అవంతీపుర రాజ్యానికి రాజు శ్రీనాథుడు. ప్రజల కష్టాలు తెలుసుకుని సుపరిపాలనను అందించే శ్రీనాథుడు అంటే ప్రజలకు ఎంతో అభిమానం. అయితే రాజుకు ఒక చెడ్డ అలవాటు ఉంది. తనకు కలలో కన్పించే వాటిని, రాజ్యంలో అమలు చేయడానికి ప్రయత్నించేవాడు. అది మంచయినా, చెడయినా చేయాలనుకునేవాడు. ఈ ఒక్క అలవాటు వల్ల మాత్రం ప్రజలు ఇబ్బందిపడేవారు. ఇది తప్పు అని రాజుగారికి చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోయారు. కానీ కొందరు అవంతీపుర యువకులు రాజుగారి అలవాటును ఎలాగైనా మాన్పించాలని ఆలోచనలు చేయసాగారు.
ఒకనాడు కలలో రాజధాని నగరం పశ్చిమం వైపు ఎత్తైన భాగంలో పెద్ద చెరువు, దానిచుట్టూ చక్కటి ఉద్యానవనం ఉన్నట్లు కనిపించింది. మర్నాడు సభలో కల గురించి చెప్పి, ''పశ్చిమ దిక్కులో చెరువు తవ్వించడానికి ఏర్పాటు చేయండి'' అని మంత్రిని ఆదేశించారు. పశ్చిమ ప్రాంతం నగరం కన్నా ఎత్తుగా ఉంటుంది. అక్కడ చెరువు తవ్విస్తే, ప్రమాదవశాత్తూ ఎప్పుడైనా దానికి గండిపడితే నగరాన్ని వరద ముంచెత్తుతుంది. ఈ విషయం తెలిసినా చెప్పే ప్రయత్నం చేయలేకపోయారు మంత్రి.
చెరువు తవ్విస్తున్న విషయం, రాజధాని నగరంలో అందరికీ తెలిసింది. ఇక లాభం లేదు, రాబోయే ప్రమాదాన్ని రాజుగారికి చెప్పాలి. కలలో వచ్చినవన్నీ అ మలు పరచడంలో అర్థం లేదని చెప్పాలని విజయుడు అనే యువకుడు ఓ పథకం ఆలోచించాడు.
మర్నాడు విజయుడు తన తమ్ముడితో కలిసి రాజుగారి సభకు వచ్చాడు. ''రాజుగారికి నమస్కారాలు, ధర్మప్రభువులు!'' అన్నాడు. ''మీ సమస్య ఏంటి?'' అని రాజు అడగటంతో ''రాజా వీడు నా తమ్ముడు, వీడిని మా పక్కింటి కుర్రాడు నిన్న సాయంత్రం చెరువులో తోసి, ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ప్రాణహాని తలపెట్టిన అతనికి తగిన విక్ష విధించి, మాకు న్యాయం చేస్తారని విన్నవించుకుంటున్నాను'' అన్నాడు విజయుడు.
సభాసదులందరూ విజయుడి వైపు వింతగా చూశారు. ''నీకు మతిస్థిమితం ఉందా? లేదా? ఎదురుగా తమ్ముడిని పెట్టుకుని, ప్రాణం పోయింది అని ఆరోపిస్తున్నావు, ఇది రాజసభ అనుకున్నావా, రచ్చబండనుకున్నావా? హాస్యానికైనా హద్దుండాలి'', అని గద్దించాడు రాజు.
''క్షమించాలి రాజా! నా మతిస్థిమితంగా ఉండే మాట్లాడుతున్నాను. నాకు రాత్రి వచ్చిన కలలో మా తమ్ముడిని పక్కింటి కుర్రాడు, మీరు తవ్విస్తున్న చెరువులో తోసి, ప్రాణం తీసినట్టు వచ్చింది'' అన్నాడు విజయుడు.
''అది కల కదా? నిజం కాదు కదా! కలలో జరిగింది వాస్తవంలో ఎందుకు జరుగుతుంది?'' అని రాజు అనడంతో ''కలలో జరిగింది ఎందుకు నిజం కాకూడదు? నగరం పశ్చిమంవైపు చెరువు ఉందని కలలో మీకు అనిపిస్తే, నిజంగానే జరుగుతుంది కదా! అలాగే నా తమ్ముడి ప్రాణం పోయింది'' అని విజయుడు అనడంతో, రాజు ఆలోచనలో పడ్డాడు. విజయుని మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించాడు. తన కలలో వచ్చిన విషయాల్ని వెనకాముందూ చూసుకోకుండా అమలు చేస్తుండటాన్ని, దానివల్ల ప్రజలకు వచ్చే ప్రమాదాలను, కలలు నిజం కావని చెప్పడంలో విజయుడు చూపిన యుక్తిని రాజు అభినందించాడు. ఈ అలవాటును విడిచిపెడుతున్నానని, ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకోనని ప్రకటించాడు. విజయుడి యుక్తిని అందరూ అభినందించారు.
Authorization