ప్రకృతి ప్రకోపానికి ఓ వైపు ప్రజల పరుగులు, మరోవైపు అంబులెన్స్ సైరన్ల మోతలు, ఇంకోవైపు తమవారిని కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్న బాధితులు, ఇవి ఇటీవల భూకంపం సృష్టించిన భయానక దృశ్యాలు. కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ భూకంపాలు అలజడి సృష్టిస్తున్నాయి. గతేడాది అఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించి వెయ్యి మందికి పైగా మృతి చెందారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఆ పెను విషాదం మరువక ముందే తాజాగా టర్కీ, సిరి యాలో ప్రజలు గాఢనిద్రలో ఉండగా మరో భారీ భూకంపం పెను విషాధాన్ని మిగిల్చింది. దాదాపు 20వేల మంది చనిపోయినట్టు అంచనా. ఇప్పటివరకు శవాల లెక్కల్లోనే అధికారులు నిమగమయ్యారు. భూకంపాలు మానవాళి ఉనికికే ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరమున్నది. భూకంపాలు ఎందుకొస్తాయి? వాటిని అరికట్టలేమా? ముందే పసిగట్టే సాంకేతికత ఉందా? భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై ఆదివారం అనుబంధం 'సోపతి' అందిస్తున్న కవర్ స్టోరీ..
భూమి ఉపరితలం ఆకస్మికం గా కదలడాన్నే భూకంపం అంటారు. భూ అంతర్భాగంలో కలిగే అత్యంత శక్తిమంతమైన అలజడుల ప్రభావం వల్లనే ఇది సంభవి స్తుంది. భూమి లోపలి ప్రకంపనలతో భూమి ఉపరితలంపై ఆకస్మికంగా ఏర్పడే విధ్వంసంగా దీనిని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికీ ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉంటుంది! ప్రతియేటా వేలాది మంది భూకంపాలకు బలవుతున్నారు. భూ ప్రకంపనలు రాగానే కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలి పోతుంది. పునాదులతో సహా కట్టడాలు కూలిపోతాయి. చెట్లు పడిపోతాయి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఇవి భూకంపాలు సృష్టించే విధ్వంసకర విపరీత పరిణామాలు. ఈ పరిణామాన్ని గమనించి ఆ విలయం నుంచి బయట పడటానికి మనకు ఏ మాత్రం అది అవకాశం ఇవ్వదు. ఎందుకంటే దాని ధాటికి రెప్పపాటులోనే అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే భూకంపం అనే పేరు వినగానే మనం ఒక్కసారిగా కంపించిపోతాం. మిగిలిన ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే భూకంపాల తీరు విభిన్నంగా ఉంటుంది. మిగిలినవన్నీ వచ్చే ముందు ఎన్నో కొన్ని సూచనలు మనకు అందిస్తాయి. మనం ఆ వైపరీత్యం నుంచి బయట పడటానికి కొంత అవకాశం ఇస్తాయి. మరి భూకంపాలు విషయంలో మాత్రం అలా కాదు. హఠాత్తుగా అవి విరుచుకు పడతాయి. విలయాన్ని సృష్టిస్తాయి. ప్రభావిత ప్రాంతం అంతటా కూడా క్షణాల్లోనే శిథిలాలను మిగులుస్తాయి. ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అందుకేమానవాళిని వణికించే అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాలుగా భూకంపాలును పేర్కొంటారు.
కారణాలు..
ఈ విశ్వంలో భూగ్రహం అంతా కొన్ని భూ ఫలకాల సమాహారం. భూమి మొత్తం నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇందులో ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్‌గా ఉంటాయి. క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్ని కలిపి లిథోస్పియర్ అంటారు. ఈ 50 కిలోమీటర్ల మందపాటి పొర అనేక భాగాలు విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. ఇవి.. భూమి లోపల ఏడు ఉంటాయి. సముద్రాల కింద ఉన్న కొన్ని ఫలకాలు, భూమి ఉపరితలంగా ఉన్న కొన్ని ఫలకాలు నిరంతరం భూమి అంతర్భాగంలో నెమ్మదిగా కదులుతూంటాయి. ఈ కదలికల వల్ల భూమి పొరల్లో నిత్యం సర్దుబాట్లు జరుగుతుంటాయి. ఒక్కో సారి చాలా చాలా చిన్నగా, ఒక్కోసారి ఓ మోస్తరుగా, ఒక్కోసారి ఎక్కువగా, ఈ సర్దుబాట్లు జరుగుతాయి. ఈ సమయంలో ఈ ఫలకాల మధ్య రాపిడి, ఒక దానిని మరొకటి ఢ కొట్టడం, ఒకదానిపైకి ఒకటి దూసుకు పోవడం కొనసాగుతూ ఉన్నప్పుడు వాటి మధ్య ఒత్తిడి అధికమై ఆ శక్తి పైకి ఎగదన్నుతూ వస్తుంటుంది. ఆ క్రమంలో భూమి లోపలి రాళ్లు బీటలు వారతాయి, బీటలు వారినప్పుడు ఏర్పడిన ఖాళీల్లోంచి అనంతమైన ఒత్తిడి కలిగి పెను శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి భూమి ఉపరితలానికి కంపనాల రూపంలో పైకి ఎగతన్నుతుంది ఇలా శక్తి పైకి ఎగతన్నుకు రావడమే భూకంపం. అగ్నిపర్వతాలు పేలడం, ఉల్కలు భూమిపై పడటం కొత్తగా ఉద్భవిస్తున్న పర్వతాల వల్ల, గనులు కూలడం, సొరంగ మార్గాల పైకప్పులు కూలడం, అణ్వస్త ప్రయోగాలు చేపట్టడం, కొండ చరియలు విరగడం,వంటి కారణాలు వల్ల కూడా భూ కంపాలు సంభవిస్తాయి.భూ దక్షిణార్ధ గోళం వైపుకన్నా ఉత్తరార్ధగోళంలోనే ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. అయితే.. చాలా భూకంపాలకు కారణం భూమి లోపలి పలకల్లో వస్తున్న కదలికలే కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు భూగర్భంలో ఫలకాల సర్దుబాటు పూర్తయ్యేవరకు ఈ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. ఈ ప్రకంపనలు భూమిపై మాత్రమే కాదు సముద్రంలో కూడా సంభవిస్తూ ఉంటాయి. సముద్రంలో సంభవించే ప్రకంపనలను సునామీ అని పిలుస్తూ ఉంటాం. ఇటువంటి సునామీ తీర ప్రాంతం అంతటినీ ముంచేస్తుంది. సమత్రా, జపాన్ భూకంపాలు వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదే అగ్ని పర్వతాలున్న చోట్ల ప్రకంపనలు వస్తే అదీ కూడా భయానకమే. భూమిపై సముద్రంలో అగ్ని పర్వతాలు ఉన్న చోటా ఇలా ఎక్కడ ఈ ప్రకంపనలు వచ్చినా చివరకు తీవ్ర నష్టాన్నే మిగులుస్తాయి. భూకంపాలు అనేవి భూ గ్రహంపైనే కాకుండా ఇదే తరహా కంపాలు ఇతర గ్రహాలు, ఉప గ్రహాలపై కూడా తప్పవని అంతరిక్ష శాస్త్రజ్ఞులు అంటున్నారు. చంద్రుడిపై కూడా ఇవి నమోదవ్వడాన్ని వారు గుర్తించారు. చందమామపై సంభవించే కంపనాలను 'మూన్ క్వేక్స్' అని పిలుస్తున్నారు.
రింగ్ ఆఫ్ ఫైర్..
