హారు చిన్నారులూ...! వేసవి వచ్చిందంటే చాలు... కొబ్బరి బోండాలు తరచుగా తాగుతూనే ఉంటాం. ఎందుకంటే ప్రకృతి ఇచ్చే సహజమైన పోషకాల నీరు. అంతేకాదు ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. ఆ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందామా?
- కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చేదాన్ని కల్పవృక్షం అంటారు. అలాగే కొబ్బరి చెట్టు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే భారతీయులు కల్పవృక్షం అని కూడా పిలుస్తుంటారు.
- కోకస్ న్యూసిఫెరా దీని సాంకేతిక నామం. న్యూసిఫెరా అంటే పొత్తుతో కూడినది అని అర్థం. దీని చరిత్ర తెలుసుకోవాలంటే చాలా ప్రాచీన కాలానికి వెళ్లాలి. ఎందుకంటే ఐదుకోట్ల ఏండ్ల క్రితమే భూమ్మీద కొబ్బరి చెట్టు ఉనికి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వారికి భారత్, ఆస్ట్రేలియాల్లో వాటి శిలాజాలు దొరికాయట. ఎన్నో పరిశోధనలు చేసి వాటి పుట్టుపూర్వోత్తరాలు బయటపెట్టారు.
- కొబ్బరి అచ్చంగా మనదే. దాని పుట్టుక మన దేశంలోనే. అవును! ఇక్కడి నుంచే ప్రపంచమంతా పాకింది. అందుకే దానికి 'ఇండియన్ నట్' అని మరో ముద్దుపేరు ఉంది. అసలింతకీ ఇదెలా విస్తరించిందో తెలుసా! పోర్చుగీసు నావికుడు 'వాస్కోడిగామా' మనదేశానికి వచ్చినపుడు కొబ్బరి కాయను చూశాడట. దాని ఆకారం చిట్లించిన ముఖంలా ఉందని అంతటితో ఊరుకోకుండా ఆ అర్థమే వచ్చేలా వాళ్ల భాషలోనే 'కొకొ' అని పేరు కూడా పెట్టేశాడు. కాలక్రమేణా ఇంగ్లిష్ వాళ్ల వల్ల 'నట్' చేరి 'కోకోనట్' అయింది. అయితే దీన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం యూరప్ యాత్రికులు.
- నాగరికత పెరిగేకొద్దీ కొబ్బరి చెట్లు మలేషియా, మెలనేషియా, న్యూగినియాల్లో సముద్రతీరప్రాంతాల్లో మొదట కనిపించాయని కొందరి వాదన. ఏదేమైనా ఇవి పెరిగింది మాత్రం మహాసముద్రాల పక్కనుండే చిన్న చిన్న దీవుల్లో.
- ప్రపంచంలో ఎక్కువగా కొబ్బరి ఉత్పత్తి చేసే దేశాల్లో మనది మూడోస్థానంలో ఉంది. మొదటి స్థానం ఫిలిప్పీన్స్. రెండోస్థానంలో ఇండోనేషియా ఉన్నాయి. మనదేశంలో అత్యధిక ఉత్పత్తి జరిగేది కేరళ రాష్ట్రం నుంచి. వీళ్లు వంటల్లో కూడా కొబ్బరి నూనెని వాడతారు. కొబ్బరి నూనె ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంటుంది. దానికి కారణం అందులో కీటోన్, లాక్టోన్, ఆల్కహాల్.
- ఎటువంటి తెగులు రాకుండా ఉంటే కొబ్బరి చెట్టు ఏటా 75 కాయలు ఇస్తుంది. కొబ్బరి బొండాల్లో పావులీటరు నుంచి లీటరు వరకు నీరుంటుంది.
- కొవ్వులు అస్సలు లేని కొబ్బరి నీటిని ఏ కాలంలోనైనా తాగవచ్చు. అయితే వేసవిలో కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం మంచిది. ఎందుకంటే శరీరాన్ని చల్లబరచి డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. తక్షణ శక్తినిచ్చి నీరసాన్ని తగ్గిస్తుంది. అందుకే శీతలపానీయాల బదులు కొబ్బరినీరు సేవించడం ఉత్తమం.
Authorization