ఇదీ ఓ రకం పిల్లే. కాకుంటే పిల్లులన్నిట్లోకీ ప్రత్యేకమైనది. ఇసుక రంగులో ఉండటమే కాదు, ఇసుక ఉన్నచోటే బతుకుతుంది. దీని జీవనశైలి మాత్రం... మామూలు పిల్లులకంటే భిన్నంగా ఉంటుంది. అంతేకాదండోరు ఇన్నాళ్లు ఈ బుజ్జిపిల్లి కెమెరా కంటికి చిక్కకుండా తప్పించుకుంటోంది. అలాగని. వదిలేస్తారా ఏం? ఎట్టకేలకు పట్టేశారు. దీని గురించి బోలెడు సంగతులు చెప్పేశారు. అవే చూద్దామా పిల్లలూ...
ఈ ఏడారి ఏప్రిల్ నెల వరకూ ఇసుక పిల్లుల విషయాలు బయట ప్రపంచానికి ఇసుమంతైనా తెలీదు. వీటి జాడ, జీవనశైలి గురించి తెలుసుకోవాలని పరిశోధకులు నాలుగేళ్లుగా ఆఫ్రికా ఎడారిలో గాలిస్తున్నారు. ఆఖరికి ఎలాగైతేనేం 'పాంథెరా' అనే స్వచ్ఛంద సంస్థ డాక్టర్ అలెగ్జాండర్ స్లివా నేతృత్వంలోని పరిశోధక బృందం ఫలితాన్ని సాధించింది. ఇప్పటికే ఈ సంస్థ 40 అడవిజాతి పిల్లుల పరిరక్షణ కోసం పని చేస్తున్నది.
కళ్లని చూసే కనిపేట్టేశారు...
ఆఖరికి ఎనిమిది వారాల వయసుస్న పిల్లికూనలు, తల్లి పిల్లి.. మొరాకన్ సహారా ఎడారిలోని మొక్కలగుబుర్లలో దోబూచులాడుతూ కనిపించాయి. చీకటిలో టార్చిలైట్ల వెలుగులో వాటి కండ్లు ఆకుపచ్చగా మెరుస్తుండటంతో అవక్కడ ఉన్నట్లు గుర్తించగలిగారు. లేదంటే ఇంకెన్నాళ్లు వెతకాల్సి వచ్చేదో! వాటిని చూసిన ఆనందంలో ఓ గంటపాటు ఫొటోలు తీస్తూ గడిపేసిందట ఆ బృంధం.
రహస్య జీవనం వల్లే!
ఇసుక పిల్లుల్ని శాండ్ కేట్స్ అంటారు. లాటిన్ భాషలో వాటి పేరు ఫెరిస్ మార్గరిటా. ఇవి చాలా పిరికి పిల్లులు. ఎవరికంటా పడకుండా తప్పించుకుంటాయి. అలికిడి వినిపిస్తే పారిపోయి దాక్కుంటాయి. ముఖ్యంగా పగలు బయట సంచరించవు. ఇసుక నేలల్లో, లోతుగా బొరియలు చేసుకొని నిద్రపోతాయి. ఆ బొరియలు వేడి నంఉచి, చలి నుంచి వీటిని రక్షణనిస్తాయి. ఆహారం కోసమే రాత్రిపూట బయటికొస్తాయి. వచ్చినా అస్సలు శబ్దాలు చేయ్యవు. పాదముద్రల ద్వారా కూడా వాటి సంచారాన్ని తెలుసుకునే వీలులేదు. సాధారణ పిల్లుల్లా కాకుండా వాటి పాదాల కింద బొచ్చు ఒత్తుగా ఉంటుంది. చలికాలంలో ఆ బొచ్చు రెండు అంగుళాల ఎక్కువ పెరుగుతుంది. దాంతో ఇసుకలో పాదాల అచ్చులు పడవు. ఆ బొచ్చువల్లే ఎడారి ఇసుక వేడిని తట్టుకొని నడవగలవు.
ఆకారమూ వైవిధ్యమే!
పరిమాణంలో చాలా చిన్నవి. ఇసుక పిల్లుల్లో పెద్దదే సాధారణ పిల్లి పిల్లంత ఉంటుంది. చెవులు పొడవుగా, పదునైన ఆకారంలో ఉంటాయి. అందువల్లే మామూలు పిల్లుల వినికిడి శక్తికంటే వీటికి వినికిడి శక్తి ఎక్కువ. శత్రువు జాడని తెలుసుకునేందుకు ఇదీ ఒకందుకు ఉపయోగపడుతుంది. ఈ పిల్లుల ప్రధాన ఆహారం పక్షులు, బల్లులు, ఎలుకలు, కీటకాలు. ఒకోసారి ఎడారి విష పాములను కూడా ఆరగిస్తాయి. ముఖ్యంగా ఇవి సహారా, ఇజ్రాయెల్, అరేబియన్ ఎడారి, ఇరాన్, పాకిస్థాన్ ఎడారుల్లో జీవిస్తాయి.
Authorization