శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని కాలంలో ప్రజలలో మూఢనమ్మకాలు ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాడు అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయి. 15, 16వ శతాబ్దాల మధ్య కాలంలో కోపర్నికస్, గెలీలియో, న్యూటన్ లాంటి శాస్త్రవేత్తలు ఖగోళ, భౌతిక శాస్త్రాలకు ప్రారంభకులైనారు. అలాగే ఆంద్రియస్ వెసాలియస్, విలియం హార్వే లాంటి వారు చేసిన పరిశోధనల ఫలితంగా మానవ శరీర శాస్త్రం అభివృద్ధి అయింది. 19వ శతాబ్దంలో చార్లెస్ డార్విన్ జీవజాతుల పరిణామ క్రమం ఫలితంగా ఈనాటి ఆధునిక మానవుడు ఎలా ఆవిర్భవించాడు అన్న విషయాన్ని రుజువులతో సహా నిరూపించాడు.
కంప్యూటర్లు ఇంటర్నెట్లు రాకెట్లు శాటిలైట్స్ సెల్‌ఫోన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులు తీస్తున్న ఈ కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాల ఊబిలో చిక్కుకుపోయి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి అది ఒక సామాజిక వైఫల్యం. ఈనాడున్న సామాజిక రుగ్మతల వలన సమాజం తగినంతగా అభివృద్ధి కాకపోవటానికి ఈ మూఢనమ్మకాలే కారణం. ఇది కరోనా వైరస్ కన్నా ప్రమాదకారి. ఈ మూఢత్వానికి మూల కారణం మతమౌఢ్యాన్ని పెంచి పోషించడమే ప్రధానమైన కారణం.
ఈ మూఢనమ్మకాలు కూడా బహువిధములు. అందులో కొన్ని...
1. బాణామతి, చేతబడి, చిల్లంగి, దయ్యాలు, క్షుద్ర పూజలు భూత వైద్యం, పూనకాలు లాంటివి.
2. వేళ్ళకు ధరించే ఉంగరాలలో రకరకాల రంగు రాళ్లు పెట్టుకుంటే మహర్దశ వస్తుందని నమ్మటం.
3. పేరులో ఒక అక్షరం మారిస్తేనో లేదా రెండు అక్షరాలు కలిపితేనో, జీవితం మారిపోతుందని భ్రమించటం.
4. రుద్రాక్షలు, కాశీ దారాలు, రంగురంగుల దారాలు, తాయెత్తులు, ధరిస్తే ఏదో మంచి జరుగుతుందని భావించటం.
5. బహిష్టు అయిన స్త్రీ ఎవరిని తాగకుండా ఐదు రోజుల పాటు దూరంగా ఉంచుతూ మైల పాటించటం.
6. విధవ స్త్రీ కానీ పిల్లి కానీ ఎదురైతే అశుభం అని అనుకోవటం.
7. బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని నమ్మటం.
8. మసూచి, ఆటలమ్మ లాంటి అంటు రోగాలకు గ్రామ దేవతలు ఆగ్రహించటం వలన వచ్చాయని నమ్మటం.
9. గ్రహణాలు పట్టిన సమయంలో భోజనం చేయకూడదు అనటం, ఆహార పదార్థాలలో గడ్డిపరకలు వేయటం, గర్భిణీ స్త్రీలు, పిల్లలు అసలు బయటికి రాకూడదని ఆంక్షలు పెట్టడం.
10. గ్రహణం పట్టిన రోజున గ్రహణం వీడే వరకు దేవాలయాలను మూసివేయటం.
11. గ్రహణం ఏర్పడడానికి కారణం రాహు కేతువులు సూర్యుని, చంద్రుని మింగటమే కారణమని గుడ్డిగా నమ్మటం.
12. బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే వెనక్కు వచ్చి కాసేపు కూర్చొని మంచినీళ్లు తాగి వెళ్ళటం.
13. కాకి తల మీద తన్నితే ఆ కాకి శని వాహనం అని ఆ వ్యక్తికి శని పడుతుందని నమ్మటం.
14. బల్లి శరీరం మీద పడితే పడిన భాగాన్ని బట్టి అరిష్టం, లేదా ఫలితం ఉంటుందని నమ్మటం. బల్లి పడినవారు స్నానం చేసి కంచి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకొచ్చిన వారిని తాకితే అరిష్టం పోతుంది అని అనుకోవటం.
15. కేరళలో నాడీ శాస్త్రం పేరుతో మీరు గత జన్మలో ఫలానా అని వచ్చే జన్మలో ఫలానాగా జన్మిస్తారని చెప్తే నిజమని భ్రమ పడటం.
16. గోదానం చేసిన వారు చనిపోయిన తర్వాత వైతరణి నదిని సులభంగా దాటేయగలరని, గోదానం చేయని వారు సలసల కాగుతూ ఉండే నదిలో దిగి నడవవాల్సిందేనని పూజారులు చెబితే నిజమే కాబోలు అని అనుకోవటం .
17. చనిపోయిన మనిషిని బ్రతికిస్తామని ఆ శవం వద్ద పూజలు నిర్వహిస్తే నిజంగానే బ్రతికి వస్తాడని అనుకోవడం.
18. మానసిక స్థిమితం లేని మనిషిని డాక్టర్ వద్దకు కాక భూత వైద్యుడు పాలు చేయడం. వాడు కొట్టే దెబ్బలు తట్టుకోలేక చివరకు మరణించడం.
19. బ్రదర్ అనిల్ కుమార్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు నేను కరోనాను తొక్కేశాను. ఇక మనకు కరోనా రాదని చెప్తే నమ్మటం.
20. చిలుకూరు బాలాజీ గుడి పూజారి అయిన రంగరాజన్ అనే ఆయన తనకు బాలాజీ కలలో కనబడి మన దేశానికి కరోనా అసలే రాదని చెబితే అది నిజమేనని విశ్వసించటం.
21. ఏ మాత్రం వాస్తవం లేని వాస్తు, జ్యోతి ష్యాన్ని నమ్మటం.
22. కల్వరి ఆయిల్ పూయటం, లేదా సేవించటం వలన స్వస్థత చేకూరు తుందని అనుకోవటం.
23. హస్త సాముద్రికం అంటే చేతిలోని రేఖలు చూసి భవిష్యత్తు చెప్పటం, ఇలాంటి వన్నీ మూఢనమ్మకాలే మనం నిత్యం మన జీవితంలో చూస్తు న్నవే. ఎదురవుతున్నవే .ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా చాలానే ఉన్నాయి.
ఒక పక్క శాస్త్రవేత్తలు విశ్వ రహస్యాలను ఛేదిస్తూ సమాజానికి దిక్సూచిగా, దశ దిశను చూపిస్తూ ఉంటే మరోపక్క మూఢ నమ్మకాలతో ప్రాణాలహరణం జరుగుతూ ఉండటాన్ని చూస్తూనే ఉన్నాం. దైవదూతలం అని చెప్పుకు తిరిగే ఈ పూజారులు, బాబాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మౌల్వీలు, పాస్టర్లు వీరందరూ కరోనా సమయంలో మాస్కులు పెట్టుకోక తప్పలేదు. దైవదూతలకు భయం ఎక్కువగా కాబోలు కరోనా పాజిటివ్ వస్తే హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకున్నారు. వీరికి ఎలాంటి మహత్తులు లేవని వీరు కూడా సాధారణ మనుషులేనని కరోనా ముందు అందరూ సమానులే అని కరోనా తేల్చి చెప్పింది.
ఈ మూఢనమ్మకాల వలన మన సమాజం అనేక దుష్ఫలితాలను ఎదుర్కొంటుంది. చేతబడి చేశారని పళ్ళు పీకటం, సజీవ దహనం చేయటం, వివస్త్రలను చేసి ఊరేగించడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడటం మనం చూస్తూనే ఉన్నాం. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో నాలుగేళ్ల క్రితం మంత్రాలు చేశాడన్న నెపంతో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా చంపివేశారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం 2000-2012 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ''వశీకరణం'' మంత్ర విద్య నిర్వహిస్తున్నారని నెపంతో దాదాపు 350 మందిని చంపారు. అంతెందుకు మదనపల్లిలో జరిగిన సంఘటన ఏమిటి? విద్యాధికులైన తల్లిదండ్రులు బాగా చదువుకున్న ఇద్దరు కూతుళ్లను, పునర్జన్మ ఉన్నదని నమ్మి, శివుడు బతికిస్తాడు అన్న గుడ్డి నమ్మకంతో వారిద్దరి కూతుళ్ళను చంపటం సమాజం చేష్టలుడిగి చూస్తూనే ఉన్నది. ఇలాగా ఈ
కాశ్మీర్‌లోని కథువా గ్రామంలో 8 సంవత్సరాల అసిఫా అనే అమ్మాయిని దుర్గామాత గుడిలోనే పూజారితో పాటు ఆరుగురు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి తెగబడి చంపేశారు. ఆలయంలోనే అంత దారుణం జరుగుతుంటే ఆయుధాలు ధరించిన దుర్గామాత చూస్తూ ఉండిపోయిందేమి? ఆ అమ్మాయిని కాపాడలేదు ఎందుకు? అలాంటి క్రూరత్వానికి పాల్పడిన వారిని శిక్షించలేదు ఎందుకు? అల్లా కానీ యేసులు కానీ ఎవరూ కాపాడలేకపోయారు ఎందుకు?
మహిళలలో ఏర్పడే నెలసరి రుతుక్రమాన్ని అన్ని మతాలలో కూడా అశుభ సూచికంగానే చూస్తారు. ఐదు రోజులపాటు అస్పృశ్యతను పాటిస్తూ ఒకే గదికి పరిమితం చేస్తారు. ఇటీవల కాలంలో వివాదాస్పద అయ్యప్ప గుడిలోకి మహిళలు ప్రవేశించడానికి ఈ నెలసరి రుతుక్రమాన్ని సాకుగా చూపిస్తున్నారు. అన్ని వయస్సుల మహిళలు గుడిలో ప్రవేశించి దర్శించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఈ మనువాద మతవాదులు మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం చూసాం. అజ్ఞానం, రాజకీయ లబ్ధి పొందటం కోసం ఈ మతవాదులు ఆడుతున్న నాటకం కాదా ఇది? స్త్రీలకు వచ్చే నెలసరి అనేది ప్రకృతి సహజమైన ప్రక్రియ. రుతుస్రావం అన్నది స్త్రీల శరీరంలోని వ్యర్ధపదార్థం. ఆ వ్యర్ధాన్ని విసర్జించాల్సిందే కదా! మగవారు వాళ్ళ శరీరంలోని వ్యర్ధాన్ని ప్రతిరోజు విసర్జించటం లేదా? మరి వారు పవిత్రులు ఎలా అయ్యారు? వారికి ఆ గుడిలోకి ప్రవేశ అనుమతి ఉన్నది కదా! అలాగే వ్యర్ధాన్ని విసర్జించే ఆడవారు అపవిత్రులు ఎలా అయ్యారు? మరి దీన్ని హేతుబద్ధంగా ఆలోచించే పనే లేదా? గుడ్డిగా మూఢత్వాన్ని పట్టుకు వేలాడటమేనా?
దేవుడి వద్ద సేవికులుగా నియమించబడ్డ స్త్రీలు జోగిని, దేవదాసి, బసివి పేర్లతో ఉన్నవారు వారి జీవితాలు దుర్భరంగా, సామాజిక వివక్షతకు గురై తీవ్ర బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. వీరికి పేరుకు మాత్రమే దేవుడితో పెళ్లి చేస్తారు. కానీ వారు మాత్రం ఊరుమ్మడి ఆస్తి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడి పేరుతో చేస్తున్న వ్యభిచారం. దానికి బలై ఆ స్త్రీలు దుర్భర జీవితాలను వెళ్ళదీస్తూనే ఉన్నారు. ఇది మూఢత్వం నుండి పుట్టిన దురాచారం కాదా? అజ్ఞానం నుండి ఆవిర్భవించింది కదా? పెత్తందారీ తన నుంచి పుట్టింది కాదా? ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలాంటివి కొనసాగటాన్ని మనం ఎలా చూడాలి?
పిల్లలు పుట్టక పోయినా, మగ పిల్లవాడు కలగకపోయినా అదంతా భార్యదే తప్పు అన్నట్లుగా ఆమెను ఇంటి నుండి వెళ్లగొట్టడానికి సైతం వెనకాడరు భర్త, అత్త మామలు. పురుషుడి వీర్యంలో స్పెరండెన్సిటీ 20 మిలియన్ల నుండి 200 మిలియన్ల వరకు ఉండాలి. 20 మిలియన్ల కన్నా తక్కువ ఉంటే పిల్లలు పుట్టరు. ఈ విషయం తెలుసుకోవటానికి డాక్టర్ల వద్దకు వెళ్లాలి కానీ భూత వైద్యులను, తాయత్తులను, గుడుల చుట్టూ ప్రదక్షిణాలను చేస్తే ఉపయోగం ఏమిటి?
అలాగే స్త్రీ పురుషులలో చెరి 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 22 జతలు ఇద్దరిలో ఒకేలాగునే ఉంటాయి. పురుషుడిలోని 23వ జత కారణంగానే పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ జరుగుతుంది. స్త్రీలు 23 జతలలోనూ ''ఎక్స్ ఎక్స్'' ప్రోమోజోములు ఉంటే, పురుషుడి 23వ జాతిలో ''ఎక్స్ వై ''క్రోమోజోములు ఉంటాయి. స్త్రీలో అండం ఫలదీకరణ చెంది పిండంగా మారాలంటే పురుషుడిలో ఏదో ఒక క్రోమోజోము స్త్రీ అండంతో కలవాలి. మగవాడిలో 23వ జతలో ఉన్న ''ఎక్స్'' క్రోమోజోమ్ వెళ్లి స్త్రీలోని ''ఎక్స్, ఎక్స్'' క్రోమోజోములతో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అలాగే పురుషుడిలోనే 23వ జతలోని ''వై ''క్రోమోజోమ్ వెళ్లి స్త్రీ అండంలో ''ఎక్స్, ఎక్స్'' తో కలిస్తే మగ పిల్లవాడే పుడతాడు. అంటే పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అన్నది నిర్ధారించేది పురుషుడిలోని ''ఎక్స్, వై'' క్రోమోజోములే. ఆడ లేదా మగ పుట్టడానికి పురుషుడే కారణం కానీ స్త్రీ ఏ మాత్రం కాదు.
ఈ రోజున చదువుకున్న వారిలో, మరీ విద్యాధికులలో కూడా వాస్తు పిచ్చి బాగా పట్టుకుంది. శీకాకాయ పౌడర్ వేసి కడిగిన వదలని జిడ్డు లాగా ఇది సమాజాన్ని పట్టిపీడిస్తున్నది. వాస్తు శాస్త్రం ఏం చెబుతున్నది? తెల్లని భూమి ఉత్తమమైనదట, అది తీయగా ఉంటుందట, అందులో బ్రాహ్మణులకు ఇళ్ల నిర్మాణానికి సరైనదట.
ఎర్రని భూమి మధ్యమమట, అది కారంగా ఉంటుందట. దానిలో క్షత్రియులు ఇల్లు కట్టుకోవటానికి శ్రేయస్కరమట.
పసుపు రంగు భూమి అధమం అట, అది పుల్లగా ఉంటుందట. అది వైశ్యులకు యోగ్యమైనదట.
నల్లని రంగు భూమి అధమాధమం అట, అది చేదుగా ఉంటుందట. అందులో శూద్రులు ఇల్లు కట్టుకోవాలట. ఇల్లు కట్టుకోవాలి అంటే భూమి రంగు రుచి వాసన చూడాలని వాస్తు శాస్త్రం చెబుతుంది అంటే వాస్తు శాస్త్రం కుల వ్యవస్థను స్థిరీకరిస్తుందన్నమాట. అంతేకానీ అది ఇంజనీరింగ్ ఎంత మాత్రం కాదన్నమాట. అందుకే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా వారి కులాలను బట్టి సచివాలయంలో మార్పులు చేయిస్తూ ఉంటారు ఈ వాస్తు మార్తాండ పండితులు. వాస్తు నిజంగా అంత గొప్పదే అయితే వాస్తు శాస్త్ర్తం ప్రకారం కట్టిన సోమనాథ దేవాలయం మీద మహమ్మద్ ఘజిని అన్నిసార్లు దండయాత్రలు ఎందుకు చేసినట్లు?
