హాయ్ చిన్నారులూ! ఐస్క్రీంను చూడగానే నోరూరుతుంది.. పిల్లలైనా.. పెద్దలైనా.. తినకుండా ఉండలేరు.. విభిన్న రంగుల్లో రకారకాల ఫ్లేవర్లు... తింటుంటే ఆహా ఏమీ రుచి అంటూ మళ్లీ మళ్లీ తినాల్సిందే! ఇంతకీ ఐస్‌క్రీం గురించి ఎందుకు చెబుతునానంటే దాని గురించి పెద్ద కథే ఉంది మరీ! సాధారణంగా పుట్టిన రోజుల్ని, పండగదినాలను, ఒక్క రోజే జరుపుకుంటారు. కానీ ఒక నెల మొత్తం ఐస్ క్రీం పండగను జరుపుకుంటారని తెలుసా? జూలై నెలను అమెరికాలో 'నేషనల్ ఐస్ క్రీం మంత్' గా జరుపుకుంటారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
చిన్నా పెద్ద తేడా లేకుండా అంతా ఇష్టంగా తినే ఐస్ క్రీం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జూలై నెలను ఐస్ క్రీం నెలగా, జూలై నెలలోని మూడో ఆదివారాన్ని అంతర్జాతీయ ఐస్ క్రీం రోజుగా 1984 సంవత్సరంలో ప్రకటించారు. అమెరికా ప్రజలకు ఐస్ క్రీం అంటే మక్కువ ఎక్కువ. ఎంత మక్కువంటే అమెరికాలో 98 శాతం మంది ఐస్ క్రీంలు తింటారు. ఐస్ క్రీం వినియోగదారుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. 87 శాతం అమెరికా ప్రజలు వారి రిఫ్రిజిరేటర్లలో ఐస్ క్రీంలను ఉంచుకుంటారు. 2,500 సంవత్సరాల కిందట నుంచే ప్రజలు ఐస్ క్రీంలను తింటున్నారు. గ్రీకులు క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలోనే ఐస్ క్రీం వంటి పదార్థమైన డిసర్ ్ట తినేవారు.
మార్క్ పోలో యూరప్ ప్రజలకు ఐస్ క్రీం ను 13 శతాబ్దంలో పరిచయం చేశాడు. అమెరికా ప్రజలు 18వ శతాబ్ద ఆరంభంలో తొలిసారిగా ఐస్‌క్రీం రుచి చూశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో 1773 సంవత్సరంలో మొట్టమొదటి ఐస్ క్రీం పార్లర్ ప్రారంభమైంది. మొదటి ఐస్‌క్రీం మెషిన్‌ను 1840వ సంవత్సరంలో కనిపెట్టారు. సెయింట్ లూయిస్ అనే వ్యక్తి ఐస్‌క్రీం కోన్‌ను 1904వ సంవత్సరంలో ప్రపంచానికి పరిచయం చేశాడు. దక్షిణ పసిఫిక్ నౌక శాఖకు చెందిన బుర్టన్ బుచ్ బాస్కిన్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తన జీపును అమ్మి ఐస్‌క్రీం ఫ్రీజర్‌ను కొన్నాడు. వెనిలా, స్ట్రాబెర్రీతో పాటు దాదాపు 30 రకాల ఫ్లేవర్లను తయారు చేసిన ఘనత బాస్కిన్దే. ఇతనితో రాబిన్స్ చేతులు కలిపాడు. నేడు అందరికీ సుపరిచితమైన బాస్కిన్-రాబిన్స్ ఐస్‌క్రీం స్టోర్ల యజమానులు వీరే.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 రకాల ఐస్ క్రీం ఫ్లేవర్లు ఉన్నాయి. 1790కు ముందు జింజర్, బ్రౌన్ బ్రెడ్, పర్మేసన్ ఫ్లేవర్ల ఐస్ క్రీమ్‌లు కూడా ఉండేవి. ఐస్ క్రీముల్లో చాక్లెట్, వెనిలా, పిస్తా, బాదం, స్టా బెర్రీ, మ్యాంగో, బటర్ స్కాచ్ ఇలా చాలా రకాల ఫ్లేవర్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం మంది ఇష్టపడేది వెనిలా. ఆ తర్వాతి స్థానం చాక్లెట్‌ది. వెనిలా, స్టాబ్రెర్రీ కాకుండా ప్రపంచంలో ఎక్కువ ప్రదేశాల్లో రాఖీ రోడ్ అనే ఫ్లేవర్డ్ ఐస్‌క్రీం దొరుకుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ఐస్‌క్రీం కోన్‌ను ఇటలీలో తయారు చేశారు. ఈ కోన్ ఎత్తు తొమ్మిది అడుగులు. సగటు అమెరికా పౌరుడు సంవత్సరానికి 23 లీటర్ల ఐస్ క్రీంను తింటాడు. 11 లీటర్ల పాలతో నాలుగు లీటర్ల ఐస్క్రీంను తయారు చేయవచ్చు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే పాలల్లో తొమ్మిది శాతం పాలను ఐస్‌క్రీం తయారీ కోసమే వినియోగిస్తున్నారు.
Authorization