పసిఫిక్ మహాసముద్రం బేసిన్లో 40 శాతం కంటే ఎక్కువ భూఉష్ణ శక్తి వనరులను కలిగి ఉన్న ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇది అగ్నిపర్వత బెల్ట్. ఇక్కడ పెద్ద సంఖ్యలో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సాక్షులుగా ఉన్నాయి. దీనిని 'సర్కమ్-పసిఫిక్ బెల్ట్' అని కూడా అంటారు. ఇక్కడే పదే పదే భూకంపాలు సంభవిస్తాయి. ఇది 40 వేల కి.మీ. మేర విస్తరించి ఉంది. భూమి చుట్టూ ఉండే ఈ రింగ్ వంటి ప్రాంతంలో.. 452 అగ్ని పర్వతాలు ఉన్నాయి. అందుచే ఈ ప్రాంతాన్ని అగ్నివలయం అంటారు. ప్రపంచంలోని అగ్ని పర్వతాల్లో 75 శాతం ఈ రింగ్ దగ్గర్లోనే ఉన్నాయి. వీటి వల్లనే 80 శాతం భూకంపాలు ఈ ప్రాంతంలోనే వస్తున్నాయి అనేది నిరూపితం అయ్యింది. 20వ శతాబ్దంలోని మొదటి 60 ఏళ్లలో ఎక్కువ భూకంపాలు ఇక్కడే వచ్చాయి. 8.5 కన్నా ఎక్కువ తీవ్రతతో 7 భూకంపాలు ఈ ప్రాంతంలోనే వచ్చాయి. భూకం పాలు అనేవి ఒక ప్రాంతానికి చెంది ఉండవు. ప్రపంచం అంతా ఇవి విస్తరిస్తాయి. వీటికి సరిహద్దు అంటూ ఏదీలేదు. కానీ ఈ భూ కంపాలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యస్తంగా ఇంకొన్ని ప్రాంతాల్లో అల్పంగా సంభవిస్తున్నాయి. భూకంపాలు ఎక్కువ సంభవించే న్యూజిలాండ్‌కు దగ్గరలో ఉన్న ఆస్ట్రేలియాకు మాత్రం భూకంపాల బెడద లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఖండం భూమి అడుగు భాగంలో కంపనాలు ప్రయాణించే భ్రంశాలు లేవు. అందుచేతనే ఆస్ట్రేలియా ఖండాన్ని భూకంపాలు సంభవించని ప్రాంతంగా పేర్కొంటారు. జపాన్ను మాత్రం అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతంగా గుర్తించారు. అందుచేతనే జపాన్ దేశాన్ని భూకంపాల దేశం అని పిలుస్తారు. మొత్తం మీద ప్రపంచంలో ఏడాదికి 10 లక్షల వరకు భూకంపాలు సంభవిస్తున్నట్లు అంచనా వేశారు. వీటిలో గమనించలేని తీవ్రతలో వచ్చిన భూకంపలే ఎక్కువ. అంతేకాదు ఎక్కువ శాతం సముద్ర గర్భాల్లోనే సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. భూ స్వభావాన్ని బట్టి భూకంపాలు సంభవించే అవకాశాలు ఉంటాయని మొట్ట మొదట సూత్రీకరించింది అరిస్టాటిల్. రెండువేల ఏండ్ల క్రితం చైనా పరిశోధకుడు జాంగ్హెంగ్ తొలిసారి ఎర్త్‌క్వేక్ డిటెక్టర్‌ను కనుగొన్నాడు. దాదాపు ఆరువందల కిలోమీటర్ల ఆవల సంభవించే భూకంపాలను కూడా అది గుర్తించగలదు. 1935లో అమెరికన్ పరిశోధకుడు చార్లెస్ రిక్టర్ భూకంపాన్ని కొలిచే 'రిక్టర్ స్కేల్' రూపొందించారు.
భూకంపం స్కేళ్లు...
భూకంపాలు కొలవడానికి అనేక రకాల స్కేళ్ళు అమలులోనికి వచ్చాయి. వీటిలో ప్రాన్స్‌లో అభివృద్ధి చేసిన రోసీ ఫారల్ స్కేలు, జపాన్‌లో అభివృద్ధి చేసిన షిండే స్కేలు ఇటలీలో రూపొందించిన మెర్కిలీ స్కేలు ఉన్నప్పటికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్త చార్లెస్ రూపొందించిన రిక్టర్ స్కేలుకు విశేష ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం భూకంపాలను ఈ స్కేల్ ఆధారంగానే లెక్క కడుతున్నారు. భూకంప తీవ్రతను.. రిక్టర్ స్కేల్‌పై కొలుస్తారు. భూకంపం సంభవించినప్పుడు.. ఆ సమయంలో భూమి లోపలి నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి.. భూకంపాన్ని కొలుస్తారు. ప్లేట్ల కదలిక కారణంగా భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి.. కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది. భూ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్‌పై 7 కంటే ఎక్కువ తీవ్రత నమోదైతే.. భూకంపం సంభవించిన 40 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు సంభవిస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 3 కంటే తక్కువగా నమోదయ్యే భూకంపాలు దాదాపు ప్రతిరోజూ సంభవిస్తుంటాయి. అవి సంభవించినట్లు కూడా ఎవరికీ తెలియదు. రిక్టర్ స్కేల్‌పై 3.0 కన్నా ఎక్కువ స్థాయిలో నమోదయ్యే భూకంపాలు ఏడాదికి కనీసం 8000 సంభవిస్తూ ఉంటాయి. అంతకన్నా తక్కువస్థాయి భూకంపాలు వందలకొద్దీ వచ్చిపోతున్నా వాటి ప్రభావం ఎక్కడా కనిపించదు. వీటినే సేఫ్ భూకంపాలు అంటారు. అతి సూక్ష్మ తీవ్రత గల ఈ ప్రకంపనల వల్ల ఆస్తినష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగదు. రిక్టర్ స్కేల్‌పై 3-5 వరకు నమోదయ్యే భూకంపాలను స్వల్పస్థాయి నుంచి ఒక మోస్తరు భూకంపాలుగానే పరిగణిస్తారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5-7 వరకు ఉంటే ఒక మోస్తరు నుంచి తీవ్ర భూకంపాలుగా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా, 7-8 వరకు నమోదయ్యే భూకంపాలను పెను భూకంపాలుగా పరిగణిస్తారు. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏడాదికి ఒకటైనా పెను భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి పెను భూకంపాల కారణంగానే భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లుతాయి. ఇప్పటి వరకు రిక్టర్ స్కేల్‌పై 10 వరకు నమోదైన భూకంపం ఒక్కటైనా సంభవించలేదు. అలాంటిదే సంభవిస్తే, అప్పుడు వాటిల్లే నష్టాన్ని ఊహించడమే అసాధ్యం.
మన దేశంలో భూకంప మండలాలు
మన దేశంలో భూకంపం తీవ్రత ఆధారంగా 5 జోన్లుగా విభజించారు. అయితే1997లో వల్నరబులిటీ అట్లాస్ ఆఫ్ ఇండియా... భూకంప జోన్ ఒకటిని రెండో జోన్లో విలీనం చేసి రెండో జోన్‌గా పేరు మార్చింది. అందువల్ల ప్రస్తుతం మన దేశంలో భూకంప జోన్లు నాలుగు మాత్రమే ఉన్నాయి. వీటిలో 5వ జోన్ అత్యంత తీవ్ర భూకంపాలు సంభవించే జోన్‌గా గుర్తించగా రెండో జోన్‌ను తక్కువ భూకంప తీవ్రత కలిగిందిగా గుర్తించారు.
జోన్ 5 : ఈశాన్య భారతదేశం, ఉత్తర బిహార్, పశ్చిమ, మధ్య హిమాలయ ప్రాంతం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ (కాంగ్రా), గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకశ్మీర్ ప్రాంతాలు.ఈ జోన్ అత్యంత తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతం.
జోన్ 4 : గంగా, సింధూ మైదానం, న్యూఢిల్లీ, శ్రీనగర్, సిక్కిం, అమృత్సర్, జలంధర్. ప్రాంతం.
జోన్ 3 : లక్షదీవులు, కేరళ, గుజరాత్, ఏపీ తీర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, నర్మదా నది పగులు లోయ, రాజస్థాన్ పశ్చిమ సరిహద్దు, మహారాష్ట్ర, తూర్పు, పశ్చిమ కనుమల ప్రాంతాలు. మన దేశంలో ఎక్కువ భాగం ఈ జోన్లోనే ఉంది.
