భారతీయ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత అక్షరాలు దిద్దించిన గురువుకే పెద్దపీట వేసింది. నేటి బాలలే.. రేపటి పౌరులు. ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా.. బంగారు భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులుగా.. ప్రగతి రథ సారధులుగా నిలిపే వారే.. ఉపాధ్యాయులు. అందుకే శతాబ్దాల నాటి గురుకులాలైనా.. ఆన్లైన్ పాఠాల సంస్కృతి పెరుగుతున్న నేటి ఆధునిక యుగంలోనైనా.. బోధన ఒక పవిత్రమైన వృత్తిగా భాసిల్లుతోంది. టీచర్స్ అంటే సమాజంలో గౌరవం ఇనుమడిస్తోంది. దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుందన్న డా.డి.ఎస్. కొఠారి మాటలు అక్షర సత్యాలు. విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి, మానవతా విలువలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో బోధనా విధానం కీలకం. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన పరిస్థితులలో విద్యను అందించడానికి ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం ఉన్నదా అనే చర్చ గత సంవత్సరకాలంగా జరుగుతుంది. ఏ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ప్రత్యక్ష బోధనకు అది ఏ విధంగాను ప్రత్యామ్నాయం కాబోదు. విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులను వెలిగించే గురువులకు సమాజంలో గౌరవ ప్రదమైన స్థానం ఉంది. దేర్ ఈజ్ నో నాలెడ్జ్ విత్ అవుట్ టీచర్స్.. టీచర్స్ ఆర్ ప్రొవైడర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.. జ్ఞాన సముపార్జనలో.. భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులకున్న ప్రాధాన్యతను తెలిపేందుకు ఇంతకు మించిన పదాలు అక్కర్లేదు. అందుకే.. మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే స్థానం దక్కింది. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు భవిష్యత్‌ను ఇచ్చే క్రమంలో కీలకపాత్ర టీచర్లదే.
నైపుణ్యాలకు నగిషీలు..
వజ్రం ఎంత గొప్పదైనా.. దానికి సానపెడితేనే మరింత వెలుగులీనుతుంది. అదేవిధంగా చిన్నారుల్లో సహజసిద్ధమైన సామర్థ్యాలున్నా.. వారిని సానపెట్టి వజ్రాల్లా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. చిన్నారుల్లోని నైపుణ్యాలను గుర్తించి.. వాటికి నగిషీలు అద్ది, మట్టిలోని మాణిక్యాలను కూడా వెలుగులోకి తీసుకు వచ్చేది మాత్రం టీచర్లే. ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ అసిస్టింగ్ డిస్కవరీ అనే మాటే.. పిల్లల్లో నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్రను తెలియజేస్తోంది. అత్యున్నత నోబెల్ బహుమతి గ్రహీతల నుంచి సమాజంలో ఉన్నత స్ధానంలో ఉన్న వ్యక్తుల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ తమకు స్ఫూర్తి, ప్రేరణ తమ చిన్ననాటి ఉపాధ్యాయులే అని పేర్కొనడం మనం తరచూ వింటూనే ఉంటాం. అలాంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి.
అనుబంధం అంతంతమాత్రం..
ప్రస్తుతం 21వ శతాబ్దంలో.. 4జీ ఫోన్లు, అరచేతిలో ఒక్క క్లిక్‌తో సమస్త ప్రపంచ సమాచారం కళ్ల ముందుంటోంది. ఈ క్రమంలో ఈ తరం ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎలా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారు? అంటే .. వీరి మధ్య అనుబంధం అంతగా ఉండటం లేదని చెప్పొచ్చు. తరగతి గది మారింది. పాఠశాల స్థాయిలో బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ స్థానంలో వైట్ బోర్డ్స్, మార్కర్ పెన్స్ సంస్కృతి పెరిగింది. ఆడియో-విజువల్ టూల్స్‌తో క్లాస్రూంలు ఆధునికతను సంతరించు కుంటున్నాయి. 'క్లాస్ రూంలో పాఠాలు వినపోయినా ఫర్వాలేదు. ఇంటర్నెట్, ఈ-లెర్నింగ్ టూల్స్ ఉన్నాయిగా' అనే దృక్పథం యువతలో పెరుగుతోంది. కానీ ఈ-లెర్నింగ్ టూల్స్, ఆన్లైన్ ట్యూషన్స్, వీడియో లెక్చర్స్ సైతం ఉపాధ్యాయులే రూపొందిస్తారని యువత గుర్తించాలి అని విద్యావేత్తలు అంటున్నారు. 'టెక్నాలజీ అనేది విద్యా బోధనలో ఒక సాధనం మాత్రమే. విద్యార్థిని తీర్చిదిద్దడంలో టీచర్ పాత్రే అత్యంత కీలకం' అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యలే విద్యార్థుల భవిష్యత్ నిర్దేశం దిశగా నేటి ఆధునిక యుగంలో ఉపాధ్యాయుల పాత్రను తేటతెల్లం చేస్తోంది.
