ఈ విశ్వంలో మానవులు ఏ ఇతర మూగ జీవాల మనుగడకైనా ఆహారం అత్యంత అవశ్యకం. ఆహారం ఉంటేనే ఆయువు ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో తగినంత ఆహారం లేకుండా ఎంతో మంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే వీలు కూడా లేని ప్రదేశాలు ఇంకా ప్రపంచంలో ఉండడం అనేది ఎంతైనా శోచనీయం. ఈ సృష్టిలో సమస్త జీవరాశికి గాలి.. నీరు.. నిద్ర.. ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. అయితే అటువంటి ఆహారం శరీరానికి శక్తిని ఆరోగ్యాన్నిచ్చేదిగా ఉండాలి. కేవలం కడుపు నింపేది మాత్రమే ఆహారం కాదు. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లను అందించగల సమరతూకంగా గల ఆహారమే సంపూర్ణ ఆహారం. అటువంటి ఆహారాన్ని తీసుకోగలిగిన వారికే సంపూర్ణ ఆరోగ్యం స్వంతం అవుతుంది.
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచం లో దాదాపు 150 దేశాలు అక్టోబరు 16న జరుపుకుంటారు. దీనికి కారణం 1945 అక్టోబరు 16న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పడిన అక్టోబరు 16నే ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా నిర్వహించుకుంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని మొదటిసారి 1981లో నిర్వహించారు. ఆహారం విలువ ఏంటో చాటి చెప్పటానికి ఆహారాన్ని ఆదా చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది దీని ప్రధాన లక్ష్యం. భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించడమనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ప్రధాన లక్ష్యం.
పోషకాహార లోపం
ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం మెరుగై జీవన ప్రమాణం వృద్ధి చెందుతుందో.. ఏ ఆహారం తీసుకుంటే అనారోగ్యాలు మన దరి చేరవో.. ఆ ఆహారమే పోషకాహారం. ఈ పోషక ఆహారంలో మాంసకృత్తులు పిండిపదార్ధాలు కొవ్వు పదార్ధాలు పీచుపదార్ధం, విటమిన్లు, ఖనిజలవణాలు, నీరు అనే 7 రకాలైన పోషకాలు ఉంటాయి. సమతౌల్యంగా వీటిని తీసుకోగలిగితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.
శరీరం తగినంతగా ఈ పోషకాలను అందుకోకపోతే కలిగే పరిస్థితినే ''పోషకాహార లోపం'' అంటారు. ఇది ప్రపంచ సమస్య. ప్రపంచంలోని అత్యధిక దేశాలు పోషకాహార లోపం సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పోషకాహార లోపం అనే సమస్యకు బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే బీజం పడుతుంది అని చెప్పవచ్చు. ఇందుకు కారణం గర్భవతి అయిన మహిళలు అనేకమంది రక్తహీనతతో బాధపడటమే. దీనికి మూలం పేదరికం. పోషకాహారం తీసుకునే సామర్థ్యం లేక పోవడం వల్ల, ఆ ప్రభావం బిడ్డలపై పడుతుంది. అంతేకాదు ఆర్ధిక స్ధోమత ఉన్నప్పటికీ పోషక ఆహారంపై అవగాహన లేకపోవడం వలన కూడా అనేక మంది తల్లులు రక్తహీనతకు గురవుతున్నారు. ఈ కారణంగానే తక్కువ బరువుతో శిశువులు జన్మిస్తున్నారు. దీని వల్ల ఆరేళ్ళలోపు చిన్నారులలో ఎదుగుదల సరిగా ఉండటం లేదు.
విద్యావంతులై ఆర్ధిక స్ధోమత కలిగిన వారు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అంటే కారణం ఎలాంటి పోషణ లేని జంక్ ఫుడ్‌కు వారు అలవాటు పడడమే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. పోషకాహార లోపం అనేది పల్లెలకే పరిమితం కాలేదు. పట్టణాల్లో మరింత అధికంగా విస్తరిస్తోంది. అవగాహన ఉన్నా ఆచరణలో చూపక పోవడమే దీనికి కారణం. ముఖ్యంగా ప్రసవం అనంతరం బిడ్డకు మొదటి గంటలోపు ముర్రుపాలు ఇవ్వాలనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసినప్పటికీ 57 శాతం మంది మాత్రమే దీన్ని పాటిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే మహిళలు, పిల్లల విషయంలో సమాజంలో నేటికీ ఎన్నో మూఢనమ్మకాలు, అవగాహనా లోపాలు, ఆచరణా లోపాలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం పిల్లల్లో 3వ వంతు మంది మన దేశంలోనే ఉన్నారు. వీరిలో46 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉంటున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 52 శాతం మరణాలు సంభవిస్తున్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్య సమితి మాత్రం 2030 నాటికి ఆకలి బాధలకు పోషకాహార లోపాలకు తావు లేని సౌభాగ్య ప్రపంచాన్ని సాకారం చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నది. ఈ లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ఆహార భద్రత సాధించాలి.