జోన్ 2 : తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యభారత్, గుజరాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, కర్ణాటక, దక్కన్ ప్రాంతం, రాయపూర్, రాంచీ, జైపూర్ ప్రాంతాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ జోన్లోనే ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (దీ×ూ) రూపొందించిన భూకంప మండల మ్యాప్ ప్రకారం చూస్తే మన దేశంలో 65 శాతానికి పైగా భూభాగం 7, అంతకు మించిన తీవ్రతతో భూకంపాలు సంభవించే ముప్పును కలిగి ఉందని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో..
విశాఖపట్నం, హైదరాబాద్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు నిపుణులు ప్రకటించారు. విశాఖపట్నంలో అయితే గత 200 ఏండ్లలో 7 సార్లు మాత్రమే ప్రకంపనాలు వచ్చాయి. అయితే అవన్నీ అత్యంత స్వల్పమైనవని కాబట్టి విశాఖకు రానున్న రోజుల్లో కూడా తీవ్రతతో కూడిన భూకంపాలు వచ్చే అవకాశం లేదని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలాగే హైదరాబాద్ కూడా సురక్షితమైనదే అంటున్నారు. గత 55 ఏండ్ల్లుగా హైదరాబాద్ ఉప్పల్‌లోని ఎన్జీఆర్ఐ భూకంప క్షేత్రంలో ఏర్పాటు చేసిన యంత్రాలలో నమోదైన రికార్డులు అధ్యయనం చేయగా పెద్దగా చెప్పుకోదగ్గ భూకంపాలు నమోదు కాలేదు.
మేడ్చల్‌లో మాత్రం 1985లో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదయ్యింది. అయితే బోరబండలో భూ ప్రకంపనలు కొత్తేమీ కాదు. 2017 నుంచి ఇప్పటి వరకు బోరబండలోనే దాదాపుగా 135 సార్లు ప్రకంపనలు వచ్చాయి. అవి కేవలం 0.5, 0.2 మధ్యలోనే వచ్చాయి. 1995-96లో కూడా జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ప్రకంపనలే వచ్చాయి. బోరబండలోనే భూప్రకంపనలు రావడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. ఇక్కడ భూమి పొరల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండటమే కారణమని చెబుతున్నారు. వర్షా కాలంలో అత్యధిక వర్షపాతం నమోదైనందున భూ పొరల్లో కూడా ఒత్తిడి, సర్దుబాట్లు వచ్చి ఇలాంటి ప్రకంపనలు వస్తున్నాయని వీటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మానవ తప్పిదాలే కారణాలు...
భూ భౌతిక పరిణామ ప్రభావాల వల్ల భూమి అంతర్గత పొరల్లో ఏర్పడే కదలి కలు, అగ్నిపర్వతాలలో తలెత్తే మార్పుల ప్రభావం వల్లనే భూకంపాలు సంభవిస్తు ఉంటాయి. కారణం ఏమిటంటే వాతా వరణ కాలుష్యం, కారణంగా పెరుగుతున్న భూ తాపం వంటివి భూమి లోలోపలి పొరలపై సైతం తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారణ కొచ్చారు. అడవుల నరికివేత, వాహన కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు వంటివి పర్యావరణంపై ప్రతికూల ప్రభావానికి కారణమవు తున్నాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులకు దోహద పడుతు న్నాయి. ఇవన్నీ వరదలకు, సముద్ర మట్టాలు పెరగడానికి దారితీసి భూ లోలో పలి పొరల్లో సాగే అలజడిని మరింత వేగవంతం చేయడం ద్వారా భూకం పాలకు కారణభూతం అవుతున్నాయి. దీనితో పాటు విచ్చలవిడిగా గనుల తవ్వకం కూడా భూకంపాల ఆవిర్భావానికి ప్రధాన కారణంగా నిలిచింది భూగర్భంలో ఖనిజాలు కోసం గనులు తవ్వి వాటిని పూడ్చి పెట్టకుండా అలాగే వదిలి వేసిన సందర్భాలలో అవి