నవతెలంగాణ-హైదరాబాద్ : చేరాల్సిన ప్రాంతాన్ని ఇంటర్నెట్లో వెతుక్కుంటూ బయల్దేరిన ముగ్గురు దారితప్పారు. అది తప్పని గ్రహించి వెనక్కి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదానికి గురై ఓ యువకుడు మరణించాడు. మెహిదీపట్నం-శంషాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో పిల్లర్ నంబరు 84 వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎంహెచ్ఎన్వీఎస్. చరణ్(22) ప్రాణాలు కోల్పోయాడు. వాహనం వెనుక కూర్చున్న మరో ఇద్దరు యువతులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. పోచారం వద్ద ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం రావడంతో నగరం చేరాడు. సమీపంలోని టౌన్షిప్లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వారాంతపు సెలవులు కావడంతో శనివారం సాయంత్రం మూడు ద్విచక్ర వాహనాలపై 9 మంది మిత్రులు నగరానికి వచ్చారు. అందరికీ నగరం కొత్త కావడంతో గూగుల్ మ్యాప్ సహాయంతో మెహిదీపట్నం మీదుగా తీగల వంతెన వైపు బయల్దేరారు. రెండు బైక్‌లపై ఉన్న మిత్రులు ముందు వెళ్లిపోయారు. చరణ్ గూగుల్ మ్యాప్ చూస్తూ ఆరాంఘర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గంవైపు మళ్లించాడు. కాసేపట్లోనే దారి తప్పినట్టు గ్రహించి, గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబరు 82 వద్ద ఎక్స్‌ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు వెళ్లేందుకు మలుపు తిరిగాడు. అదే సమయంలో ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న కారు ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.
లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ సత్యనరేంద్ర ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన చరణ్‌ను సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. స్వల్పగాయాలతో బయటపడిన యువతులు ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన స్నేహితులు తీగల వంతెన చేరి చరణ్‌కు ఫోన్ చేశారు. ఎంతకీ స్పందించకపోవడంతో ఆందోళనకు గురై వెనక్కి వచ్చి, ప్రమాద విషయం తెలుసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 May,2023 09:31AM