నవతెలంగాణ - రంగారెడ్డి: ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో నలుగురు దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధి తుర్కయంజాల్ కూడలి వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన అహినల్ల మహే్‌షకుమార్, వెంపల్లి మహేష్ డీజే మ్యూజిక్ సిస్టంపై పనిచేస్తుంటారు. సోమవారం అర్ధరాత్రి ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని డీజే బాక్స్‌లతో డీసీఎం(ఏపీ31 టీటీ1204)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాత మల్లయ్యపాలెం గ్రామానికి చెందిన నాగసాయి బాబరెడ్డి(22) ఎల్బీనగర్లో ఉండి చదువుకుంటూ పార్ట్ టైం క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతడు సోమవారం తుర్కయంజాల్‌లోని హోటల్లో ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో క్యాటరింగ్ పని కోసం మిత్రులతో కలిసి వెళ్లాడు. పని పూర్తయిన తరువాత రాత్రి ఇంటికి వెళ్లేందుకు తుర్కయంజాల్ చౌరస్తా పెట్రోల్ పంపు వద్ద క్యాటరింగ్ బాయ్‌లు నాగసాయి బాబరెడ్డి, లింగరాజు, సురేష్, అవినాష్ బస్సు కోసం వేచి ఉన్నారు. ఈలోగా ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్న డీసీఎం వాహనాన్ని ఆపారు. రోడ్డు పక్కన నిలిపి వాహనం ఎక్కుతున్న సమయంలో సిమెంట్ లోడుతో ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ (టీఎస్15 యూఏ2851) వేగంగా వచ్చి నిలిచి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొంది. దీంతో నాగసాయిబాబరెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లికి చెందిన తుమ్మోజు లక్ష్మయ్య(52) అక్కడికక్కడే మృతి చెందారు. జియాగూడకు చెందిన మహే్‌షకుమార్(23), వెంపల్లి మహేష్(52) ఆస్పత్రికి తరలించగా మరణించారు. మరో ముగ్గురు క్యాటరింగ్ బాయ్‌లు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిమెంట్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సీఐ రవికుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm