Sun 22 May 05:30:43.331955 2022
Authorization
'ఆకాశం ధారాపాతంగా వాన కురుస్తూ ఉంటే.. ఆశగా కళ్ళు విప్పార్చి అటే చూస్తున్నాను. ధారాపాతంగా కురిసే ఏ చినుకులతోనైనా కలిసి ధరలు కిందికి చేరి ఈ ధరను చేరతాయని... నేను చేతక పక్షినో, చేతకాని మనిషినో...' అన్నాడో కవి.
నిజమే మరి... ఇప్పుడు బుడతలు తాగే పాల ప్యాకీటు నుంచి ముసలోళ్లు వాడే బీపీ, షుగర్ గోలీల వరకూ అన్నింటి ధరలూ ఆకాశాన్నంటాయి. ఉప్పులు, పప్పులు, నూనెలు, కూరగాయలు, సబ్బుల ధరలు మండిపోతున్నాయి. వీటి దెబ్బకు 'ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు...' అనే పాత పాటను గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది. నెలకు, వారానికోసారి పెరిగిపోతున్న వంట గ్యాస్ ధరలతో ఇప్పుడు అదే పాటను 'ఏం వండుకునేటట్టు లేదు...' అనే రీతిలో పేరడీగా పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇవి చాలవన్నట్టు ఇంటి అద్దెలు, వాటి పన్నులు, కరెంటు ఛార్జీలు, బస్ టిక్కెట్ల రేట్లు, వాహన రిజి స్ట్రేషన్లు... ఇలా ఒకటేమిటి సగటు మానవుణ్ని ఎన్ని రకాలుగా పీల్చి పిప్పి చేయొచ్చో అన్ని రకాలుగా పీల్చి పిప్పి చేస్తున్నాయి ఈ ధరలు, రేట్లు. ఈ క్రమంలో మన దేశంలో సామాన్యుడి నుంచి సంపన్నుల వరకూ ఈ ధరాఘాతాలకు గురికాని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. కాకపోతే వాటి దెబ్బకు పేదోడు ఇప్పటికే బెంబేలెత్తి పోతుంటే... కాస్త డబ్బులున్న వారికి ఇప్పటికిప్పుడు ఆ భారాల తీవ్రత తగలటం లేదు, వాటి ప్రభావం అర్థం కావటం లేదు. కానీ వారికి సైతం కాస్త ఆలస్యంగా ఆ దెబ్బ తగలటం ఖాయమన్నది రోజురోజుకీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని చూస్తే ఇట్టే తెలిసిపోతున్నది.
వాస్తవానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ధరలు పెరుగుతూ ఉండటం, వాటిని సామాన్యుడు మౌనంగా భరిస్తూ ఉండటం మామూలై పోయింది. అవి పెరిగినప్పుడల్లా కమ్యూనిస్టు పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు ఆందోళనలు చేయటం మనం గమనిస్తూనే ఉంటాం. తెల్లదొరల నుంచి నల్లదొరల చేతికి పాలనా పగ్గాలు వచ్చిన కొన్నేండ్ల వరకూ ఆ ఆందోళనల ఫలితంగా కొంతలో కొంత ధరలను ఆనాటి ప్రభుత్వాలు తగ్గించేవంటూ పెద్దోళ్లు చెప్పగా విన్నాం. కాలక్రమంలో ప్రజల ఈతి బాధలను, ఆ సందర్భంగా నిర్వహించే ధర్నాలను పాలక వర్గాలు పట్టించు కోవటం మానేశాయి. 1991 తర్వాత జనాన్ని చావగొట్టేందుకు వీలుగా 'నూతన సరళీకృత ఆర్థిక విధానాలు' అనే ముద్దు పేరిట మన ప్రభుత్వాలు చేపట్టిన దిక్కుమాలిన చర్యల వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజల కనీస, ప్రాథమిక అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్న రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా... సంపన్నులు, బడాబాబులు, ప్రయివేటు, కార్పొరేట్ కంపెనీల సేవలో తరి స్తున్న పాలకులు ధరలను అదుపు చేసిందీ లేదు. ద్రవ్యోల్బణాన్ని అడ్డుకున్నదీ లేదు.
ఈ పరంపరలో 2019లో మొదలైన కోవిడ్ సంక్షోభం ఇటు పాలకవర్గాలకు, అటు కార్పొరేట్లకూ మరింత వర మైంది. కరోనాతో జనం బెంబేలె త్తిపోతే... కేంద్రప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్ అనంతరం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచటంలో తలమునకలైంది. అడ్డూ అదుపు లేకుండా వారానికీ, ఇంకా చెప్పాలంటే రోజుకో సారి వాటి రేట్లను పెంచుకుంటూ పోవటం వల్ల దేశంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. పెట్రో ఉత్పత్తుల ధరల ప్రభావం అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. లాక్‌డౌన్ వల్ల నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. కూరగాయల ధరలు చుక్కలు చూపించాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితి ఇలా ఎన్నాళ్లు ఉంటుందో తెలియక అనేక మంది రెండు మూడు నెలలకు సరిపడా రేషన్ కొని నిల్వ ఉంచుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా డిమాండ్ పెరగడం.. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు మండి పోయాయి. దీంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. చిల్లర దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల వరకూ వ్యాపారులు కత్రిమ కొరతను సష్టిస్తూ... ధరలను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూపోయారు. దీంతో.. సామాన్యులు బతకలేని దుర్భర పరిస్థితి దేశంలో నెలకొన్నది.
