Sun 02 Oct 00:25:01.492743 2022
Authorization
గాంధీజీని మహాత్ముడని, జాతిపితని దేశమంతా కొనియాడే కాలంలో లేము. గాంధీజీని హతమార్చిన గాడ్సేని దేశభక్తుడని స్వయంగా పార్లమెంటు సభ్యులు (బిజెపి వారు) నిస్సిగ్గుగా మాట్లాడుతున్న కాలంలో వున్నాం. గాంధీజీ వర్గంతి రోజున ఆయన బొమ్మను పిస్తోలుతో కాల్చి గాడ్సే జిందాబాద్, గాంధీ మురదాబాద్ అని వికృతంగా కేకలుపెట్టి, ఈ మొత్తం తతంగాన్ని సోషల్ మీడియాలో పెట్టిన ప్రగ్యాటాకూర్ని మధ్యప్రదేశ్లో ప్రజలు పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్న కాలానికి చేరాం. గాంధీజీని ఆరాధించే వాళ్ళు పొగిడి, ఆయనని హతమార్చిన వాళ్ళు పొగడడంతో గాంధీజీ అన్న ఓ మహోన్నత వ్యక్తి జీవితం చివరి 25 సం||లు స్వాతంత్రోద్యమానికి తిరుగులేని నాయకత్వం వహించిన ఆయన గురించి, నాటి స్వాతంత్రోద్యమం గురించి దేశానికి తెలియకుండా చేయాలన్న కుట్ర యిమిడి వుంది. అందువలన పొగడ్తలు సరిపోవు. గాంధీజీ జీవితాన్ని ఆయన సిద్ధాంతాలను (గాంధీజీలు) చదవాలి. చదువుతూనే వుండాలి. అంతేకాదు నేటి తరానికి వివరంగా చెప్పాలి. చెబుతూనే వుండాలి. అప్పుడే ఆయన్ని హతమార్చి, ఆయన సిద్ధాంతంపై విషం కక్కుతూ నేడు అందల మెక్కిన వారి అంతు చూడగలం. ఈ క్రమంలో గాంధీజీ వారసులుగా చెప్పుకునే వారి గురించి కూడా చెప్పుకోవాలి. అలాగే స్వాతంత్రోద్యమంపై గాంధీజీ తిరుగులేని ప్రభావం, ఆయన సిద్ధాంతం, దాని వర్గ స్వభావం స్వాతంత్య్రానంతరం జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ తెల్సుకోవాలి.
హైదరాబాద్లోని గాంధీ జ్ఞానమందిరంలో (1957 సం||లో) కామ్రేడ్ సుందరయ్య చేసిన ప్రసంగంలో ''మహాత్మా గాంధీ నిరంతరం హిందూ-ముస్లిం ఐక్యత కోసం కషి చేస్తూ వచ్చారు. ఆఖరికి ఆ కషిలోనే ఒక హిందూ మతోన్మాది చేతులో తుపాకి కాల్పులకు బలయ్యారు. సమానత్వం అనేది గాంధీ సిద్ధాంతాలలో కీలకం. దక్షిణాఫ్రికాలో తెల్లవారితో నీగ్రోల సమానత్వం, చంపారన్ (బీహార్)లో రైతుల సమానత్వం, అన్ని కూలాల వారి సమానత్వం, హిందూ ముస్లింల సమానత్వం ఆర్థిక అసమానతలు తొలగించి సమానత్వం సాధించడం కోసం మొత్తం ఆయన జీవితమంతా సమానత్వం కోసం పోరాడారు. సమానత్వమనేది ఆయన నడిపిన ఉద్యమాలన్నింటికీ కీలక బీజం. ఈ సమానత్వం సాధించాలనే కర్తవ్యం ఇంకా మిగిలే వుంది. దాన్ని సాధించాలి. అలా సాధించినప్పుడే గాంధీజీ ఆశయాలు నెరవేర్చిన వారమవుతాము.'' అని చెప్పారు. ఆ ప్రసంగంలోనే ఆయన ''స్వాతంత్య్రం సాధించడానికి గాంధీయిజం పునాదులు వేసింది. స్వాతంత్య్రం అనే మన ఆశయాన్ని సాధించడంలో గాంధీజీ ప్రముఖ పాత్రను కమ్యూనిస్టులు గుర్తిస్తారు. కాని అంత వరకు మాత్రమే గాంధీజీ సిద్ధాంతాలు అంతకు మించి ముందుకు పోవడానికి తోడ్పడవు'' అని తేల్చిచెప్పారు. నిజానికి గాంధీజీనే స్వాతంత్య్రం వచ్చిన తీరు, ముఖ్యంగా దేశ విభజన ఆ సందర్భంగా భయానకమైన మత కలహాలు, మారణకాండ, స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ నాయకుల విపరీత ధోరణులపై తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ''రాజ్యాంగ సభకు సభ్యులుగా వుండగోరే వారి నుంచి నాకెన్నో ఉత్తరాలు వస్తున్నాయి. ఈ ఉత్తరాలు మేధావి వర్గానికి దేశ స్వాతంత్య్రం మీద కంటే స్వంత లాభాల మీదనే దృష్టి వున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇది చూస్తే భయం వేస్తోంది. ఈ దరఖాస్తులు ఒక జబ్బుకు లక్షణం. ఈ విషయంలో నా సహాయం కోరవద్దని చెప్పడం కంటే రోగ లక్షణాల్ని ప్రజలకు చూపిండానికేననేది వ్రాస్తున్నాను.'' అని ప్రకటించారు. గాంధీజీ అనుచరులందరూ స్వాతంత్య్ర ఉత్సవాలు చేస్తుంటే ఆయన భారత రాజకీయ పరిస్థితులు అస్థిరంగా వున్నాయని కలత చెందారు. అదే విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చారు. ఈ అస్థిర పరిస్థితులకు కారణం - హిందూ, ముస్లిం తగాదాలు. అవి ఇండియా, పాకిస్తాన్ల మధ్య తగాదాలుగా రూపం తీస్కోవడం. రెండవది కాంగ్రెస్ సంస్థలో ప్రవేశించిన కుళ్ళు, పతనము. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన బతికి వున్నది కేవలం 5 1/2 నెలలు మాత్రమే. కానీ ఆయన గొప్పతనమేంటంటే ఆ అతికొద్ది కాలంలోనే భారతదేశ భవిష్యత్ ఎలా వుండబోతుందో అర్థం చేస్కోవడం, ప్రజల్ని హెచ్చరించడం, చివరకు భగవంతుడి మీద భారం వేయడం తప్ప ఆయనకు మరోదారి తోచలేదు. 1947లో తన జన్మదినం సందర్భంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు... ''హిందూవయినా, ముస్లిం అయినా మరొకడయినా పరమకిరాతకంగా సాగించే ఈ హత్యాకాండను చేతులు ముడుచుకుని చూస్తు కూర్చునే పరిస్థితిలో నన్ను పెట్టే కన్నా ఈ దు:ఖమయ ప్రపంచంలో నుండి తీసుకుపోవాల్సిందిగా సర్వశక్తివంతులైన ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.'' అని చెప్పారు. (మహాత్ముడు ఆయన సిద్ధాంతాల నుండి)
75 సం||రాల సాక్ష్యం
స్వాతంత్య్రానంతరం గడచిన 75 సం||లను రెండు భాగాలుగా చుడొచ్చు. ఒకటి హిందూత్వ శక్తులు బలపడటానికి ముందు అంటే 1992 (బాబ్రీ మసీదు విధ్వంసం 1992 డిసెంబరు 6), ఆ తరువాతగా గాంధీజీ వ్యక్తం చేసిన భయాందోళనలను బట్టి చూసినప్పుడు ఈ రెండు విడి భాగాలు కాదు. పరస్పరం కల్సి వుండేవి. మొదటి దశ కొనసాగింపుగానే రెండవ దశగా చూడటం అవసరం. అప్పుడే గాంధీజీ సిద్ధాంతానికి ఆయన సహచరులు, అనుచరులు చేసిన అపార నష్టం. ఆ నష్టాన్ని వినియోగించుకుంటూ హిందూత్వ శక్తులు తమ విషప్రచారాన్ని వందల, వేల రేట్లు ఎలా పెంచుకుంటూ పోయాయో అర్ధం అవుతుంది.
గాంధీజీని చంపినా...
వారి లక్ష్యం యింకా నెరవేరలేదు
గాంధీ మహాత్ముడ్ని తాను ఎందుకు చంపాడో చెబుతూ హత్యకూ తమకు ఏ సంబంధం లేదని చెప్పే ఆర్ఎస్ఎస్ అధినేత ఎం.ఎస్. గోల్ వాల్కర్ అంటాడు. గాడ్సేకూ, 1947 డిసెంబర్లో గాంధీజీ హత్యకు కొద్ది రోజుల ముందు ఆర్ఎస్ఎస్ ముఖ్య కార్యకర్తల్లో చేసిన ఉపన్యాసంలో ఏమన్నాడో చూడండి. ''ఈ భూమి మీద వున్న ఏ శక్తి ముస్లింలను హిందూస్తాన్లో నిలపలేదు. వాళ్ళు ఈ దేశం వదిలి పోవాల్సిందే. మహాత్మా గాంధీ ఎన్నికల్లో వారి ఓట్లతో కాంగ్రెస్కు లాభం చేకూరుతుందని వాళ్ళను ఈ దేశంలో వుంచాలనుకుంటున్నారు. కానీ అప్పటికీ ఒక్క ముస్లిం కూడా ఇండియాలో వుండడు. గాంధీ వాళ్ళని యింక ఏ మాత్రం మోసగించ లేడు. ఇటువంటి వ్యక్తుల్ని శాశ్వతంగా నోరు మూయించే పద్ధతులు మన దగ్గర వున్నాయి. కానీ హిందువులకు హాని కలిగించని సాంప్రదాయాలు మనవి. మనకు తప్పకపోతే అటువంటి చర్యలకు కూడా పోవాల్సి వుంటుంది''.
గాంధీజీని నిర్మూలించడం ద్వారా నూతన లౌకిక ప్రజాతంత్ర రాజ్యాన్ని అంతం చేసి తీరుతామన్న హెచ్చరిక ఆర్ఎస్ఎస్ పంపింది. గాంధీజీ హత్యపై రోధించిన దేశం గాడ్సేని ఆర్ఎస్ఎస్ని అసహ్యించుక్ను దేశం గాంధీ సిద్ధాంతం గురించి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైన హిందూత్వం గురించి తీవ్రంగా తీస్కోలేదు. గాంధీజీపై సన్నసన్నగా విషం కక్కిన హిందూత్వ శక్తులు ఈ రోజు బలపడిన తరువాత పూర్తి స్థాయిలో ఆయన పైన, ఆయన సిద్ధాంతాల పైన విషం కక్కుతున్నాయి. దేశం మనస్సులో నుండి గాంధీజీ స్థిరత్వాన్ని తుడిచిపెట్టే పనిలో పడింది ఆర్ఎస్ఎస్. అందుకోసమే గాంధీజీ హత్య కేసులో కుట్రదారుడు నెం.1 అయిన విడిసావర్కర్ని ఆకాశానికి ఎత్తుతున్నది. గుజరాత్లోని నర్మదావ్యాలీలో 597 అడుగుల సర్దార్ వల్లభారు పటేల్ విగ్రహం ప్రతిష్టించింది అక్కడ బిజెపి రాష్ట్ర ప్రభుత్వం నిజానికి గుజరాత్ జాతీయ విగ్రహం అయినా స్వాతంత్య్రో ద్యమానికి తిరుగులేని నాయకుడైనా గాంధీజీ అవుతారు కదా?! లేకుంటే తొలిప్రధాని నెహ్రూ విగ్రహం పెట్టాలి కదా?! కారణమేమంటే గాంధీజీ చాలా స్పష్టంగా హిందుత్వ సిద్ధాంత మూలాలను అసహ్యించుకునే వారు. గాంధీజీ మిత్రుడు ఆర్ఎస్ఎస్ వారి సేవా కార్యక్రమాల్ని ఆయన వద్ద పొగిడితే గాంధీజీ వెంటనే ''హిట్లర్ నానిలు, ముస్సోలినీ, ఫాసిస్టులు కూడా ఈ విధంగానే చేసే వారిని మర్చిపోకూడదు. ఆర్ఎస్ఎస్ అనేది నిరంకుశ మతోన్మాద సంస్థ'' అని హెచ్చరించారు.
గాంధీజీ కలలను
కమ్యూనిస్టులే సాకల్యం చేయగలరు..
గాంధీజీ సిద్ధాంతాలతో ఎన్ని విభేదాలున్న ఆయన కలలు గన్న మత సామరస్యం, ఆర్థిక సమానత్వం నీతివంతమైన రాజకీయ వ్యవస్థ వంటివి ప్రస్తుత పాలకవర్గ పార్టీల వల్ల సాధ్యం కాదని 75 సంవత్సరాలు చరిత్ర తేల్చింది. స్వాతంత్రోద్యమ కాలంలో బూర్జువావర్గం రెండు రంగాలలో పోరాడవలసి వచ్చింది. ప్రజలను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, కార్యరంగలోకి తీసుకు రావడం, రెండు - వారిని ప్రజా విప్లవ కార్యక్రమంలో పాల్గొనకుండా నిషేధించడం. గాంధీజీ నాయకత్వాన ఈ రెండు కర్తవ్యాలు దిగ్విజయంగా నడప బడ్డాయి. బూర్జువా వర్గానికి అధికారం రాగానే మొదటి కర్తవ్యం తేలిపోయింది. సామ్రాజ్యవాదంతో జరిగే పోరాటం (రాజీలు) ప్రభుత్వ స్థాయిలో జరపవచ్చు. దానికోసం ప్రజలను కార్యరంగంలోకి తీసుకు రానక్కర్లేదు రెండవ కార్యవర్గానికి రాజ్యాంగ మంత్రం ఉండనే ఉంది. గాంధీజీ కలలు సాకల్యం కాకపోవడానికి ఆయన ఐక్యపరచి నాయకత్వం వహించిన బూర్జువా వర్గ స్వభావంలోనే ఉంది. అందువలన ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని సార్లు మారినా దేశం మరింత ఆర్ధిక... సామాజిక సంక్షేభంలోకి కురుకు పోతుందే తప్ప మెరుగు కాదు. అందువలన అర్థిక, సామాజిక దోపిడిలకు గరవుతున్న అశేష ప్రజానీకాన్ని , కార్మిక , కర్షక జనాన్ని ఐక్య పరచి కులం, మతం, జాతి, బాషల పేరిట మనిషిని మనిషిని దోచుకోని ఓ ఉన్నత, నూతన కొరత దేశాన్ని సాధించ గలగడం వామపక్ష, ప్రగతిశీల ప్రజాతంత్ర, లౌకిక శక్తులన్నింటినీ కలిపి నడిపించ గల కమ్యూనిస్టులకే సాధ్యం.
- ఆర్. రఘు