Sun 24 Jul 00:16:25.433617 2022
Authorization
బోనాల పండుగంటే తెలంగాణ నిండా ఒక పులకరింత. లయాత్మకమైన డప్పుల దరువుల మోత. శిగాల ఊగుళ్ళ దృశ్యాల కనివిందు. చినుకుపడి నేలంతా పచ్చి వాసనలో మట్టితోటి మనుషులు గజ్జల సప్పుళ్ళ కదలికల మధ్య ఎగురుతూ సల్లంగా కాపాడమని తల్లిని వేడుకొనే నైవేద్యపు రుచి. నమ్మకం, విశ్వాసాలతో మనుషులంతా ఒక్కటై కదిలే బోనాల దీపపు వెలుగుల పండుగ. నిజానికి తెలంగాణ అంటేనే పండుగల నిలయం. చెట్టుకు, పుట్టకి, రాయికి, సమస్త ప్రకృతికి మొక్కుతూ రైతులు, కూలీలు, శ్రమజీవులు, ప్రజలు తమదైన
ప్రపంచాన్ని కాపాడమని వేడుకొనే ఒక విధమైన నమ్మకం. దాదాపుగా తెలంగాణలో ముక్క సుక్కతో కూడిన పండుగలు, జాతరలు ఎక్కువగా తారస పడుతుంటాయి. వర్షాలు పడ్డ తొలి చినుకు నుండి వనభోజనాలు, బతుకమ్మ, బోనాలు, దసరా, ఎల్లమ్మ, పెద్దమ్మ, సమ్మక్క సారాలమ్మ, కోమురవేల్లి, ఐలవోలు, గంగదేవి, గొల్లగట్టు జాతరలు ఇలా అనేక పండుగలు, జాతరలు అణువణువునా ప్రకతితో మమేకమై తెలంగాణ నలుమూలల సందడి చేస్తుంటారు.
పండుగలకి నిలయం గ్రామాలు. గ్రామాల్లో వాతావరణం వేరు, పట్నంలో వాతావరణం వేరు. పండుగలప్పుడు ఊర్లన్నీ అలికి, కడిగినట్లు మెరుస్తుంటాయి. వానలు జోరుగా పడే వేళా ఊర్లల్లో అనేక అంటువ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. తల్లీ, తట్టు, మసూచికము, కలరా, విష జ్వరాలు, సుఖరోగాలు మొదలైన అంటూ వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. సాధారణ రోజుల్లోనే తల్లీ బొస్తే బోనాల పండుగకు కోడిని కొస్తాను, చీరలు పెడతాను అంటూ మొక్కుతూ కల్లుశాకం ఆరబోస్తారు.
రైతుల జీవనంలో పంటలు పండాలని, అప్పులు సకాలంలో తీరిపోవాలని వాళ్ళ బాధల్ని అన్నింటిని
ఊర్లో ఉండే తల్లులకు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి మొక్కుల నుండి నమ్మకాల నుండి బోనాల పండుగ పుట్టుకొచ్చిందని అవగతమవుతుంది.
ముత్యాలమ్మ, ఎల్లమ్మ ,కట్టమైసమ్మ, జేరిపోతులమ్మ , పెద్దమ్మ , పోలేరమ్మ, అంకాలమ్మ, డొంకాలమ్మ, ఉజ్జయిని మహంకాళి వంటి వివిధ పేర్లతో కూడిన తల్లులకు బోనాలను సమర్పిస్తారు.
ప్రాంతాలని బట్టి కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ దాదాపుగా పండుగ వాతావరణం అంతా ఒకేలా కనిపిస్తుంది. సాధారణంగా బోనాల పండుగ వానాకాలంలో ఆషాడ మాసంలో జరుగుతుంది. బిడ్డలంతా ఆషాడంలో ఇంటికొస్తారనే నమ్మకంతో బోనాల్ని చేసి పెడతారు అని, తెలంగాణ అంతా ఒక్కో రూపంలో ఒక్కో తల్లికి బోనాన్ని సమర్పిస్తారని తెలుస్తోంది. అన్నీ కులాల వాళ్ళు ఈ పండుగలో పాల్గొని ఉన్నంతలో ఉత్సవాలను చాలా సహజంగా జరుపుతుంటారు.
చారిత్రాత్మకంగా పరిశీలిస్తే తెలంగాణల రాష్ట్ర పండుగల జాబితాలోకి బోనాల పండుగను 2014 జూన్ 16న ప్రకటించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలో బోనాల పండుగ ఒకటి. 1813లో హైదరాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి సంభవించింది. మిలిటరీ అధికారిగా కొనసాగుతున్న అపయ్య (నర్సయ్య) హైదరాబాద్‌లో ఉజ్జయిని రెజిమెంట్‌లో ఉండేవాడు. ఆ తరుణంలో ప్లేగు వ్యాధి నయం అయితే మహంకాళి దేవాలయం నిర్మిస్తాను అని విశ్వాసించినట్లు ఆ తర్వాత 1815లో మహంకాళి దేవాలయం నిర్మించినట్లు, అప్పటి నుండి బోనాలు ప్రతీ సంవత్సరం జరుగుతున్నట్లు రాను రాను పండుగ నిడివి పెరిగి అంగరంగ వైభవంగా జరుపుతుండంటం ఆనవాయితీగా మారింది.
ఆషాడం మొదటి ఆదివారం గోల్కొండ ఎల్లమ్మతో మొదలై లష్కర్గా పిలవబడే సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకొని నయాపూర్ ఘటముల వద్ద నిమజ్జనంతో ముగుస్తుంది.
బోనాల పండుగ తంతుని 'ఊరడి' గా పిలుస్తారు. బోనం అనగా అన్నం, భోజనంగా చెప్పవొచ్చు. నైవేద్యాన్ని మట్టి, రాగి, ఇత్తడి కుండలలో వండుతారు. బోనంతో పాటుగా పాలు, పెరుగు, బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని సమర్పిస్తారు. కుండకు పసుపు, కుంకుమ, బియ్యం పిండి, వేప రిమ్మలతో అలంకరిస్తారు. ఇవి యాంటీబయోటిక్‌గా కూడా ఉపయోగపడతాయి. బోనాలు ఆలయాలకు కదిలినప్పుడు దీపాలతో మెరుస్తుంటాయి. ప్రజలంతా తమ బోనాలను తమ సమీప తల్లులకు సమర్పించి సంతోషంగా మొక్కుకుంటారు. ప్రధానంగా బోనాల సమర్పణ వలన దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా ఉంటాయని ఒక విశ్వాసం.
బోనాల పండుగలో గావు పట్టడం ప్రధానమైన ఘట్టం. దీనిలో పోతురాజు పాత్ర కీలకమైనది. ఆయనను అమ్మవారి సోదరుడిగా చెపుతుంటారు.
సిటీల్లో పోతురాజు వేషాలు ఎక్కువగా కనిపిస్తాయి. పోతురాజు వేషధరణలో ఉన్న వ్యక్తి బలశాలిగా, గాంభీర్యంగా ఉంటాడు. ఒళ్ళంతా పసుపు పూసుకుని నుదిటిపై కుంకుమ బొట్టు, కాళ్ళకి గజ్జలు, చిన్న ఎర్రని ధోతి ధరించి చేతిలో కొరడాతో బోనాల వెంట డప్పు సప్పుళ్ళ వాయిద్యాలకు అనుగుణంగా చిందేస్తుంటాడు.
కోపంతో ఉన్న పొతురాజు మేకపోతుల్ని కొరికి తల మొండం వేరు చేసి పైకి విసిరేస్తారు అని ప్రచారంలో ఉంది. దీనిని గావు పట్టడం అని అంటారు.
గ్రామాలలో పొతురాజులు కనిపించరు. స్వయంగా ప్రజలు వెళ్ళి పోతురాజు విగ్రహం వద్ద కుల వృత్తిగా భావించే చాకలి, అలాల్ కోసం ముస్లింలు జంతువధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బోనాలతో చివరి ఘట్టం రంగం. భవిష్యవాణిని చెప్పడం అంటారు. డప్పు సప్పుళ్ళతో ఎగురుతూ సంతోషంగా తల్లి దగ్గరికి వెళ్తున్న క్రమంలో కొంత మంది పూనకాలతో ఊగుతూ డప్పుల లయబద్ధమైన మోతలకి అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. ఆమెను శాంతించడానికి నీళ్ళను కాళ్ళ దగ్గర పోస్తూ శాంతించమని ఏమి తక్కువైంది తల్లీ, మమ్మల్ని, మా ఊరిని సల్లంగా కాపాడమని వేడుకుంటూ తమదైన బాధల్ని అడిగించుకుంటు చెప్పించుకోవడం కనిపిస్తూ ఉంటుంది.
