Time and tide waits for none...ఇది చాలా పాత మాట. కానీ అలా ఆగని టైమ్‌నే సెకన్ల్లుగా, గంటలుగా, రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా కొలమానం చేస్తున్నాం. మరి దీని ప్రకారం చూస్తే ప్రతి సెకండ్ కొత్తగా పుడుతుంది. ప్రతి సెకను అంతరించిపోతుంది. ఇది తెలిసిందే కదా అనుకునేవారు లేకపోలేదు. కానీ పుట్టిన ప్రతి సెకను కాలంగా మనకు కనిపిస్తుంది. దాన్నే సరిగ్గా వాడుకుంటే భవిష్యత్తును నిర్దేశించే సూచికగా నిలబడుతుంది. అదే మనకు భరోసానిచ్చే భవితగా కనిపిస్తుంది. నిజానికి సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్త సంవత్సరం ఏమైనా మొదటిదా?. కానే కాదు. పండుగనా?. అస్సలు కాదు. కేవలం కేలండర్లో వచ్చే మార్పు మాత్రమే!. కానీ ఆ మార్పు కాలంలోనో కేలండర్‌లోనో ఉంటే సరిపోదు. మార్పు మనలో ఉండాలి. మన జీవితంలో ఉండాలి. కుటుంబాల్లోనూ ఉండాలి. అందుకే కొత్త సంవత్సరం అనగానే చాలామంది తమ జీవితానికి తీసుకునే నిర్ణయాలుగా భావిస్తారు. మరికొందరు కొత్త ఆలోచనలకు స్వీకారం చుడతారు. ఇంకొందరు చెడు అలవాట్లకు ముగింపు పలుకుతారు. మన ఆలోచనలు, ఆశయాలు, ఆచరణలు అన్నీ బాగుంటేనే కొత్త సంవత్సరం మరింత నవ్యంగా ముందుకు సాగుతుంది. అలాంటిదే ఈ నూతన ఏడాది కావాలని కోరుకుందాం. గత జ్ఞాపకాలపై నిర్మించే భవిష్య్తత్తు కలల సౌధం 2023కు స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం అనుబంధం 'సోపతి' అందిస్తున్న కవర్ పేజీ కథనం..
న్యూ ఇయర్‌కు సంబంధించి రకరకాల కథలు చరిత్రలో ఉన్నాయి. క్రీస్తు పూర్వం 45లో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్యాలెండర్ సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించాడు. క్యాలెండర్‌ను ప్రవేశపెట్టేప్పుడు సంవత్సరాన్ని మొదలు పెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. రోమన్లకు జనవరి నెల ప్రముఖ మైనది. ఈ దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల అది. రోమన్లు ఆరాధించే జనస్‌కు రెండు తలలు. ప్రారంభాల దేవత అని కూడా అంటారు. అందుకే రోమన్లు జనవరి నెలను ఎంచుకున్నారు. అయితే 5వ శతాబ్దంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు.చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి.కానీ పోప్ 13వ గ్రెగొరీ 16వ శతాబ్ధంలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు. అయితే క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది. 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి,యూరప్‌తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేలా చేసింది.ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి. అందుకే ప్రతి యేటా డిసెంబరు 31వ తేది రాత్రి నుంచి ఈ సంబరాలు మొదలు అవుతాయి. 31నే స్నేహితులు, బంధువులు అందరూ కలుసుకుని విందూ, వినోదాలు, ఆటాపాటలతో వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి 12 గంటలకు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..
ప్రపంచం లోని అనేక నగరాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి గడియారం దాటిన వెంటనే అద్భుతమైన బాణాసంచా ప్రదర్శనలు జరుగుతాయి.
ఇటీవలి సంవత్సరాలలో, ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఈ వేడుకల్లో మొదటిదానికి ఆతిథ్యం ఇచ్చింది. ఎందుకంటే చాలా ఇతర ప్రధాన అంతర్జాతీయ నగరాల కంటే ముందుగా న్యూ ఇయర్ వచ్చేసింది. ప్రదర్శన సిడ్నీ హార్బర్‌లో జరుగుతుంది, ఒపెరా హౌస్,హార్బర్ బ్రిడ్జ్ అద్భుతమైన సెట్టింగ్‌గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేలాది బాణసంచాలతో నగరాల్లో ఆకాశాన్ని వెలిగిస్తుంది.నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రజలు ఉత్సవాలు జరుపుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రతి దేశం కొత్త సంవత్సర వేడుకలను విభిన్నమైన పద్ధతిలో జరుపుకుంటారు.
స్పెయిన్‌లో ద్రాక్షపండ్లతో..
స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున పాటించే సంప్రదాయం గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. స్పెయిన్‌లో.. న్యూ ఇయర్ అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇలా చేయడానికి రీజన్ ఏమిటంటే.. 12 ద్రాక్షలు 12 నెలలు.. ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒకొక్క ద్రాక్ష పండు వారి దృష్టిలో ఒకొక్క నెల అదృష్టంతో ముడిపడి ఉంటుంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్, బార్సిలోనా వంటి పెద్ద నగరాల్లో.. ద్రాక్షను కలిసి తినడానికి ప్రధాన కూడలిలో భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు.
డెన్మార్క్‌లో పాతప్లేట్లు, గ్లాస్‌లను విసిరేసి..
డెన్మార్క్ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యుల అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వలన చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని డెన్మార్క్ ప్రజల నమ్మకం. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం.
అమెరికాలో టీవీల ముందు...
న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రతి అమెరికా ప్రజలు తమ టీవీ ముందు కూర్చుం టారు. ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రాప్‌ను చూడడానికి వారు ఇలా చేస్తారు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టె సమయంలో కొత్త ప్రధాన కార్యాలయంలో బాల్ డ్రాప్‌ను చూసే ఈ అలవాటు న్యూ ఇయర్ వేడుకలలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంప్రదాయాలలో ఒకటి.
బ్రెజిల్‌లో ప్రత్యేక పనులతో...
బ్రెజిల్‌లో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులను చేస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక లోదుస్తులు ధరిస్తారు. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
ఫిన్లాండ్‌లో విశేషాలతో...
ఫిన్లాండ్‌లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరగనున్న విశేషాల గురించి ఊహిస్తారు . దీని కోసం.. వారు కరిగిన టిన్‌ను నీటిలో ముంచి, లోహం గట్టిపడిన తర్వాత.. లోహానికి ఆకారంగా మార్చే పక్రియను చేపడతారు. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే.. అది వివాహం జరగడానికి చిహ్నం అని అర్థం. మరోవైపు మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే, అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారు.
మొదట, చివరి వేడుకలు
చేసుకునే ప్రాంతాలు..
భూభ్రమణాన్ని బట్టి వివిధ టైంజోన్లను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి న్యూ ఇయర్ మొదలవుతుంది. మనకంటే ముందున్న టైం జోన్ల ప్రకారం వాళ్లకు వేడుకలు ముందే ఆరంభమౌవుతాయి. అలాగే కొన్ని దేశాల్లో మన తర్వాత వేడుకలు జరుగుతాయి. న్యూజిలాండ్ ఛాథమ్ దీవుల్లో ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమ వుతాయి, ఇక్కడ ప్రారంభమైన 24 గంటలకి , అందరికంటే చివరగా అమెరికాలో ని సమోవా దీవుల్లో వేడుకలు జరుపుకుంటారు. అలా అని ఈ రెండు ప్రాంతాలకు చాలా దూరమని అనుకునేరు. కేవలం 550 మైళ్లు మాత్రమే, ఫ్లైట్లో గంట సేపట్లో చేరుకోవచ్చు. భూమి గుండ్రంగా ఉండి సూర్యుడి చుట్టూ తిరగడం వల్లనే ఇదంతా.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిందే...
కరోనా గాయం నుంచి చాలామంది నేటికీ కోలుకోనేలేదు. ఇప్పటికీ ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారు కూడా ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి అల్లకల్లోలం అయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.సాటి మనిషికి సాయం చేయలేని విధంగా కరోనా నేర్పిన పాఠం అలాంటిది. అందుకే చాలామంది ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలతో వ్యాయామం చేస్తున్నారు. న్యూ ఇయర్ రిసోల్యూషన్స్ కింద కూడా చాలామంది జిమ్కి వెళ్ళడం, యోగా చేయడమో, ధ్యానం చేయడమో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య పెరిగిన స్మార్ట్ డివైసెస్ వల్ల అంటే సెల్ ఫోన్స్ లో కానీ స్మార్ట్ వాచెస్ వల్ల కానీ మన చేసే యాక్టివిటీకీ కొలమానం చేయగలుగుతున్నాం. 2023లో ఇది ఇంకా పెరిగి హెల్త్ మీద శ్రద్ధ చూపించడం పెరుగుతుందని ఒక అధ్యయనం చెప్తే, కేవలం యూట్యూబ్ చూసి యాక్టివిటీస్ చేయడం వల్ల కొన్ని అనవసరంగా అనారోగ్యానికి గురవుతున్న విషయాం కూడా ఇంకో అధ్యయనం తేల్చింది. ఇది ఇలా ఉంటే 2023లో మెంటల్ హెల్త్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన సమయం అని నిపుణుల సూచన. ఈ సంవత్సరం హెల్త్ కేర్ సెక్టార్లు, ఫార్మా రంగంలో లాభాలు అధికంగానే ఉండేలా ఉన్నాయి, వాళ్ల టార్గెట్ చూస్తుంటేనే అర్థమవుతుంది. డిఎన్‌ఏ లో మార్పులు చేయగల 'అడ్వాన్స్డ్ జిన్ ఎడిటింగ్' థెరపీకి 2023లోనే అప్రూవల్ రానుంది. 2023లోనే 'బయో ప్రింటింగ్' వల్ల అవయవాల మార్పిడి చాలా తేలిగ్గా జరిగేలా, అలాగే 'బయో ఇంజనీర్ టిష్యూస్' వల్ల మజిల్ గ్రోత్ కావడం లాంటి టెక్నాలజీ రానున్నాయి.ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా ఇన్సులిన్‌ని టాబ్లెట్ రూపంలో ఈ సంవత్సరం మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
నూతన ఏడాదిలో రానున్న మార్పులు...
కాలంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేది మాత్రం టెక్నాలజీ. ప్రస్తుతం ఉన్న 4జి నెట్వర్క్‌కి 5జి తోడుగా వచ్చి ఇండియాలో ఎక్కువ గా విస్తరిస్తుంది. ఫోన్లో కెమెరాలు ఉండడం తెలిసిందే కానీ ఈసారి ఆ కెమెరా లెన్స్ లో మైక్రోస్కోప్ లెన్స్ కూడా జత చేయబోతున్నారు. నార్డ్ వీపిఎన్ అందుబాటులోకి రానుంది. హ్యాకింగ్ కి పాల్పడే ప్రకటనలు ఇక వీల్లేకుండా చేస్తాయి. వరల్డ్ వైడ్ వెబ్‌లో మూడో వెర్షన్ అంటే వెబ్3.0 రాబోతుంది. సెక్యూరిటీ, ప్రైవసీ చాలా పెరిగి డేటా యాక్సిసిబిలిటీకి కంట్రోల్ ఉంటుంది. మన డేటా ఏ సైట్లు పడితే ఆ సైట్లు వాడుకోలేవు. యూజర్స్‌కి కూడా ప్రతీది ఫ్రీ బ్రౌజింగ్ ఉండకపోవచ్చు. ఆన్లైన్ చదువులకు డిమాండ్ పెరగడంతో, పిల్లల కోసం ముఖ్యంగా చదువు కోసం ప్రత్యేకమైన యాప్స్ చాలా రాబోతున్నాయి. బుక్ రీడింగ్ యాప్స్ కూడా.వ్యవసాయంకి టెక్నాలజీ సాయం పెరగబోతుంది. ఇప్పటికే డ్రోన్స్, రిమోట్ కన్ట్రోలింగ్ వాటరింగ్ టెక్నాలజీ టెస్టింగ్ ఫేసెస్ దాటి అందు బాట్లోకి రానున్నాయి. అయితే మనిషి శ్రమతో ముడి పడిన వ్యవసాయానికి సాంకేతిక సొబగులు వద్దనే విమర్శలూ ఉన్నాయి. గేమిఫికేషన్, విఎఫ్‌ఎక్స్, నానో టెక్నాలజీకి గిరాకీ ఎక్కువగా ఉండ బోతోంది. ఎలక్ట్రిక్ బైక్స్ ఇండియాలో వినియోగం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫుడ్ డెలివరీ యాప్‌లో మార్పులు లేక పోయినా ఎక్కువగా లావాదేవీలు, లాభాలు మాత్రం ఎప్పటిలా అంతంత మాత్రమే ఉండేలా ఉన్నాయి. ఉన్న పరిస్థితులను బట్టి ఈ సంవత్సరం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎక్కువగానే ఉండేటట్టు కనిపిస్తున్నాయి.గత రెండు సంవత్సరాలుగా వర్క్ ఫ్రం హౌం చేస్తున్న ఐటీ ఉద్యోగులు ఈ సంవత్సరం నుంచి తమ ఆఫీస్ నుండి వర్క్ చేయబోతున్నారు. దాదాపుగా అన్ని కంపెనీలు కాకపోయినా చాలా వరకు హైబ్రిక్ మోడ్‌ని పాటిస్తున్నాయి. అయితే 2023 మొదటి క్వార్టర్‌లో మాత్రం రిసిషన్ ప్రభావం చాలానే చూపేలా ఉంది. ఇప్పటికే కొన్ని వేల ఉద్యోగుల్ని ప్రముఖ ఐటి కంపెనీలు లేఆఫ్ చేయడంతో చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయి. పైగా మూన్ లైటింగ్ లాంటివి జరగకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
భారత్‌లో రాష్ట్రాలవారీగా వేడుకలు...
భారతీయులకు వేడుకలంటే మహాఇష్టం. ముఖ్యంగా అందులో మన తెలుగువారిది ఇంకా ప్రత్యేకం. గ్రామ దేవతల నుంచి మొదలుకుంటే వెయ్యి నూటొక్క పండుగలు మన సంస్కృతికి చిహ్నాలుగా నిలుస్తాయి.అందులోనుంచి పుట్టుకొచ్చిన పండగలా, అంతలా వేడుకగా చేసుకునేదే న్యూ ఇయర్. ఆ సెలబ్రేషన్ స్నేహితులతో అయితే కిక్కెక్కువ. ఫ్యామీలతోనైతే మరీ ఫీలెక్కువ. అందుకే ప్రతి కొత్త సెకండ్‌ని సెలబ్రేట్ చేసుకోవడం కంటే ప్రతి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనావాయితీగా మారింది. నూతన సంవత్సరానికి చాలామంది మన దేశంలో కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. స్నేహితులు మందు, విందుల్లో మునిగి తేలుతారు. కుటుంబ సభ్యులు తమకిష్టమైన వారికి మెసేజ్‌లు పంపుతారు. విద్యార్థులు గ్రీటింగ్ కార్డుల ద్వారా స్వాగతం చెబుతారు. ఎక్కువమంది బయట వీధుల్లో ఎంజారు చేస్తారు. కూల్‌డ్రింక్స్ తాగి కొత్త సంవత్సరాన్ని కొత్తగా గడుపుతారు. అయితే మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు వల్ల ఇతర దేశాలతో పోలిస్తే మనకు నూతన సంవత్సరమనేది రాష్ట్రాల వారిగా జరుపుకోవడం ఎక్కువ. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో ఉగాదిని కొత్త సంవత్సరంగా ఆహ్వానిస్తారు. మహారాష్ట్రలో గుడిపడ్వా, పంజాబ్‌లో బైసకి, జార్ఖండ్ వాళ్లు జుడే షీతల్, తమిళులు పుతండ్ వేడుకలు నిర్వహిస్తారు. అస్సాంలో బోగ్ బిహు, బెంగాలీలో పొహెలా బోయిసాక్, గుజరాతీలో బెస్తు వరాస్, మలియాళీలో విషు, సిక్కిం లో లొసోంగ్, కాశ్మీర్‌లో నవ్రే, ఒడిస్సాలో పన సంక్రాంతిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరానికి ఒక్కో పేరు కూడా ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.
నవ సమాజం దిశగా అడుగులేద్దాం..
దేశం సాంకేతిక రంగంలో దూసుకు పోతోంది. మానవ సమాజమంతా కూడా దాని చుట్టే తిరుగుతోంది. ఓ వైపు అభివృద్ధిని ఆహ్వానిస్తూనే ఆధిపత్యం సృష్టించే భావజాలాన్ని అడ్డుకోవాలి. కులం, మతం, ప్రాంతం పేరుతో చేస్తున్న దోపిడీని తిప్పికొట్టాలి. పెరుగుతున్న వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఎవరికివారే తమ వంతుగా ప్రయత్నించాలి. మనిషి టెక్నాలజీ పరంగా చాలా స్మార్ట్ కానీ ప్రకృతి అంతకంటే స్మార్ట్... సో దాన్ని కాపాడుతూ మనల్ని మనం కాపాడుకునేందుకు ఒకరికొకరు తోడుగా నిలవాలి. కరోనా లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉంటూనే ప్రతి సెకండ్‌ని ఎంజారు చేద్దాం.అంతరాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. బారు బారు లాస్ట్ ఇయర్.. వెల్‌కమ్ న్యూ ఇయర్..
- మన్ ప్రీతమ్, 8179306464
Sun 01 Jan 02:14:34.968657 2023