హాయ్ ఫ్రెండ్స్...బొమ్మల్లల్లో ఎంతో ప్రసిద్ధి చెందినవి కొండపల్లి బొమ్మలు. వాటి ప్రత్యేకతే వేరు. కళ్లను కట్టిపడేసే కళా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటాయవి. జీవం ఉట్టిపడే ఆ బొమ్మల్ని బహుశా ఇష్టపడని వాళ్లుండరు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఇవి గుర్తింపు పొందాయి. మరి వీటిని ఎవరు చేస్తారో! ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుందామా...
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టిల్లు కొండపల్లి గ్రామం. ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బొమ్మల కళాకారులకు దశాబ్దాలుగా ఈ వృత్తే జీవనాధారం. మన సంస్కృతిలో కలిసిపోయిన ఈ కళ నిజానికి ఇక్కడ పుట్టింది కాదు.
దాదాపు 4 వందల సంవత్సరాల క్రితం మాటిది. రాజస్థాన్ నుంచి కొందరు కొండపల్లి ప్రాంతానికి వలస వచ్చారట. వస్తూ వస్తూ వాళ్లతో ఈ బొమ్మల తయారీ విధానాన్ని తీసుకొచ్చారని అంటారు. అందుకనే కొండపల్లి బొమ్మల్లో 16-17 శతాబ్దాల రాజస్థానీ సంప్రదాయ అలంకరణ కనిపిస్తుంది.
ఈ బొమ్మల్ని చేసేందుకు అచ్చులు, యంత్రాలు ఉండవు. కేవలం చేత్తోనే అద్భుతమైన రూపాన్నిస్తారు. కాకుంటే చెక్కేందుకు బావుదారు అనే ఓ ప్రత్యేకమైన పనిముట్టు ఉండాలి. దాన్ని ఉపయోగిస్తూ చాలా చాకచక్యంగా చెక్కతో బొమ్మల్ని అద్భుతంగా మలుస్తున్న తీరు చూడాల్సిందేనట.
ఈ కొయ్య బొమ్మల్ని చేసేది 'పొనికి' చెక్కతో. ఈ కర్ర తెల్లగా, చెక్కడానికి వీలయ్యేంత మెత్తగా ఉంటుంది. దొరికేది కూడా కొండపల్లికి దగ్గరలో ఉండే 'కొండూరు' అడవుల్లో. అందుకనే ఈ కళాకారులంతా అక్కడికి దగ్గరి ప్రాంతమైన కొండపల్లిని విడిచిపోరు.
వీటిని చెయ్యడం తేలికైన పనేమీ కాదు. ముందుగా తెల్ల పొనికిని సేకరించి వేడినీటిలో ముంచుతారు. తరువాత దాన్ని ఎండబెడతారు. ఆ తరువాత నునుపుగా చేసి ముక్కలుగా కోస్తారు. దానికి కావాల్సిన రూపాన్నిచ్చి రంపపు పొట్టు, చింతగింజల పొడితో తుది మెరుగులు దిద్దుతారు. సున్నం పూసి ఆరబెట్టి వాటికి అవయవాలు, ఆభరణాలు అతికిస్తారు. దీనికోసం కాగితపు గుజ్జు, విత్తనాల జిగురు ఉపయోగిస్తారు. సహజ పదార్థాలతో తయారు చేసిన రంగులను పూస్తారు. ఇంకేముంది అందమైన బొమ్మలు సిద్ధమైనట్టే.
అయితే ఏ బొమ్మకాబొమ్మే ప్రత్యేకమైంది. వీటిలో తల నడుము దగ్గర వేరుచేసి, తిరిగి అమర్చే అమ్మాయి బొమ్మ మరీ ప్రత్యేకం. అవి కదులుతూ నాట్యమాడుతున్నట్టే అనిపిస్తుంది. అందుకే ఎవరన్నా తలని అదేపనిగా కదులుస్తుంటే వాళ్లని కొండపల్లి బొమ్మలతో పోలుస్తాం.
కొండపల్లి బొమ్మలు ఎన్నుంటాయో...వాటిలో దశావతారాలు, నవదుర్గలు, పండ్లూ, కూరగాయలు ఎన్నెన్నో. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల ఆలయాల్లో కనిపించే గరుడ, నంది బొమ్మలు వీళ్ల చేతుల్లో తయారయినవే. దాంతో పాటే దసరా, సంక్రాంతి సమయాల్లో కొందరిళ్లలో కొలువు తీర్చే బొమ్మల కొలువులో గ్రామీణ వాతావరణం, సంప్రదాయం, చేతి వృత్తుల బొమ్మలన్నీ కొలువుతీరుతాయి. వాటిని చూస్తుంటే హస్త కళాకృతుల్లో కొండపల్లి బొమ్మల ప్రాధాన్యం ఏమిటో తెలిసిపోతుంది.
Authorization