ఎర్లీ చైల్డ్‌హుడ్.. ప్రధానం
సరిగా మాటలు పలకడం కూడా రాని వయసులో ప్రీ-ప్రైమరీ, కిండర్ గార్టెన్, నర్సరీ, ఎల్కేజీ ఇలా రకరకాల పేర్లతో పిల్లలను పాఠశాలల్లో చేర్చుతున్న రోజులివి. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది ఉపాధ్యాయులే. ఆట బొమ్మలతో పాఠాలు చెబుతూ.. వాటిని చిన్నారులు అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులు పాటించే సహనం, ఓర్పు, నేర్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాకుండా చిన్నారుల్లో ఉన్న సహజ సిద్ధ నైపుణ్యాలను వెలికితీయడంలో టీచర్ల పాత్ర వెలకట్టలేనిది. అందుకే 'గుడ్ టీచర్ నోస్ హౌ టు బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఇన్ స్టూడెంట్స్ - అనే మాట నూటికి నూరుపాళ్లు నిజం.
నిత్య విద్యార్థి
ఉపాధ్యాయుడు నిత్యం సమకాలీన అంశాలను పాఠ్యాంశాలకు జోడించి చెప్పగలగాలి. అప్పుడే తన బోధన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. పుస్తకాలలో చదువును సామాజిక అంశాలకు జోడిస్తూ ఆకట్టుకునే విధంగా పాఠాలు జోడిస్తూ చెప్పినప్పుడే విద్యార్థి ప్రయోజనం పొందుతాడు. అయితే పాఠాలను ఒక మూస ధోరణిలో చెబుతూ కాలక్షేపం చేసే గురువులు కూడా నేడు లేకపోలేదు. దాని వలన ఉపాధ్యాయునికి నష్టం లేకపోయినా విద్యార్థులు ఖచ్చితంగా నష్టపోతారు. అంటే గురువు పుస్తకాలనే కాదు సమాజాన్ని చదవాలి, విశ్లేషించాలి. దానిలో మంచి చెడులను పిల్లలకు తెలియచెప్పాలి. అప్పుడే వారిలో సరైన మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది.
సామాజిక వైద్యుడు
సమాజంలో ప్రజలకు సంభవించే మానసిక శారీరక రుగ్మతలు నివారించడానికి ప్రఖ్యాతి గాంచిన వివిధ విభాగాలకు చెందిన ఎందరో వైద్యులు మనకు అందుబాటులో ఉన్నారు. అయితే సమాజంలో పేరుకుపోయిన సామాజిక రుగ్మతలను నివారించాలంటే మాత్రం ఉపాధ్యాయుడే సరైన వైద్యుడు. తన చేతిలో భావి భారత పౌరులు సరైన శిక్షణతో బయటకు వచ్చిన నాడు ఉత్తమ పౌరులు దేశానికి లభిస్తారు. అప్పుడే సమాజానికి చేటు తెచ్చే రుగ్మతలు దరి చేరవు. అంటే తన మార్గదర్శకత్వంలో సామాజిక రుగ్మతల చీడను మొగ్గ దశలోనే అణచి వేయగల సామర్థ్యం ఉపాధ్యాయుడు ఒక్కడికే సాధ్యం. అందుచేతనే ఉపాధ్యాయుడిని సామాజిక వైద్యుడు అంటారు. ఒక మెరుగైన సమాజాన్ని కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే నిర్మించగలడు.
మార్గదర్శకుడు
ఉపాధ్యాయుడు అంటే తరగతి గదిలో పిల్లలకు మూకుమ్మడిగా బోధన చేసే వాడు కాదు. తరగతి గదిలో ఉన్న ఒక్కొక్క విద్యార్థికి ఒక్కో రకమైన నైజం ఉంటుంది. స్వతహాగా తెలివైన వాళ్ళు ఉంటారు. చదువులో వెనుకబడిన వారు ఉంటారు. వీరిద్దరి మధ్య తేడా గ్రహించి భిన్న రీతిలో వారిని ఆకట్టుకునే విధంగా బోధన చేయాలి.
అభ్యసనంలో వెనుకబడి ఉన్న వాళ్లపై ప్రత్యేక దృష్టి సాధించాలి అంటే వారు ఏ రంగంలో రాణించగలరో గమనించగల శక్తి గురువు కలిగి ఉండాలి.. అంటే గురువు పిల్లల సమగ్ర వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా వారిని ప్రేరేపించి సరైన మార్గదర్శనాన్ని చూపించి విద్యార్థులను తీర్చిదిద్దాలి. విద్యార్థుల సామర్ధ్యాన్ని మార్కులతో కొలచి అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయించే వారు సరైన గురువులు కాదు. చదువుతో పాటు సంస్కారం అనేది పిల్లల్లో గురువు కలిగింప చేయాలి అప్పుడే వారిలో సమగ్ర మూర్తిమత్వం సాధించగలుగుతారు. అందుకే బడి అనే నారుమడిలో.. విద్య అనే విత్తనం వేసి.. అక్షరం అనే నీరు పోసి.. చెడు అనే కలుపుతీసి.. మంచి, నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే గురువు అంటారు పెద్దలు.