కరోనా సమయంలో ప్రజలు ఇంతలా ఇబ్బంది పడితే... వారిని కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రమూ ఆదుకోలేక పోవటమనేది దానికి పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. దేశంలో రెక్కాడితేగానీ డొక్కాడని వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కూలీలు, హమాలీలు, ఇతర పేదలందిరికీ నెలకు రూ.7,500 ఇవ్వటం ద్వారా ఆదుకోవా లంటూ వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు చెప్పిన మాటలు... ఢిల్లీ పెద్దలకు చెవికెక్కలేదు. దీంతో భారతావనిలో ఆకలి చావులు, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు వైద్య ఖర్చులను భరించలేక కొన్ని లక్షల మంది తమకున్న ఆస్తులను తెగనమ్మి ఆస్పత్రులకు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి. కరోనా అనంతరం కూడా ఈ దుస్థితి అనేక నెలలపాటు కొనసాగింది. అయినా కనికరం లేని పాలకులు పేదలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటం గమనార్హం.
ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కరం. మరోవైపు కోవిడ్ సమయానికి మించి... ఇప్పుడు ప్రజ లపై మరిన్ని భారాలు వేయటంతో వారి ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితి, ప్రణాళికలూ తారుమారవు తున్నాయి. దీంతో పలు కుటుంబాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుం టున్నది. నిత్యావసరాల ధరలతో పాటు పిల్లల బడి ఫీజులు, ఆస్పత్రుల ఖర్చులు విపరీతంగా పెరిగి పోవటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నలిగి పోతున్నారు. ఈ బాధలను భరించలేక అనేక మంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నది.
కోవిడ్‌తో దేశమంతా అతలాకుతలమైనవేళ కేరళ రాష్ట్ర ప్రభుత్వం... అక్కడి ప్రజలను తన అక్కున చేర్చుకుంది. లాక్‌డౌన్‌తో ఉపాధి పోయి, ఆదాయాల్లేక విలవిల్లాడిన ప్రజలకు పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరికీ నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను పంపీణీ చేయటం ద్వారా వారిని ఆదుకుంది. ఫలితంగా ప్రజలపై ఆర్థిక భారాలు పడకుండా చూసింది. నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఇప్పుడు దేశంలోకెల్లా అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది.
ధరలు తగ్గాలంటే.. జనం రోడ్డెక్కాల్సిందే...
ఇటీవల శ్రీలంక సంక్షోభాన్ని మనం చూశాం. అక్కడ పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగటంతో ప్రభుత్వం నిత్యావసరాలు, అత్యవసరాల ధరలను నియంత్రించలేక చేతులెత్తేసింది. దీంతో లీటరు పెట్రోల్ రూ.200, గ్యాస్ సిలిండర్ రూ.2 వేలు పెట్టి కొనుక్కోవాల్సిన దారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పసి పిల్లలకు పట్టేందుకు పాలు కూడా దొరక్క జనం అరిగోస పడ్డారు. ఈ బాధలు భరించలేక వారు రోడ్ల మీదికొచ్చారు. చివరికి శ్రీలంక అధ్యక్షుడే పదవి నుంచి దిగిపోయి... సైన్యం పంచన తలదాచుకోవాల్సి వచ్చింది. మన దేశంలో కూడా ఇప్పుడున్న రీతిలోనే ధరలు పెంచుకుంటూ పోతే... మున్ముందు శ్రీలంక పరిస్థితే ఇక్కడా తలెత్తే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక వేత్తలు, నిపుణులూ హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వామపక్షాలు ధరాఘాతాలపైనా, వాటికి కారణమైన ప్రభుత్వ విధానాలపైనా యుద్ధం ప్రకటిస్తూనే... ప్రజలను చైతన్య పరిచేందుకు నడుంకట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి 31 వరకు దేశవ్యాప్త నిరసనలకు శ్రీకారం చుట్టాయి. ఆ పిలుపులో భాగంగా తెలంగాణాలో సైతం ఆయా ఆందోళనలు కొనసాగనున్నాయి. 27న మండల కేంద్రాల్లో నిరసనలు, 30న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 31న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా కార్య క్రమాన్ని నిర్వహించనున్నాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో పాల్గొని... జయప్రదం చేయటం ద్వారా ధరలపై మనం నిరసనాస్త్రాలను సంధించాలి. ప్రభుత్వాలు, పాలకుల విధానాలను ప్రశ్నించాలి. లేదంటే అవి దిగిరావు. ఫలితంగా ఆయా ధరలు పైకి, పైపైకి ఎగబాకుతూ ఉంటాయి. మన ఆదాయాలు, జీవితాలు, జీవన ప్రమాణాలు అథ:పాతాళంలోకి దిగజారతాయి. అప్పుడు మళ్లీ... 'ఆకాశం అందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు...' అంటూ వెలుగు నీడలు సినిమాలోని అక్కినేని నాగేశ్వరరావు గారి పాటను అనునిత్యం పాడుకుంటూ దిగాలుగా కూర్చోవాల్సి వస్తుంది. అందుకే... 'కాంచవోయి నేటి దుస్థితి.. ఎదిరించవోయి ఈ పరిస్థితీ...' అనే స్ఫూర్తితో మనం పిడికిళ్లెత్తాలి. ధరలను తగ్గించేందుకు, పాలకులను హెచ్చరించేందుకు అదే మన ముందున్న తక్షణ కర్తవ్యం, అదే మన ఆయుధం.
- బి.వి.యన్.పద్మరాజు, 9490099021