను కూడా విజయవంతంగా నిర్వహించి తెలంగాణ సాహితీ సమాజంలో తనదైన ముద్రను వేసింది. వీటికి తోడు 2022 సంవత్సరపు క్యాలెండర్‌ను, డైరీని కూడా ప్రచురించడం ద్వారా సాహితీవేత్తలకు తెలంగాణ సాహిత్య అకాడమి కార్యకలాపాలను మరింత చేరువ చేసే ప్రయత్నాలు చేసింది. ఇది కేవలం డైరీ గానే కాక, అందులో తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీ వైతాళికుల జయంతులు, వర్ధంతుల విషయాలను, రాష్ట్ర అవతరణ నుంచి సాహిత్య రంగం ప్రతిష్టాత్మక ప్రభుత్వ పురస్కారాలు సాధించిన అక్షర మూర్తుల వివరాలను అందించడం విశేషం.
- ఈ సందర్భంలో తెలంగాణ సాహిత్య అకాడమీ మరింత ఉత్సాహంగా, ఉధృతంగా, ఉత్తేజంగా పని చేయడానికి, తెలంగాణా సమకాలీన సాహితీలోకానికి దిశానిర్దేశం చేయడానికి ప్రముఖ సాహితీవేత్త జూలూరు గౌరీశంకర్‌ని నూతన అధ్యక్షుడిగా నియమించడం తెలంగాణా సాహిత్యానికి, తెలంగాణా పుస్తకానికి జరిగిన పట్టాభిషేకంగా భావించాల్సిందే.
- ఈ క్రమంలో చిరకాలంలోనే తెలంగాణ సాహిత్య అకాడమీ వేసిన బాటను, చేసిన కృషిని కొనసాగిస్తూనే, రాబోయే కాలంలో యువతను, పూర్వకవులు, సమకాలీన కవులను, సాహితీవేత్తలను, అనువాదకులను, రచయితలను అందర్నీ కలుపుకుంటూ ఒక సంపూర్ణ, సమగ్ర తెలంగాణ సాహితీ మూర్తిమత్వాన్ని ఆవిష్కరించే దిశగా తెలంగాణ సాహిత్య అకాడమి ద్విగుణీకృత ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది.
- ఆదిత్య పకిడే, 8309639787
Sun 27 Feb 01:51:57.081486 2022