మూర్తిమత్వానికి చోదక శక్తులు
అంకిత భావం కష్టించే స్వభావం, వృత్తిని ప్రేమించేతత్వాన్ని కలిగి ఉన్న ఉపాధ్యాయులు నేడు కూడా లేకపోలేదు. అటువంటి వారు విద్యార్థులలో సంపూర్ణ మూర్తిమత్వానికి చోదక శక్తులుగా నిలుస్తున్నారు. అటువంటి గురువులు పాఠం చెబితే తిరిగి చదవ వలసిన అవసరమే ఉండదు అంటారు విద్యార్థులు. ఇటువంటి గురువుల వద్ద నైపుణ్యాలు విలువలు కూడా విద్యార్థులకు వరంగా లభిస్తాయి.
పిల్లల సామర్ధ్యాల వెలికితీత
వజ్రం ఎంత గొప్పదైనా.. దానికి సానపెడితేనే గాని వెలుగులు ప్రకాశించదు. ఇదే రీతిలో ఉపాధ్యాయుడు కూడా పిల్లల్లో దాగి ఉన్న సహజ సిద్ధమైన సామర్ధ్యాలను గుర్తించి వాటిని వెలికి తీసి వజ్రాల్లా తీర్చిదిద్దాలి. మన సమాజంలో అత్యున్నత నోబెల్ బహుమతి గ్రహీతల నుంచి ఉన్నత స్ధానంలో ఉన్న వ్యక్తుల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ తమకు స్ఫూర్తి, ప్రేరణ తమ చిన్ననాటి ఉపాధ్యాయులే అని పేర్కొనడం మనం తరచూ వింటూనే ఉంటాం. అలాంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి.
సాంకేతికత పెరిగిన తరువాత ఇంటర్నెట్ సదుపాయం విస్తరించిన తరువాత అర చేతిలోనే గూగుల్ ద్వారా ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. అవసరమైన సమాచారాన్ని వేగంగా పొందగలుగుతున్నాము. కాబట్టి గూగుల్‌నే గురువుగా భావించే వాళ్ళు లేకపోలేదు. ఎంత సాంకేతికత వృద్ధి చెందినా తరగతి గదిలో అభ్యసించిన విద్యకు ఆన్లైన్ విద్యకు అసలు పొంతనే ఉండదు. అందుకే 'శిక్షక్ నహీ - శిక్షా నహీ' అని పెద్దలు అంటూ ఉంటారు. 'ఉపాధ్యాయుడుంటేనే - చదువు' అంటే తరగతి గదిలో చదువు అభ్యసించడం ద్వారానే జ్ఞానాన్ని వ్యక్తిత్వాన్ని గురువు ద్వారా మెరుగు పరుచుకోవచ్చు. తరగతి గదికి విద్యార్థికి మధ్య గల సంబంధాన్ని ఒకానొక సందర్భంలో చాలా అద్భుతంగా వివరించారు రాధాక్రిష్ణన్.
ఆయన మాటల్లో విద్యాభ్యాసంలో తరగతి గది ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. 'విద్య ద్వారా సమాజ పరివర్తన తీసుకురావాలి అటువంటి సమాజ పరివర్తనను సామాజిక శాస్త్రవేత్త అయిన ఉపాధ్యాయుడు తరగతి గది నుంచి మాత్రమే సాదించగలడు' అన్నారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.
పుస్తకాలు వేలకొద్దీ ముందున్నా... వాటిని అర్థం చేసుకుని వాటి పరమార్థాన్ని చెప్పగలిగేవారు లేకుంటే వ్యర్థం. అందుకే గురువు మన జీవితానికి అర్థం చెప్పే ఓ దైవం అన్నారు దాశరథి కృష్ణమాచార్యులు.
ఇవన్నీ చూస్తే దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుందన్న డా.డి.ఎస్. కొఠారి మాటలు అక్షర సత్యాలని చెప్పవచ్చు.
'టెక్నాలజీ అనేది విద్యా బోధనలో ఒక సాధనం మాత్రమే. విద్యార్థిని తీర్చిదిద్దడంలో తరగతి గదిలో బోధించే ఉపాధ్యాయుల పాత్రే అత్యంత కీలకం' అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యలే విద్యార్థుల భవిష్యత్ నిర్దేశం దిశగా నేటి ఆధునిక యుగంలో ఉపాధ్యాయుల పాత్రను తేటతెల్లం చేస్తోంది. పలువురు విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ఒక విద్యార్థికి క్లాస్ రూం పాఠం ద్వారా 50 శాతం, లైబ్రరీ ద్వారా 25 శాతం, ఇతర లెర్నింగ్ సదుపాయాల ద్వారా 25 శాతం నైపుణ్యాలు అందుతాయి. అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఎన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా ప్రత్యక్షంగా టీచర్ చెప్పే పాఠం ద్వారా లభించే జ్ఞానమే అధికమని నేటి తరం గుర్తించాలి. గురువు వద్ద శిష్యులు ప్రత్యక్ష బోధన ద్వారానే విద్యలో నాణ్యత పెరుగుతుంది. గురువు అంటే పాఠాలు బోధించే వాడే కాదు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహద పడేవాడు.
విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి, మానవతా విలువలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తరగతి బోధన కీలక పాత్ర వహిస్తుంది.
ఆదర్శ గురువు
ఒక గురువు ఎలా ఉండాలో కూడా భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఏయే లక్షణాలు ఉండాలి.. ఏయే లక్షణాలు ఉండకూడదు.. అలాగే గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో కూడా వివరించారు.
గురువు గొప్పతనాన్ని వివరిస్తూ మన పెద్దలు సాధారణ ఉపాధ్యాయుడు పాఠం చెబుతాడు. మంచి ఉపాధ్యాయుడు పాఠాన్ని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు పాఠం నేర్చుకునేందుకు ప్రేరణ కలిగిస్తాడు... ఇలా పేర్కొనడం బట్టి ఉపాధ్యాయుడు పని పాఠం బోధించడం ఒక్కటే కాదని స్పష్టం అవుతుంది. ఆదర్శ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలను అమెరికన్ మేధావి ఎల్.ఎఫ్.క్లాప్ ఇలా వివరించారు. మంచి సంబోధన (పలకరింపు), ఆకర్షణీయమైన రూపం, ఆశావాదం, అల్పభాషణం, ఉత్సాహం, మానసిక స్వచ్ఛత, దయ, చేతనత్వం, నాయకత్వ సామర్థ్యం, మంచి కంఠం, విలువలకు కట్టుబడి ఉండటం, చక్కటి భావ వ్యక్తీకరణ, స్నేహశీలత, భావోద్రేకాల నిలకడ, బోధన పట్ల అనురక్తి, పఠనాసక్తి, సహకార లక్షణాలు ఉపాధ్యాయుడిలో ఉండాలంటారాయన.
ఈ లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకొని గత తరంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ఆదర్శపురుషులు, మహానుభావులు మహాత్మజ్యోతిబాయి ఫూలే, సావిత్రిబాయి ఫూలే, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎపిజె అబ్దుల్ కలాం వంటివారు ముందువరసలో ఉన్నారు.
వీరిలో సామాన్య ఉపాధ్యాయవృత్తిని చేపట్టి ఉపరాష్ట్రపతి, భారత అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారి గౌరవర్థాం సెప్టెంబర్ 5 వతేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. రాధాకృష్ణగారు 1888 సెప్టెంబరు ఐదున ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తిరుత్తని అనే గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా రాధాకృష్ణన్ బాల్యం నుంచే చురుకైన వ్యక్తి. 21 సంవత్సరాలకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యునిగా నియమితులయ్యారు.
1929లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ కాలేజి ప్రిన్సిపల్‌గా, ఆ పిదప ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆచార్యుడుగా పనిచేశారు. 1931లో సర్వేపల్లికి 'సర్' బిరుదు లభించింది. ఆయన మైసూరు, కలకత్తా, మద్రాసు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఆచార్యుడుగా పనిచేసి 1931లో ఆంధ్రాయూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
రాధాకృష్ణ తత్త్వవేత్తగా, భారత రాయబారిగా, విద్యా సంస్కరణల కమిటీ చైర్మన్‌గా, ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు, రాష్ట్రపతిగా ఉత్తమ సేవలందించినందుకుగాను 1954లో భారతరత్న అవార్డును సైతం అందుకున్నారు. భారతీయ దార్శినిక చింతనాధోరణులను, సంస్కృతిని తన రచనలు ద్వారా పాశ్యాత్య దేశాలకు తెలియచేసిన గొప్ప రచయిత రాధాకృష్ణన్.
సంస్కృత భాషలోని భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు ఆంగ్లంలో గొప్ప వ్యాఖ్యానాలు రాసి పాశ్చా త్యులను సైతం ఆశ్చర్యపడేలా చేసిన వేదాంతి రాధాకృష్ణన్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కు పైబడి డాక్టరేట్లు వివిధ విశ్వ విద్యాలయాల నుండి పొందిన ప్రతిభా శీలి.
