హాయ్నేస్తాలూ... ! మీకు ఈము పక్షి తెలుసు కదా...! పేద్ద శరీరం కలిగి వేగంగా పరుగెత్తుతూ ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద పక్షుల్లో ఆస్ట్రిచ్ది మొదటి స్థానమైతే ఈము పక్షులది రెండోస్థానం. అంతేకాదు ఇవి అన్ని ప్రాంతాల వాళ్లకీ దగ్గరైపోయాయి. అందుకే రైతులూ వీటిని ఫారాల్లో పెంచుతున్నారు...
ఈము పక్షి ఆస్ట్రేలియా దేశానికి చెందింది. ఆ దేశపు జాతీయ పక్షి కూడా. దీని శాస్త్రీయ నామం 'డ్రొమైస్ నొవాహలండై'. రేటైట్ జాతికి చెందింది. ఈము ...80 వేల ఏండ్లకు పూర్వమే ఈ పక్షులు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని ఆదిమ జాతుల వాళ్లు మొదట వీటిని మాంసం కోసం మచ్చిక చేసుకున్నారట.
ఈ జాతి పక్షులకు రెక్కలు చాలా చిన్నగా ఉంటాయి. అందుకే ఎగరలేవు. ఆస్ట్రిచ్, రియా కసోవరి, కివీ పక్షులు కూడా ఈ కోవకి చెందినవే. ఈముకి ఆ పేరు 'ఎమా' అనే పోర్చుగీసు పదం నుంచి వచ్చింది.
ఈము పక్షులు ఎత్తులోనే కాదు వేగంగా పరుగుపెట్టే వాటిలో కూడా వీటిదే రెండో స్థానం. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో 30 నిమిషాలు ఆగకుండా పరుగెడుతాయి. కాస్త నెమ్మదిగా నీటిలో కూడా ఈదగలవు. 5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి జీవిత కాలం 25-30 ఏండ్లు. వీటి కాళ్లు బలంగా మూడు వేళ్లతో ఉంటాయి. అవి ఎంత బలమైనవంటే ఇనుప కంచెను కూడా కాళ్లతో విరిచేయగలవు.
వీటి రెక్కలు చిన్నవిగా ఉన్నా ఎగిరేందుకు పనిచేయవు. కాకుంటే... అవి వేగంగా పరిగెత్తేటప్పుడు శరీరం తూలిపోకుండా అదుపుచేస్తాయి. వీటి మెడ పొడుగ్గా నీలంగా ఉంటుంది. శరీరమంతా గోధుమ రంగు మచ్చలతో ఈకలు ఉంటాయి. చర్మం మందంగా పొలుసులతో కూడి ఉంటుంది. అందుకే ఏ వాతావరణాన్ని అయినా తట్టుకోగలవు. ఇవి ఎక్కువగా ఇసుక నేలల్ని ఇష్టపడుతాయి. ఎలాంటి గడ్డి భూముల్లోనైనా ఉండగలవు.
సహజంగా శాకాహారాన్ని ఇష్టపడే ఈమూలు లేత ఆకులు, కూరగాయలు, విత్తనాలు, పండ్లు, దోసకాయ, బొప్పాయి లాంటివి తింటాయి. మొక్కలపై ఉండే గొంగళి పురుగుల్ని, కీటకాల్ని, గొల్లభామల్ని కూడా తింటాయి. వీటికి తిన్నది ఎప్పుడైనా అరగకపోతే గులకరాళ్లని మింగుతాయి. వీటికి నీటి అవసరం అంతగా ఉండదు. అరుదుగా మాత్రమే నీళ్లు తాగుతాయి. కానీ ఒకేసారి ఎక్కువ మొత్తం నీటిని తాగేస్తాయి.
ఈమూ అరుపు 2 కి.మీ. దూరం వరకూ వినిపిస్తుంది. అది అచ్చు డ్రమ్స్ వాయిస్తున్నట్లు ఉంటుంది. ఇవి తిండి లేకుండా వారం రోజుల వరకూ ఉండగలవు.
ఈమూ గుడ్డు అరచెయ్యంత ఉంటుంది. అంటే మామూలు కోడిగుడ్డుతో పోల్చితే 10 గుడ్లంత. ఈ గుడ్డు పరిమాణంలోనే కాకుండా రంగులోనూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆడ ఈములకి 20 నెలల వయసు వచ్చిన దగ్గర నుంచి 16 ఏండ్లు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గుడ్లు పెట్టడం పూర్తయ్యాక వాటిని మగ ఈము పొదుగుతుంది. దాదాపు ఎనిమిది వారాలు పొదిగాక పిల్లలు బయటకు వస్తాయి. పిల్లలు ఎదిగి 6 నెలల వయసు వచ్చేవరకు వాటి బాధ్యత మగవాటిదే.
పూర్వం ఈము పక్షుల చర్మాన్ని దుస్తులుగా ధరించేవారు. కొవ్వును నూనెగా మార్చి సంప్రదాయ వైద్యంలో ఔషధంగా వాడేవారు. అంతేకాదు....ముక్కు, కాలిగోళ్లను ఆభరణాలుగా ధరించేవారు. - వీటివల్ల ఉపయోగాలను తెలుసుకున్న ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగీస్ దేశస్తులు పెంచుకోవడం మొదలుపెట్టారు. అలా అన్ని దేశాలకూ విస్తరిస్తూ మనదేశానికీ చేరాయి. 1990 నుంచి రైతులు ఫారాల ద్వారా సాగుచేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, చైనా ఈము పెంపకంలో ముందున్న దేశాలు. ఆస్ట్రేలియా 50 సెంట్ల నాణెం మీద ఈము చిహ్నం కూడా ఉంటుంది.
Authorization