హాయ్ పిల్లలూ సంక్రాంతి సెలవులను సరదాగా గడిపేస్తున్నారా? ఈ సెలవుల్లో గాలిపటాలు ఎగరేయడమంటే మీకు చాలా ఇష్టం కదూ..! మరి మీకెంతో ఇష్టమైన గాలిపటం పుట్టింది ఎక్కడో తెలుసా? జవాబు కావాలంటే ఇది చదివేయండి మరి!
చైనా... ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో ఒకటి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఇదే. ఈ దేశ రాజధాని బీజింగ్, జనాభా 1,40,35,00,365, విస్తీర్ణం 95,96,961 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ మాండరిన్, మంగోలియన్, టిబెటన్ భాషలు మాట్లాడతారు. చైనా కరెన్సీ పేరు చైనీస్ యువాన్. ఈ దేశపు జెండా ఎరుపు. ఈ రంగు కమ్యూనిస్ట్ విప్లవానికి సూచిక. ఇక్కడి ప్రజల సంప్రదాయ రంగు కూడా ఇదే. జెండాలో ఉండేపెద్ద నక్షత్రం కమ్యూనిజానికి గుర్తు. అలాగే మిగిలిన నాలుగు చిన్న నక్షత్రాకారాలు సామాజిక తరగతులను సూచిస్తాయి. చైనీయులు ఎరుపు రంగును సంతోషానికి గుర్తుగా భావిస్తారు. అందుకే రకరకాల పండగల్లోనే కాదూ... ప్రత్యేక సందర్భాల్లో, వివాహం లాంటి వేడుకల్లోనూ ఈ రంగునే ఉపయోగిస్తారు.
మరెన్నో సంగతులు
- చైనాలో 2009 వరకు ఫేస్బుక్, ట్విట్టర్ వాడటం నిషిద్ధం.
- టాయిలెట్ పేపర్తో పాటు మనకెంతో ఇష్టమైన గాలిపటాలు పుట్టింది కూడా ఈ దేశంలోనే.
- చైనాలో విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడితే ఏడేళ్ల శిక్ష విధిస్తారు.
- ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఆటబొమ్మల్లో ఎక్కువ శాతం బొమ్మలు చైనాలోనే తయారవుతాయి.
- చైనాలో పెద్దవారి కోసం ప్రత్యేక చట్టం ఉంది. వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే శిక్ష విధిస్తారు.
- ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' మనకు తెలిసిందే. దాదాపు 2600 ఏండ్ల నాటి నిర్మాణమిది. ఏటా ఇక్కడికి ఐదు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారు.
- ఎగుమతుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది చైనా. దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది.
- ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు ఇక్కడే ఉంటాయి.
- ప్రపంచంలోనే పురాతన, పొడవైన కాలువ 'చైనా గ్రాండ్ కెనాల్'. దీని పొడవు 1,794 కిలోమీటర్లు.
- కొన్ని పెద్ద దేశాల్లో టైమ్ జోన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ పెద్ద దేశమైన చైనాలో మాత్రం ఒక్కటే 'బీజింగ్ స్టాండర్డ్ టైమ్ జోన్' ఉంది. అంటే ఈ దేశమంతా ఒకే సమయం ఉంటుంది.
- దాదాపు 1400 సంవత్సరాల కిందట డబ్బుగా కాగితపు నోట్లని మొదటిసారిగా వాడింది చైనాలోనే.
- సముద్ర ప్రయాణాల్లో ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్), మొట్ట మొదటి ముద్రణాయంత్రం, వూగే వంతెనలు, తుపాకీ మందు, ముడుచుకునే గొడుగుల్ని తయారు చేసింది కూడా చైనీయులే.
- సంఖ్యాపరంగా ప్రపంచంలోని మొత్తం పందుల్లో సగం చైనాలోనే ఉన్నాయి.
- చైనాలో కొంత మంది పోలీసులు కుక్కలకు బదులు పెద్ద బాతుల్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే కుక్కల్లానే వీటికి దొంగల్ని గుర్తించే శక్తి ఉందట.
- ప్రపంచ వ్యాప్తంగా మనకు కనిపించే పాండాలు కూడా చైనా దేశానికి చెందినవే.
Authorization