ఇక జ్యోతిష శాస్త్రం సంగతి చూద్దాం. గ్రహాల పరిభ్రమణము, నక్షత్రాల గమనము పరిశీలించిన ఒకనాటి ఖగోళ మేధావులు గ్రహణాలు ఎలా ఏర్పడుతున్నాయో, సూర్యోదయం సూర్యాస్తమయం ఎప్పుడు జరుగుతుందో, ఋతువుల చక్రం క్రమం తప్పకుండా ఎలా వస్తుందో నిర్దిష్టంగా చెప్పగలిగారు. దీనినే ఖగోళ విజ్ఞానం లేదా ఖగోళ జ్యోతిష్యం అని అన్నారు. గ్రహగతులు, నక్షత్రాల పరిశీలన కారణంగా ప్రకతిలో నిర్దిష్టంగా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి, అవి మనుషుల జీవిత చక్రం మీద కూడా ప్రభావం చూపుతాయి అనే ఫలిత జ్యోతిష్యాన్ని సష్టించారు కొందరు పకీర్లు. అసలు జ్యోతిష్యం కానీ వాస్తు గాని భూమి చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతున్నాయి అని తప్పు సిద్ధాంతం నుంచి పుట్టాయి. జ్యోతిష పండితులు నవగ్రహాలని వాటి చుట్టూనే వీరి లెక్కలు తిరుగుతూ ఉంటాయి. వీరి లెక్క ప్రకారం సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురువు, రాహువు, కేతువు, శని వీటిని నవగ్రహాలని అంటారు. ఈ గ్రహాలకు కూడా మళ్లీ కులం ఉన్నది. మీరు చెప్పే ఈ నవగ్రహాలలో సూర్యుడు అసలు గ్రహం కాదు అది స్వయం ప్రకాశకమైన నక్షత్రం. చంద్రుడు గ్రహం కాదు కేవలం భూమికి ఉపగ్రహం మాత్రమే. భూమి ఒక గ్రహం కానీ వీరి జ్యోతిష్యంలో అంటే నవగ్రహాలలో అది లేదు. రాహు కేతువు అనే గ్రహాలే లేవు. ఇవి చాయా గ్రహాలంటారు మరి వేటి చాయనో చెప్పలేరు. అలాగే నెఫ్ట్యూన్, ఫ్లూటో వీరి గ్రహాల జాబితాలో లేనే లేవు. అంటే వీరి జ్యోతిష్యం అని చెప్పే దానికి ప్రాతిపదికగా తీసుకునే గ్రహాల జాబితానే ఒక తప్పుల తడుక. ఇలా చెప్పటం మూఢత్వమే కాదు మోసం కూడా. ఇలాంటి జ్యోతిష్యాన్ని చెప్పే వారిని గురించి వివేకానందుడు 'ఈ మూఢనమ్మకాల ఊర కుక్కలను బయటికి తోలెయ్యండి' అని అన్నాడు. మహర్షి దయానంద సరస్వతి, చక్రవర్తి రాజగోపాలచారి, స్వామి అగ్నివేష్, సివి రామన్, భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారుగా పనిచేసిన సి.ఎన్.ఆర్. రావు లాంటి ప్రముఖులు ఈ జ్యోతిష్య శాస్త్రం పరమ బూటకం అన్నారు. అయినా మన దేశంలో ఈనాడు 2500 కోట్ల రూపాయల జ్యోతిష్య వ్యాపారం జరుగుతున్నది. పైసా పన్ను కట్టకుండా. పాలకవర్గాలు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం మాని ఇంకా ప్రోత్సహించడం అత్యంత విషాదం.
ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో భూత వైద్యం ప్రవేశ పెడుతున్నారట మన ఏలికలు. తాంత్రిక మాంత్రికా టక్కు టమార విద్యలలో ఆరితేరిన మాంత్రికులే అధ్యాపకులన్నమాట. సైన్స్ చదువుకునే విద్యార్థులకు పరిశోధనలు, ప్రాక్టికల్స్ చేయటం కొరకు విద్యాలయాల్లో లేబరేటరీలు ఉంటాయి. మరి భూత వైద్య విద్యార్థులకు స్మశానాలేనా లేబరేటరీలు. దెయ్యాలు పిశాచాల మీద ప్రాక్టికల్స్ నేర్పిస్తారా? ఇది వినటానికే ఎబ్బెట్టుగా లేదూ! మనం మధ్యయుగాల్లోకి వెళుతున్నామా లేక ఇంకా అంతకు ముందున్న రాతియుగానికి చేరుతున్నామా ఆలోచించు వద్దా!
మానవ సమాజాలు శైశవ దశలో ఉన్నప్పుడు ప్రకృతిలో జరిగే పరిణామాలు చూసి గాబరాపడ్డారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఉరుములు, మెరుపులు, వరదలు, కార్చిచ్చు ఏర్పడి అడవులు దహనం అవటం, అగ్నిపర్వతాలు పేలిపోవడం ఇలాంటివన్నీ ఎలా సంభవిస్తున్నాయో తెలియక తికమక పడ్డారు. అందువలన ప్రకృతి శక్తులకు మానవీయ రూపకల్పన చేసుకుని ఆరాధించారు. అలా అజ్ఞానం నుండే దైవ భావన అంకురించింది. ప్రకృతి విపత్తుల నుండి కాపాడమని వారు ఏర్పరచుకున్న దైవభావనకు వారే లొంగిపోయి ఆరాధించారు. ఆనాటి జ్ఞానం అంతవరకే. ప్రపంచంలోనే అన్ని నాగరికతలలోనూ అన్ని సంస్కృతులలోనూ కాస్త ముందు వెనకలుగా ఇలానే జరిగింది. మానవుడు చంద్ర మండలం మీద కాలు పెట్టి అక్కడి చంద్ర శిలలను భూమికి తెచ్చిన కాలంలో నివసిస్తున్నాం మనం. చంద్రుడు మీద ఉన్నవన్నీ రాళ్లు రప్పలు పర్వతాలు లోయలు అన్న విషయం తెలియని కాలంలో చంద్రుని దేవుడుగా ఆరాధించటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఏ గ్రహాల మీదనైనా మనలాంటి మానవులు కానీ మనల్ని పోలిన వారు గానీ లేక జీవం కానీ ఉన్నదేమోనని పరిశోధిస్తున్న యుగంలో ఉన్న మనం మూఢత్వంలో కొట్టుకుపోకూడదు.
కానీ మన దేశంలో ఏలికిలే ఇలాంటి మూఢనమ్మకాలను, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి పేరిట పెంచి పోషిస్తున్నారు. మానవజాతి స్పేస్ యుగంలో ఉన్నప్పటికీ మన భారత జాతి వైజ్ఞానిక స్పృహ ఇంకా నేర్చుకోలేదు. బూజు పట్టిన భావాలను జీర్ణించిపోయిన వ్యవస్థలకు ''భారతీయ సంస్కృతి'' అని పేరు పెట్టి దానిని పునర్జీవనం చేయడానికి పాలకులు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. దీని కారణంగానే జాతి, మతం, కులం, భాష, ప్రాంతీయ దురభిమానాలు పుట్టి పెరుగుతున్నాయి. దేశ సార్వభౌమత్వానికి గుండెకాయ లాంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులు, ప్రధాన మంత్రులు అయిన వారు మతం మౌఢత్యాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ నాయకులే స్వామీజీలు, బాబాలు, మత గురువుల ముందు మోకరిల్లినప్పుడే మన రాజ్యాంగం మసకబారింది. ప్రపంచం ముందు దేశ గౌరవ ప్రతిష్టలు అభాసుపాలు అవుతున్నాయి. ఈ నాయకులే చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి, పళ్ళాలు మోగించితే కరోనా వైరస్‌ను చంపవచ్చునని ప్రచారం చేశారు. రామాయణ కాలంలోనే పుష్పక విమానం ఉన్నదని ఎంతమంది ఎక్కినా మరొక సీటు ఖాళీగా ఉండేదని, రావణాసురుడు 24 రకాల విమానాలు వాడే వాడని అవన్నీ లంకలో విమానాశ్రయాల్లో ఉండేవని ఏమాత్రం రుజువు లేని, రుజువు కానీ విషయాలను ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మహాభారతంలో 100 మంది కౌరవుల పుట్టుకకు మూల కణాల వైద్యం ఆనాడే ఉండేదని, టెస్ట్ ట్యూబ్ బేబీ సాంకేతిక పరిజ్ఞానం మన పురాణాల్లో పుష్కలంగా ఉందని, సీత కూడా టెస్టు బేబీయేనని ఆధునిక సైన్సు పదాలను కొన్ని అడ్డం పెట్టుకుని గతం ఎంతో గొప్పదని ప్రచారం చేస్తున్నారు. వినాయకుడికి ఏనుగు తల అతికించడం అంటే ఈనాటి ప్లాస్టిక్ సర్జరీ లాంటిదని, అది ఏనాడో మా మునులు, మహర్షులు ఆవిష్కరించారని, ఇవన్నీ అసలు మా వేదాల్లోనే ఉన్నాయని ఇలాంటి హేతుబద్ధత లేని ప్రచారాలు మన ప్రధాని నుండి ఇతర మంత్రుల వరకు, చివరికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ల దాకా ఇలా సూడో సైన్స్‌ను ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాము. ఒక సెక్యులర్ దేశంగా ప్రభుత్వాలు మత సంబంధిత విశ్వాసాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రాజ్యాంగంలోని 51 A(H) అధికరణ ప్రకారం ప్రజలలో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించాలని చాలా స్పష్టంగా రాసుకున్నాము. కానీ దానికి భిన్నంగా ప్రజలలో మూడవిశ్వాసాలు పెంచి పోషించడానికి ఆ ప్రభుత్వాలే ఆ ప్రభుత్వ ప్రతినిధులే స్వయంగా పుష్కరాలు, చండీయాగాలు, జాతరలు, కుంభమేళాలు లాంటి వాటిల్లో పాల్గొని జరిపి ప్రజలలో అజ్ఞానాన్ని పెంచుతున్నారు. ప్రజల వ్యక్తిగత నమ్మకాలను పాలకులు తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు.
అంతరిక్షంలోకి పంపే రాకెట్ల నమూనాను తిరుపతి వెంకన్న పాదాల ముందు పెట్టి పూజించిన తర్వాతనే ప్రయోగిస్తున్నారు కొందరు సైంటిస్టులు. రోడ్డు మీద పసుపు అంటిన నిమ్మకాయనో, మిరపకాయనో చూసి జడుసుకొని చెమటలు పడుతున్న పాస్టర్లు ఉన్నారు. భూమిపై పుట్టిన పిల్లలకు ఆకాశంలో నక్షత్రాలను బట్టి పేర్లు పెట్టే డాక్టర్లు ఉన్నారు. అలాగే స్త్రీకి సహజ ప్రసవం అంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ డబ్బుకు కక్కుర్తి పడి ముహూర్తం కోసం పొట్ట కోసి బిడ్డను తీసే డాక్టర్లకు అలా చేయమని అడిగే తల్లిదండ్రుకు కొదువలేదు మనదేశంలో. పేరులో ఒక అక్షరం మారిస్తే సినిమా హిట్ అవుతుందని నమ్మే హీరోలు, నిర్మాతలు ఉన్నారు. ఇలాంటి వారు ఉంటే మన దేశంలో వైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయా?
