పిల్లలూ! కోకో వృక్షం అమెరికాలో, మరికొన్ని ప్రాంతాల్లో ఉంది. కోకో పౌడరు చాక్లెట్ల తయారీలో ఎక్కువగా వాడతారు. గింజల నుండి తీసిన కొవ్వుతో కోకో వెన్న తయారు చేస్తారు. దీని విశేషాలను తెలుసుకుందాం..
కోకోవో అనే వృక్షం నుండి కోకో లభిస్తుంది. ఇది మధ్య, దక్షిణ అమెరికాలో పెరుగుతుంది. కోకో విత్తనాలను 1879లో ఘనాలో మొదట నాటారు. 1913 వరకు కోకోను ఉత్పత్తి చేసే దేశాలలోకెల్లా ఘనా అగ్రగామిగా ఉండేది. ఇప్పటికీ ఇక్కడ దీని వ్యవసాయం గణనీయమైనదే. ఘనాలో కోకో వ్యవసాయంపై 5 లక్షల మంది ఆధారపడి ఉన్నారు.
కోకో చెట్టు 7 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇది సతత హరితమైన మొక్క. ఏడాదికి రెండు పర్యాయాలు చిన్న నక్షత్రాకారంలో ఉండి, ఎరుపు పసుపు కలిసిన రంగులో పువ్వులు పూస్తాయి. కొంత కాలానికివి మొగ్గలు, కాయలుగా పెరుగుతాయి. కాయలు కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. వీటి పొడవు 6-10 అంగుళాలు, మందం 3-4 అంగుళాలు ఉంటుంది. మొగ్గలు కాయలుగాను, కాయలు పళ్ళుగానూ తయారవటానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది.
భూమధ్యరేఖకు సమీప ప్రాంతంలో ఉన్న భూభాగంలో కోకో ఎక్కువ పెరుగుతుంది. దీనికి ఎల్లప్పుడూ తేమ కావాలి. కొన్ని దేశాలలో మొక్కలను తరచూ తడుపుతుంటారు. 50-100 మి.మీ. వర్షపాతం గల ప్రాంతాలు ఈ మొక్కలకు చాలా అనుకూలమైనవి. సాధారణంగా ఏడాదికి రెండు పంటలు పండిస్తారు. అక్టోబరు, మార్చిలలో ఒకటి, మే, ఆగస్టుల మధ్య మరొకటి. మొక్క ఐదేళ్లు ఎదిగిన తర్వాత కాయలు కాస్తుంది. పదునైన చాకులతో ఈ కాయలను కోస్తారు. స్త్రీలు, ఆడపిల్లలు వీటిని ఎక్కువ కోస్తారు అన్నిటిని ఒక చోటికి చేర్చి పళ్ళను చితగ్గొట్టి లోపలి గింజలను వేరు చేస్తారు. గింజలను చిల్లులు గల పెట్టెలలో ఉంచి నిరంతర ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. ఈ విధంగా ఆరు రోజులు వేడి చేస్తారు. అపుడు వీటిలోని కాలుష్యాలు పోతాయి. తర్వాత ఈ గింజలను చాపలపై ఎండబెడతారు. వీటిని చితగొట్టి కోకో పౌడరును తయారు చేస్తారు.
కోకోను అనేక ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా చాక్లెట్ల తయారీలో దీనిని ఎక్కువగా వాడతారు. గింజల నుండి తీసిన కొవ్వుతో కోకో వెన్న తయారుచేస్తారు. దీనిని ఐస్‌క్రీమ్‌లలో సువాసన కోసం వాడతారు. ప్రతి విత్తనం కోకో వెన్నగా కొంచెం కొవ్వు కలిగి ఉంటుంది. కోకోను కొన్ని మందులలో ఉపయోగిస్తారు. కోకో అనే పదం స్పానిష్ పదం కాకో నుంచి వచ్చింది. స్పెయిన్ దేశస్థులు చాక్లెట్‌ను ఐరోపాకు పరిచయం చేశారు. 17వ శతాబ్దం మధ్యకాలం నాటికి ఇది ఒక ప్రముఖ పానీయంగా మారింది. పానీయాన్ని సాధారణంగా హాట్ చాక్లెట్ అని పిలుస్తారు.
Authorization