హాయ్ చిన్నారులూ..! మనం ఎటయినా వెళ్లినపుడు సాధారణంగా రహదారుల వెంట ఏం కనిపిస్తాయి. పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడా చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తాయి కదా.. కానీ ఓ ఊరి దారిలో మాత్రం పెద్ద పెద్ద బొమ్మలు కనిపిస్తాయి. ఎందుకంటారా... అవే విషయాలు చెబుతాను చదవండి..
- ఆకాశాన్నంటే చేప, మీద వచ్చిపడుతుందేమో అనేట్టుండే సాలీడు, బోలెడు అబ్బురపరిచే శిల్పాలు ఇవన్నీ రెజెంట్ అనే ఊరిదారిలో కనిపిస్తాయి. ఇది అమెరికాలోని గ్లాడ్‌స్టోన్ పట్టణంలో ఉండే ఓ చిన్న విలేజ్.
- ఆ దారి వెంట వెళ్తుంటే ఎన్నో అద్భుతమైన, అబ్బురపరిచేబొమ్మలు కనిపిస్తుంటాయి. బొమ్మలంటే ఏదో చిన్నవి కాదు. కొన్ని పదంతస్తుల భవనమంత ఎత్తు కూడా ఉంటాయి.
ఈ బొమ్మల మరో ప్రత్యేకతేంటో తెలుసా? ఇవి ఏ సిమెంట్‌తో కట్టినవి కాదు, పనికిరాని పాత పైపులు, నూనె డబ్బాలతో చేసినవి. ఇందులో 154 అడుగుల వెడల్పు, 110 అడుగుల ఎత్తున్న బాతుల బొమ్మకు 'ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రాప్ మెటల్ శిల్పం'గా గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది.
- వీటిల్లో 60 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తుండే గొల్లభామా, దాని పక్కనే 24 అడుగుల ఎత్తుతో ఉన్న గడ్డిపూలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా 70 అడుగుల ఎత్తుండే నెమళ్లు, జింకలు, చేపలు, గుర్రపుబండి, సాలెగూళ్లు ఇలా దారిపొడుగునా ఏడు రకాల అంశాలతో తీర్చిదిద్దారు. ఇవన్నీ రోడ్డుపై ఒకేచోట ఉండవు. 50 కిలో మీటర్ల పొడవునా సాగే ఈ రహదారిపై అక్కడక్కడా ఒక్కొక్కటిగా ప్రదర్శనకు పెట్టారు. అందుకే ఈ దారి వెంట వెళ్లే ప్రతి ఒక్కరూ బొమ్మల వద్ద ఆగుతూ ఆగుతూ ప్రయాణం చేస్తారు. ఫోటోలు తీసుకుని సంబరపడిపోతుంటారు.
- ఇంతకీ ఈ ఆలోచన ఎవరికి, ఎందుకు వచ్చింది అంటారా... రెజెంట్కు చెందిన గ్రే గ్రిఫ్ అనే ఆయన మారుమూలలో ఉన్న తమ గ్రామం ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బొమ్మల్ని తయారుచేయడం మొదలుపెట్టాడట. అలా 1989 నుంచి పాత ఇనుప సామాన్లతో చిత్రవిచిత్రమైన ఆకారాలు తీర్చిదిద్దుతూ ఆకట్టుకుంటున్నాడు. గ్రామ ప్రజలు కూడా తోచినంత సాయం చేస్తున్నారు.
Authorization