ఇక మన చదువులు కూడా అలానే ఏడ్చాయి. ఏ మాత్రం శాస్త్రీయంగా ఆలోచించటానికి పునాదులు పడటం లేదు. ''య'' అంటే యజ్ఞం అని చెప్తారే కానీ ''య'' అంటే యంత్రం అని చెప్పరు. గణితంలో కూడా పది లీటర్ల పాలలో మూడు లీటర్లు నీళ్లు కలిపితే నీళ్ల శాతం ఎంత? పాల శాతం ఎంత? ఇలా చిన్నప్పుడు నుంచే కల్తీ ఎలా చేయవచ్చో, అలానే పదివేల రూపాయలు మూడు రూపాయల వడ్డీకి ఇస్తే అది బారు వడ్డీ ప్రకారం లెక్క కడితే ఎంత లాభం వస్తుంది? చక్రవడ్డీ ప్రకారం కడితే ఎంత లాభం వస్తుంది? అని ఇలా వడ్డీ వ్యాపారం చేసుకునే లెక్కలను చిన్నప్పటి నుంచే నేర్పుతుంటారు. ఇలా ఏ మాత్రం శాస్త్రీయత లేని చదువుల వల్ల విద్యాలయాలలో సైన్సు ఇతర సబ్జెక్టు పాఠాలను బట్టి కొట్టించటం వలన డిగ్రీ పట్టాలు అరకొరా ఉద్యోగాలు వస్తాయేమో తప్ప విజ్ఞానం, వివేకం, విచక్షణ వస్తాయి అనుకోవడం కంటే అంతకు మించిన మూఢనమ్మకం మరొకటి ఉండదు. అజ్ఞానం, మూఢత్వం మన సమాజంలో నాలుగు చెరుగుల వ్యాపించేందుకు పాలకుల శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రస్తుత విద్యా విధానానికి లౌకిక తత్వానికి ఏ మాత్రం లంకె కుదరటం లేదు. అసలు చారిత్రక దృక్పథమే లేదు.
ప్రజల దయనందిన జీవిత సమస్యల పరిష్కారం చూపనందువల్ల వచ్చిన అసంతప్తి, ఆగ్రహ జ్వాలలు, రాజకీయ నిరసనలుగా, తిరుగుబాట్లుగా మారకుండా ఉండేందుకు ఇహ లోకంలోని ఈతి బాధలకు పరలోకంలో పరిష్కారం చూపే మతాన్ని పాలకులు ఆయుధంగా వాడుకుంటున్నారు. మూఢ నమ్మకాలను పెంచి పోషించే బాబాలను, స్వామీజీలను, సాధువులు, సంతులు రూపంలో ఉన్న రౌడీ మూకలను ప్రోత్సహిస్తున్నారు. వాస్తు మారిస్తేనో, రుద్రాక్షలు ధరిస్తేనో, యాగాలు హోమాలు జరిపిస్తేనో, హాజియాత్రలు చేస్తేనో, పాస్టర్ల, లామాల మలమూత్రాలు సేవిస్తేనో, స్వస్థత చేకూరుతుందని విస్తృత ప్రచారం ఈ బాబాలు స్వామీజీల ద్వారా తీవ్రంగా ప్రచారం చేయిస్తున్నారు. సామాజిక సమస్యలే ముడిసరుకుగా వారి మత విశ్వాసాలు, వెనుకబాటుతనాన్ని, పెట్టుబడిగా వారి ఆశలు, ఆకాంక్షలే, వ్యాపార మార్కెట్లుగా మారుస్తూ ,భక్తిని ఒక పరిశ్రమగా వేలకోట్ల రూపాయల ఆధ్యాత్మిక సామ్రాజ్యాలను పెంచుకునేలా పాలకవర్గాలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి.
ప్రజలలో అజ్ఞానాన్ని, అంధవిశ్వాసాలను మత మౌడ్యాన్ని, పెంచే పాలకుల విధానాలను, అభివద్ధి నిరోధక శక్తులను తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ మూడ భావజాలానికి వ్యతిరేకంగా అసలైన సైన్సు విజ్ఞాన పరిమళాలను ప్రజలకు అందించాలి. ప్రజల జీవితాలు మెరుగుపడాలంటే సైన్సు సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచాలి. సైన్సు ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రీయ, హేతు దృక్పథాన్ని ఆలోచించే శాస్త్రీయ విద్యావిధానానికై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమ్మకాలు సంప్రదాయాలు, ఆచారాల పేరిట అశాస్త్రీయ భావాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. బాణామతి, చేతబడి, చిల్లంగి అంటే బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసం చేసే వారిని, నరబలులు ఇవ్వమని ప్రోత్సహించే వారిని, బాబాల ముసుగులో లైంగిక అకత్యాలకు పాల్పడే వారిని శిక్షించే విధంగా మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని చేసి దేశంలో అమలు పరచాలి.
- పి.బి. చారి, 9704934614
Sun 07 Aug 06:17:27.105338 2022