పక్షులను, జంతువులను గమనించడం ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా అలా వాటిని గమనిస్తున్నప్పుడు మనకు ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఆడుకుంటున్న కుక్కపిల్లల్ని, చెంగుచెంగున గెంతే లేగదూడలని, మేకపిల్లలని... ఇలాంటి వాటిని చూస్తున్నపుడు మనకు సంతోషంగా అన్పించదూ. మనకు లాగా వాటికి టీవీలు, వీడియోగేములు, రకరకాల చిరుతిండ్లు, షికార్లు ఇలాంటివేమీ ఉండవు. అయినా ఎంతో సంతోషంగా ఉంటున్నాయి... సరిగ్గా ఇలాంటి గొప్ప లక్షణాలనే జంతువుల నుంచి మనం నేర్చుకోవలసి ఉంటుంది. జంతువులు ఆనందంగా ఉండటమే కాదు అనుక్షణం అప్రమత్తంగా కూడా ఉంటాయి. ఏ క్షణం ఎటువంటి ఎలాంటి ప్రమాదం వచ్చినా దానికి వెంటనే స్పందిస్తాయి. వాటిలో ఈర్శ్య, అసూయ, ద్వేషం, పగలాంటివి మచ్చుకైనా కనిపించవు. కొన్ని విషయాల్లో ఇతర జంతువులతో అవి పొట్లాట పడినప్పటికీ మరొకరికి హాని తలపెట్టే కుట్రలు, కుతంత్రాలు వంటివి వాటిలో ఏ కోశానా కనిపించవు. జంతువులను బాగా గమనించడం ద్వారా మనం కూడా ఇలాంటి మంచి లక్షణాలను మన స్వభావంలో ఒక భాగంగా మార్చుకోవచ్చు.