ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న మనం మన దేశంలో 'నేషనల్ సైన్స్‌డే' (NSD) నిర్వహించుకుంటున్నాం. అదే రోజు మన శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ దేశానికే కాదు, మొత్తం ఆసియా ఖండానికే తొలి నోబెల్ బహుమతి తీసుకొచ్చారు. దానితో భారతీయ వైజ్ఞానిక ప్రతిభ విశ్వవ్యాప్తమైంది. ఆయన తన పరిశోధనల్ని 'రామన్ ఎఫెక్ట్' పేరుతో 28 ఫిబ్రవరి 1928న ప్రతిపాదించారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ దేశ ప్రజలలో వైజ్ఞానిక స్ఫూర్తి నింపడానికి ఫిబ్రవరి 28ని జాతీయ వైజ్ఞానికదినంగా నిర్వహించుకుంటున్నాం. అయితే సర్ సి.వి. రామన్‌కు నోబెల్ పురస్కార ప్రదానం 1930లో జరిగింది.
అధికారికంగా ఆ రోజును సైన్స్‌డేగా ప్రకటించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC) భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం 1986లో ఆమోదించింది. ఆ తర్వాత మొదటి సారి సైన్స్‌డే 28 ఫిబ్రవరి 1987న జరిగింది. ఆ తర్వాత ప్రతి ఏటా జరుగుతూనే ఉంది. కాల క్రమంలో దీనిలో కొన్ని మార్పులు జరుగుతూ వచ్చాయి. వైజ్ఞానిక విషయంగా ప్రతిభావంతంగా జనంలోకి తీసుకుపోయిన వారిని గుర్తించి,NCSTC మొదటిసారి 'నేషనల్స్ సైన్స్ : పాపులరైజేషన్ అవార్డు 1987 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది 28 ఫిబ్రవరిన కొనసాగుతుంది. ఇది కాకుండా దీనికి మరొక విషయం కూడా చేరింది. ప్రతి ఏడాది సైన్స్డేకు ఒక ఇతి వృత్తం (THEME) ఏర్పాటు చేసుకుని, దాని ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఆనవాయితీ అయ్యింది. CROP FOR DROP / WELTH FROM WASTE/ BLUE PRINT OF LIFE వంటి ముఖ్యమైన విషయాలపై కృషి జరిగింది. ఈ 2023 ఏడాదికి సంబంధించిన థీమ్ GLOBAL SCIENCE FOR GLOBAL WELL- BEING. అంటే విశ్వ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఏర్పరుచుకున్నది ఇది - సైన్స్ డే సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలు.. అవి ఏవంటే-
1. నిత్య జీవితంలో సైన్సు ప్రాముఖ్యతను గ్రహించే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలి.
2. మానవాభ్యుదయానికి ఉపయోగపడే వైజ్ఞానిక పథకాలకు రూపకల్పన చేసుకోవాలి.
3. సమాజంలో వైజ్ఞానిక అవగాహన పెంచడానికి కృషి చేసిన, చేస్తున్న వారి అభిప్రాయాలు తెలుసు కుంటూ ఉండాలి. వాటికి ప్రాధాన్యత కల్పించాలి.
సైన్స్ డే - పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయా లకు మాత్రమే పరిమితం కాదు. అన్ని పౌర సంఘాల్లో దీన్ని ఘనం గా జరుపుకోవాలి. దేశపౌరుల్లో ముఖ్యంగా బాలబాలికల్లో సైన్సు పట్ల ఆసక్తిని పెంచ డానికి దీన్ని ఉపయోగించు కోవాలి. సైన్స్‌డే సందర్భంగా ఉపన్యాసాలు, వైజ్ఞానిక ప్రదర్శ నలు, ఉరేగింపులు, పోటీలు మొదలైనవి నిర్వహించి, జనంలో అవగాహన పెంచగలగాలి!
ఎవరి పరిశోధనల్ని గుర్తించి, సగర్వంగా మనం 'నేషనల్ సైన్స్‌డే' నిర్వహించుకుంటున్నామో ఆ మహానుభావుడు, మహా శాస్త్రవేత్త, భారతరత్న సర్ సి.వి.రామన్ గురించి ఆయన మహోన్నత వ్యక్తిత్యం గురించి కూడా మనం ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం! ముఖ్యంగా నేటి యువతరానికి, బాలబాలికలకు ఆయన ఆదర్శప్రాయుడు. వారంతా ఆయన జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాల్సి ఉంది. ఇక్కడ నేను కొన్ని విషయాలు మాత్రమే పొందుపరుస్తున్నాను. వాటి ద్వారా ఆయన ఔన్నత్యాన్ని ఎవరికి వారే బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన వాడిగా చాలా మందికి తెలుసు. కానీ ఒక మహోన్నతమైన వ్యక్తిగా, జాతీయవాదిగా, దేశభక్తుడిగా చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. నేటి యువతీయువకులు, రాజకీయ నాయకులు స్వలాభం కోసం దేశాన్ని అమ్మడానికైనా సిద్ధపడే కుట్రదారులు, పైరవీకారులు, కార్పోరేట్లు, ఆధ్యాత్మిక గురువులు ఆయన జీవితం లోంచి ఎన్నో విషయాలు తెలుసుకుని ఆచరించాల్సి ఉంది.
వైజ్ఞానిక పరిశోధనా రంగంలో రాజకీయాల జోక్యం ఏ మాత్రం సహించని సి.వి. రామన్ బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - డైరెక్టర్ పదవి తనకు తానై వదులుకున్నాడు. హాలెండ్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ డైరెక్టర్ ఆహ్వానం వస్తే మర్యాదగా తిరస్కరించాడు. ఎందుకంటే జీవితాంతం తన సేవలు మాతృభూమికే అర్పించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు కాబట్టి! అలాంటి మరో అతి సున్నితమైన కారణం వల్లనే లండన్ రాయల్ సొసైటీ ఫెలోషిప్‌కు రాజీనామా చేశాడు. వీటన్నిటికంటే మరెంతో ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఆహ్వానం వస్తే ఆయన ఏ మాత్రం తొణకకుండా, బెణకకుండా వద్దు పొమ్మన్నాడు. బాధ్యతా యుతమైన ఒక శాస్త్రవేత్తగానే ఆయన ఉండదలిచాడు. రాజకీయాలు పరిపాలనా వ్యవహారాల మధ్య తనలోని శాస్త్రజ్ఞుడిని ఆయన అణగదొక్కదలచుకోలేదు. ఏ కొద్దిపాటి ఆసరా దొరికినా విదేశాలకు పరుగులు తీసేవారూ, ఏ చిన్నపాటి ఉన్నత పదవి లభిస్తుందన్నా నైతికంగా దిగజారేవారు ఇప్పుడు మన మధ్యే ఉన్నారు. జాతీయ స్థాయిలోనే దిగజారిన, దిగజారుతున్న వ్యక్తులు టి.వి. తెరల మీద చూస్తూనే ఉన్నాం. సి.వి. రామన్ నెలకొల్పిన జీవిత విలువలు, ఉన్నత ఆదర్శాలు కనీసం వీరు అర్థం చేసు కోగలరా? అని అనిపిస్తుంది. ఇక ఆచరణ దాకా ఎందుకూ?
ప్రాయోగిక విజ్ఞానం కేవలం తమకే సాధ్యమని యూరోప్ దేశాలు విర్రవీగుతున్న దశలో బ్రిటీష్ ఇండియాలోని ఒక భారతీయుడు, ఏ అవకాశాలు లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టినవాడు, నెలకు పది రూపాయల జీతంతో జీవితం వెళ్ళబోస్తున్న ఒక కాలేజి ట్యూటర్ సుపుత్రుడు విదేశాలలో పెద్ద చదువులు చదవకుండానే, పెద్ద పెద్ద ప్రయోగశాలలు చూడకుండానే తనకు తానుగా ఒక కాకలు తీరిన శాస్త్రజ్ఞుడిగా తయారై, నోబెల్ బహుమతి సాధించి, దేశంలో అనేక పరిశోధనా సంస్థలు స్థాపించి, సర్వస్వం దేశానికి ఆర్పించగలగడం కేవలం చంద్రశేఖర వెంకట రామన్ వంటి అద్భుత వ్యక్తులకు మాత్రమే సాధ్యపడుతుంది. తమిళనాడులో తిరుచునాపల్లి సమీపంలో 1888 నవంబర్ 7న పుట్టిన సి.వి. రామన్‌ను ప్రపంచం గొప్ప శాస్త్రవేత్తగా గౌరవించింది. అయితే ఆయనలో చిన్నప్పటి నుంచి ఒక భావుకుడు, ఒక కవి, ఒక సంగీతకారుడు, ఒక భాషావేత్త ఉన్న విషయం ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఆయనలో వీరందరూ ఉన్నారు కాబట్టే, వ్యక్తిగా ఆయనలో ఒక పరిపూర్ణత సిద్ధించింది. వివేచన, విశాల దృక్పథంతోనే ఆయన విశ్వ మానవుడయ్యాడు. సంగీతధ్వనులకు విపరీతంగా ప్రభావితుడయ్యే వాడు. లయలో పడి కొట్టుకుపోకుండా, వాటిని శాస్త్రీయంగా విశ్లేషించాలని అనుకునేవాడు. ఆ రకంగా ఆయన దృష్టి ధ్వని తరంగాల పైకి మళ్ళింది.
ఆ రోజుల్లో వారి కుటుంబం విశాఖపట్నానికి చేరింది. రామన్ చదువుకునే పాఠశాల సముద్ర తీరాన ఉండేది. తరగతిలోంచి చూస్తే, లేచిపడే సముద్ర కెరటాలు కనిపిస్తూ ఉండేవి. బాల్యంలో రామన్ సముద్రాన్ని తదేకంగా చూస్తూ ఉండేవాడు. అలా సి.వి. రామన్‌ను బాల్య దశలో విశాఖ సముద్రం ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ తర్వాత చాలాకాలానికి తన ముప్పయవయేట ఆక్స్ఫర్డ్డ్ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్నప్పుడు మధ్యధరా సముద్రపు నీటి రంగు - మళ్ళీ అతనిని మేల్కొలిపింది. నౌకాయానం చాలా మందికి విసుగ్గా ఉంటే, రామన్‌కు మాత్రం ఉత్సాహంగా, ఉత్కంఠభరితంగా సాగింది. ఎందుకంటే ఆయన నౌకనే ప్రయోగశాల చేసుకున్నాడు. డెక్ మీద నిలబడి ఆకాశాన్ని, చుక్కల్ని, నీలి సముద్రాన్ని తదేకంగా పరిశీలిస్తూ, వెంట తెచ్చుకున్న చిన్న చిన్న పరికరాలతో సముద్రపు నీటి నమూనాలు పైకి లాగి, ప్రయోగాలు జరిపి చూశాడు. అప్పటి ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త లార్డ్ రేలై - నీలాకాశపు ప్రతిబింబం సముద్రంపై పడడం వల్లనే సముద్రం నీలంగా ఉంది అని అన్నాడు. కానీ, అది సత్య దూరమని రామన్ నిరూపించగలిగాడు. సముద్రం స్వతహాగా తనంతటతానే నీలంగా ఉందని - రామన్ ఆ ప్రయాణంలో నిర్ధారించుకున్నాడు. అది 1921. తన భారతదేశం తిరిగి వెళ్ళాక, ఆ విషయంపైనే విస్తృతంగా పరిశోధనలు జరపాలని నిర్ణయించుకున్నాడు కూడా! అంతేకాదు, ఆ పని చేసి చూపించాడు. కేవలం ఆరేండ్ల కాలంలో అంటే 1927లో ''రామన్ ఎఫెక్ట్''ను ప్రపంచానికి ప్రకటించారు. రెండు మూడేండ్లు ప్రపంచవ్యాప్తంగా రామన్ ఎఫెక్ట్ మీద చర్చలు జరిగాయి. విశ్లేషణలు, పరిశీలనలూ జరిగాయి. విచిత్రం ఏమిటంటే, 1930లో నోబెల్ బహుమతులు ప్రకటించడానికి కొన్ని నెలల ముందే సి.వి. రామన్ స్టాక్ హోమ్ వెళ్ళి రావడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాడు. అదొక పిచ్చిపనిగా అనిపిస్తుంది గానీ, ఆయన ఆత్మవిశ్వాసం అలాంటిది! తెల్లవాళ్ళు ప్రాబల్యం ఎక్కువగా ఉన్నచోట ఒక నల్లవాడికి అందునా దక్షిణ భారతీయుడికి నోబెల్ రావడం అయ్యేపని కాదని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆయన తన అచంచల ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని ఉండడం సామాన్యమైన విషయమా?
కేవలం రికార్డుల కోసం కొందరు వెర్రిమొర్రి పనులెన్నో చేస్తుంటారు. కానీ, ప్రపంచ యువతీ యువకులెవరైనా సర్ సి.వి. రామన్ రికార్డులను అధిగమించగలరేమో పోలుకుని చూసుకోవచ్చు. ఆయన తన పదకొండవ యేట మెట్రిక్యులేషన్ ప్రధమశ్రేణిలో ఉత్తర్ణుడై మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. అప్పుడు అక్కడ పనిచేసే యూరోపియన్ ప్రొఫెసర్లంతా ఈ కుర్రవాడు పొరపాటున తమ క్లాసుకు వచ్చాడేమోనని భ్రమపడే వారు. ఆ తర్వాత ఆయన తన పద్దెనిమిదో యేట లండన్ నుంచి వెలువడే 'ద ఫిలసాఫికల్ మ్యాగజైన్' (1906)లో పరిశోధన పత్రాలు ప్రచురించాడు. అప్పటికి సి.వి రామన్ ఎం.ఎ.లో ఉన్నారు. తనకు ఇష్టమైన భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ, వెలుగు కిరణాల్ని కొలుస్తూ ఉండేవాడు. ప్రొఫెసర్ ఆర్.ఎన్. జూన్స్ - రామన్ ప్రశ్నలకు సమాధానాలివ్వలేక... నేచర్, ఫిలసాఫికల్ మేగజైన్ వంటి పత్రికలకు రామన్‌తో వ్యాసాలు రాయించి పంపిస్తూ ఉండేవాడు. ఒక రకంగా తొలిదశలో రామన్‌కు ఆయన గైడ్‌గా ఉపయోగపడ్డాడు. రామన్‌ది మామూలు కుటుంబం. ఉద్యోగం చేయడం తప్పనిసరైంది. బ్రిటీష్ గవర్నమెంట్ వారి ఫైనాన్స్ సర్వీసులో చేరాడు. పెద్ద జీతం, బంగళా వంటివి అమిరాయి. అప్పుడే లోకసుందరితో వివాహమైంది. 1907లో రామన్ ఉద్యోగం కలకత్తాకు మారింది. అక్కడికి చేరుకున్న మొదటి వారంలోనే ఆయన ట్రామ్‌లో ప్రయాణిస్తూ బౌ బజార్ స్ట్రీట్‌లో ఒక బోర్డు చూశాడు. INDIAN ASSOCIATION FOR THE CULTIVATION OF SCIENCE - ఆ సాయంత్రమే అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నాడు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ 1876లో ఆ అసోసియేషన్ స్థాపించి, భారతీయ శాస్త్రవేత్తలు జాతీయాభిమానంతో దేశంలోనే పరిశోధనలు సాగించాలన్న మహదాశయాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకుని సి.వి. రామన్ వెంటనే అందులో చేరిపోయాడు. అంతే కాదు, నోబెల్ బహుమతికి అర్హత సంపాదించగలిగే స్థాయి పరిశోధనలు కొన్నేండ్లలో అక్కడ చేయగలిగాడు. ఒక వైపు ఆర్థిక శాఖలో ఉద్యోగం చేస్తూ, మరోవైపు భౌతికశాస్త్రంలో పరిశోధనలు చేయడం ఎంత కష్టం? మనిషికి ఉండాల్సిన క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష అన్నీ రామన్‌కు ఉన్నాయి గనకనే - ఇతరులకు అసాధ్యమనిపించినవి సాధ్యమేనని ఆయన రుజువు చేసి చూపాడు.
ఒక దశలో- టైగర్ ఆఫ్ బెంగాల్ ఆశుతోష్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు బ్రిటీష్ ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం నెరపి, పరిశోధనల నిమిత్తం సి.వి. రామన్‌కు రెండేండ్ల సెలవు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఈ భారతీయుడి పరిశోధనలపై బ్రిటీష్ ప్రభుత్వానికి నమ్మకం కలగలేదు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చి, వీలు కాదని చెప్పింది. చివరకు ఆశుతోష్ ముఖర్జీ నిబంధనల్ని కొద్దిగా సడలించి సి.వి.రామన్‌ను ఏలిత్ ఛైర్ ఆఫ్ ఫిజిక్స్‌కు ఎన్నుకున్నాడు. అది 1917. చూస్తూ చూస్తూ పెద్ద ఉద్యోగం, హోదా, డాబు, వసతులు అన్నీ వదులుకుని, ఒక చిన్న ఉద్యోగానికి రావడం అందరూ చేయగల పనికాదు. ఒక ధ్యేయానికి కట్టుబడి ఉండగలిగే రామన్ లాంటివారు మాత్రమే చేయగలిగే పని. ఆయనలోని వైజ్ఞానిక జిజ్ఞాస, నిబద్దత ఆయనని ఆ పనికి ఉసిగొల్పాయి. ఒక వైపు బోధన, మరో వైపు పరిశోధనల మధ్య ఆయన జీవితం ఆ కాలంలో ఊపిరి సలపకుండా సాగింది. సహనం, సౌశీల్యం గల భార్య లోకసుందరి సహాయ సహకారాలతో- రామన్ వైజ్ఞానిక శిఖరాలను అధిరోహించి, ఈ దేశపు జెండాను దిగ్విజయంగా ఎగరేశాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటే, ఎన్నింటినో వదులుకోక తప్పదు - అన్న విషయం రామన్ జీవితం స్పష్టం చేసింది. 'రామన్ ఎఫెక్ట్' వెలుగులోకి వచ్చిన పదేండ్లలో ప్రపంచంలో సుమారు రెండు వేల పైచిలుకు పరిశోధనా పత్రాలు ఆ విషయాన్ని ధృవపరిచాయి, OPTICS రామనే ఆద్యుడు. PHYSIOLOGY OF VISION ను మొదట అధ్యయనం చేసిందీ ఆయనే. ఇలా వైజ్ఞానిక రంగంలోని ఎన్నో శాఖలకు ఆయన బీజం వేశాడు. అందుకే భారత ప్రభుత్వం 'భారత రత్న'తో గౌరవించుకున్న తొలి శాస్త్రవేత్త కూడా ఆయనే అయ్యారు!
సైన్స్‌డే సందర్భంగా ఒక్క సి.వి. రామన్ జీవిత విశేషాలే కాదు, విలువలకు కట్టుబడి సైన్సు కోసం జీవితాలు ధారపోసిన ఎంతో మంది భారతీయ వైజ్ఞానికుల వ్యక్తిత్వ ఔన్నత్యం యువతరానికి అందిస్తూ ఉండాలి. మన విద్యావిధానంలో ఉన్న ప్రధాన లోపమేమంటే, క్లాసు రూవమ్లో సైన్సు సూత్రాలు మాత్రమే చెపుతారు. అంతేగాని, ఒక్క శాస్త్రవేత్త ఎన్ని ఒడిదుడుకులను ఎదురుని ఆ పరిశోధనలు ఎలా చేయగలిగాడో నన్నది మాత్రం సంక్షిప్తంగానైనా చెప్పరు. ఏ అవకాశాలూ లేని రోజుల్లో వారు ఎంతగా శ్రమించారో చెప్పరు. యువతీ యువకుల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే వారి జీవిత నేపథ్యం గూర్చి చెప్పరు. అభిరుచి ఉన్నవారు వెతుక్కుని వెతుక్కుని చదువు కోవాల్సిందే. అందుకే చూడండి. పాఠ్యగ్రంథాలు రాసే రచయితలు అవసరమే, కానీ... వారికన్నా సరళ వైజ్ఞానిక రచనలు చేసే రచనల్ని జనం అధికంగా అభిమానిస్తారు. అటు శాస్త్రవేత్తలకూ, ఇటు సామాన్య పాఠకులకూ మధ్య సుగమ విజ్ఞాన రచయితలు ఒక వారధిలా నిలబడుతున్నారు. సమాజం వివేకవంతం కావడానికి నిరంతరం కషి చేస్తున్నారు.
