హాయ్ ఫ్రెండ్స్! కుండలు చేసే వృత్తి కలిగినవారిని కుమ్మరివారు అంటారు. కుండలు తయారు చేయడం చాలా శ్రమ, నైపుణ్యంతో కూడిన పని. అంతే కాదు ఎంతో సహనం కూడా అవసరం. అటువంటి కుండలను ఎట్లా తయారుచేస్తారో తెలుసుకుందామా...
ముందుగా చెరువుల దగ్గర్నుంచి కుండల తయారీకి కావాల్సిన మెత్తని ఒండ్రుమట్టిని సేకరిస్తారు. అందులో ఉన్న చిన్న రాళ్ళను, వేర్లను తీసివేస్తారు. తర్వాత ఆ మట్టిలో కొద్దిగా నీళ్ళు చల్లి నాలుగైదు రోజులు నానబెడతారు. దానికి మరి కాసిన్ని నీళ్ళు కలిపి కాళ్ళతో తొక్కుతారు. ఆ మట్టిని తీసుకుని స్థూపాకారంగా చేసి, తిరిగే చక్రం (సావె)పై ఉంచుతారు.
కుండలు తయారు చేయడానికి ఉపయోగించే చక్రం రెండడుగుల వ్యాసార్థం కలిగి ఉంటుంది.దాని కింద ఒక చిన్న లోహపు బుడిపెలా ఉంటుంది. దానికింద నున్న మరో లోహపు గిన్నెపై నిలబడి ఉంటుందీ బుడిపె. ఆ చక్ర చట్రంపై ఒక చోట ఒక అంగుళం లోతున చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో కర్రను పెట్టి వేగంగా చక్రాన్ని తిప్పుతారు. అలా తిరిగేటప్పుడు చేతులతో ఆ మట్టికి ఒత్తిడి కలిగించడం వల్ల అది గుండ్రని ఆకారంలోకి కుండ రూపుదిద్దుకుంటుంది. అప్పుడు అడుగుభాగంలో పుల్లను గుచ్చి మట్టి ముద్దనుంచి కుండను ఒడుపుగా వేరుచేస్తారు. తయారైన కుండల్ని రెండు రోజులు నీడలో ఆరబెడతారు. ఆ తర్వాతే కుమ్మరి వామితో పని ఉంటుంది.
ఆరిన కుండల్ని కాల్చడానికి వృత్తాకారంలో ఉండే పొయ్యిలో పెట్టి కాలుస్తారు. ఈ పొయ్యినే 'కుమ్మరి వామి' అని అంటారు. అది మూడడుగుల ఎత్తు ఉంటుంది. దానికి ఒక వైపు రంధ్రం ఉంటుంది. ఆరిన కుండల్ని అందులో పేర్చి, వాటిపైన ఆకులతో చెక్కలు, పొట్టు వంటివి వేసి, దాని మీద బంకమట్టితో మూసేస్తారు. గోడకు ఒకవైపు మిగిలి ఉన్న రంధ్రం గుండా గడ్డి, కంపల్లాంటివి వేసి మంటపెడతారు. దాన్ని ఓ రోజంతా అలా వదిలేస్తారు. ఆ వామి పూర్తిగా చల్లారాక కుండల్ని బయటికి తీసుకుంటారు.
మట్టి కుండలతో పాటుగా అలంకరణ సామగ్రి కూడా తయారుచేస్తారు. కొందరు మట్టి కుండల్ని పెట్టుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ కోసం తయారయినవే నాజూకైన కూజాలు. కూజాల్లో కుండల కంటే కాస్తంత తక్కువ నీళ్ళు పడతాయి. అయితే కుండలిచ్చేంతటి చల్లదనాన్నే ఇస్తాయివి. పూల కుండీలూ ఇదే పద్ధతుల్లో తయారుచేస్తారు. దేవుళ్ళ బొమ్మలు, జంతువులు, పక్షులు, కళాత్మకమైన అలంకరణ సామగ్రి,పెండ్లిళ్ల వంటి సంప్రదాయక వేడుకల్లో అవసరమయ్యే మట్టి పాత్రలు; పప్పుదినుసులు, ధాన్యం వంటివి నిల్వ చేసుకునేందుకు వీలయ్యే పెద్ద జాడీలు వంటివెన్నింటినో కుండల తయారీ దార్లు తయారుచేస్తారు. లోహపు పాత్రలు అందుబాటులోకి వచ్చాక మట్టి కుండల వినియోగం కాసింత తగ్గినా ఈ కుండల తయారీ పూర్తిగా అంతరించిపోలేదు.
కుండల తయారీ ఖర్చు ఎక్కువే. బంకమట్టి సేకరణా కష్టమే. అన్ని చెరువుల వద్దా దొరకదది. కొందరైతే దూర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటారు. కుండలు కాల్చేందుకు కట్టెలు, ఊక కొనాల్సి ఉంటుంది. కుండల్ని కాల్చుతున్నప్పుడు ఒకోసారి విరిగిపోతుంటాయి. రవాణాలో కూడా పగిలిపోతాయి. చెప్పాలంటే ఒక్కో కుండ తయారీకి 50 రూపాయల వరకూ ఖర్చు అవుతుంది.
అయితే కుండల తయారీలో పెద్ద పెద్ద పెట్టుబడిదార్లు ప్రవేశించి యంత్రాల సహాయంతో మట్టితోనే రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పరిశ్రమనే 'సిరామిక్' పరిశ్రమగా పిలుస్తున్నారు. పెట్టుబడిదారుల ధాటికి తట్టుకోలేక గ్రామీణ కుండల తయారీదార్లు తమ వృత్తిని వదిలేసి వేరే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్కడక్కడ మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో చక్రంపై కుండలను తయారుచేసే వృత్తిదార్లు ఇప్పుడు కనిపిస్తారు.
Authorization