బోనాల పండుగ ఆలయాలలో ప్రజలే ఆలయ పూజారులుగా కంటబడుతారు. బైండ్లోళ్ళు, కుమ్మరోళ్ళు వంటి కుల వృత్తుల వాళ్ళు ఆలయాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే కుల వృత్తుల కదలికలో భాగం బోనాల పండుగ. చాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి వంటి వివిధ వృత్తులు ఈ పండుగలో భాగమై తమదైన పనిని చేపట్టి పండుగను నడిపిస్తుంటాయి.
తెలంగాణ పండుగలో ప్రధాన భాగమైంది బోనాలు. తెలంగాణని కేంద్రంగా చేసుకుని తీసే చిత్రాల్లో బోనాల సందడి కూడా కనిపిస్తుంది. తెలంగాణలో సహజంగానే జానపద తడి అణువణువునా తారసపడుతుంది. ఊర్లల్లో ఇప్పటికీ పాటలు పాడుతుంటారు. వానలు పడాలి అని బిందల్ని మధ్యలో పెట్టి ఉయ్యాల పాటల దగ్గర నుండి తమ బాధల్ని చెప్పుకొనే దాకా పాట తెలంగాణ గొంతునిండా నిండి ఉంది. ఆ క్రమంలో బోనాల పండుగలో కూడా పాట వినిపిస్తోంది.
బోనాల పండుగను కేంద్రంగా చేసుకుని
''అమ్మరావే మా అమ్మ పోశమ్మ
తల్లీ రావే మా అమ్మ ఎల్లమ్మ'' అని పాటలు పాడుతూ ఊరుని కాపాడమని, బతుకుల్ని కాపాడమని వేడుకొనే సందర్భాలు ఉన్నాయి. ఆధునికంగా యూట్యూబ్ చానల్స్ లో కూడా బోనాల పాటలు కనిపిస్తాయి.
''ఘల్లు ఘల్లు పోతారాజుల వీరంగం
జల్లు జల్లు జల్లుజల్లు శివసత్తుల శివంగం'' (V6)
''రావే రావే పెద్దమ్మ
నిను రాజులు మెచ్చిరి జేజమ్మ
మహిమలు గల్లా రుద్రమ్మ
మము సల్లాంగ చూసే ఎల్లమ్మ'' (బతుకమ్మ మ్యూజిక్).
''కోటి డప్పుల కోలాటం
కోడిపుంజుల ఆరాటం
కల్లు కుండలే నీశాకం
మేకపోతులే నైవేద్యం''. (బల్వీర్ సింగ్)
''జంబాయి జంబాయి
జంబాయిరే అమ్మ బెల్లిలల్లి
జంబాయిరె'' (నవీ జే స్టూడియో)
వంటి వివిధ రకాల పాటలు తమదైన బోనాల పండుగను ప్రతిభించే విధంగా మెక్కులని, నమ్మకాలను పండుగ వాతావరణాన్ని మొదలైన ఎన్నో విషయాలను పాటలుగా రికార్డు చేస్తున్నాయి.
సాహిత్యపరంగం కూడా తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతున్న పాటలు నేటికి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఫోన్ లోను పాటల సప్పుడు మారుమోగుతుందని కూడా మనకు తెలిసిందే.
బోనాల పండుగ అంటేనే ఒక వైబ్రేషన్. శ్రమ జీవుల హడావుడి. ఆడబిడ్డల సందడి. అనేక మనుషుల నమ్మకాల రూపం. తెలంగాణని అణువణువునా ప్రతిభించే ఒక విధమైన శబ్దాల ధ్వని. సీటి బోనాలకు, పల్లెటూరి బోనాలను కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కుటుంబాల్ని, గ్రామాల్ని, పట్నాల్ని అంటూ వ్యాధుల నుండి, తమదైన ప్రపంచంలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా కాపాడమని కోరుకునే ఒక ఆశావహక ఉత్సవంగా చెప్పవొచ్చు.
- పేర్ల రాము, 9642570294