ఏడాదిలో తొలి పండుగ. ఏడాది కోసారొచ్చే పెద్ద పండుగ. తెలుగు వారికే సొంతమైన పండుగ. అచ్చమైన పల్లెటూరి పండుగ. శ్రమజీవుల పండుగ. జాన పదుల పండుగ...అదే మన సంక్రాంతి పండుగ. చదువు కోసమో, బతుకుదెరువు కోసమో, ఉద్యోగం కోసమో.. కారణమేదైనా తల్లిదండ్రులకు, పుట్టినూరుకు దూరమయ్యాం. ఉపాధి వేటలో సొంత ఇంటికే బంధువులమయ్యాం. ఫర్వాలేదు.. దేశం కాని దేశంలో ఉంటేనేం. పట్టణ వాసపు జీవనంలో మగ్గితేనేం. సంక్రాంతికి మాత్రం సొంతూరుకు పరిగెడతాం. ఆఫీసులో సెలవులేదు. అయినా అడిగి మరీ ఊరెళ్లాల్సిందే. ఎందుకంటారు? ఆత్మీయత పంచే అమ్మ కోసం, అనురాగం అందించే నాన్న కోసం, పల్లెతనాన్ని పంచిన మట్టి వాసన కోసం, చిన్నతనపు మధురస్మృతుల కోసం. దేశంలోనే సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే తెలుగు రాష్ట్రాల ప్రత్యేకమైన పండుగిది. సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం అనుబంధం అందిస్తున్న 'సోపతి' కవర్ స్టోరీ...
ఉరుకుల పరుగుల జీవనంలో ఏదో వెలితి.అవసరానికి తప్ప మాట్లాడేవారే కరువు.అనుబంధాన్ని పంచే వారు అంతకన్నా లేరు. ఆఫీస్‌లో సమస్యలు. రాత్రంతా నిద్రుండదు. బాధ్యతల చికాకులు. ఇంటా బయట అంతా సతమతమే. ఇలాంటి సమయంలో మన ఊరు నుంచి ఎవరైనా వస్తున్నారంటే చాలు.. పట్టలేని ఆనందం. ఎందుకు? అదే పుట్టిన మట్టి విలువ. అందుకే పల్లెతనాన్ని పంచిన పుట్టిన ఊరుకు వెళ్లాలంటే ఎంతో సంతోషం. ఆనందాలు, సరాదాలు, సంభాషణలు ఎన్నెన్నో మన జీవితపు మాధుర్యాలు అక్కడే ఉంటాయి. అందుకే పట్టణాన్ని వీడుతున్నామనే బాధ కాస్తా కూడా ఉండదు. మూడు రోజులకు సరిపడా బట్టలు సర్దుకుని ఊరెళ్తాం. అందరినీ కలుస్తాం. యోగక్షేమాలు తెలుసుకుని పిండివంటలు రుచిచూస్తూ ఆనందంగా గడుపుతాం. అమ్మ మనకోసం చేసిన గారెలు, బూరెలు, లడ్డూలు స్నేహితులకు తీసుకురావాడినికి ఇంకా ఎక్కువ చేయాలని అడుగుతాం. పాత మిత్రులు వస్తున్నారా అని ఫోన్లో వాకబు చేసుకుంటాం. ఏవైనా పనులున్నా.. పండగకు వచ్చినప్పుడు చేద్దాంలే అని సరిపెట్టుకుంటారు. కొత్త ఏడాదిలో తొలి పండగకున్న ప్రత్యేకత అలాంటిది. అందుకే ఎంత బిజీగా ఉన్నా అందరినీ కలిసే అనుబంధాల కలయికే ఈ సంక్రాంతి.
నెల నుంచే ఎదురుచూపు...
కొత్త సంవత్సరం రాగానే సంబరాలు. ఆ తర్వాత వచ్చే పండగ ఏదైనా ఉందంటే సంక్రాంతి. తెలుగునాట ఉగాదిని తొలి పండగగా చెప్పుకున్నా అంతకన్నా ముందే వచ్చే ముందు పండగగా సంక్రాంతి ఉంటుంది. మద్రాస్ ఐఐటిలో చదివే తెలుగు విద్యార్థి అయినా, బెంగుళూరులో ఆంధ్రామెస్ యజమానైనా, హైదరాబాద్‌లో పని చేసే వలస భవన నిర్మాణ కార్మికుడైనా..సంక్రాంతికి ఊరెళ్లాలంటే నెలనాళ్ల ముందే టిక్కెట్టు రిజర్వేషన్ చేయించుకోవాల్సిందే. లేకుంటే మాత్రం ముప్పు తిప్పలు పడి మూడు చెరువుల నీళ్లు తాగినంత పనవుతుంది ప్రయాణం. ఆర్టీసీ వాళ్లు. ఎన్ని స్పెషల్ బస్సులు పెట్టనివ్వండి.. రైల్వేవాళ్లు ఎన్ని ప్రత్యేక రైళ్లు పెంచనివ్వండి.అబ్బే సరి పోవు. ఈ సంక్రాంతి సెలవు దినాల్లో నిండు చూలాల్లా కనిపిస్తుంటాయి బస్సులు, రైళ్లు. ఇక ట్రావెల్స్ యజమా నులకైతే దోపిడీ ద్వారాలు తెరపడానికి ఇదే అదను. ఇక మన భాగ్య నగరంలోని ఎంజీబీఎస్‌కు ఒకసారి వెళ్తే ఓ వైపు చలి, మరోవైపు ఇసుక వేస్తే రాలనంత జనం. అష్టకష్టాలు పడా ల్సిందే. తల్లి చంకలో చంటి బిడ్డ, పక్కన లగేజీ సంచులు.. బస్సులో సీటు కోసం పరితపిస్తూ కని పించిన కండక్టర్ సార్లను ఖాళీలున్నాయా అని అడగటం. నిరాశలు, పెదవి విరు పులు. ఇప్పుడు మాత్రం వెళ్లాల్సిందే. ఎందుకంటే మనస్సు అనే లగేజీ సంచు ల్లో ఏడాదికి సరిపడా. మధురా నుభూతు లను మూట కట్టుకొని తెచ్చుకో వాలిగా! మరి దేశం కాని దేశంలో ఉంటున్న వారికి మాత్రం సొంతూరుపై మమకారం ఉండదా. పండక్కి ఊర్లో ఉండాలి. అమ్మ, నాన్నతో గడపాలి. అయిన వారందరినీ కలవాలన్న ఆశలు వారికి ఉంటాయి కదా.
అవధులు లేని పిల్లల పండగ
సంక్రాంతి అంటే.. అందులో పిల్లల ఆనందా లకు అవధులుండవు. పుస్తకాల మోత ఉండదు. హోంవర్క్ లుండవు. బడి గంట అసలే విన పడదు. ఎంచక్కా సెల వుల్లో అమ్మమ్మ వాళ ఇంటికి వెళ్లచ్చు... నాన్నమ్మ చేత బోలెడన్ని కథలు చెప్పించు కోవచ్చు. ఇంట్లో ఎన్ని పిండి వంట లున్నా, అత్తయ్య, మామయ్య ఇచ్చే డబ్బులతో కురు కురేలు కొనుక్కో వచ్చు. ఊర్లో ఉండే పిల్లలందరినీ పోగు చేసి దాగుడు. మూతలు, ముక్కు గెల్లుడు, దొంగ పోలీస్ ఆటలన్నీ ఆడుకోవచ్చు. కేరింతలు కొడుతూ గాలి పటాలు ఎగరేయవచ్చు. హరిదాసు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూడటం. ఆయన కలశంలో బియ్యం పెట్టాలని తహతహలాడటం, పోటీకొచ్చిన అక్కతోనో. తమ్ముడితోనో గిల్లిగజ్జాలకు దిగటం ఇలాంటివి బోలెడన్ని ఇక భోగి రోజైతే... వీధిలో అందరికంటే పెద్ద భోగి మంట వేయాలి. పాత చెక్క ముక్కలు, బెల్లపు బుట్టలు, అట్ట పెట్టలు అన్నీ పోగుచేయాలి. ఆనాటి కోసమే తయారు చేసిన పిడకల దండను బయటకు తీయాలి. ఎవరి దండ పెద్దదో బేరీజు వేయాలి. అవన్నీ భోగి మంటలో వేసి నులి వెచ్చని ఆవిర్లను. ఒంటికి రుచి చూపిం చాలి. కొత్త బట్టలు తొడుక్కోవాలి. సంక్రాం తిని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు తన పెద్దలను స్మరించు కోవడం ఆనవాయితిగా వస్తుంది. హార్దిక సంబం ధాలు పూర్తిగా అడుగంటిపోతున్న ఈ రోజుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని భోజనం చేయడం.... కుటుంబ పెద్దలను స్మరిం చుకొని వారిని గౌరవించు కోవడం, తల్లిదండ్రుల ఆశీ స్సులు తీసుకోవడం ఇవన్నీ సంక్రాంతి మాత్రమే కల్పించిన సందర్భం. ఎక్కడెక్కడో నివశిస్తున్న అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరూ కలవడం అన్నది తర్వాత తరాలకు కుటుంబ ఆత్మీయతలు, అనుబంధాల గురించి తెలియచేసే మంచి క్రతువు.
