హాయ్ చిన్నారులూ...! మీరు బొగ్గు గనుల గురించి వినే ఉంటారు. ఈ గనుల నుంచి బొగ్గును ఉత్పత్తి చేస్తారు. దీన్నే సహజంగా మనం నల్లబంగారం అని కూడా పిలుస్తాము. మరి భూమిలో బొగ్గు ఎలా తయారవుతుంది? వృక్ష పదార్థాలు బొగ్గుగా రూపాంతరం చెందడానికి ఏయే క్రియలు జరుగుతాయి? ఎంత కాలం పడుతుంది? అనే విషయాలు తెలుసుకుందామా..!
- తెలంగాణ సిరుల పంట బొగ్గు. ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బొగ్గు నిల్వలకు కొదువ లేదు. ఏండ్ల కొద్దీ తవ్వకాలు జరిపినా తరగని బొగ్గు నిక్షేపాలు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి.
- జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గోండ్వానా ప్రాంతంలో దశాబ్దాలుగా అన్వేషించి బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1889లో ఖమ్మం జిల్లా ఇల్లెందులోని సింగరేణి గ్రామంలో ప్రప్రథమంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ చేపట్టారు.
- గోదావరి పరివాహక ప్రాంతంలో 9,877 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణ చేశారు. ఇందులో ఇప్పటివరకు 1,050 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇంకా 90 శాతం బొగ్గు నిక్షేపాలు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి. భూమాత కడుపులో దాగి ఉన్న ఆ మొత్తం బొగ్గు సంపదను వెలికితీయడానికి మరో 200 సంవత్సరాల సమయం పడుతుందని భూగర్భ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.
- బొగ్గు ఎలా ఏర్పడుతుందంటే... పూర్వం దట్టమైన అటవీప్రాంతాలు, ఆకాశానికి నిచ్చెనవేసినట్లుండే మహావృక్షాలు ఏపుగా పెరిగి ఉండేవి. వృక్ష సంపదంతా ఎక్కడో ఒకచోట పోగై భూమి పొరల్లో కప్పబడిపోయేది. ఆ తర్వాత భూగర్భంలోని ఉష్ణోగ్రత, ఒత్తిడితో నేలకూలిన వృక్షాలలోని పదార్థాలన్నీ అనేక విధాల భౌతిక, రసాయనిక ప్రక్రియలకు లోనయ్యాయి. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆ వృక్ష సంపద వివిధ రూపాంతరాలకు గురై చివరకు బొగ్గుగా మారింది.
భూగర్భంలో వృక్ష పదార్థాలు అనేక పరిణామాలు చెందుతాయి. కింద పడిపోయిన మహావృక్షాలు ఇసుక, మట్టితో కప్పబడి మొదట పీట్గా ఏర్పడతాయి. ఆ తర్వాత భూమిలోని పీడనం, ఉష్ణోగ్రతతో పీట్ క్రమంగా లిగ్నైట్గా మార్పు చెందుతుంది. లిగ్నైట్ రూపాంతరం చెంది చివరి దశలో బొగ్గు తయారవుతుంది.
మీకు మరో విషయం తెలుసా..? ఒక మీటర్ బొగ్గు తయారీకి వేల ఏండ్లు పడుతుంది....భూగర్భంలో జరిగే అనేక భౌతిక, రసాయన ప్రక్రియలతో ఏడాది కాలంలో అరమిల్లిమీటర్ నుంచి మూడు మిల్లిమీటర్ల మందంలో పీట్ తయారవుతుంది. ఈ లెక్కన సుమారు 300 నుంచి 400 సంవత్సరాలకు ఒక మీటర్ మందం పీట్ వృద్ధి చెందుతుందన్న మాట. సుమారు 20 నుంచి 30 మీటర్ల మందం గల వృక్ష పదార్థాలు 6 మీటర్ల పీట్గా మారి ఆ తర్వాత 3 మీటర్ల లిగ్నైట్గా తయారవుతుంది. ఆ మూడు మీటర్ల లిగ్నైట్ తర్వాత క్రమంలో ఒక మీటర్ బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. ఒక మీటర్ బొగ్గుగా మారడానికి సుమారు 6 వేల నుంచి 9 వేల సంవత్సరాల కాలం పడుతుంది.
గోండ్వానా ప్రాంతంలో నిక్షేపాలు
భూగర్భ విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏండ్ల తరబడి చేసిన అనేక పరిశోధనల ఫలితంగా భూమాత కడుపులో దాగి ఉన్న నల్ల బంగారం నిల్వలు బయటపడ్డాయి. భూగర్భంలో వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నట్లు కనుగొన్నారు. దేశ వ్యాప్తంగా గోండ్వానా ప్రాంత వైశాల్యం 63 వేల చదరపు కిలోమీటర్లుగా నిర్ధారించిన శాస్త్రజ్ఞులు ఇందులో 15 వేల చదరపు కిలోమీటర్లు బొగ్గు అన్వేషణకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు క్షేత్రవైశాల్యం 17,400 చదరపు కిలోమీటర్లుగా కనుగొన్నారు. ఇందులో బొగ్గు అన్వేషణకు 1100 చదరపు కిలోమీటర్లు అనువైన ప్రాంతంగా నిర్ధారించారు.
Authorization