హాయ్ నేస్తాలూ...! చెట్లు మనకు చేసే మేలు అంతాఇంతా కాదు. తినే తిండి, పీల్చే గాలి అన్నీ చెట్ల నుండే లభిస్తున్నాయి. అవి లేకుండా పోతే మనం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోతాం! మరి అటువంటి చెట్లకు మనమేం చేస్తున్నాం. కాసిన్ని నీళ్లు పోసేందుకే కష్టపడిపోతున్నాం. అందుకనే చెట్లకు ఓ రోజు కేటాయించారు. ఆ రోజుని ట్రీ డ్రెస్సింగ్స్ డే అంటారు. ఇంతకీ ఆరోజు ఏం చేస్తారో చూద్దామా...
- పండుగొస్తే కొత్త బట్టలు వేసుకుంటాం కదా. అలాగే ట్రీ డ్రెస్సింగ్స్ డే అనేది చెట్ల పండగ. అంటే మనలా వాటికి దుస్తులూ తొడిగేస్తారేమో! అనేసుకోకండి. చక్కనైన రిబ్బన్లు, పూసల గొలుసులు, లాంతర్లు, కొవ్వొత్తి సీసాలు, వివిధ రకాల పండ్లను తాళ్లతో కట్టి చెట్లకు వేలాడదీస్తారు. అంతేకాదు.. చెట్ల మొదళ్లకు, ఆకులకు, కొమ్మలకు రంగులేస్తారు కూడా.
- ఈ వేడుకలు మొదట 1990లో లండన్లో మొదలయ్యాయి. దీనికి ఓ కారణం ఉంది. అదేంటంటే.. పట్టణాభివృద్ధి పెరిగేకొద్దీ చెట్లను నరికేస్తున్నారు. దాంతో పర్యావరణానికే కాకుండా ప్రాణకోటికీ ముప్పు వాటిల్లుతోంది. ఈ విషయం మీద ప్రజల్లో అవగాహన కల్పించాలంటే ఏం చెయ్యాలా అని పర్యావరణ వేత్తలు ఆలోచించారు. మనకు ఎన్నో విధాల మేలు చేసే చెట్లను ప్రేమించమంటూ, వాటిని జాగ్రత్తగా కాపాడుకోమంటూ పండగపేరుతో పిలుపునిచ్చారు. దీనికోసం ఏటా డిసెంబర్ మొదటి వారాన్ని కేటాయించారు.
- ట్రీ డ్రెస్సింగ్రోజున ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటుతారు. బళ్లో పిల్లలతోనూ నాటిస్తారు. అంతా వనవిహారం పేరిట దగ్గరుండే అడవుల్లోకి వెళ్తారు. అక్కడుండే పెద్ద పెద్ద చెట్లను అందంగా అలంకరిస్తారు. కొందరైతే వాళ్ల కోరికల చిట్టాను కొమ్మలకు కడతారు. పాటలు పాడి, నృత్యం చేస్తారు. చెట్ల మీద నివసించే పక్షుల కోసం గింజలనువేస్తారు. చెట్ల గురించి కబుర్లను చెప్పుకుంటారు. ఫలహారాలు చేసి సాయంత్రానికి ఇళ్లకు వెళ్తారు. ఈ కార్యక్రమం రెండు రోజులుంటుంది. ఈ రోజుల్లో ఉద్యానవనాలు, రోడ్ల పక్కనుండే చెట్లు, ఇళ్లలోవి అన్నీ కళకళలాడుతూ కనిపిస్తాయి.
- ఈ చెట్ల పండగకు స్ఫూర్తి మనదేశంలోనే ఉంది తెలుసా! 1730 కాలమది... రాజస్థాన్లోని జోధ్పూర్కు దగ్గరుండే కేజర్లీ గ్రామంలో వృక్షసంపద ఎక్కువట. అభరుసింగ్ అనే రాజు జోధ్పూర్కోట కట్టుకునేందుకు అక్కడి చెట్లను కొట్టి కలపని తెమ్మని సైన్యాన్ని పంపాడట.ఆ సమయంలో అమృతాదేవి అనే ఆమె ఆ సైన్యాన్ని అడ్డుకునేందుకు కొట్టబోయే చెట్టును కౌగిలించుకుంది. దాంతో వాళ్లు ఆమెని గొడ్డలితో నరికి చంపేశారు. ఇది చూసి ఆ గ్రామ ప్రజలంతా ఎదిరించారు. ఆ సైన్యం అడ్డొచ్చిన వాళ్లందరినీ నరుక్కుంటూ పోతే వాళ్ల చేతుల్లో 363 మంది బలయ్యారు. అయినా ఆ గ్రామ ప్రజలు వెనుకడుగు వెయ్యలేదు. దాంతో భయపడిన ఆ మహారాజు సైన్యాన్ని వెనక్కి పిలిపించాడు. అంత ధైర్యసాహసాలతో ప్రాణాలను కూడా పణంగా పెట్టిన వాళ్లంతా బిష్ణోయి జాతికి చెందినవాళ్లు. ఇప్పటికీ ఎవరైనా చెట్లను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోరు. అలాగే ఆ ప్రాంత జంతువుల్ని వేటాడినా ఒప్పుకోరు. అందుకనే... వాళ్లుండే ప్రాంతం ఎడారిలో ఒయాసిస్సుగా పేరుపడింది. అలాంటి పర్యావరణ ప్రేమికులైన బిష్ణోయీ జాతివాళ్లు మన దేశ పౌరులు కావడం గర్వించదగ్గ విషయం.
- ట్రీ డ్రెస్సింగ్ డే వేడుకలు మొదలైంది మనదేశ సంఘటన స్ఫూర్తితో కానీ ... ఈ ఉత్సవాలు విదేశాల్లోనే ఘనంగా జరుగుతాయి. వేడుకల మాట అటుంచితే.. మనకు నిత్యావసరాలైన కాగితం వంట చెరుకు, గృహోపకరణాలు, జీవనాధారమైన గాలినీ అందిస్తూ... ప్రపంచాన్ని కాలుష్యరహితంగా చేసే చెట్లను మన వంతు కర్తవ్యంగా మనమూ కాపాడదాం. చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షిదాం.
Authorization