మత విశ్వాసాలు ప్రధాన పాత్ర పోషిస్తున్న మన దేశంలో సైన్స్ డే- నిర్వహణ అత్యవసరం ! ప్రపంచమంతా వైజ్ఞానికంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో కొందరు మన దేశ పౌరులు, మన ప్రభుత్వ పెద్దలు మూఢ నమ్మకాలకు పెద్ద పీట వేస్తున్నారు. దేశాన్ని మూడు వేల ఏళ్ళ నాటి అనాగరిక సమాజం లోకి లాక్కుపోతున్నారు. ఆప్రమాదంలోంచి దేశాన్ని రక్షించుకోవాలంటే, దేశ పౌరులంతా వివేకం ప్రదర్శించాలి. సైన్సును ఒక వెన్నెముకగా చేసుకుని ప్రగతి పథంలోకి నడవాలి. నేషనల్ సైన్స్ డే (ఫిబ్రవరి 28) జాతీయ వైజ్ఞానిక స్పృహదినం (ఆగష్టు 20) వంటివి - పల్లె పల్లెలో, వాడ వాడలో ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ సంస్థలదీ మాత్రమే కాదు, ప్రతి పౌరుడిది కూడా ! మూఢత్వాన్ని వదిలి, చేతనత్వంలోకి రావాలంటే - మన రాజ్యాంగంలో రాసుకున్న 51A(H) స్ఫూర్తిని నిలుపుకోవాలంటే - ప్రతి పౌరుడూ చిత్తశుద్దితో పనిచేయక తప్పదు. ఇప్పటి దేశకాల పరిస్థితులను చూస్తుంటే, ఇక ఆ దిశలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని అనిపిస్తోంది.
రాజకీయాలు, సినిమాలు, పూజలు, జ్యోతిష్యాలు, క్రికెట్ వంటి అంశాలకు ఎక్కువ పాధాన్యమిస్తున్న మీడియా సంస్థలు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. మరీ ముఖ్యంగా ప్రజలకు వైజ్ఞానిక అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. అలాగని వదిలేద్దామా? బాధ్యతగల కొంత మంది పౌరులు, కొన్ని సంస్థలు, సోషల్ మీడియాలో ఒక భాగం - నిజాయితీగా పని చేస్తూనే ఉన్నాయి. ఆ లోటును తీరుస్తూనే ఉన్నాయి. జాన పిపాసులంతా వారికి వెన్నుదన్నుగా నిలబడాలి. అధికారం, అహంకారం, ధనం - హుంకరిస్తూనే ఉంటాయి. కానీ, ప్రజాబలం ముందు అవి ఎప్పుడూ ఓడిపోవాల్సిందే! ఇప్పుడు ప్రజల చేతిలో ఉన్న ఆయుధం - ప్రశ్న! ప్రశ్నలోంచి ఎదుగుతూ వచ్చిందే సైన్సు !! ఈ సైన్సు అంత ముఖ్యమైందిగా ఎందుకయ్యింది? అంటే చీకటిలోంచి వెలుగులోకి వెళ్ళాలంటే సైన్సే ఆసరా. అనాగరికతను, మూర్ఖత్యాన్నీ వదిలి విశాల విశ్వంలో అత్యాధునిక మానవులుగా నిలబడాలంటే- సైన్సు తప్ప, మరో మార్గం లేదు. అన్యాయాల్ని, అబద్దాల్ని, దుర్మార్గాల్ని ఛేదించాలంటే తప్పదు - అదే సైన్సు! అలాగే, ప్రభుత్వాల మూఢత్వం బద్దలు కొట్టాలన్నా ఇప్పుడు ప్రజల -మనకున్నది అ ఒకటే ఉన్న పదునైన ఆయుధం - సైన్స్ ఒకటే !!
- డాక్టర్ దేవరాజు మహారాజు
కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త
Sun 26 Feb 04:09:37.804664 2023