కుప్పకూలి స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. దానితో పాటు భూగర్భంలో అణు పరీక్షలు నిర్వ హించడం వల్ల కూడా భూకంపాలు సంభ విస్తాయనే నివేదికలు ఉన్నాయి. భారీ డ్యాముల వెనుక నిలువ చేసిన వందలాది ఘనపు మైళ్ల భారీ నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. మహారాష్ట్రలోని కోయినా డ్యామ్ వద్ద 1967లో ఏర్పడిన భూకంపం ఇలాంటిదేనని నిర్థారణ అయ్యింది. దీనితో పాటు భూగర్భ జలాన్ని ఎక్కువ దుర్వినియోగం చేయడం ద్వారా కూడా భూ ప్రకంప నలకు దారి తీస్తాయని భూగర్భ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తెలి పారు. ఇటువంటి మానవ ప్రమేయలే భూ కంపాలకి అదనపు బలంగా మారుతోంది. వాస్తవంగా చెప్పాలంటే భూకంపాల కారణంగా ఎవరూ మరణిం చరు. ప్రమాణాలు పాటించని బహుళ అంతస్తుల భవనాల కారణంగానే మరణి స్తారనేది సత్యం. భూకంపాలు సంభవించి నప్పుడు భారీ భవనాలలో కాకుండా, ఆరు బయట ఉన్నవారు సురక్షితంగా బయట పడతారు. భూకంపాలను తట్టుకునే రీతిలో భవనాలను నిర్మించకుండా పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాల నిర్మా ణాలకు అధికారులు అనుమతులివ్వడం కారణంగా భూకంపాల సమయంలో ఎక్కువ ప్రాణనష్టం జరుగుతూ ఉంది.
30 సెకన్ల ముందే...
ప్రపంచంలో తీవ్ర భూకంపాలు ఎక్కడ వచ్చినా కూడా అవి భయానక విపత్తును సృష్టిస్తున్నాయి. ఫలితంగా ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారు. ఆస్తి నష్టం తక్కువేం కాదు. అయితే ఈ విపత్తును తుఫాన్ల వలె ముందుగా గుర్తించగలిగితే ప్రాణ నష్టం జరగకుండా బయట పడవచ్చు. అయితే అటువంటి అత్యాధునిక వ్యవస్ధ ఇంతవరకూ లేదు. అయితే ఆధునిక పరిశోధనలు ఫలితంగా కొన్ని దేశాల్లో 30 సెకన్ల ముందే భూకంపాల రాకను గుర్తించే వ్యవస్ధ ఉంది. మన దేశంలో మాత్రం చాలాకాలం వరకూ భూకంపాల రాకను తెలుసు కోవడానికి ఉపయోగించే పరిజ్ఞానం కేవలం ప్రాథమిక ప్రకంపనలు గుర్తించేదిగా మాత్రమే అందుబాటులో ఉంది. అయితే నేడు అభివృద్ధి చెందిన దేశాలకు అందుబాటులో ఉన్న 30 సెకన్ల లోపు భూకంప రాకను గుర్తించే అత్యాధునిక 'వార్నింగ్ అండ్ సెక్యూరిటీ' వ్యవస్థను త్వరలో మన దేశంలోనూ ఏర్పాటు చేయడానికి భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. జర్మనీకి చెందిన 'సెక్టీ ఎలక్ట్రానిక్స్' కంపెనీ ఈ సాంకేతికను అభివృద్ధి చేసింది. ఇప్పటికే దాదాపు 25 దేశాలు ఈ టెక్నాలజీని అమలులోనికి తీసుకు వచ్చాయి. ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. దీనిలో భాగంగానే మన దేశానికి కూడా సెక్టీ ఎలక్ట్రానిక్స్' కంపెనీ ఇండియన్ పార్టనర్ 'టెర్రా టెక్కామ్ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా భారత్‌కు సాంకేతికతను అందించడానికి ముందుకు వచ్చింది.ఈ విధమైన అధునాతన సాంకేతికతను ఉపయోగించే 2010లో చిలీలో వచ్చిన భూ ప్రకంపనలను 'ఎర్త్‌క్వేక్ వార్నింగ్ అండ్ సెక్యూరిటీ'గా పిలిచే అధునాతన సాంకేతికత ద్వారా 30 సెకన్ల ముందు కనుగొని అక్కడ అపార ప్రాణ, ఆస్తి నష్టాలను నియంత్రించగలిగారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇంతకుమించిన ఆధునిక వ్యవస్థలేదనే భావిస్తున్నారు. ఎలక్ట్రిక్, ఎనర్జీ వ్యవస్థలను నష్టపోకుండా