మిత్రులను కలిసే పండగ
పండక్కి ఊరెందుకెళుతున్నావు అని ఎవరైనా అడిగితే ఏమి సమాధానం చెప్పాలో తెలియక పోయినా మనస్సు మాత్రం వెంటనే ఒకటి గుర్తుచేసు కుంటుంది 'చిన్న నాటి స్నేహితుల్ని కలవచ్చు అని. నిజమే సొంతూర్లో కట్టికట్టని లాగులతో ఎన్నో ఏళ్లు కలిసి వాళ్లతో తిరిగుంటారు. కోతి కొమ్మచ్చిలు ఆడుంటారు. చింత చెట్లు ఎక్కుంటారు. దొంగతనంగా మామిడి పిందెలు తెంపుంటారు. ఏం చేద్దాం. కాలం విడదీసింది. బతుకు తెరువు కోసం తలోదిక్కు పోయారు. అయితేనేం... సం క్రాంతి పండుగకు అందరం కలుద్దాం.. అని ఫేస్‌బుక్‌లోనో, సెల్ఫోన్లలోనో ముందే సమా చారం అందుతుంది. కలవాల్సిన రోజు రానేవచ్చింది. ఊరి బొడ్డురాయి దగ్గర మొదలవు తుంది. కలయిక. రవి గాడెక్కడ... మహేశ్ గాడెక్కడ. శ్రీకాంత్ ఎక్కడున్నాడో ఫోన్ చేయి... శ్రీధర్ ఇంకా రాలేదా వాట్సప్‌లలో మెసేజ్ ఇవ్వు.. అంటూ బోలెడన్ని ఊసులు. అంతలో బడి రమ్మని పిలుస్తుంది. ఒక్కసారిగా ఆ బడి గోడలు సెల్యూలాయిడ్లవుతాయి. చిన్న నాటి జ్ఞాపకాలన్నీ అందులో బొమ్మలుగా మెదులుతాయి. మిత్రులంతా కలసి గ్రామాభివృద్ధి విషయాలూ చర్చిస్తారు. అందులో భాగంగా సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఆటల పోటీలు, పాటల పోటీలు... క్రికెట్, కోకో, వాలీ బాల్ లాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తారు. సాంఘిక నాటికలనూ ప్రదర్శిస్తారు. గతంలో అయితే గ్రామంలోని కొంత మంది. యువకులు కలసి పండుగ పది రోజుల ముందు నుండే కోలాటం, చెక్క భజన నేర్చుకొని పండుగ రోజు ప్రదర్శనలిచ్చేవారట నేటికీ కొన్ని పల్లెల్లో సంక్రాంతి సాయంత్రాలు కోలాటాలు, చెక్క భజనలు, తోలు బొమ్మలాటలు వంటి జానపదుల నృత్యాలతో కోలాహలంగా ఉంటాయి.
ఎన్నెన్నో మధుర స్మృతులు
ఏడాది నుంచి ఎదురు చూసిన పండుగ రానే వస్తుంది. మూడు రోజుల పండుగ మురిపిస్తుంది. ఆ మురిపెంలో మూడు రోజులు మూడు క్షణాల్లా కరిగిపోతాయి. మళ్లీ మామోలే. బతుకు జీవుడా అంటూ కడుపు చేత పట్టుకొని, కన్నతల్లిని, సొంతూరుని వదిలి ప్రయాణం.
