హారు చిన్నారులూ...! దేశం అంటే ఎన్నో రాష్ట్రాల కలయికతో ఏర్పడుతుంది. కోట్ల సంఖ్యలో జనాభా ఉంటుంది. కానీ ఓ దేశం మాత్రం పదుల కిలోమీటర్ల వైశాల్యంలోనే విస్తరించి ఉంది. అంతేనా అక్కడ జనాభా కూడా తక్కువే. అదే నౌరు! వినడానికి చిన్నదే కానీ ఈ దేశంలో విశేషాలకి లోటులేదు.
- ఆస్ట్రేలియాకి దగ్గరలో, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీపమే నౌరు. భూమధ్య రేఖకు కేవలం 50 కిలోమీటర్ల దిగువన ఉంది. 21 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మాత్రమే ఉన్న నౌరులో రోడ్లన్నీ కలిపినా 30 కిలోమీటర్లు దాటవు. దీని తీరప్రాంతం కూడా 30 కిలోమీటర్లే. అంటే నడుస్తూ తిరిగినా ఒక్కరోజులో దేశాన్ని చుట్టేయవచ్చన్నమాట. ఇంత చిన్న దేశంలో జనాభా కూడా తక్కువే. 10,000 మంది మాత్రమే ఉన్నారు. వీళ్లలో ఎక్కువ మంది పాలినీషియా అనే జాతిలోని 12 తెగల వాళ్లు.
- నౌరు అంటే స్థానిక నౌరువన్ భాషలో 'నేను తీరానికి వెళ్తున్నాను' అని అర్థం. నౌరు ద్వీపాన్ని 1798లో 'జాన్ఫెర్న్' అనే బ్రిటన్ నావికుడు చేరుకున్నాడు. అక్కడి వాతావరణాకి సంబరపడిపోయి దానికి 'ప్రశాంత ద్వీపం' అని పేరుపెట్టాడు. అలా ఈ ద్వీపానికి విదేశీయుల రాక మొదలైంది.
- నౌరువాసులు 3000 సంవత్సరాలకి పూర్వమే ఇక్కడ నివాసాలని ఏర్పరచుకున్నట్లు తేలింది. నక్షత్రాలను గమనిస్తూ, చీకట్లోకూడా నౌకాయానం చేయగల ప్రతిభ నౌరువాసుల సొంతం. అందుకే వాళ్ల జాతీయ జెండాలో నీలం రంగు మీద పసుపురేఖ, దాని కింద 12 కోణాలు ఉన్న నక్షత్రం ఉంటుంది. నీలం రంగు సముద్రానికి, నక్షత్రం సముద్రయానానికి, 12 కోణాలు 12 తెగలకీ ప్రతీక అన్నమాట. ఇక భూమధ్యరేఖకి గుర్తుగా పసుపు రేఖ!
- 1888లో నౌరుని జర్మనీ ఆక్రమించుకుంది. ఆ తరువాత ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్... ఇలా చేతులు మారి చివరికి 1968, జనవరి 31న స్వాతంత్య్రాన్ని సాధించింది.
- నౌరు ద్వీపం మీద సముద్ర పక్షుల విసర్జకాలు పోగుపడటంతో, ఫాస్పేట్ నిల్వలు ఏర్పడ్డాయట. ఎరువుల్లో ఫాస్పేట్ వాడకం ఎక్కువ. 19వ శతాబ్దం మొదట్లో ఈ నిల్వలను గుర్తించడడంతో వాటిని తవ్వేయడం మొదలుపెట్టారు. 1960ల నాటికి నౌరు ధనిక దేశాల్లో ఒకటిగా పేరుపొందింది. కానీ ముప్పై ఏండ్లు గడిచేసరికి ఫాస్పేట్ నిల్వలు తరిగిపోసాగాయి. జాతీయ బ్యాంకు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. నిరుద్యోగం 90 శాతానికి చేరుకుంది. ఈ దశలోనౌరు ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో ఓ నిధిని ఏర్పాటు చేసింది.
- నౌరులో 16 ఏండ్ల వరకు విద్యని ఉచితంగా అందిస్తారు. కాబట్టి అక్షరాస్యత 96 శాతం. యారెన్ అనే ఊరు ఈ దేశ రాజధాని. నౌరుకి ప్రత్యేకమైన కరెన్సీ లేదు. ఆస్ట్రేలియన్ డాలరునే ఉపయోగిస్తుంది. ఎర్రటి ఛాతీ ఉన్న ఫ్రిగేట్ నౌరు జాతీయ పక్షి. పున్నాగ పుష్పం నౌరు జాతీయ పుష్పం.
- 95 శాతం మంది అధిక బరువుతో ఉండటం వల్ల ఈ దేశాన్ని 'ఫ్యాటెస్ట్ నేషన్'గా కూడా పిలుస్తారు. రైలు మార్గం కేవలం అయిదు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఫాస్పేట్ రవాణా కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఒకే ఒక విమానాశ్రయం ఉంది. ఈ దేశానికి సైనికదళాలు లేవు.
యాంగం దినోత్సవం
అంతంతమాత్రంగా ఉన్న నౌరు జనాభా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1500 కంటే తక్కువకు పడిపోయింది. మళ్లీ 1949 నాటికి గానీ ఆ సంఖ్యని చేరుకోలేదు. ఆ సందర్భాన్ని గుర్తిస్తూ 'లక్ష్యాన్ని చేరుకున్న రోజు' (యాంగం దినోత్సవం)గా ఏటా అక్టోబరు 26న సంబరాలు చేస్తారు. అలాగని తమ సంస్కృతి పట్ల నౌరువాసులకి అభిమానంఎక్కువ అనుకోవద్దు. ఎందుకంటే.. ఫాస్పేట్ గనుల యావలో తమ వేషభాషల్ని వారు కోల్పోయారు.
Authorization