కాపడవచ్చు. బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు వచ్చే ఏర్పాటు చేయవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కడైతే భూకంపం వచ్చే ప్రమాదం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా వైర్ లెస్ ద్వారా ప్రమాద హెచ్చరికలను అలారం ద్వారా తెలియచేసినట్లయితే వెంటనే అప్రమత్తమై భారీ నష్టం నుండి బయటపడే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడా ముందుగానే భూకంపాలను కచ్చితంగా ఊహించే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం నేటికి రూపకల్పన జరగలేదని శాస్త్రవేత్తల అభిప్రాయం.
తీవ్ర భూకంపం వచ్చినప్పుడల్లా శాస్త్రవేత్తలు చేసే హెచ్చరికల భయం ప్రపంచాన్నే వణికించేస్తుంది. అయితే ఆ తర్వాత నిర్లక్ష్యం అనేది షరామామూలే. ఇప్పటికైనా కట్టడాల నిర్మాణం విషయంలో, పర్యావరణాన్ని పాడుచేస్తున్న విషయంలో ప్రతి ఒక్కరూ ఆచితూచి వ్యవహరిస్తే.. భూకంపాల్ని నివారించ లేకపోయినా, భూకంపాల కారణంగా వచ్చే నష్టాన్ని మాత్రం కచ్చితంగా కట్టడి చేయగలం.
ముందే హెచ్చరించిన ఫ్రాంక్ హుగర్ బీట్స్
అయితే తాజాగా సంభవించిన టర్కీ, సిరియా భూకంపం గురించి సరిగ్గా మూడు రోజుల ముందే నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే సంస్థ సైంటిస్ట్ ఫ్రాంక్ హూగర్ బీట్స్ హెచ్చరించారు. త్వరలో టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ సరిహద్దు ప్రాంతాలలో రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూకంపం రాబోతోందంటూ ఆయన ఫిబ్రవరి 3న సాయంత్రం 5.30 గంటలకు ట్వీట్ చేశారు. అందులో భూకంపం వచ్చే అవకాశాలున్న దేశాలను పాయింట్ చేస్తూ ప్రత్యేక మ్యాప్‌ను కూడా అటాచ్ చేశారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేశానని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఆయన ట్వీట్‌ను అందరూ ఎగతాళి చేశారు.. నవ్వారు.. నువ్వేమైనా జోతిష్యుడివా?ఎందుకు అలా చెడును కోరుకుంటున్నావు అంటూ ఫ్రాంక్హూగర్ బీట్స్‌ను నెటిజెన్లు ప్రశ్నించారు. గతంలో ఆయన చెప్పిన హెచ్చరికలు నిజం కాలేదని నిర్లక్ష్యం చేశారు.చివరకు ఆయన చెప్పిందే నిజమవడంతో.. ఇప్పుడు ఆ సంచలన ట్వీట్‌పై చర్చ జరుగుతోంది. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా ఆయన చేసిన పరిశోధనపై మరింత అధ్యయనం చేయాలనే చర్చ నేడు ప్రపంచంలో వేగమైంది.భూకంపాలు సంభవించి నప్పుడు ముందుగానే అలర్ట్ చేసేందుకు ఈ యాప్ కాలిఫోర్నియా, బెర్కెలీ యూనివర్సిటీ శాస్త్ర వేత్తలు మై షేక్ పేరిట సరికొత్త మొబైల్ యాప్‌ను రూపొందించారు. కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవిస్తే వెంటనే మొబైల్ యాప్ నుంచి మనం విషయాన్ని పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి, పగలు అనే లేకుండా సిగల్స్ ఇవ్వడం ఆ యాప్ ప్రత్యేకత. ఈ మధ్యచిలీ, అర్జెంటైనా, మెక్సికో, జపాన్, తైవాన్, న్యూజీలాండ్, నేపాల్, మొరాకో, ఇతర దేశాలలో భూకంపాలు సంభవించినప్పుడు మై షేక్ యాప్ మెరుగైన పని తీరు కనబరచినట్లు శాస్త్రవేత్తలు సంతప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో చేసిన సెన్సార్ ఉన్న స్మార్ట్ఫోన్లలో మైషేక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చని చెప్పారు.