అబ్బా.... పండుగ అప్పుడే. అయిపోయిందా అనిపిస్తుంది. పిల్లలు రామని మారం చేస్తారు. పెద్దల మనస్సుల్లో కూడా తెలియని అలజడి. కానీ తప్పదు. అమ్మ కట్టించిన పిండివంటల సంచులు... పప్పుధాన్యాల మూటలు, బియ్యపు గోతాలు... వారి కన్న ప్రేమకు ఈ మూటలు కొలమానాలు మాత్రం కాదు. ఉదయాన్నే పది గంటలకే ఆఫీసులో అబెండ్ కావాల్సిన అబ్బాయిగారు. ప్రాజెక్ట్ వర్క్ పక్కన పెట్టి మరీ వచ్చిన అమ్మాయి గారు, మొదటి పిరియడ్ మిస్ కాకుండా బడిబాట పట్టాల్సిన బుజ్జాయి గారు.. మోయలేని మూటలతో, మనస్సంతా భారంతో అందరి అడుగులు భారంగా ముందుకు సాగుతుంటాయి. ఎక్కాల్సిన బస్సు. రానే వస్తుంది. మనస్సును మాత్రం వదిలేసి... మనుషుల్ని మాత్రమే తీసుకెళ్లడానికి. ఆ బస్సు కదులుతుంటే... అమ్మ కళ్లలో కృష్ణమ్మలు పొంగుతాయి. నాన్న గుండె చిన్నబోతుంది. తిరుగు ప్రయాణపు చిర్రుబుర్రులు మళ్లీ మొదలు. ఆపసోపాలు, ఇక్కట్లు అన్నీ భరించి ఎవరి గమ్యాలకు వారు చేరుకుంటారు. పండుగకు ఊరు వెళ్లని మిత్రులు, పల్లెటూరే తెలియని స్నేహితులకు, ఆఫీసులో సహోద్యోగులకు అరిశెలు, అమ్మ చేతి పిండి వంటలు రుచి చూస్తారు. సంక్రాంతి పంచుకుంటారు. అవి విన్నవారు. అరిసె తిన్నవారు అమ్మని, ఊరుని పొగడక మానరు. ఏడాదికి సరిపడా మధుర స్మృతుల మూటల్ని మాత్రం అలాగే మదిలో దాచుకుంటారు మళ్లీ సంక్రాంతి వరకూ..
కోడిపందేలా సందడి...
తెలంగాణలో దసరాకున్నంత హడావిడి ఏపీలో సంక్రాంతి పండగకు ఉంటుంది. మనమైతే కొత్తదుస్తులు, పిండివంటలు, అనుబంధాలు, అప్యాయతల మధ్య పండగ జరుపుకుంటాం. అక్కడైతే కోడిపందేలు, ఎడ్లబండ్ల పోటీలు ఆసక్తికిని కనబరుస్తాయి. సంక్రాంతి పండుగకు తెలుగు లోగిళ్లన్నీ సందళ్లతో, సంతోషాలతో, ఆటపాటలతో, సరదాలతో వెరసి నూతనోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా...ఇంటికి కొత్త అల్లుడు రావడం, వారికి అత్తింటివారు కొత్త బట్టలు పెట్టడం, బావల్ని మరదళ్లు ఆటపట్టించడం ఆనవాయితీ. ఇక ఈ సంక్రాంతికి కొత్త సినిమాలు అందులోనూ పెద్దహీరోల సినిమాల సందడి ప్రత్యేకం. పండగపూట ఊరికి దగ్గర్లోని టూరింగ్ టాకీసు వెళ్లడం షరామామోలే. గతంలో అయితే బంధుమిత్రులు అందరూ కలిసి ఎడ్లబండి కట్టుకొని మరీ తెరబొమ్మ చూడ్డానికి వెళ్లేవారట, ఇప్పుడు కాలం మారింది. ఇంట్లో టెలివిజన్, కాపల్సినన్ని సినిమాలు. కానీ అవన్నీ సంక్రాంతి పూట బలాదూర్. ఇక అసలు సిసలైన సంక్రాంతి. ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడ్ల పోటీలు. అవి చూడ్డానికి చుట్టు పక్క ప్రాంతాల నుంచి వచ్చే జనం, సందడే సందడి. గోదావరి జిల్లాల్లో కోడి పందేల గురించి చెప్పనక్కర్లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బడా బడా బాబులంతా కొబ్బరితోటలు, చింత తోపుల్లో చొరబడి కోట్ల రూపాయలతో కోళ్ల పందేలు కాస్తారు. ఇంకా కొన్ని సంక్రాంతి సరదా ఆటలు కూడా ఉన్నాయి. టెంకాయాట.. ఉల్లి పాయాట, నిమ్మ కాయాట, సంక్రాంతి సమయంలో పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి. అక్కడ కొంత మంది రైతులు ఒకచోట చేరి ఈ ఆటలు ఆడతారు. ఎవరు వీటిని తక్కువ సమయంలో ఎక్కువ దూరం విసురుతారో వారు పందెంలో గెలిచినట్టు ఆరుగాలం పండించిన పంట చేతికొస్తుంది. చేతిలో డబ్బులాడతాయి. అప్పటిదాకా సరదాలు సంతోషాలు తెలియని రైతులు సంక్రాంతికి మాత్రం రకరకాల పందేలు కాచి సరదాలు తీర్చుకుంటారు.
సంక్రాంతి
హరిదాసులు ఉదయాన్నే ఆధ్యాత్మిక రాగాలను పలికి పొతే..
పట్టు పరికిణీల్లో పల్లె పడుచులు
రంగవల్లికల సరాగాలు వల్లిస్తుంటే..
డూడూ బసవన్నలు గొబ్బెమ్మల దగ్గర తలలు ఊపుతుంటే..
ఒక పక్క భోగి మంటలు.. మరో పక్క కోడిపందాల జోరు...
పిండివంటల గుబాళింపు ఒకవైపు.. బావ, మరదల సరసాలు మరోవైపు..
ఉరుకులాడుతున్న పిల్లగాళ్ళ సందడి ఇంకోవైపు..
సంక్రాంతి పండుగకు ఎన్నో కోణాలు.. మరెన్నో వర్ణాలు.
మూడు రోజుల పండగ.. ముచ్చటైన పండగ..
ఆత్మీయత పంచే.. సంక్రాంతి పండగ..
భోగిమంటలు
కష్టాలను కాల్చివేసే భోగి మంటలు..
భోగాలను అందించే భోగి పళ్లు..
కొత్త అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు..
బరిలో పోరుకు సిద్ధమైన కోళ్లు..
తెలుగు లోగిళ్ల రంగవళ్లులు...
వాటిని వేసి మెరుగుదిద్దే ఆడపడుచులు..
హరిదాసు కీర్తనలు..
పిండివంటలు..కొత్త బట్టలు..
ఇంకెన్నెన్నో సంబరాలు..
ఆత్మీయత అనురాగాలు...
పండగ సంబరం..
సూర్యుడి మకర సంక్రమణం..
సంక్రాంతి పండగ సంబరం..
అంబరాన పతంగుల విహారం..
అవనిపైన కోళ్ల పందేల సమరం..
ముంగిళ్లలో రంగవళ్లుల హారం..
గుమ్మాలతో మామిళ్ల తోరణం..
హరిదాసుల మధుర సంగీతం...
బసవన్నల సుందర నాట్యం..
పల్లెసీమల పైరుల అందం..
కొత్త అల్లుళ్ల సరదాల వినోదం...
గుర్తుండిపోయే ప్రతీ జ్ఞాపకం..
నెమరేసుకో మిత్రమా..మరో వసంతకాలం..
జీవితపు సంక్రాంతి
పొగలాంటి మంచు...
వెచ్చనైన భోగిమంటలు..
అందమైన రంగవల్లులు..
విమానాలతో పోటీపడే గాలిపటాలు..
అందరినీ ఊరించే ఘుమఘుమలు..
పచ్చనైన వరి పంటలు..
పట్టు వస్త్రాలతో పిల్లలు.
బంధువుల మాటల్లో మునిగిన పెద్దలు..
