Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందడి చేసే లేత వయసు సమీపించగానే మనసు కూడా కొత్త నడకలు నేర్చుకుంటుంది. వింత వింత గారడీలు చేస్తుంది. మనల్ని అదుపులో ఉండనీకుండా పరుగులు తీయిస్తుంది. మనతో ఎప్పుడు ఎలాంటి పనులు చేయిస్తుందో మనకే తెలియదు. మనసుకు హద్దు దాటవద్దని మనసారా మనవి చేస్తూ సురేంద్రకష్ణ ఒక పాట రాశాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (2021) సినిమా కోసం రాసిన పాట ఇది.
ప్రేమికుడు తన మనసుకు చేస్తున్న మనవి ఈ పాట. మనసును మనసారా బతిమాలాడట ప్రేమికుడు. ఏమని? ఆమె వలలో పడవద్దని. అయితే మనసు వయసు కంచె ఎప్పుడో దాటింది. కాబట్టి - ఆ ప్రియుడు తన గోడును విన్నవించుకున్నా, పిలిచానా, ఎంత అరచినా ఆ మనసు వినకుండా ఆమె వెంటే పరుగులు తీసింది. అందుకే - తన మాటను అలుసుగా తీసుకున్న మనసుకు ప్రియుడు చెబుతున్నాడిలా - 'నేనెవరో తెలుసా? నన్నెందుకు లెక్కచేయట్లేదు. నాతోనే ఉంటావు. నన్నే నడిపిస్తావు. నన్నాడిపిస్తావు. అలాంటిది నా మాట వినవా?' అంటూ తన గోడును వినని మనసును ఈవిధంగా ప్రశ్నిస్తాడు.
అయితే ఆమె వైపు వెళతావెందుకు? ఆమెలోని గమ్మత్తేంటి అని అతను ప్రశ్నిస్తే, గమ్మత్తును మించిన మత్తేదో ఆమెలో ఉందని మనసు సమాధానమిచ్చిందట. ఆమె కన్నా అందాలు ఎన్నో ఉన్నాయని అతను చెబితే, అందానికే ఆమె ఆకాశంలాంటిదని మనసు చెప్పిందట. అప్పుడతను నువ్వే నా మాట వినడం లేదు. వినకుండా ఆమె వెంటే వెళుతున్నావు. ఇక ఆమె నీ మాట వింటుందా? ఆశ ఎందుకు? అని అంటాడా ప్రియుడు.
అయితే ఆమె వెంటే ఎందుకు వెళతావని మనసుకు చెప్పిన ప్రియుడి మాటల్లో అతనికి ఆమెపై అంతులేని ప్రేమ కనబడుతున్నదని స్పష్టంగానే తెలిసిపోతుంది. అందుకే తెలివి తేటలన్నీ నా సొంతమనుకుని ప్రపంచమంతటా తిరిగాను. కాని ఆమె ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు నా పేరు నేనే మరిచిపోయాను. ఇది ఆమె మహిమే. ప్రేమ వల్ల కలిగిన మైకమే అని చెబుతున్నాడు. ఆమె మాటలే వింటూ మైమరచిపోయి, మతిపోయి నిలిచిపోయాను. దానికి బదులెక్కడుందంటూ అంతటా వెతికాను. ఈ పరవశానికి ఆమెనే కారణం. అందుకే మనసా! తనతో ఉండే ఒక్కొక్క నిమిషాన మళ్ళీ మళ్ళీ కొత్తగా పుడతావా? అని మనసుకు మనసారా విన్నపం చేసుకుంటున్నాడు ప్రేమికుడు.
అంటే - ప్రేమికుడి మనసులో ఆమెపై ఉన్న ప్రేమే ఆమె వైపు వెళ్ళవద్దని అతని నోటి వెంట పై పై మాటలుగా వచ్చాయి. వెళ్ళవద్దనే మాటల వెనుక ఆమె లేనిదే ఉండలేననే విషయమూ వ్యక్తమవుతోంది. అయితే ఆ విషయం రెండవ చరణంలో చాలా బాగా స్పష్టమవుతోంది. ఒక మనసు ఇంకో మనసును కోరుకున్నప్పుడు మరియు చేరుతున్నప్పుడు ప్రతి ప్రేమికుడు తన మనసుకు తాను మనవి చేసుకునే విషయాలేమిటో ఈ పాట చెబుతుంది. తను కోరుకున్న మనసును చేరుకున్నప్పుడు కలిగిన సంతోషం ఎలా ఉంటుందో కూడా ఈ పాట వివరిస్తుంది.
పాట :-
మనసా మనసా మనసారా బతిమాల
తన వలలో పడబోకే మనసా
పిలిచా అరిచా అయినా నువ్ వినకుండ
తన వైపు వెళతావ మనసా
నా మాట అలుసా నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా!
ఏముంది తనలోన గమ్మత్తు అంటే
అది దాటి మత్తేదో ఉందంటు అంటూ
తన కన్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశమంటూ
నువ్వే నా మాట..హే..నువ్వే నా మాట వినకుంటే మనసా
తానే నీ మాట వింటుందా ఆశ...
తెలివంత నా సొంతమనుకుంటు తిరిగా
తన ముందు నుంచుంటే నా పేరు మరిచా
ఆ మాటలే వింటూ మతిపోయి నిలిచా
బదులెక్కడుందంటు ప్రతి చోట వెతికా
తనతో ఉండే..హే..తనతో ఉండే ఒక్కొక్క నిమిషం
మరలా మరలా పుడతావా మనసా!
- తిరునగరి శరత్ చంద్ర
6309873682