జంతువులు గుర్తిస్తాయి..!
భూకంపం రాబోతోందని మనుషులు గుర్తించలేరు గానీ.. జంతువులు, పక్షులు, చేపలు, సరీసపాలు, కీటకాలు గుర్తించగలవనే అభిప్రాయాన్ని చాలా మంది సమర్దిస్తున్నారు. కొన్ని జీవులు.. ఈ ప్రమాదాన్ని కొన్ని వారాల ముందే పసిగడతాయిని కొన్ని జీవులు అయితే సెకండ్ల ముందు గ్రహిస్తాయని,. భూకంపం రాబోతోందని తెలియగానే అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని. భూకంప తరంగాలను అవి ముందే గుర్తిస్తాయి అనేది ఎక్కువ ప్రచారంలో ఉంది. అయితే దీనికి శాస్త్రీయ నిరూపణ విషయంలో అనేక వాదోప వాదాలు కూడా ఉన్నాయి.చాలా రకాల జీవజాతులకు భూకంపాలను గుర్తించే శక్తి ఉందని జీవశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. 'జర్నల్ ఆఫ్ జువాలజీ' అధ్యయనం కూడా కుక్కలు, ఎలుకలు, కోళ్లు మొదలైనవి భూకంపాలను ముందు గానే గుర్తిస్తాయని నిర్దారించింది.ఇదే అధ్యయనం ప్రకారం కప్పలు భూకంపాలను ముందుగానే గ్రహించి, దాని ప్రభావం నుంచి తప్పించు కోవడానికి దూరంగా ప్రయాణం ప్రారంభిస్తాయని పేర్కొంది. దీనిని సమర్థిస్తూ కొంత కాలం క్రితం బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ జంతువులు ముందుగానే భూకంపాలు గుర్తిస్తాయి అనే విషయంపై చేసిన అధ్యయనం అందరినీ ఆలోచింప చేసింది. ఈయన పరిశోధనకు పెరూలోని యనచాగ జాతీయ పార్క్‌లో ఏర్పాటుచేసిన కెమెరాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని కాంటమానాలో 2011లో రెక్టర్ స్కేల్‌పై 7 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం వచ్చింది. ఆ కాలానికి సంబంధించి జాతీయ పార్కులోని కెమెరాలు తీసిన దశ్యాలను డాక్టర్ రాచెల్ గ్రాంట్ లోతుగా అధ్యయనం చేశారు. పెను భూకంపానికి 23 రోజుల ముందు నుంచే జంతువుల ప్రవర్తనలో వచ్చిన మార్పులను ఆయన గ్రహించారు. 15 రోజుల ముందు వాటిలో కలకలం రేగింది. సరిగ్గా ఆ భూకంపానికి ఐదు రోజుల ముందు అవి ఎలాంటి కదలికలు లేకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. అంటే అప్పటికే ఓ ప్రళయం రాబోతుందన్న స్పహ వాటికి కలిగిందన్నమాట. భూ కంపాలను జంతువులు ముందుగానే గుర్తిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
- రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578
Sun 12 Feb 05:38:21.022967 2023