నవతెలంగాణ - దుబాయ్: రెండు నెలల కింద విజిట్ వీసాపై దుబాయి వెళ్లిన భారతీయ ఇంజనీర్ ఊహించని విధంగా విగతజీవిగా కనిపించాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని కేరళ రాష్ట్రం కొల్లంలోని అంచలుమూడుకు చెందిన డీ శ్రీకుమార్ (46) గా గుర్తించారు. గత ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలోనే అతడు విగతజీవిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన శ్రీకుమార్ 12 ఏళ్లు దుబాయ్లో ఉన్నాడు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చేశాడు. అలా ఐదేళ్లు ఇండియాలోనే ఉండిపోయాడు. ఆ తర్వాత రెండు నెలల కింద మళ్లీ దుబాయ్ వెళ్లాడు. ఈసారి విజిటర్ వీసాపై దుబాయ్ వెళ్లిన శ్రీకుమార్ తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే అనుమానస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. కాగా, పోలీసులు అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య సినీమోల్, ఇద్దరు పిల్లలు ధనపలాన్, లక్ష్మీ కుట్టి ఉన్నారు. శ్రీకుమార్ మృతితో స్వస్థలం అంచలుమూడు విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm