కప్పలు బెకబెకమంటాయని తెలుసు...కానీ కీటకాల్లా చప్పుళ్లు చేస్తాయని విన్నారా? అలాంటి వింత కప్పలు ఈమధ్యే కొత్తగా బయటపడ్డాయి...మరెక్కడో కాదు మన దేశంలోనే! చూడటానికి చిట్టి కప్పలే. గోరుపై పట్టేంత చిన్నవి. ఇన్నాళ్లూ ఎవరికీ కనపడకుండా దాక్కున్నాయి. ఇవన్నీ ఈమధ్యే మనదేశంలో పశ్చిమ కనుమల దగ్గర దొరికిన ఏడు కొత్త జాతి కప్పల సంగతులు. నైట్ ఫ్రాగ్స్గా పిలిచే ఈ ఏడు కప్పజాతుల్లో నాలుగు ప్రపంచంలోనే అతి బుల్లివట. వాటి పరిమాణం ఎంతో తెలుసా? అర అంగుళం కన్నా తక్కువే. అంటే అర్ధరూపాయి బిళ్లపై సగం ఉంటాయంతే. మిగతా కప్పలు అర అంగుళం నుంచి ఒకటిన్నర అంగుళమంత పరిమాణంలో ఉన్నాయి.
నిక్టిబట్రాచస్ జాతికి చెందిన ఈ కప్పలకు నిక్టిబట్రాచస్ మనలరి, పులివిజయని, రాబిన్మోరై, శబరిమలై, వెబిల్ల, అతిరప్పిలైన్సిస్, రాడ్క్లిఫీ అని పేర్లు పెట్టారు. వీటి అతి సూక్ష్మ రూపం, ఇవి చేసే ప్రత్యేకమైన కీటకాల్లాంటి ధ్వనుల వల్ల ఇప్పటి వరకు వీటిని కనిపెట్టడం కష్టమయింది. శాస్త్రవేత్తలు అయిదు సంవత్సరాల పాటు పరిశోధన చేస్తే ఈమధ్యే దొరికాయి. బాగా పరీక్షిస్తే ఇవన్నీ కొత్త కప్ప జాతులే అని తేలింది. అయితే ఈ అరుదైన కప్పల్లో పాపం... కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ కొత్త కప్పలతో కలిపి నైట్ ఫ్రాగ్స్ కప్పల జాతుల సంఖ్య 35కి చేరింది. అంతేకాదు, రాక్షస బల్లుల కాలం నుంచి ఉన్న ఇండియన్ పర్పుల్ ఫ్రాగ్ ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ తప్ప మరెక్కడా జీవించి లేదు. ఈ కొత్త చిట్టి కప్పలు బయటపడటం ద్వారా పశ్చిమ కనుమల్లో ఉన్న జీవవైవిధ్యం ఎంతో విస్తృతంగా ఉందని తేలింది. అలాగే వాటి పరిరక్షణకు మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Authorization