Sun 25 Sep 01:04:11.987201 2022
Authorization
పూల పండుగ.. ఆడపిల్లలు పచ్చగా బతకాలని కోరుకునే పండుగ... జీవితంలో నిత్యం పడే బాధలను, ఇబ్బందులను, కష్టాలను, దు:ఖాలను తనలో తానే అనుభవిస్తూ కుమిలిపోకుండా పదుగురితో పంచుకొనే ఒక సామూహిక సందర్భం బతుకమ్మ పండుగ. ఆడబిడ్డల ఆనందం కోసం ఆటలతో పాటలతో ఆకాంక్షించే ఆశల పండుగ. మహిళల మనసుల్లో సంతోషాల పూల సింగిడి ఈ పండుగ. పూలకాంతిలా తమ భవిష్యత్తు వెలగాలని అభిమతాల గీతాలాపన చేసే సందర్భం పండుగ. పరిమళించే అనుబంధాల కోసం పరితపించే పండుగ. బతుకు కోసం, భవిత కోసం సామూహిక గొంతులెత్తే స్వరమయ శోభితమే పండుగ...
ప్రకృతి మానవుల సంబంధాన్ని చాటిన పండుగ బతుకమ్మ. పండుగ వస్తుందంటే మహిళలు తమ తమ గ్రామాల్లో పట్టణాల్లో సంబురాలు చేసుకుంటూ ఆటపాటలతో ఎంతో సందడి చేస్తారు. కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన బతుకమ్మ సంబురాలు ఈ మధ్య వేరే దేశాల్లో కూడా సందడి చేస్తున్నాయంటే ఇందులో ఇమిడి ఉన్న అనేక అంశాలు కారణమని చెప్పవచ్చు.
చరిత్రలో బతుకమ్మ గురించి కొన్ని రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధ్యాత్మికతను నమ్మేవారు చెప్పేది, సుమారు 1000 సంవత్సరాల క్రితం ధర్మాంగుడనే రాజు భార్య సత్యవతి. వీరికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. వారంతా యుద్ధాల్లో మరణించగా ఆ రాజ దంపతులు దుఃఖంతో తపస్సు చేస్తూ దేవుళ్లను వేడుకోగా శ్రీమహావిష్ణువు వారిని కనికరించి శ్రీ మహాలక్ష్మి ఆడపిల్లగా ఆ రాజు దంపతులుకు జన్మించిందని, ఆ పాపయే బతుకమ్మ అని నామకరణం చేసి ఆ ప్రాంతంలో నివసించే ఋషులంతా పాపను లక్ష్మీదేవిగా పూలతో పూజించేవారని లక్ష్మిదేవి విగ్రహం మీద పూలు కుప్పలుగా పోసి ఆరాధించే వారని మన పురాణాలు నమ్మినవారు చెప్తున్న కథ. ఎక్కువ మంది మహిళలు నమ్ముతున్న కథ కూడా. కేవలం రాజుల కుటుంబాల్లోనే ఈ పూజలు జరిగేవి. తర్వాత కాలంలో సమాజం అభివద్ధి చెందే కొద్దీ బతుకమ్మ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాల్ని గుర్తించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయా కాలాన్ని బట్టి ఆచార వ్యవహారాలు పాటిస్తుంది. సమాజం ఆ రోజుల్లో గ్రామాలన్నీ చెరువులు నదులపై ఆధారపడి జీవనం కొనసాగించేవారు. ఇప్పుడున్న చేద బావులు, బోరుబావులు అప్పుడు లేవు. కావున బతుకమ్మ ఆడిన తర్వాత ప్రతిరోజు దగ్గరలో ఉండే చెరువుకెళ్ళి నిమజ్జనం చేసి వారు పువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల వర్షాలకు పశువుల వల్ల కలుషితమైన నీరు శుభ్రపడేది. తాగడానికి కూడా గ్రామాల్లో ఈ నీటినే వాడేవారు.
ఏ కాలంలోనైనా మూడ విశ్వాసాలతో పాటు సైన్స్‌తో కూడిన ఆచారం సమాజంలో నిలుస్తుంది. దినదన ప్రావర్ధనమై వెలుగొందుతుంది. భావవాదంతో కూడిన ఆచారం కొన్నేళ్లకు నశిస్తుంది. ఇది చరిత్ర అందించిన సత్యమిది. మూడ విశ్వాసంతో పుట్టిన బతుకమ్మ మహిళలకు ప్రీతిపాత్రులు అయింది.