మధ్యమధ్యలో గొబ్బెమ్మల పాటలు..
ఆ మధ్యలో బసవన్నల సయ్యాటలు..
ఇదే అందరి జీవితాల్లో
కాంతి నింపే 'సంక్రాంతి'
ముగ్గుల పండుగ
సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ, నెల మొదలు నుండే ఎలాంటి ముగ్గులు పెట్టాలి. ఎన్ని చుక్కల ముగ్గులు పెట్టాలి. వాటికి ఏయే రంగులద్దాలి? అమ్మాయిల మది ఇలాంటి ఆలోచనలతో నిండిపోతుంది. మా వీధిలో అందరికన్నా పెద్ద ముగ్గు నేనే వేయాలి. అందరి ముగ్గు కన్నా నా ముగ్గే బావుండాలి. ఎన్ని ఆశలు. ఎంత స్వార్థం. ఎవరైనా నీ ముగ్గు బాగుంది అని పొరపాటున అన్నారనుకో... ఇక ఒలంపిక్స్‌లో బంగారు పతకం వచ్చినంత ఆనందం. అయినా ఒలంపిక్‌లో ముగ్గుల పోటీ కూడా చేరిస్తే బాగుంటుందేమో! అందులో మన తెలుగు అమ్మాయిలకే అన్నీ పతకాలు. ముగ్గులు పెట్టడంలో మన వారిది అందె వేసిన చెయ్యి కదా! ఈ పప్పులన్నీ ఉడకాలంటే ఊరిలో ఉండాలి. మాస్టర్ డిగ్రీ తీసుకొని ఉద్యోగాల వేటకోసం అమీర్‌పేట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే అమ్మాయిలు... ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం బెంగుళూర్లో బస చేస్తున్న యువతులు... వీరి పరిస్థితి ఏమిటి. కాంక్రీట్ జంగిల్ నివాసంలో ముగ్గులు పెట్టే స్థలం ఎక్కడ. అంత సమయమెక్కడ. అందుకే సంక్రాంతికి ఊరు వెళ్లాలి. ఉన్న మూడు రోజులు అమ్మకు అసలు అవకాశం ఇవ్వకూడదు. ఇంటి ముందు పెద్ద పెద్ద చుక్కల ముగ్గు పెట్టాలి. రథం ముగ్గు వేయాలి. అమ్మ లంగాఓణీ కట్టుకోమంటుంది. నానమ్మ చీర కట్టుకోమంటుంది. అమ్మ, నానమ్మ ఇద్దరి మాట వినాలి. ఉదయం లంగా ఓణీ, సాయంత్రం చీర. సరిపోతుంది. పెరటిలో ఉన్న కనకాంబరం చెట్లు తనకోసమే దాచిన పూలన్నీ తలలో తురమాలి. స్నేహితురాళ్లతో సరదా కబుర్లాడాలి. ఊరిలో పెట్టే ముగ్గుల పోటీలో పేరు ఇవ్వాలి. సాయంత్రం పూట నిర్వహించే కుర్చీలాటలో పాల్గొనాలి. బహుమతులన్నీ గెలుచుకోవాలి. అవన్నీ వచ్చే ఏడాది వరకూ తీపి చిపెట్టుకోవాలి.
మధుర సంక్రాంతి
పడిగాపులుగా వేచిన పల్లె పసిపాపల్లే నవ్వెను చూడు..
తిరిగి వచ్చు తమవాళ్లను చూడ తహతహలాడే తనువులు చూడు..
వెలవెలబోయి వీధుల్లోన డూడూ బసవన్నల సందడి చూడు..
బోసిపోయిన ముంగిలిలోన నిండుగ వెలిసిన ముగ్గులు చూడు..
దూరాలన్నీ చేరువ కాగా పుట్టిల్లు చేరిన మగువలు చూడు...
నెత్తురు చెమటగా చిందిన రైతుకు ధాన్యం తెచ్చిన ధైర్యం చూడు..
బతుకున చీకట్లను తరిమేసే భోగిమంటల వెలుగులు చూడు..
మధుర స్మృతులను మనకు పంచే మకర సంక్రాంతిని చూడు..
Sun 15 Jan 03:46:38.986174 2023