ఆయన దాదాపు 150 వరకు గ్రంథాలను రచించడమే కాకుండా ఆ గ్రంథాలు విశిష్ట ప్రాచుర్యాన్ని కూడా ఆర్జించాయి. వీటిలో ముఖ్యమైనవి 'ఇండియన్ ఫిలాసఫీ', 'ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్', 'ద ఐడియల్ వ్యూ ఆఫ్ లైఫ్', 'ఫ్రీడమ్ అండ్ కల్చర్', 'మహాత్మాగాంధీ', 'గ్రేట్ ఇండియన్', 'ది దమ్మపద గౌతమబుద్ద' వంటివి భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి.
తత్వశాస్త్రానికి సాహిత్యాన్ని జోడించిన మహా రచయిత రాధాక్రిష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు.
ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
'దేశాన్ని తీర్చిదిద్దే మేధావులు ఉపాధ్యాయులే' అని చాటి చెప్పిన డాక్టర్ రాధాకృష్ణన్, 'ఒకరోజు నేను దేశ మాజీ అధ్యక్షుడిని అవుతాను. కానీ ఎప్పటికి మాజీ విద్యావేత్తను మాత్రం కాను' అన్నారు సర్వేపల్లి అంటే ఆయనకు అధ్యాపక వృత్తిపై గల అపారమైన గౌరవం ఉందని మనకు తెలుస్తుంది.. విద్యకు విద్యార్థులు అంకితం- ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం' అని తరచూ చెబుతూ ఉండేవారు సర్వేపల్లి. దేశాధ్యక్ష పదవి కన్నా ఉపాధ్యాయ వృత్తి నాకు ఎంతగానో సంతృప్తి ఇచ్చిందని అనేవారు. ఆయన అధ్యాపకుడిగా ఉండే సమయంలో ఆయన శిష్యులు కూడా ఆయన అంటే అంతే ప్రేమాభిమానాలను చూపేవారు. ఒకసారి మైసూరు నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి రాధాకృష్ణన్ ఉపకులపతిగా వెళుతున్నప్పుడు పూలతో అలంకరించిన గుర్రబగ్గీని మైసూర్ రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులే లాక్కెళ్లారంటే ఆయన విద్యార్థులకు ఎంత చేరువయ్యారో, గురుస్థానానికి ఆయన ఇచ్చిన విలువ ఎంతో అనేది అవగతమవుతుంది. ఆయనను విద్యార్థులే కాదు ఎందరో అత్యున్నత స్ధితిలో ఉండే ప్రముఖులు నుండి కూడా ప్రశంసలు పొందారు.
ఆ ప్రముఖుల ప్రశంసలను బట్టి రాధాకృష్ణన్ గురువుగా ఆయన ఆర్జించిన ఖ్యాతి మనకు బోధపడుతుంది.
ఆయన పర్యటించని ప్రదేశం లేదు. ఆయనను గౌరవించని స్థలం లేదు. ఆయన అధ్యక్షతన ఏర్పాటు (1948) చేసిన విశ్వవిద్యాలయ మొదటి కమిషన్ నివేదికలో విద్యకు సంబంధించి పలు సూచనలు చేశారు. వాటిలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడే విద్యార్థులు తమలోని స్వేచ్ఛను, భావావేశాన్ని, కళాత్మకతను, మేధోపరమైన మేధోపరమైన కార్యకలాపాలను వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని, ప్రధానంగా విద్యావ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని విద్యపై వ్యయాన్ని ప్రజల, ప్రజాస్వామ్య భవిష్యత్ పెట్టుబడిగా భావించాలని ఆయన సూచించారు. విద్యా రంగంలో వాణిజ్య దృక్పథం అనేది ఆరంభం అయితే అసమానతల సమాజం ఏర్పడి అనేక దుష్ఫ లితాలు సంభవిస్తాయని ఆయన ఆనాడే ఉహించారు.
అబ్దుల్ కలాం
రాధాకృష్ణన్ భావాలనే పుణికి పుచ్చుకున్న మరొక ఆణిముత్యం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. తనకు శాస్త్రవేత్తగా కన్నా రాష్ట్రపతిగా కన్నా అధ్యాపకుడిగా తనకు అత్యంత సంతృప్తి కలిగిందని తరచూ ఆయన అంటూ ఉండేవారు. 'ఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని, భవిష్యత్తును రూపుదిద్దే సర్వోన్నత వ్యక్తి ఉపాధ్యాయుడే' అని ఆయన తరచుగా చెప్పేవారు. ఆయన వివిధ హోదాల్లో బిజీగా ఉన్నా మనసంతా బోధనపైనే ఉండేది. వీలు దొరికినప్పుడల్లా ఏవైనా పాఠశాలలు యూనివర్సిటీలు కళాశాలలను సందర్శించి వివిధ అంశాలపై ఉపన్యసించేవారు. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులతో తన అనుభవాలను పంచుకునేవారు. వారిని ఉత్సాహపరిచేవారు.. కార్మోన్ముఖులను చేసేవారు. దేశాధ్యక్షుడిగా పదవీ విరమణ అనంతరం పూర్తి సమయం విద్యార్థులతోనే గడపడానికి కేటాయించారు. .విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశాలలో విద్యార్థుల లేవనెత్తిన పలు సందేహాలను మనసుకు ఆకట్టుకునే విధంగా వివరిస్తూ ఉండేవారు.