ఇందులో సైన్సు ఏమిటో చూద్దాం..
మన పూర్వికులకు వైద్యం అందుబాటులో ఉండేది కాదు. చెట్టు, ఆకులు, కాయలు, బెరుళ్ళు, పువ్వులు ఇవే ఆనాటి ఔషధాలు. శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు ఆగస్టు, సెప్టెంబర్ అక్టోబర్ వర్ష ఋతువు. అంత ప్రజలు రోగాల బారిన పడి మరణించేవారు. పసిబిడ్డలు నూటికి 30, 40 మంది మాత్రమే బతకటం కష్టంగా ఉండేది. సరిగ్గా ఈ పండగ అదే సమయంలో వస్తుంది. కాబట్టి ధనవంతులైన రాజులు పని వారి చేత పువ్వులు తెప్పించి పూజలు చేసేవారు. దేవతలను ప్రసన్నం చేసుకునేవారు. రోగాలు తగ్గి వారి కుటుంబ సభ్యులు బతుకుతారని గ్రహించి దేవీ నవరాత్రుల పేరుతో స్త్రీ శక్తిని అమ్మవారిగా భావించి తొమ్మిది రోజుల్లో నవరాత్రులు పూజించే వారు. ఆ కాలంలో ఇప్పుడు ఉండే పువ్వులు లేవు. గునుగు పూలు, తంగేడు, గుమ్మడి, జిల్లెడు, భీర తీగల పువ్వులు వాడేవారు. అందుకే పాత పాటలు ఈ పేర్లతో ముడిపడి ఉంటాయి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ. ఏమేమి కాయొపుప్పనే గౌరమ్మ. తంగేడు పువ్వనే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ. అట్లాగే గౌరమ్మ పేరుతో పసుపు వాడేవారు. పసుపు ముద్దను చేసి బతుకమ్మ తలపై ఆ కూర్చో పెట్టి కళ్ళకి మొహానికి పసుపు రాసుకుంటూ చేతితో రాస్తారు. కావున అర చేతులకు అంటుతుంది. ఈ పసుపులో ఉండే యాంటీ బయాటిక్, పూలలో ఉండే ఔషధ గుణాలు కలిసి ఇల్లంతా పరిశుభ్ర వాతా వరణంతో రోగాల భారి నుంచి కొంతవరకు రక్షించబడ్డారు. ఆడపిల్లలే ఇందులో ఎక్కువగా పాల్గొంటారు. ఇంట్లో అందరి గురించి పాటల రూపంలో దేవతలను వేడుకునేవారు. రోజుకొక రకం ఫలహారాలు సమర్పించి పంచుకునే వారు. వడపప్పు, కొబ్బరి నువ్వులు, అటుకులు ఇవన్నీ పోషకాలను అందించేవి. చెరువులో వదలడం వల్ల నీరంతా పూలు వల్ల కాలుష్యం పోయి ఆరోగ్యాన్ని ఇచ్చేది. మరొక అంశం ఇందులో మహిళలు పొందే ఆనందం ఆటతో చెప్పలేనిది. చిన్ననాటి స్నేహితులంతా ఒక దగ్గర చేరి రకరకాల భంగిమల్లో చప్పట్లు వేస్తూ చుట్టూ తిరుగుతూ ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆ కాలంలో బాల్యవివాహాలు ఎక్కువ చిన్న వయసులో కుటుంబ బాధ్యతల్లో మునిగి విసిగి ఉండేవారు బతుకమ్మని పండుగ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. రాజులతో పాటు తర్వాత దొరల గడియలకు పరిమితమైన బతుకమ్మ తెలంగాణ రైతాగ సాయుధ పోరాటంతో అప్పటికే సాగుతున్న సాంఘిక అణిచివేతను వ్యతిరేకిస్తూ నడుస్తున్న ఉద్యమాల్లో బతుకమ్మను బడుగు బలహీన పేటలో కూడా ఆడిస్తామని మల్లు స్వరాజ్యం ఇతర ఉద్యమకారులు దొరల ఎదిరించి బడుగుల బతుకమ్మగా పల్లె పల్లెకు ఈ ఆటను ఆడించారు. అన్నం వంపే