ఆహార భద్రత
1996లో రోమ్‌లో జరిగిన మొదటి ఆహార శిఖరాగ్ర సమావేశం ఆహార భద్రతను ఈ విధంగా నిర్వచించింది. ''ప్రజలందరికీ నిరంతరం తమ ఆర్థిక, శారీరక అవసరాలకు తగినంతగా సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండడమే ఆహార భద్రత''. ఆహార భద్రత లభ్యత, సరఫరా, అందుబాటులో ఉండడం, స్థిరమైన వినియోగం పునాదులుగా రోమ్ సమావేశం అభిప్రాయ పడింది. తగినంత, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో కలిగి ఉండడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని కూడా రోమ్ సమావేశం తీర్మానించింది. రోమ్ సమావేశం ఫైనల్ డిక్లరేషన్‌లో ఆకలిని ఒక హక్కుల చట్రంలో కూడా పొందుపరిచింది.
రోజుకు 2,100 కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకుంటే పోషకాహార లోపం, ఆహార అభద్రత ఉన్నట్టు గుర్తించాలి. వాస్తవంగా క్షేత్ర స్ధాయిలో పరిశీలిస్తే సమాజంలో మహిళలు, అట్టడుగు వర్గాలు, వెనకబడ్డ ప్రాంతాల్లో అయితే 2100 కేలరీల ఆహారం తీసుకునే వారు తక్కువే. కరోనా వంటి మహమ్మారులు విజృంభించినప్పుడు ఈ పరిస్థితి మరింత తీవ్రమై ఆకలి మరణాలు పెరిగి పోతున్నాయి.
మన దేశం విషయానికి వస్తే...
స్వాతంత్య్రం అనంతరం కూడా ఆహార ధాన్యాల విషయంలో కొంత కాలం దిగుమతులు చేసుకున్నాం. అయితే ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మనం 1965 తరువాత తీసుకువచ్చిన హరిత విప్లవం ప్రభావం మాత్రం ఆహార ఉత్పత్తిలో గణనీయ మెరుగుదల సాధించడంతో పాటు దిగుమతులు ఆగిపోయి ఎగుమతులు చేసే స్ధితికి చేరుకున్నాం. కరువు కాటకాలను దీటుగా ఎదుర్కొన్నాం. కరోనా వంటి మహమ్మరిని కూడా నిల్వ ధాన్యాలతో దీటుగా ఎదుర్కోగలిగాం. అయినప్పటికి 75 ఏండ్ల అమృతోత్సవాల వేళ కూడా ఇంకా ఆకలి కేకలు, ఆకలి మరణాలు చూస్తున్నాం అంటే ఆహార పదార్ధాల కొరత కాదు ఆహార భద్రత లేకపోవడమే.
ఆహార భద్రత లోపిస్తే ఆకలి ఏర్పడుతుంది. ఆకలి అనేది పేదరికానికి సూచిక మాత్రమే కాదు, పేదరికాన్నీ తీసుకు వస్తుంది కూడా. ఆహారం విషయంలో పరిమాణం అనేది ప్రధానం కాదు. ఆహారం అనేది పరిమాణంలో తక్కువ అయినా గుణాత్మకంగా ఉండాలి. అప్పుడే ఈ ఆకలి మరణాలు అరికట్ట గలుగుతాము. ఏదిఏమైనా ఆహార భద్రత అనేది ఒక దేశ ఆర్థిక శక్తికి ఆరోగ్య స్థితికి సూచిక. ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించిన దేశం సమర్ధవంతమైనది అని చెప్పవచ్చు. దీనికి భిన్నంగా దేశంలో ఆహార భద్రత నెలకొంటే అది పూర్తిగా ఆ దేశ ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చు. ఆహార భద్రత ప్రజల ప్రాధమిక హక్కు అయితే ఆహార భద్రత కల్పించడమనేది ప్రభుత్వ బాధ్యతగా చెప్పవచ్చు. ఈ మార్గంలోనే ఆహార భద్రతకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కారణంగా రెండు దశాబ్దాల కిందటి కంటే ప్రస్తుతం ఆకలి సమస్య చాలావరకు తగ్గింది. అయినా, ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 81.5 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పేదరికం, ఉద్యోగ భద్రత కొరవడటం, ఆహార కొరత, ఆహార పదార్థాల వృథా, సాధనా సంపత్తి లోపాలు, అస్థిరమైన మార్కెట్లు, భూతాపం కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, యుద్ధాలు, సంఘర్షణలు, అట్టడుగు వర్గాలపై వివక్ష వంటివి ఆకలి సమస్యకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు 1.25 డాలర్లు (సుమారు రూ.89) లేదా అంతకంటే తక్కువ మొత్తం సంపాదన ఉన్నవారిని పేదలుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 750 కోట్లకు పైగా ఉంటే, సుమారు 140 కోట్ల మంది రోజుకు కనీసం రూ.89 సంపాదనైనా లేని పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల్లోనే ఉన్నారు. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ నేటికీ ఆకలి మరణాలు ఏర్పడటానికి అనేక కారణాలు పరిశీలన ఉన్నాయి.
గిడ్డంగి సౌకర్యాలు లేమి
ఆహార ధాన్యాలను భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాల్లో దాదాపు 40శాతం మేరకు తిండి గింజలు వినియోగానికి పనికి రాకుండా నాశనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఆకలి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. యుద్ధ పరిస్థితులు, సంఘర్షణలతో అతలాకుతలమవుతున్న దేశాల్లోనూ జనం ఆకలితో అలమటిస్తున్నారు.
ధరల అస్ధిరత్వం
మార్కెట్లలో అస్థిరతల వల్ల ఆహార ధాన్యాలు, ప్రధానమైన పంటల ధరలు ఒక్కోసారి విపరీతంగా పెరగడం, ఒక్కోసారి విపరీతంగా పడిపోవడం వల్ల కూడా తాత్కాలికంగా చాలా మంది ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోవిడ్ మహమ్మారి ప్రభావం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, కట్టడి చేయలేని నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార సంక్షోభం, ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం అన్నీ కలిసి నేడు ఆకలి బాధితుల సంఖ్య పెరిగేలా చేస్తున్నాయి. ఇదే కాకుండా రైతులు ఆహార ధాన్యాలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం మొదలయ్యింది... ఇలా ఎన్నో కారణాలు. వీటి పర్యవసానంగా ఆహార ధాన్యాల ధరలు అందుబాటులోకి లేనంతగా పెరిగి ఆహార సంక్షోభాన్ని అధికం చేస్తున్నాయి.
పోషకాహారంపై అవగాహన రాహిత్యం
మనదేశంలో ఆకలితో అలమటిస్తున్నవారు కొందరైతే, పోషకాల సంగతి పట్టించుకోకుండా దొరికినదేదో తిని కడుపు నింపుకుంటున్న వారే ఎక్కువ. ఆహార నిపుణుల సూచనల మేరకు పోషకాహారం తీసుకునే పరిస్థితి చాలామందికి లేదు. పోషకాహారం తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ దాని విషయంలో అవగాహన లేకపోవడం మరొక ప్రధాన అవరోధం. తీసుకుంటున్న ఆహారానికీ, పోషక ప్రమాణాలకు వ్యత్యాసం మన గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం మేరకు, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం మేరకు ఉంటోంది. ఇటువంటి పరిస్ధితులు వల్లనే పోషకాహార లోపంతో మరణాలు సంభవిస్తున్నాయి.