తాను ఎక్కడో దేశానికి దక్షిణం దిక్కులో సముద్రంలో విసిరేసినట్లుండే ఒక చిన్న ఊరు రామేశ్వరంలో పుట్టినా.. ఈ స్థాయికి రావడానికి తన గురువులే కారణమని కలాం ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు.
ఆయన ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్' పుస్తకం యువతకు స్ఫూర్తి నింపిందని చెప్పొచ్చు. ఆయన ప్రతీ సమావేశంలోనూ గురువు శిష్యుల మధ్య సంబంధం గురించి మనల్ని ఉత్తమ పౌరులుగా మలచడంలో గురువుల పాత్ర గురించి మనసుకు హత్తుకునే విధంగా భోదిస్తూ ఉండేవారు. ఇదే ప్రయాణంలో ఆయన 2015 జూలై 15న షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)విద్యార్థులకు బోధిస్తూనే ఆ జ్ఞానశిఖరం నేలకొరగడం బాధాకరం.
నేటి గురు శిష్యుల బంధం
1990 తర్వాత ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక సరళీకృత విధానాలు అమలుపరచడం ప్రారంభమయ్యాక గురు శిష్యుల బంధం మధ్య అంతరం పెరగడం ఆరంభమయ్యిందని చెప్పొచ్చు. ఈ కాలంలో విద్య అంగడి సరుకుగా మారడంతో ఉపాధ్యా యులపై గౌరవ ఆదరాభి మానాలు మసక బారడం మొదలయ్యాయి.
ఈ అవాంఛనీయ పరిణామాలతో నేడు విద్యా సంస్ధ లలో భిన్నమైన పరిస్ధితులు గోచ రిస్తు న్నాయి. గురువు లకు గత కాలంలో దక్కిన వైభవం నేడు కాన రాకుండా పో యింది. ఎందు కంటే విద్యా విధానంలో అవాంఛనీయ పోటీ పెరిగి పోయింది. సిలబస్ బోదనే తప్ప నైతిక విలువల బోధనకు ఏ మాత్రం అవకాశం లేని పరిస్ధితి నేడు తప్పనిసరి అయ్యింది. చదువుకు అను బంధంగా క్రీడలు సాంస్కృతిక కార్యక్ర మాలకు ఏ విదంగాను అవకాశం లేదు. విద్యా భ్యాసం అంటే ఉన్నత ఉద్యోగాల ఆర్జనే తప్ప ఉన్నత వ్యక్తిత్వం అనే దానికి అవకాశం లేకుండా పోయింది. అవాంఛనీయ పోటీలో పిల్లల తల్లిదండ్రులు సైతం మా పిల్లలకు విద్య లభిస్తే చాలు అంటూ బుద్ధులు మాట పక్కన పెట్టేశారు. గురువు అనే వాడు నేర్పేది విద్యతో పాటు బుద్ధులు కానీ నేడు గురువుకు బుద్ధులు స్ధానంలో ర్యాంకులు మార్కులు అప్పగించారు తల్లిదండ్రులు. కరెన్సీ కట్టల ఆర్జనే ధ్యేయంగా కార్పొరేట్ విద్యకు ఎర్ర తివాచీ పరిచారు.
ప్రస్తుతం డిజిటల్ విద్యాబోధనలో విద్యార్థులకు, గురువులకు మధ్య ఇంటర్నెట్ చేరింది. అందరి చేతుల్లో 4జీ ఫోన్లు అరచేతిలో ఒక్క క్లిక్‌తో సమస్త ప్రపంచ సమాచారం కళ్ల ముందుంటోంది. ఈ క్రమంలో ఈ తరం ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎలా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యా యులు ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారు? అంటే .. వీరి మధ్య అనుబంధం అంతంత మాత్రమే అని చెప్పడం అతిశయోక్తి కాదేమో!
'క్లాస్ రూంలో పాఠాలు వినపోయినా ఫర్వాలేదు. ఇంటర్నెట్, ఈ-లెర్నింగ్ టూల్స్ ఉన్నాయిగా' అనే దృక్పథం యువతలో రోజు రోజుకు పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో పిల్లలను గురువులు మందలించే ఆస్కారమే నేడు లేకుండా పోయింది. ఒకానొక కాలంలో పిల్లలను గురువు మందలించినట్లు లేదా పనిష్మెంట్ ఇచ్చినట్లు తెలిసినా తల్లిదండ్రులు కూడా మరింతగా పిల్లలను మందలించే వారు. అయితే నేటి పరిస్ధితి తారుమారు అయినట్లుగా కనిపిస్తుంది. పిల్లలను గురువు మందలించినట్లు తెలిస్తే గురువును మందలించడానికి తల్లిదండ్రులు బంధువులు తరలి వస్తున్న సంఘటనలు మనకు ఎన్నో చూస్తున్నాం. అంతే కాదు కొందరి ఆధునిక గురువుల వ్యవహార శైలిలో కూడా ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే రీతిలో ఉండే ఘటనలు మనకు అక్కడక్కడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థలలో విద్యార్థినులపై గురువుల లైంగిక వేధింపుల గురించి తరచూ మాధ్యమాలలో చదువుతున్నాం. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కుల వ్యవహారంలో కొందరి గురువులు వ్యవహరిస్తున్న ధోరణి మనం వింటూనే ఉన్నాం. ఏదో కొందరి ఈ తరహా వ్యవహార శైలి వల్ల అందరు ఉపాధ్యాయులు అపవాదులు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన ఉపాధ్యాయ వర్గం నుండి వ్యక్తమవుతూ ఉంది. సినిమాలలో అయితే గురువును జోకర్‌గా చూపిస్తూ చిన్నబుచ్చే పాత్రలు ఎన్నెన్నో. ఈ పరిణామాలకు కారణం వ్యవస్ధీకృత లోపలే. గురువు అనే ఈ పవిత్ర వృత్తికి బోధన పట్ల మరియు ఈ వృత్తి పట్ల పూర్తి ఆసక్తి ఉన్నవారే ఈ రంగంలోనికి వచ్చేవారు. కానీ నేడు ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఒక ఉపాధిగా ఎంచుకునే వాతావరణం వృద్ధి చెందింది.
ఒకానొకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు. కానీ నేడు అది బతకడానికి బడిపంతులుగా మారింది. కానీ వాస్తవంగా బడిపంతులు అనే వాడు బతకలేక, బతకడానికి అని కాకుండా బతికించడానికి అని గుర్తెరిగి వ్యవహరించిననాడు ఉపాధ్యాయుడి ప్రతిష్ట మరింత మెరుగు పడుతుంది. విలువలే పరమావిధిగా ఉండే ఉపాధ్యాయ వృత్తి అనేది ఉపాధి కోసం ఒక ఎంపికగా మారిన నాటి నుండి విలువలు పడిపోతున్నాయి అని కొందరి విద్యావేత్తల ఆందోళన. నేడు ప్రభుత్వ విద్యా సంస్ధలలో పరిణితి చెందిన ఉపాధ్యాయులు అధ్యాపకులు అనేకులు ఉన్నారు. కానీ నేటి అవాంఛనీయ పోటీ వాతావరణంలో పిల్లలను నైతికంగా మలచే అవకాశం సమాజమే ఇవ్వడం లేదు. పూర్వం తల్లి తండ్రులు గురువును మీరు ఏదన్నా చేయండి మా బిడ్డను సంస్కారం కలిగిన విద్యావంతుడిగా చేయమని గురువును వేడుకునే వారు. కానీ నేడు మీరు ఏదైనా చేయండి మా బిడ్డకు మంచి ర్యాంక్ అందించండి అంటూ 24 గంటలు బోధనకే పరిమితం చేయిస్తున్నారు. దీని వలన పిల్లలు అధిక ఆదాయాలు ఆర్జించే కొలువులు సంపాదిస్తున్నారు తప్ప విలువలు శూన్యం అవుతున్నాయి అనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. దీని ఫలితాన్ని ఈ రోజున అనేక అఘాయిత్యాలు అకృత్యాలు రూపంలో మనం చూస్తున్నాం. కేవలం బోధన మాత్రమే చేసే వారు సంపూర్ణ గురువులు అనిపించుకోరు. విద్యార్థి వ్యక్తిత్వాన్ని సరైన రూపంలో మలిచే వాడే నిజమైన గురువు. గత కాలంలో విద్య అభ్యసించి ఉన్నత స్ధితికి చేరుకున్న ప్రతీ ఒక్కరు తమ ఉన్నతికి గురువులు ప్రేరణ అని. గురువుల బోధనలే కాదు వారిచ్చిన సూచనలు, మందలింపులు, ప్రేరణలు అంటూ ప్రతీ సంఘటనను ప్రతీ ఒక్క గురువును పేరు పేరునా స్మరించుకుంటు ఉంటారు.మరి నేటి తరం పిల్లలు ఆ విధంగా తమను ప్రేరణకు గురి చేసిన గురువులు వీరు అని స్మరించుసుకునే అవకాశం ఉందా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. ఎందుకు అంటే మనమే గురువులకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. కేవలం ఇప్పటి పిల్లలు మా టీచర్ లెక్కలు బాగా చెప్పే వారు ఫలానా టీచర్ సైన్స్ బాగా చెప్పే వారు. ఫలానా టీచర్ పరీక్షలకు బాగా ప్రిపేర్ చేసే వారు అని చెప్పడం తప్ప తన జీవన విధానంలో మంచి ప్రేరణ తీసుకువచ్చిన గురువు ఫలానా వారు అని చెప్పుకొనే వారు అరుదుగా ఉంటారని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
ప్రపంచీకరణ ప్రయివేటీకరణ నేపథ్యంలో గురువు స్ధానంలో అవాంఛనీయ మార్పులు సంభవించాయి.గత కాలంలో విద్యార్థులు పాఠశాలలో కానీ కళాశాలల్లో కానీ చేరాలి అంటే విద్యా సంస్థలు వద్దకు వచ్చి గురువు వద్ద చేతులు జోడించి విద్యా సంస్ధలో ప్రవేశానికి అభ్యర్దించి గురువులకు తల్లి తండ్రులు అప్పగించే వారు. అయితే విద్య కార్పొరేట్ శక్తుల చేతుల్లోనికి వెళ్లి పోయిన తరువాత ఇప్పుడు గురువులు ఒకటికి రెండు సార్లు విద్యార్థి తల్లి తండ్రుల ఇళ్లకు వెళ్లి వినయంగా చేతులు జోడించి తమ పిల్లలను జాయిన్ చేయమని బతిమలాడే స్ధితికి గురువు స్ధానాన్ని దించేశారు.విద్యా వ్యస్ధలో ఇది నేడు చాలా దురదృష్టకర పరిణామంగా చెప్పవచ్చు. ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయుల విధి నిర్వహణకు సంబంధించిన పనులు మాత్రమే కాకుండా విభిన్న బాధ్యతలు అప్పగించడం కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి మరొక కారణంగా చెప్పవచ్చు.
ఇక ప్రయివేట్ రంగంలో పని చేస్తున్న గురువుల ఎదుర్కొనే సమస్యలు అయితే చెప్పనలవే కాదు. వారికి ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనాలు చట్టం అమలు కాదు. కోవిడ్ సమయంలో అయితే వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన రాధాకృష్ణన్ మెరుగైన విద్యకు గురు శిష్యుల మధ్య సంబంధాల విషయంలో, విద్య కేవలం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి అనే సూచనలు ఆనాడే చేయడం గమనార్హం. అయితే ప్రభుత్వాలు మాత్రం ఆయన గౌరవార్థం ఆయన జన్మదినాన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం తప్ప ఆయన చేసిన విలువైన సూచనలు మాత్రం అమలు చేయడంలో చిత్త శుద్ధి లేకపోవడం వల్లనే నేడు విద్యారంగంలో కానీ గురు శిష్యుల సంబంధంలో కానీ విపరీత పోకడలు చూస్తున్నాం. సమాజంలోని వివిధ రంగాలలో విభిన్న వృత్తులు చేపట్టిన ఉద్యోగులు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే ఆ రంగంలో లేదా ఆ వృత్తిలో మాత్రమే ప్రతికూల ప్రభావాలు సంభవిస్తాయి. కానీ ఉపాధ్యాయ విధి నిర్వహణలో కానీ గురువు స్థానంలో కానీ గురువులు వ్యవహరించే తీరులో కానీ విభిన్న ధోరణలు సంభవిస్తే మాత్రం సమాజం పునాదులే బీటలు వారుతాయి అనే ప్రమాదాన్ని గుర్తెరిగి ఇప్పటికైనా చర్యలు చేపట్టక పోతే ఎదురయ్యే పరిస్ధితులను సమాజం మొత్తం భరించవలసి వస్తుంది.చివరిగా గురువుల పట్ల గౌరవ భావాలు కలిగి ఉండటం ఎంత ముఖ్యమో విద్యార్థుల నుండి గౌరవాన్ని భక్తిని పొందే విధంగా గురువులు కూడా నడుచుకోవడం అంతకన్నా ముఖ్యం అని గురువులు గుర్తెరగాలి. ఏది ఏమైనా గురువు స్ధానంలో నిలబడే అవకాశం రావడం ఒక మహద్భాగ్యం. దానిని నిలబెట్టుకోవలసిన ప్రాధమిక బాధ్యత నేటి గురువులపై ఉంది.ఆనాడే గతకాలపు గురు శిష్య బంధం మరలా వెలుగులు విరంజిమ్ముతుందని భావిస్తూ ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
- రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578
Sun 04 Sep 03:24:43.299208 2022