సిబ్బి తీగలతో అల్లుతారు. దానిలో పువ్వులు పేర్చి ఆడించారు. ఆ విధంగా ఈ రోజు వీధి వీధిన ఏ ఆంక్షలు లేకుండా ప్రత్యామ్నాయ సంస్కృతితో ఆడపిల్లలను పుట్టనిద్దాం పెరగనిద్దాం చదవనిద్దాం ఎదగనిదాం. లాంటి నినాదాలతో ఐద్వా ఇతర ప్రజా సంఘాలు ఈ ఆహ్లాదాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత. బతుకమ్మ సంబురాలని ప్రోత్సహిస్తున్నాము అనే పేరుతో ప్రకతిని కలుషితం చేస్తున్నారు. పువ్వులతో ఆడడం వల్ల ఆనాడు సమాజానికి మేలు జరిగింది. రోగాలు ఎదుర్కొనే శక్తి పెరిగింది. పేపర్ బతుకమ్మ అడడం వల్ల బతుకమ్మ వ్యాపార సారుకుగా మారింది. ప్రభుత్వం ఈ పరిస్థితిని అరికట్టాలి. ఆడే దగ్గర, చెరువుల వద్ద పురుషులు కూడా ఈ ఆనందంలో పాలు పంచుకుంటారు. ఇక పాటలు కూడా మూఢత్వాన్ని వదిలి ప్రస్తుతం ఆడపిల్ల స్థితి గురించి ప్రభుత్వ విధానాలపై పాడుతున్నారు. ఈ పండుగ తెలంగాణ ప్రాంతంలోనే పుట్టింది. కాబట్టి మన రాష్ట్రానికి ఆనందాయకమైన పండుగ అయింది.
పాత పాటల స్థానంలో మూఢనమ్మకాలు తొలగిస్తూ ప్రత్యామ్నాయ సంస్కృతిలో కూడా వాడుకలోకి వచ్చాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయ సంస్కృతిలో కూడా పాటలు వాడుకలోకి వచ్చాయి.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతికేది ఏట్లాగే ఉయ్యాలో
భారతదేశాన ఉయ్యాలో
బాలికల బతుకులే ఉయ్యాలో
బాధల బతుకులు ఉయ్యాలో
బచావో అన్నావు ఉయ్యాలో
పడావో అన్నారే ఉయ్యాలో
ఎక్కడా బచావు ఉయ్యాలో
ఎక్కడా పడావు ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతికేది ఎట్లాగే ఉయ్యాలో
ఉత్తర ఖండాన ఉయ్యాలో
ఆ రాజ్యాంలోనే ఉయ్యాలో
చిన్నారులెందరినో ఉయ్యాలో
చిదిమేసినారమ్మ ఉయ్యాలో
దక్షిణాదిలో ఉయ్యాలో
దయలేని పాలకులు ఉయ్యాలో
మద్యం అమ్మకాలు ఉయ్యాలో
మద్యం అమ్మకాలు ఉయ్యాలో
మాదక ద్రవ్యాలే ఉయ్యాలో
చెల్లి చైత్రనే ఉయ్యాలో
బలి తీసుకున్నారు ఉయ్యాలో
మద్యమే లేకుంటే ఉయ్యాలో
రాజ్యమే లేదంటా ఉయ్యాలో
బాలికల రక్షించ ఉయ్యాలో
రుద్రమ్మ వలే నీవు ఉయ్యాలో
నిద్ర లేవాలమ్మ ఉయ్యాలో
ఐద్వా సంఘమై ఉయ్యాలో
ఆడోళ్ల సంఘమట ఉయ్యాలో
ఆ సంఘమూనందు ఉయ్యాలో
మన మంత చేరలే ఉయ్యాలో
బతుకుల్ని కాపాడ ఉయ్యాలో
ఉదయమ్మవై కదులూ ఉయ్యాలో
స్వరాజ్యమై నీవు ఉయ్యాలో
గర్జించవమ్మ ఉయ్యాలో
ఐలమ్మా వై నీవు ఉయ్యాలో
పోరు చేసినావు ఉయ్యాలో
దుండగులను ఎదిరించి ఉయ్యాలో
దోరలను తరిమినంటు ఉయ్యాలో
దుష్టులను తరమంగ ఉయ్యాలో
దుర్గవై లేవే ఉయ్యాలో
కమలమ్మవై నీవు ఉయ్యాలో
కన్నేర్ర జేయాలే ఉయ్యాలో
అప్పుడే మన బతుకు ఉయ్యాలో
మరునే చెల్లెలా ఉయ్యాలో
మరునే చెల్లెలా ఉయ్యాలో
- బత్తుల హైమావతి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు