మనిషి శరీరంలో కణ విభజన ప్రక్రియ అదుపు తప్పి అదే పనిగా కణవిభజన జరగటం వల్ల వ్రణాలు (గడ్డలు) ఏర్పడతాయి. కొన్ని గడ్డలు శరీరంలో ఇతర భాగాలకు పాకకుండా ఎలాంటి హానీ చేయకుండా ఉంటాయి. కానీ కొన్ని రకాల గడ్డలు మాత్రం దేహంలోని ఇతర భాగాలకు పాకి, అక్కడ కూడా అలాంటి కణాలనే ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు ప్రాణానికే ముప్పు తెస్తాయి. అలాంటి వాటిని మాలిగెంట్ గడ్డలు అంటారు. ఇవి ఏర్పడటాన్ని మాలిగెన్సీ అంటారు. క్యాన్సర్ వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు మాలిగెన్సీ అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తారు. క్యాన్సర్ కణాలనే మాలిగెంట్ కణాలు అని కూడా అంటారు. మాలిగెంట్ గడ్డలు దేహ అవయవాల కణజాలాల్లో వస్తే దాన్ని కార్సినోమా అంటారు. ఊపిరితిత్తులు, రొమ్ము, క్లోమగ్రంథి, జీర్ణాశయం లాంటి భాగాల్లో వచ్చే క్యాన్సర్ ఈ రకమైనదే.