Sun 17 Jul 06:14:44.520399 2022
Authorization
నసీరుద్దీన్ షా ప్రఖ్యాత హిందీ సినిమా, థియేటర్ నటుడు. పలు భారతీయ భాషలతోపాటు పాకిస్తానీ, హాలీవుడ్ చిత్రాలలో నటించిన షా 1975లో శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నిశాంత్' సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. 'నిషాంత్' విజయం తర్వాత నటుడిగా నసీరుద్దీన్ వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు 'స్పర్ష్', 'పార్' సినిమాల్లో నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. మరోవైపు 'ఇక్బాల్' సినిమాలోని నటనకు గాను సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. బాలీవుడ్లో కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. సమాంతర చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నసీరుద్దీన్ షా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా 100కి పైగా భారతీయ చిత్రాలలో నటించాడు. 1970, 1980ల మద్య 'సమాంతర' సినిమాగా పిలువబడే అనేక సినిమాలలో నటించి ప్రసిద్ది చెందాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ అనే గ్రామంలో నివసించే ముస్లిం కుటుంబానికి చెందిన అలీ మహమ్మద్ షా, ఫరూఖ్ సుల్తానా దంపతులకు నసీరుద్దీన్ షా 1950, జూలై 20న న్యూఢిల్లీలో జన్మించాడు. సెయింట్ ఆన్సెల్మ్ అజ్మీర్ పాఠశాలలో షా తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత నైనిటాల్ లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదివాడు. 1971లో ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్న నసీరుద్దీన్ షా ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఇబ్రహీం అల్కాజీ వద్ద నటనలో శిక్షణ పొందాడు.
కెరీర్
నసీరుద్దీన్ షా 1975లో శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో తెరకెక్కి జాతీయ అవార్డు గెలుచుకున్న 'నిశాంత్' సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. శ్యామ్ బెనగళ్ సినిమాలు 'మంథన్, భూమిక ది రోల్' చిత్రాల ద్వారా స్టార్ నటుడిగా తన స్థానాన్ని స్థిరంగా సుస్థిరం చేసుకున్నాడు. 1980లో వచ్చిన ''హమ్ పాంచ్'' సినిమాతో బాలీవుడ్ ప్రధాన స్రవంతి సినిమాల్లో గుర్తింపు పొందారు. అదే ఏడాది వచ్చిన సాయి పరంజ్పే 'స్పర్ష్' 1982 లో దిల్ ఆఖిర్ దిల్ హై, 1983లో అర్ధ్ సత్య, మండి, జానే భీ దో యారో, మసూమ్, 1985 లో గులామి, మిర్చ్ మసాలా తో సహా దాదాపు 30పైగా సినిమాల్లో నటించాడు. 1986లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం 'కర్మ'లో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌తో కలిసి నటించగా ఈ చిత్రం ఘన విజయం పొందింది. 1987లో జల్వా, ఇజాజత్, 1988లో ది పర్ఫెక్ట్ మర్డర్, పెస్టోంజీ, మాలామాల్, హీరో హీరాలాల్, 1988లో షా మర్చంట్-ఐవరీ ఆంగ్ల భాషా చిత్రం 'ది పర్ఫెక్ట్ మర్డర్' లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఘోట్గా తన భార్య రత్న పాఠక్ సరసన నటించాడు. 1989 లో త్రిదేవ్, 1992 లో విశ్వాత్మ వంటి అనేక మల్టీస్టారర్ బాలీవుడ్ చిత్రాలలో నటించాడు. 1994లో నసీరుద్దీన్ షా నటుడిగా తన 100వ చిత్రం 'మోహ్రా'లో విలన్‌గా నటించాడు. 1999లో సర్ఫరోష్, 2005లో ఇక్బాల్ చిత్రాలలో నటించిన నసీరుద్దీన్ షా తన పాత్రలకు న్యాయం చేకూర్చాడు. షా ప్రధాన స్రవంతి చిత్రాలలో పాటు ప్యారలల్, ఆర్ట్ చిత్రాలలో నటించాడు. 1980లో భవానీ భవారు, 1983లో అర్ధ సత్య, 1997లో చాచీ 420 వంటి కళాత్మక చిత్రాలలో దర్శకుడు శ్యామ్ బెనగల్, గోవింద్ నిహలానీ, అమ్రిష్ పూరి, ఓంపురి, స్మితా పాటిల్, షబానా అజ్మీ లతో కలిసి నటించారు.
2013లో బెంగాలీ, హిందీ ద్విభాషా చిత్రమైన సన్‌గ్లాస్, బెంగాలీ చిత్రం 'తాక్ ఝాంక్'లో నటించారు. షా రెండు గుజరాతీ చిత్రాలలో నటించాడు. 2017లో విలియం షేక్స్పియర్ రచించిన టైటస్ ఆండ్రోనికస్ ఆధారంగా వచ్చిన ది హంగ్రీ చిత్రంలో నటించాడు. ఇది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2017లో ప్రదర్శించబడింది.
1977లో నసీరుద్దీన్ టామ్ ఆల్టర్, బెంజమిన్ గిలానీతో కలిసి 'మోట్లీ ప్రొడక్షన్స్' అనే థియేటర్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. వారి మొదటి నాటకం శామ్యూల్ బెకెట్ నవల 'వెయిటింగ్ ఫర్ గోడోట్', ఈ నాటకం జూలై 29, 1979న పృథ్వీ థియేటర్లో ప్రదర్శించబడింది.
1988లో గుల్జార్ దర్శకత్వంలో మీర్జా గాలిబ్ జీవితం ఆదారంగా రూపొంది డి. డి. టెలివిజన్‌లో ధారావాహికంగా ప్రసారమైన ''మీర్జా గాలిబ్'' సిరీస్‌లో నసీరుద్దీన్ షా టైటిల్ పాత్ర పోషించాడు. నటించాడు. గుల్జార్ రచించి నిర్మించిన టెలివిజన్ ధారావాహికలో 1989లో ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన జవహర్లాల్ నెహ్రూ పుస్తకం ది డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా నిర్మించిన టెలివిజన్ సిరీస్ ''భారత్ ఏక్ ఖోజ్'' లో నసీరుద్దీన్ షా మరాఠా రాజు శివాజీగా నటించాడు. ఇందులో ఔరంగజేబు పాత్రను ఓం పురి పోషించాడు. శివాజీ కథ రెండు భాగాలుగా సాగింది. 1998లో మహాత్మా వర్సెస్ నాటకంలో షా మహాత్మా గాంధీ పాత్రను పోషించాడు. 1991లో దూరదర్శన్లోని వీక్లీ సైన్స్ మ్యాగజైన్ టర్నింగ్ పాయింట్ షో ఎపిసోడ్లను హౌస్ట్ చేశాడు. షా 1999లో జీ టీవీ ''తార్కాష్'' లో ప్రత్యేక ఏజెంట్ పాత్రను పోషించాడు. యాదచ్ఛికంగా 2000లో నసీరుద్దీన్ మళ్లీ మహాత్మాగా 'హే రామ్' చిత్రంలో నటించాడు. 1999 లో సర్ఫరోష్ చిత్రంలోని షా నటన ప్రశంశలు అందుకుంది. షా గజల్ గాయకుడు, భారత దేశంలో ఉగ్ర వాదానికి మద్దతు ఇచ్చే పాకిస్తానీ గూఢచారి అనే ద్వంద్వ గుర్తింపుతో విలన్‌గా నటించాడు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం 'ఇక్బాల్'లో మోహిత్ డ్రంకెన్ కోచ్ పాత్రలో అతని నటన మంచి గుర్తింపు పొందింది. ఇక్బాల్ చిత్ర రచయిత 'విపుల్ కె రావల్' షా ను దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రను ప్రత్యేకంగా రాశారు. ఈ పాత్రలో నటించిన నసీరుద్దీన్ షా విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నారు. కిడ్స్ కరాడి టేల్స్ కోసం జనాదరణ పొందిన ఆడియోబుక్ సిరీస్‌లో కథకుడి పాత్రను పోషించిన అనేక మంది ప్రముఖ నటులలో నసీరుద్దీన్ షా మొదటివాడు. 2000 లో విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన పీరియడికల్ డ్రామా 'హే రామ్' చిత్రంలో ''మహాత్మా గాంధీ'' పాత్రను పోషించడంతో, గాంధీ పాత్రను పోషించాలనే నసీరుద్దీన్ షా కల నెరవేరింది. నసీరుద్దీన్ 2001 లో మాన్సూన్ వెడ్డింగ్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలో నటించాడు. 2003లో హాలీవుడ్ కామిక్ పుస్తక ఆధారంగా వచ్చిన 'ది లీగ్ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ జెంటిల్మెన్' లో నసీరుద్దీన్ 'కెప్టెన్ నెమో' పాత్రలో 'సీన్ కానరీ'తో కలిసి నటించాడు. 2004 లో మక్బూల్ పేరుతో షేక్స్పియర్ మక్బెత్ పాత్ర చేశాడు. తర్వాత ది గ్రేట్ న్యూ వండర్ఫుల్ లో పనిచేశాడు. షోయబ్ మన్సూర్చే విమర్శకుల ప్రశంసలు పొందిన వివాదాస్పద చిత్రం ''ఖుదా కే లియే'' చిత్రం ద్వారా నసీరుద్దీన్ పాకిస్థానీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు, ఈ చిత్రంలో షా శక్తివంతమైన అతిధి పాత్రలో నటించాడు. ఈ చిత్రంతోపాటు 2013లో జిందా భాగ్, 2016లో 'జీవన్ హాథీ' వంటి పాకిస్థానీ చిత్రాలలో నటించాడు.
దర్శకుడుగా
నసీరుద్దీన్ షా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, లాహౌర్ నగరాలలో తన థియేటర్ బృందంతో ప్రదర్శనలు ఇచ్చాడు. 'ఇస్మత్ చుగ్తారు, లావెండర్ కుమార్, సాదత్ హసన్ మాంటో' రాసిన నాటకాలకు ఆయన దర్శకత్వం వహించాడు. 2006లో విడుదలైన 'యున్ హౌతా తో క్యా హౌతా' అనే సినిమాతో షా దర్శకత్వ రంగ ప్రవేశం జరిగింది. ఈ చిత్రంలో పరేష్ రావల్, ఇర్ఫాన్ ఖాన్, కొంకణా సెన్శర్మ కొత్త నటి అయేషా టాకియా వంటి అనేక మంది ప్రముఖ నటులు నటించారు.
ది డర్టీ పిక్చర్
తెలుగు, తమిళ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ది డర్టీ పిక్చర్లో నషీరుద్దీన్ షా ఊలలా.. ఊలలా అనే పాటపై చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులు నివ్వరపోయారు. వృద్ధ హీరోగా కుర్రకారుకు తీసిపోకుండా విద్యాబాలన్‌తో కలసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులకు కనువిందు చేశాయి.
వ్యక్తిగత జీవితం
నసీరుద్దీన్ షా మొదటి భార్య పర్వీన్ మురాద్ అకా మనారా సిక్రితో విడిపోయిన అనంతరం 1982లో బాలీవుడ్ నటి, దర్శకురాలైన రత్నాపాఠక్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య పర్వీన్ మురాద్‌కు నటి హీబా షా జన్మించగా, రత్నా పాఠక్‌కు ''ఇమాదుద్దీన్, వివాన్'' అనే ఇద్దరు కుమారులు జన్మించారు. నసీరుద్దీన్, రత్నా పాఠక్‌ల జంట ''హీబా, ఇమాద్, వివాన్''లతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. నసీరుద్దీన్ షా మేనల్లుండ్లు మేజర్ మొహమ్మద్ అలీ షా, మాజీ సైనికుడు, థియేటర్, సినిమా నటుడు. సలీం షా కూడా నటుడు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా పనిచేసిన భారత సైన్యం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా, నసీరుద్దీన్ తమ్ముడు.
అవార్డులు
నసీరుద్దీన్ షా భారతీయ సినిమాకు చేసిన కృషికి భారత ప్రభుత్వం 1987లో ''పద్మశ్రీ'', 2003లో ''పద్మభూషణ్'' పురస్కారాలతో సత్కరించింది. నసీరుద్దీన్ షా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డులతో పాటు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు అందుకున్నారు. 2014లో, నసీరుద్దీన్ 'ఆండ్ దెన్ వన్ డే: ఎ మెమోయిర్' అనే పేరుతో రాసిన తన ఆత్మకథను హమీష్ హామిల్టన్ ప్రచురించారు.
తరచు వివాదాల్లోకి నసీరుద్దీన్
ఆఫ్గన్‌లో తాలిబన్లు తిరిగి అడికారంలోకి రావడాన్ని సమర్థిస్తూ సంబరాలు చేసుకున్న కొందరు భారత ముస్లింలపై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బులంద్ షహార్ హింసాత్మక ఘటనపై షా వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ సంఘటన తర్వాత షాను రైట్‌వింగ్ మీడియా లక్ష్యంగా చేసుకుంది. నసీరుద్దీన్ గతంలో దిలీప్‌కుమార్ వంటి సీనియర్ నటులు, అనుపమ్ ఖేర్, అమితాబ్ బచ్చన్ వంటి తోటి నటులు, షారుఖ్ ఖాన్, సల్మాన్‌ఖాన్ వంటి జూనియర్లు, క్రికెటర్ విరాట్ కోహ్లీలపై కూడా ఇలాంటి వాఖ్యలు చేయడమే కాకుండా రాజకీయ నాయకులను, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సైతం విమర్శించి తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న షా
నసీరుద్దీన్ షా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలాకాలంగా 'ఓనోమేటో మానియా' వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పొచ్చు. దీని కారణంగా కొన్ని పదాలు కానీ, సంభాషణలు కానీ మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తుంటారు ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధితో సావాసం చేస్తున్నానని చెప్పారు. గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నసీరుద్దీన్ షా ఇటీవలె గెహ్రిహాన్ సినిమాలో నటించారు. ఇందులో దీపికా పదుకొణె తండ్రిలా కనిపించారు. వీటితో పాటు 'కౌన్‌బనేగా శిఖర్వతి' వెబ్‌సిరీస్‌లోనూ నటించారు.
-పొన్నం రవిచంద్ర, 9440077499