హాయ్ ఫ్రెండ్స్! ఆకాశంలో కనిపించే చందమామ గురించి, మిణుకు మిణుకు మనే నక్షత్రాల గురించి, వెలుతురు, వేడినిచ్చే సూర్యుడు, ఇతర గ్రహాల గురించి మన పెద్దవాళ్లు అనేక కథలు చెబుతూ ఉంటారు. నిజానికి ఆ కథలన్నీ వాస్తవాలు కాదు. నిజాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అనేక అంతరిక్ష పరిశోధనలు చేశారు. మరిన్ని పరిశోధనలు చేయడానికి అమెరికా, రష్యా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఆకాశంలో ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించారు. దాని విశేషాలు తెలుసుకుందాం..
అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం 1998లో ప్రారంభమైంది. 2 నవంబరు 2000 న మొట్టమొదటి బృందం ఈ కేంద్రంలో ప్రయోగాన్ని ప్రారంభించింది. అప్పటినుంచి ఈ కేంద్రంలో వ్యోమగాములు నివసిస్తున్నారు. ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో, అయిదు పడకగదులతో ఉంటుంది. దీని బరువు నాలుగు లక్షల యాభరు మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోలు. వ్యోమగాములు భారరహిత స్థితిలో గాలిలో వేలాడుతూ ఉండాలి. అందుకే వాంతుల వంటి అనారోగ్య పరిస్థితులకు కూడా లోనవుతారు. అందుకే ఈ కేంద్రాన్ని 'వామిట్కోమెట్'అని అంటారు. ఒక కెసి-135 నాలుగు ఇంజన్ల జెట్ వాహనంలో వ్యోమగాములు గంట నుంచి 2 గంటల వ్యవధి వరకు గాలిలో వేలాడే స్థితిలో గడుపుతారు. అలా వేలాడుతూనే తినటం, తాగటం వంటి పనులు చేయటం అలవాటు చేసుకుంటారు. ఇక్కడ ఆహారం త్వరగా పాడైపోకుండా నిల్వ ఉండే విధంగా ఉంటుంది. అట్లాగే పొడిగా ఉండే ఆహారాన్ని వినియోగిస్తారు. మిఠాయిలు, పండ్లు, మ్యాకరోని, జున్ను వంటి కొన్ని ఆహార పదార్థాలకు నీటిని కలిపి వినియోగించవలసి ఉంటుంది. కెచప్‌లు, మస్టర్డ్, మయొనైజ్ వంటి పదార్థాలు ఉంటాయి. ఆహారాన్ని వేడి చేసుకోవటానికి వీలుగా ఓవెన్ ఉంటుంది. ఉప్పు, మిరియంపొడి వంటివి ఆహారంపై చల్లుకునేటప్పుడు భారరహిత స్థితి కారణంగా ఎగిరిపోయి అంతరిక్ష నౌకలోని గాలిరంధ్రాలకు అడ్డుపడే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని ద్రవరూపంలోకి మార్చి వినియోగిస్తారు. ఆహారంలో విటమిన్లు, మినరల్స్ సరిపడినంత ఉండేట్లు చూస్తారు. ఒక వ్యోమగామి పండ్లు, గింజలు, వేరుశనగలు, వెన్న, మాంసం మొదలైన ఘనాహారాలు; కాఫీ, టీ, నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలూ తీసుకుంటారు. అంతరిక్ష నౌకలోని వివిధ విభాగాలపై పనిచేయటం, భూ కేంద్రానికి పంపటం కోసం ప్రకృతి దృశ్యాలు, వైపరీత్యాల వంటి ఫోటోలను తీయటం, రెండున్నర గంటల వ్యాయామం, శరీరానికి అంటిపెట్టి ఉండే జీవక్రియల నమోదు యంత్రాలు వెలువరించే సమాచారాన్ని రాసుకోవటం, మిగతా కేంద్రాల వారితో సమాచారాన్ని పంచుకోవటం, ఏ రోజు పనుల గురించి ఆ రోజు నివేదిక తయారు చేయటం వీళ్ళ రోజువారి పని. భూమికి తిరిగి వచ్చాక కొంతమంది వ్యోమగాములకు కంటి చూపులో తేడాలు ఏర్పడటం, ముక్కు బిగుసుకుపోయి వాసన, రుచి తెలుసుకునే సామర్థ్యాన్ని కొంతకాలం పాటు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇన్ని కష్టాలకు ఓర్చుకుని, అమెరికాకు చెందిన కెల్లీస్కాట్, డాక్కర్ కెజెల్ లిండ్గ్రిన్ 141 రోజులు అంతరిక్షకేంద్రంలో గడిపి, వారి అనుభవాలను ప్రపంచానికి వెల్లడించారు. నెలలు, సంవత్సరాల తరబడి అంతరిక్ష కేంద్రాలలో ఉంటూ, వ్యోమగాములు వెలువరిస్తున్న పరిశోధనా ఫలితాలను, మనం దేశప్రగతి కోసం వినియోగించుకుంటున్నాం. భవిష్యత్తులో అంతరిక్ష అధ్యయనానికి చాలా ప్రాధాన్యం ఉండబోతోంది. మనం కూడా ఇటువంటి సాహస ప్రయోగాలు, ప్రయాణాల్లో పాల్గొని మన దేశానికి, ప్రపంచానికి సేవ చేయాలి. అట్లా చేయాలంటే ముందు మనం బాగా చదువుకోవాలి మరి.
Authorization