మహిళల పట్ల వివక్షత
నాగరిక సమాజంలో కూడా ప్రత్యేకించి వెనుకబడిన ఆర్ధిక వ్యవస్ధలలోని కుటుంబాలలో ఆహారాన్ని అందించే విషయంలో మహిళల పట్ల వివక్షత చూపడం నేటికి కొనసాగుతూ ఉంది. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60 శాతం మంది మహిళలే ఉండటం ఈ మాటలకు నిలువెత్తు నిదర్శ నాలుగా కనిపిస్తున్నాయి. అయితే మహిళలు పోషకాహారం లేదా తగినంత ఆహారం తీసుకోక పోవడం వల్ల సమాజానికి జరిగే నష్టం చెప్పనలవి కానిది. ముఖ్యంగా గర్భిణులకు పోషకాహార సమస్య ఉంటే పుట్టే పిల్లల మీద అత్యంత ప్రభావం చూస్తుంది. తద్వారా అనారోగ్య పిల్లలకు జన్మనిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారనే విషయం దీనికి నిదర్శనం. ఇందులో కూడా 96.5 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండటం గమనార్హం. వీరిలో ప్రతి ఐదు జననాలలో ఒక బిడ్డ సరైన వైద్య సదుపాయం లేకపోవటం వల్లే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. దీంతో పిల్లల్లో మరణాలలో 50 శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. మరొక ఆందోళన కరమైన విషయం ఏమిటంటే ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధుల వల్ల జరిగే మరణాల కంటే.. ఆకలి వల్ల పోషకాహార లోపం వలన జరిగే మరణాల రేటే ఎక్కువగా ఉంది. ఈ మరణాల స్థాయి ఎంతగా ఉందంటే.. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు.
వీటి అన్నింటికీ పరోక్షంగా మహిళలకు పోషకాహారం దక్కక పోవడం ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
సేద్యపు భూమి తగ్గుదల
ఓ పక్క పెరుగుతున్న జనాభా, మరో పక్క లాభదాయకంగా లేని వ్యవసాయం తగ్గుదల, దీనితో రానున్న రోజుల్లో మరలా ఆహార కొరత ఏర్పడవచ్చు అనే భయం వెంటాడుతోంది. ఈక్రమంలో పెరుగుతన్న జనాభా 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలోనే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి. ఇప్పటికే హరిత విప్లవం ద్వారా మన దేశంలో ఆధునిక ఉత్పత్తి పద్ధతులు అవలంబించి అత్యధిక దిగుబడులు సాధించి ఆహార కొరత అధిగమించాం. అయితే ప్రస్తుతం సేద్యం చేసే భూ విస్తీర్ణం మరింత తగ్గుతూపోతే ఎదురయ్యే ఆహార కొరతకు వేరొక పరిష్కారం కానరావడం లేదు. భూ పరిమాణం స్థిరం అందులో సేద్యపు భూమి మరింత తగ్గడం మరొక వైపు జనాభా పెరగడం చూస్తే మరలా ఆహార సమస్య ఎదురు కావచ్చు అనే భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి.
ఆహారపు వృధాలు
ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక ఉత్పత్తి విధానాల ద్వారా ఆహార ఉత్పత్తి మెరుగైనప్పటికీ ఆకలి మరణాలకు మరొక ప్రధాన కారణం ఆహారపు వృథా. ప్రపంచంలో ఒక వైపు కొందరు ఆకలితో అలమటిస్తుంటే, మరొకవైపు కొందరు నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. ఈ వృథా అనేది భారీ స్ధాయిలో నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆహార వృథాల పరిమాణం చూస్తే ప్రతి ఏటా 931 మిలియన్ టన్నులు కాగా, ఇందులో 569 మిలియన్ టన్నుల గృహ వ్యర్థాలు (61 శాతం), 244 మిలియన్ టన్నులు ఆహార సేవల వ్యర్థాలు (26 శాతం), 118మిలియన్ టన్నుల రిటేల్ ఆహార వ్యర్థాలు (13 శాతం) ఉన్నాయని విశ్లేషించారు. ప్రపంచ దేశాల వార్షిక తలసరి వ్యర్థాలు 121 కేజీలు ఉండగా, అందులో 74 కేజీలు గృహ వ్యర్థాలు, 32 కేజీలు ఆహార సేవల్లో వ్యర్థాలు, రిటేల్‌లో 15 కేజీల ఆహారం వ్యర్థమవుతున్నది.
భారత దేశంలో పరిశీలిస్తే...
68.7 మిలియన్ టన్నుల ఆహారాన్ని వ్యర్థ పదార్థంగా ఇంట్లోంచి చెత్తకుప్పలో వేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ''ఆహార వ్యర్థాల సూచిక-2021 (ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్-2021)'' నివేదిక బహిర్గత పరిచింది. అంతేకాదు సంపన్న దేశాలతో పాటు నిరుపేద దేశాల్లో సైతం ఆహార వృథా దాదాపు ఒకే స్థాయిలో జరుగుతోందని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. జనాభా వినియోగించే ఆహార పరిమాణంలో ఇది దాదాపు మూడో వంతు. వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు 2.6 లక్షల కోట్ల డాలర్లు. ఎఫ్ఏఓ లెక్కల ప్రకారం సంపన్న దేశాల్లో సగటున ఏటా 67 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుంటే, పేద దేశాల్లో సగటున 63 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. మన దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు ఆహార ఉత్పత్తి కూడా అనూహ్యంగా పెరిగింది. అయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో 40శాతం వృథాగా మట్టిపాలవుతోందని, దాని విలువ ఏడాదికి దాదాపు లక్ష కోట్ల రూపాయలని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ లోగడే లెక్కగట్టింది! పేద దేశాల్లో తగిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం, పంట కోతలో ఆధునిక పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల భారీ స్థాయిలో ఆహార నష్టం వాటిల్లుతోంది.
నిరుపేదలకు రెండు పూటల ఆహారం దొరక్క ఆకలి కేకలు పెడుతున్న దేశాలలో ఆహారం వ్యర్థ పదార్థ రూపంలో డస్ట్‌బిన్ పాలు కావడం ఎంతైనా శోచనీయం. ప్రత్యేకించి మన దేశంలో వివాహాలు వేడుకలు వంటి సందర్భాలలో వృథా కాబడే ఆహార పదార్ధాలు పరిమాణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆహార పదార్థాల వృథాను సమర్థంగా అరికట్టగలిగితే ఆకలి సమస్యను చాలావరకు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆహార వృధాలను అరికడితే ఆహార ఉత్పత్తిని చేపట్టినట్లే.
ఆహార వృధా.. పర్యావరణానికి హాని
ఆహార వృథా కారణంగా ఆహార అభద్రత ఏర్పడటమే కాదు పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతూ ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.పర్యావరణానికి జరిగే నష్టానికి ఉదాహరణగా - ఒక ఆపిల్ పండు మన చేతికి అందటానికి కనీసం 125 లీటర్ల నీరు అవసరం. ఒక ఆపిల్‌ను పాడయ్యే వరకు నిల్వ ఉంచి పారేస్తే, 125 లీటర్ల నీటిని వృథా చేసినట్లే. ఒక్క ఆపిల్‌కే నీటి వృథా ఈ స్థాయిలో ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల్లో జరుగుతున్న ఆహార వృథా కారణంగా ఏ స్థాయి జలనష్టం జరుగుతోందో ఊహించవచ్చు. ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆహార వృథా కారణంగా ఏటా 250 క్యూసెక్కుల మేరకు నీటి వృథా పరోక్షంగా జరుగుతుంది. ఈ నీటి పరిమాణం జెనీవా సరస్సులోని నీటి పరిమాణానికి మూడు రెట్లు. ఇదిలా ఉంటే, వృథా అవుతున్న ఆహార పదార్థాల కారణంగా ఏటా అదనంగా 330 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలో కలుస్తోంది. ఇది భూతాపాన్ని తనవంతు పెంచుతోంది. వృథాగా పారవేసిన ఆహార పదార్థాలు కుళ్లిపోయే దశలో విడుదలయ్యే మీథేన్ వాయువు కూడా పర్యావరణంపై ఇదే తీరులో ప్రతికూల ప్రభావం చూపుతోంది.
అరకొర తలసరి ఆహార లభ్యత
ఆహార ధాన్యాల ఉత్పాదన విషయంలో దిగుమతులపై ఆధార పడకుండా స్వయంసమృద్ధి సాధించిన మాట నిజమే కానీ తలసరి ఆహార లభ్యతలో మనం సాధించిన పురోగతి మాత్రం అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. మన దేశంలో 1908 నాటికి మన దేశంలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 177.3 కిలోలుగా ఉంటే, 2016 నాటికి తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 177.9 కిలోలు మాత్రమే. ఇదే సమయంలో చైనాలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 450 కిలోలు కాగా, బంగ్లాదేశ్‌లో ఈ పరిమాణం 200 కిలోలు ఉండటం గమనార్హం. అగ్రరాజ్యమైన అమెరికాలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 1100 కిలోలుగా ఉంది. దీనిని బట్టి ఆహార ధాన్యాల లభ్యత విషయంలో మనం ఎంత వెనుకంజలో ఉన్నామని తెలుస్తోంది. అతివృష్టి వల్ల కొంత అనావృష్టి వల్ల కొంత వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతూ ఉంది. లాభదాయకంగా లేని వ్యవసాయాన్ని వదిలిపెట్టే స్థితికి రైతులు చేరుకున్నారు. అయితే ప్రపంచ జనాభా ఏ మాత్రమూ తగ్గే దిశలో లేదు.
ఎడారీకరణ.. ఆహార అభద్రత
పెరుగుతున్న ఆహార అవసరాల కోసం భూమి సేద్యానికి రసాయనక ఎరువులు, క్రిమి సంహారక మందులు విచ్చల విడిగా వాడటం మొదలయ్యింది. దీని వల్ల నేలను గుల్లపరిచి సహజంగా భూసారాన్ని పెంచే వానపాములు తేనె టీగలు వంటి పంట సహాయకారులు నశించిపోతున్నాయి. దీనితో పాటు వరదల సమయంలో భూమిపై గల సారవంతమైన మట్టి కూడా కొట్టుకు పోవడం చేత ఎడారీకరణ పెరిగి పోతుంది. అంతే కాదు నేడు ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతూ ఉంది. ఈ సమయంలో పట్టణీకరణకు భూములు అధికంగా ఉపయోగించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇది కూడా భూ క్షీణతకు ప్రదాన దోహదకారిగా చెప్పవచ్చును. ఈ విధంగా ఒక వైపు అధిక దిగుబడులు కోసం ఆధునిక ఉత్పత్తి పద్ధతులు అవలంభించడం మరొక వైపు అభివృద్ధి పేరిట చోటుచేసుకుంటున్న మానవ కార్యకలాపాలు, పర్యావరణ మార్పులు భూమి జీవ సంబంధమైన సామర్థ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఫలితంగా భూమి క్రమక్రమంగా ఎడారిగా రూపాంతరం చెంది, భూతాపం పెరిగిపోయి, భూ ఉత్పాదక సామర్థ్యాన్ని దెబ్బతిని కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఎడారీకరణ సమస్య ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. మానవ చర్యలు, వాతావరణ మార్పుల కారణంగా నికర ప్రాథమిక ఉత్పాదకత తగ్గిపోతూ ఎడారీకరణ ఇదే విధంగా కొనసాగుతూ పోతే రాబోయే కాలంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుందని.. ప్రతీ నాలుగు హెక్టార్ల భూమిలో ఒక హెక్టారు భూమి సాగుకు పనికిరాకుండా పోతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తున్నది. ఐక్యరాజ్య సమితికి చెందిన 'యునైటెడ్నేషన్స్ కన్వెన్షన్ టు కాంబట్ డెజర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ) ప్రకారం వ్యవసాయానికి అనుకూలం కాని భూములను వ్యవసాయానికి వినియోగిస్తుండడం, నేల, నీటి పరిరక్షణ చర్యలు తగినంతగా లేకపోవడం, పరిమితికి మించి సాగు చేయడం, జల యాజమాన్యం సక్రమంగా లేకపోవడం.. భూగర్భ జలాల అపరిమిత వినియోగం ఎడారీకరణకు ప్రధాన కారణాలని.. దీనికి తోడు మృత్తికా క్రమక్షయం కారణంగా ఏటా 530 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి, 80 లక్షల టన్నుల వృక్ష పోషకాలను నేల కోల్పోతోంది. భూక్షీణత వల్ల ప్రత్యక్షంగా 25 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణం, గనుల తవ్వకం వంటి కారణాల వల్ల వ్యవసాయం, చెట్ల పెంపకానికి భూమి లభ్యత తగ్గిపోతోంది. ఫలితంగా ఎడారీకరణ మరింత వేగవంతమవుతోందని తమ నివేదికలో ప్రస్తావించింది. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతకు తీవ్ర అవరోధం కలిగే పరిస్దితులు ఏర్పడనున్నాయని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఇదే పరిస్థితులు కొనసాగితే విశ్వవ్యాప్తంగా వ్యాధులతో మరణించినవారి కంటే కరవుల కారణంగానే ఎక్కువమంది అని తెలిపింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల హెక్టార్ల భూమి సారాన్ని కోల్పోయిందని, ఇది చైనా భూభాగం కంటే రెండింతలు ఎక్కువని ఇది అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది సేకరించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 360 కోట్ల హెక్టార్ల భూమి ఎడారీకరణ ప్రభావానికి లోనైనట్లు అంచనా. మూడోవంతు భూభాగం ఎడారీకరణ ప్రమాదంలో ఉంది.
ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ధోరణి కొనసాగితే వచ్చే పదేళ్లలో మనుషులకు ఆహారం పండించడానికి అదనంగా 30 కోట్ల హెక్టార్ల పంట భూమి అవసరం అవుతుందని అంచనా. ఈ భూక్షయం వల్ల 2010 లోనే ప్రపంచ స్థూల ఉత్పత్తి 10 శాతం తగ్గిందని ఆర్ధిక సర్వేలు చెబుతున్నాయి.
ఆకలి సూచీ
మన దేశ కుబేరులు ప్రపంచ కుబేరుల జాబితాలో స్ధానం కోసం పోటీ పడుతున్నారు. అంతేకాదు, శాస్త్రీయ సాంకేతిక రంగాలలో నవకల్పనలలో భారత్ దూసుకుపోతోందని ఈ మధ్యనే ప్రపంచ ఆవిష్కరణల సూచీలో 40వ ర్యాంకు సాధించి మన గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటాం. ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ చేరుకోనుందని మన నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఆహార భద్రత కలిగి ఆకలి మరణాలు లేని దేశంగా మాత్రం మనం గుర్తింపు పొందనున్నామనేది మాత్రం చెప్పలేక పోతున్నారు. ఈ మధ్యనే ప్రపంచ ఆకలి సూచీ నివేదిక కూడా ప్రకటించారు. దానిలో కూడా మన వెనుకబాటు తనం స్పష్టంగా కనిపించింది. మొత్తం 116 దేశాలను అధ్యయనం చేస్తే ఆకలి సూచీలో మన ర్యాంక్ 101గా ఉంది. ఇన్ని సంవత్సరాల స్వతంత్య్ర భారత చరిత్రలో ఇంకా ఇంత వెనుకబాటు తనం ఉందంటే ఎంతైనా విచారించాల్సిన విషయం. అయితే ఆహార లభ్యత, నాణ్యత, ఆహారోత్పత్తిలో సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉందని ఈ నివేదిక తెలిపింది. గత పది సంవత్సరాలు గా ఆహార భద్రత సాధనకు కృషి చేస్తున్న దేశాల అభివృద్ధి ఫలితాలు చూస్తే మన దేశం ముఖ్యంగా మన పొరుగు దేశాలైన పాకిస్ధాన్.బంగ్లాదేశ్, నేపాల్‌లు సాదించిన అభివృద్ధి కన్నా మన దేశం వెనుకంజలోనే ఉందని నివేదిక తెలిపింది.
ఆహార భద్రత సూచీ
ప్రతీ సంవత్సరం ప్రపంచ దేశాల ఆహార భద్రత పరిస్ధితులను సర్వే చేసి వాటికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. దీనినే ఆహార భద్రత సూచీ అని అంటారు. దీనిలో భాగంగా లండన్‌కు చెందిన ఎకనమిస్ట్ ఇంపాక్ట్ సంస్థ కోర్టెవా అగ్రిసైన్స్ సాయంతో తయారు చేసిన 113 దేశాలతో కూడిన వార్షిక నివేదిక జీఎఫ్ఎస్ ఇండెక్స్ - 2021ను తాజాగా విడుదల చేసింది. ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, సహజవనరులు వంటి అంశాల ఆధారంగా 113 దేశాల్లో ఆహార భద్రతను అంచనా వేసి తయారు చేసిన నివేదికలో భారత్ 71వ స్థానంలో నిలచి ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఈ పరిశీలనలో ఆహార భద్రత సమగ్ర స్వరూపాన్ని అధ్యయనం చేసి ఉద్దేశ్యంతో ఆదాయ అసమానతలు ఆహార భద్రత, సహజ వనరులు, ఆహారానికయ్యే ఖర్చుతో పాటు మొత్తం 58 అంశాలను పరిగణలోనికి తీసుకుంది. ఆహార భద్రతలో పాయింట్ల దిశగా చూస్తే మన దేశానికి 57.2 పాయింట్లు దక్కాయి. ఈ విషయంలో భారత పొరుగు దేశాలైన పాకిస్తాన్ 52.6 పాయింట్లతో 75వ స్థానంలో, శ్రీలంక 62.9 పాయింట్లతో 77వ స్థానంలో, నేపాల్ 79, బంగ్లాదేశ్ 84వ స్థానంలో ఉన్నాయి. అంటే ఈ దేశాల కన్నా మన పరిస్ధితి కొంత మెరుగ్గానే ఉంది. ఒక్క చైనా మాత్రం మనకన్నా చాలా మెరుగ్గా ఉండి 34వ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనించ దగిన విషయం.
స్వాతంత్య్రానంతరం కరువు పరిస్థితులు ఏర్పడక పోయినప్పటికీ ఆకలినైతే ఇప్పటి వరకూ జయించలేదనే చెప్పాలి. అందుచేతనే ఈ పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఆహార భద్రత నివేదికలో పొరుగు దేశాలకన్న భారత్ మెరుగ్గానే ఉంది కాకపోతే సరసమైన ధరలకు ఆహార ధాన్యాలు పొందడంలో మాత్రం పొరుగు దేశాల కన్నా వెనుకబడి ఉన్నాం అని చెప్పింది. అంతే కాదు 10 ఏండ్ల ఆహార భద్రత విషయంలో భారత్ సాధించిన పురోగతి పొరుగు దేశాలకన్న వెనుకంజగా ఉంది అని గణాంకాలతో సహా చెప్పి ఆహార భద్రత విషయంలో హెచ్చరించింది. ఈ సత్యాలను అవలోకనం చేసుకుని ఆ దిశగా నిర్మాణాత్మక చర్యలు ప్రభుత్వాలు చేపడితే తప్పక ఆహార భద్రతను రానున్న కాలంలో సాదించగలుగుతాం.
ఆహార భద్రత చట్టం ఘనంగా ఏర్పాటు చేసుకుంటే సరిపోదు. దానిలో పేర్కొన్న ఆహార హక్కులను విస్తృతంగా ప్రచారం చేయడం కూడా చాలా అవసరం కూడా. నిధులు వెచ్చించడమే కాదు దానిపై సమగ్ర పర్యవేక్షణ చేయగలిగితేనే సత్ఫలితాలు సాధించగలుగుతాం. పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్దిదారులకు మాత్రమే చేరే విధంగా పటిష్ట చర్యలు చేపట్టగలిగితే ఆహార భద్రతను సాధించడం మనకు పెద్ద కష్టం కూడా కాదు. ఇటువంటి స్దితిలో నిర్ణీత కాల వ్యవధిలో లభించిన ఆ ఉత్పత్తిని నిరంతర వినియోగం కొరకు జాగ్రత్తగా భద్రపరచి అందించడం ప్రధానంగా పేదరికపు దిగువున ఉన్న ప్రతీ ఒక్కరికీ కూడా అందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యతగా చెప్పవచ్చును. అయితే ఈ విషయంలో ఉత్పత్తి దారులు, అదే సమయంలో వినియోగదారులు కూడా విభిన్న రీతులలో ఆహార భద్రతకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సురక్షితమైనదా కాదా అనేది నిర్ణయించుకునే విషయంలో ఆహార పదార్థాలను ఉత్పత్తి చేపట్టే రైతు దగ్గర నుంచి ఆ ప్రక్రియలో కీలక పాత్ర వహించే శ్రామికులు మరియు విధానాలు రూపొందించే ప్రభుత్వాది నేతల వరకూ ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ఎవరి పాత్ర వారు సక్రమంగా నిర్వరిస్తే గుణాత్మక ఆహారం వినియోగదారుల చెంతకు వస్తుంది. మెరుగైన ఆహారం తీసుకున్న వారి శారీరక సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. అటువంటి వారిలో రోగ నిరోధకశక్తి మెరుగ్గా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. ఇటువంటి ఆరోగ్యదాయక జనాభా కలిగిన సమాజాలు మంచి ప్రగతిని సాధిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578
Sun 16 Oct 00:20:00.544442 2022